ఆంధ్ర అబ్బాయి..శ్రీలంక అమ్మాయి..చూపులు కలిసిన వేళ!

Andhra Man Married To Srilankan Women - Sakshi

ఆంధ్ర అబ్బాయితో శ్రీలంక అమ్మాయికి వివాహం

కొవ్వూరులో ఒక్కటైన ప్రేమజంట

ఆశీర్వదించిన మంత్రి తానేటి వనిత

సాక్షి, కొవ్వూరు రూరల్‌: మనం పుట్టినపుడే మనతో ఎవరు ఏడడుగులు వేస్తారో అనేది దేవుడు రాసి పెడతాడని పెద్దలు చెబుతారు. ఈ సంఘటన చూస్తే అది నిజమే అనిపిస్తుంది. ఒక్కొక్కరిది ఒక్కో దేశం. ఉపాధి కోసం మరో దేశానికి వెళ్లిన వారి మనసులు కలిశాయి. రెండున్నరేళ్ల ప్రేమ తరువాత పెళ్లితో ఒక్కటవుదామనుకున్న వారికి జిల్లాలోని కొవ్వూరులో బసివిరెడ్డి పేటలో ఉన్న సత్యన్నారాయణ స్వామి దేవాలయం వేదికగా మారింది. ఆదివారం బంధువుల సమక్షంలో వారు  సంప్రదాయం బద్ధంగా ఏడడుగులు వేసి ఒక్కటయ్యారు. వివరాల్లోకి వెళితే పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెంకు చెందిన మావుడూరి ఉమామహేష్‌ ఉపాధి కోసం మస్కట్‌ వెళ్లాడు.

ఓ హోటల్‌లో సూపర్‌వైజర్‌గా చేరారు, అదే హోటల్‌లో ఉద్యోగంలో చేరిన శ్రీలంకకు చెందిన రువీని హెమలీని మొదటిసారి చూసినపుడే ప్రేమలో పడ్డారు. ఈ విధంగా రెండున్నరేళ్లపాటు ఒకరికొకరు ప్రేమించుకున్నారు. రువీని హెమలీకి తల్లిదండ్రులు లేకపోవడంతో ఈ విషయాన్ని ఉమామహేష్‌ తన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు తెలియజేసి ఒప్పించారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం 8గంటలకు హిందూ సంప్రదాయం ప్రకారం బంధుమిత్రుల సమక్షంలో ఆ ప్రేమ జంట ఒక్కటయ్యారు. ఈ సందర్భంగా వధువు మాట్లాడుతూ చాలా సంతోషంగా ఉందని, తల్లిదండ్రులు లేని లోటు అత్తమామల ద్వారా తీరుతుందని ఆనందం వ్యక్తం చేశారు.

నూతన వధూవరులకు మంత్రి వనిత దీవెనలు 
నూతన వధూవరులు ఉమామహేష్, రువిని హేమలీకి మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత శుభాకాంక్షలు తెలిపారు. పెళ్లి మండపంలో వారికి అక్షింతలు వేసి ఆశీర్వదించారు. మంత్రి మాట్లాడుతూ నేటి యువత కుల, మతాల పట్టింపులనే∙కాదు దేశ సరిహద్దులను తమ ప్రేమతో చెరిపేస్తున్నారని అన్నారు, నూతన వధూవరుల దాంపత్య జీవితం సుఖఃశాంతులతో సాగాలని అభిలషించారు. కంఠమణి రమేష్‌బాబు, పరిమి సోమరాజు తదితరులు మంత్రి వెంట ఉన్నారు. 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top