సర్వతోముఖాభివృద్ధే మా లక్ష్యం

Andhra CM YS Jagan Explained On Three Capitals - Sakshi

రాష్ట్రం బాగు కోసమే మూడు రాజధానులు

ఏ ప్రాంతానికి అన్యాయం చేయడం లేదు

పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుపై చర్చలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

అన్ని కులాలు ఓట్లు వేస్తేనే 151 సీట్లు వచ్చాయి

రాజధాని మార్చడం లేదు.. మిగిలిన ప్రాంతాలకు కూడా న్యాయం చేస్తున్నాం

రాష్ట్రం మొత్తం సంక్షేమ పథకాలు ఆపివేసి కేవలం 8 కిలో మీటర్లను పట్టించుకోవడం ధర్మమేనా?

అన్ని కమిటీలు వికేంద్రీకరణకే మొగ్గు చూపాయి

అందరికీ మంచి చేయాలి. ఇదే నా విధానం. ఇంటింటికీ అభివృద్ధి ఫలాలు అందాలి. ఇందుకోసం అన్నింటా సంస్కరణలు కొనసాగిస్తాం. గ్రామ సచివాలయాల నిర్మాణం నుంచి రాష్ట్ర సచివాలయాల నిర్మాణం వరకూ భావితరాల, మన ప్రాంతాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మేం నిర్ణయాలు తీసుకుంటాం. దీని కోసమే వికేంద్రీకరణకు ఓటు వేస్తున్నాం.
– వైఎస్‌ జగన్‌

రాజధానికి వెళ్లే మార్గంలో ఒక కారు ఎదురుగా వస్తే మరో కారు రోడ్డు దిగి వెళ్లాల్సిన పరిస్థితి. వరద ముప్పు ఉన్న ప్రాంతమిది. ఇలాంటి ప్రాంతంలో రాజధాని నిర్మించాలని ఎవరికైనా అన్పిస్తుందా? అసలు చంద్రబాబుకు ఈ గ్రామాలు ఎప్పుడైనా తెలుసా? ఎప్పుడైనా తిరిగాడా? ఇక్కడ భూములు కొనుగోలు చేశాక, రాజధాని ఇక్కడ పెట్టాలని తెలిశాకే ఈ గ్రామాల పేర్లు తెలుసు. 

సింగపూర్‌ కంపెనీ వెనక్కు వెళ్లడానికి అక్కడ కట్టలేని పరిస్థితి. చట్టం అనుమతించదు. నదీ, అటవీ భూములన్నీ తీసేస్తే మిగిలే భూమి 5,020 ఎకరాలు మాత్రమే. దీన్ని అమ్మితే లక్ష కోట్లు రావాలంటే ఎకరం రూ.20 కోట్లకు అమ్మాలి. నిజంగా ఆ పరిస్థితి ఉందా? 20 ఏళ్ల తర్వాత ఎకరం రూ.90 కోట్లకు అమ్మే పరిస్థితి వస్తేనే సెల్ప్‌ ఫైనాన్స్‌ మోడల్‌ అవుతుంది. అంత వరకూ భారీ పెట్టుబడి పెట్టే పరిస్థితి ఉందా?  

సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని, వెనుకబాటుతనాన్ని అధిగమించాలని, అన్ని వర్గాల వారికి న్యాయం జరగాలన్నదే తమ లక్ష్యం అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆ దిశగా పాలన, అభివృద్ధి వికేంద్రీకరించాలన్న వివిధ కమిటీల సూచనల మేరకు ముందడుగు వేయాలని నిర్ణయించామన్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రజలందరి కోరిక మేరకు శాసన రాజధానిగా అమరావతిని కొనసాగిస్తూనే.. విశాఖపట్టణాన్ని పరిపాలన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా చేయడానికి ఉపక్రమించామని చెప్పారు. తనకు అన్ని కులాల వారు, మతాల వారు సమానమేనని వివరించారు. చంద్రబాబు చెబుతున్నట్లు అన్నీ ఒకేచోట కేంద్రీకృతం చేస్తూ ఆయన కలల రాజధానిని నిర్మించే ఆర్థిక స్తోమత లేదని, అందువల్లే పాలన, అభివృద్ధిని వికేంద్రీకరిస్తున్నామన్నారు. సోమవారం ఆయన అసెంబ్లీలో పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుపై చర్చ సందర్భంగా సుదీర్ఘంగా మాట్లాడారు. గత ఐదేళ్లలో అమరావతి ప్రాంతంలో సాగిన భూదందా గురించి కళ్లకు కట్టినట్లు వివరించారు. బాబు వైఫల్యాలను ఎండగట్టారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఇంకా ఏం మాట్లాడారంటే..

 నిజాలు చెబుతున్నా..
‘ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో ముఖ్యమైన రోజు.. అనుమానాలు, ఆవేశాలను మంచి ఆలోచనలతో అధిగమిస్తున్న రోజు. వెలగపూడిలో చంద్రబాబునాయుడు తాత్కాలిక సచివాయం, తాత్కాలిక అసెంబ్లీ కట్టారు. ఇందుకు ఇంటెరిమ్‌ గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌ నిర్మాణానికి అనుమతి ఇస్తూ 2016 ఫిబ్రవరి 11న టీడీపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులే(జీవో ఎంఎస్‌ నెంబర్‌32) నిదర్శనం. కానీ.. చంద్రబాబు మాత్రం తాను నిర్మించింది తాత్కాలిక సచివాలయం.. అసెంబ్లీ కాదంటూ అబద్ధాల మీద అబద్ధాలు చెప్పుకుంటూ సమయాన్ని వృథా చేస్తున్నారు. నిజాల్ని నిజాలుగా రాష్ట్ర ప్రజలకు చెబుతున్నా. 1953 అక్టోబర్‌ 1న కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం అవతరించిన నాటి నుంచి.. 2014 జూన్‌లో 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పాటయ్యే వరకు, ఆతర్వాత జరిగిన పరిణామాల వరకు గమనిస్తే రకరకాల పొరపాట్లు చోటు చేసుకున్నాయి.

 మూడు నగరాలను కోల్పోయాం..
1953లో ఆంధ్ర రాష్ట్రంగా అవతరించినప్పుడు మద్రాసును పోగొట్టుకున్నాం. ఉమ్మడి రాష్ట్రం కోసం కర్నూలును త్యాగం చేశాం. 58 ఏళ్ల తర్వాత 2014లో హైదరాబాద్‌ను కోల్పోయాం. అభివృద్ధి, ఉద్యోగాలకు కేంద్రంగా ఉన్న మూడు నగరాలను కోల్పోయిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ ఒక్కటే. పదేళ్ల ఉమ్మడి రాజధానిని కూడా ఓటుకు కోట్లు ఇస్తూ పట్టుబడి ఇక్కడున్న ఒక మనిషి చేసిన తప్పిదం వల్ల కోల్పోయాం. ఏ జాతికి అయినా చరిత్ర అనేక పాఠాలు చెబుతుంది. వాటి నుంచి ఎవరైనా గుణపాఠం నేర్చుకుంటేనే భవిష్యత్‌ ఉంటుంది. ఇప్పుడు గతంలో జరిగిన పొరపాట్లను మా ప్రభుత్వం దిద్దుబాటు చేస్తోంది అనడం కరెక్ట్‌. 

ఒక కారు ఎదురుగా వస్తే రోడ్డు దిగాల్సిందే..
టెంపరరీ అసెంబ్లీ తీసుకుంటే.. విజయవాడ ప్రకాశం బ్యారేజీ దాటితే, ఎదురుగా వాహనం వస్తే ప్రయాణించలేని విధంగా కరకట్ట ఉంది. ఇదీ రాజధానికి పోయే రాజమార్గం. ఎకనామిక్‌ సూపర్‌ పవర్‌గా ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ఉండరాదన్న శివరామకృష్ణన్‌ నివేదికను నీరు గార్చేందుకు నారాయణతో సొంత కమిటీ వేశాడు. ఇందులో ఉన్నదెవరు? సుజనా చౌదరి, గల్లా జయదేవ్‌. వీళ్లంతా ఏ రంగంలో నిపుణులు? శివరామకృష్ణన్‌ నివేదిక రాకముందే తన సొంత మనుషులతో కమిటీ వేసుకున్నాడు. సెక్రటేరియట్, అసెంబ్లీ మాత్రమే కాకుండా నైన్‌ ఇన్‌ వన్‌ అని ఒక సినిమా చూపించాడు. లీగల్, ఎడ్యుకేషన్, ఐటీ, టూరిజం, మాన్యుఫ్యాక్చరింగ్‌.. అన్నీ ఇక్కడే పెడుతున్నామంటూ చెప్పాడు.

ఇంత వరకూ ఒక్కదానికి కూడా అంగుళం పనికూడా జరగలేదు. కానీ సినిమా మాత్రం గొప్పగా చూపించాడు. అనేక జిల్లాలు అత్యంత వెనుకబాటులో ఉన్నాయని, అటు శివరామకృష్ణన్, శ్రీకృష్ణ కమిటీతో పాటు ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం చెప్పినా.. ఇందుకు సంబంధించిన డేటాతో నిరూపించినా.. రైతన్నకు అందించాల్సిన నీటి కోసం ఈయన తాపత్రయపడలేదు. తన బినామీల భూముల రేట్ల కోసం తాపత్రయ పడ్డాడు. 

సెల్ఫ్‌ ఫైనాన్స్‌ మోడల్‌ కానే కాదు..
చంద్రబాబు గ్రాఫిక్స్‌లో చూపించిన ఐకానిక్‌ బ్రిడ్జ్‌ చూసి అమరావతిలో అడుగు పెట్టిన వారికి ద్వారంలో టెంపరరీ అసెంబ్లీకి వచ్చే బ్రిడ్జి కన్పిస్తుంది. అదే ఆయన అక్రమ నివాసానికి దారి కూడా. అదే ఒక కారు వెళ్తుంటే మరో కారు ఆగిపోవాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితిపై చంద్రబాబు మానస పుత్రికలు ఈనాడు, చంద్రజ్యోతి ఏనాడైనా ఒక్క ఫొటో వేస్తే సంతోషించి ఉండేవాళ్ల. (కరకట్ట వాస్తవ చిత్రాలను చూపించారు). మౌలిక వసతుల కోసం లక్షా 9 వేల కోట్లకు డీపీఆర్‌ ఇచ్చిన చంద్రబాబు ప్లేటు మార్చి సెల్ప్‌ ఫైనాన్స్‌ ప్రాజెక్టు అంటున్నాడు. నిజాన్ని దాచేసి ఈ మాటలు చెబుతున్నాడు.

పేద పిల్లలకు ఇంగ్లిష్‌ నేర్పించకూడదని, రివర్స్‌ టెండర్‌కు వ్యతిరేకంగా, అధిక ధరలకు చేసుకున్న పీపీఏలను కత్తిరిస్తుంటే కూడా ఉద్యమాలు చేశాడీయన. ఈయనకు బాకా ఊదుతున్న ఎల్లో మీడియా ఇప్పటికిప్పుడు అమరావతి భూములు అçమ్మితే లక్ష కోట్ల వస్తాయని, సెల్ప్‌ ఫైనాన్స్‌ మోడల్‌ అని చెబుతున్నారు. ఈ వాదన ఎంత వరకు కరెక్ట్‌ అని పరిశీలించాం. అందులో తేలిన నిజాలు ఏంటంటే.. గ్రీన్‌ ట్రిబ్యునల్, రిజర్వు కన్జర్వేషన్‌ ప్రాంతాలు.. ఇవన్నీ కృష్ణా నదీ ప్రవాహ ప్రాంతాలని తేలింది. సెల్ప్‌ ఫైనాన్స్‌ మోడల్‌ కాదని స్పష్టమైంది.  

ఐదేళ్లలో ఖర్చు చేసింది రూ.5,674 కోట్లు మాత్రమే
ఇంత భారీ ప్రాజెక్టును మేం అడ్డుకుంటున్నామని చంద్రబాబు అరుస్తున్నారు. మౌలిక సదుపాయాలకే లక్షా 9 వేల కోట్లు ఖర్చవుతుందని చెప్పిన వ్యక్తి.. రాజధాని కోసం ఏదో చేస్తున్నానని బాహుబలి సినిమా చూపించిన వ్యక్తి.. ఐదేళ్లలో ఈయన పెట్టిన ఖర్చు రూ.5,674 కోట్లు మాత్రమే. బకాయిలు కట్టకుండా రూ.2,297 కోట్లు వదిలేశారు. ఏ ప్రభుత్వమైన ఐదేళ్లల్లో రూ.5 వేల కోట్ల నుంచి ఆరువేల కోట్లు మాత్రమే ఖర్చు చేస్తుందని అర్థమవుతోంది. ఈ లెక్కన సంవత్సరానికి వెయ్యి కోట్ల నుంచి 1200 కోట్లు రూపాయలు మాత్రమే ఖర్చు చేస్తూ.. అమరావతి పూర్తి చేయాలంటే లక్ష కోట్లు కావాలి.

ఇలాగైతే ఎన్నేళ్లు పడుతుందో? బాబు ఎంతో స్పీడ్‌తో కట్టానని బిల్డప్‌ ఇస్తున్న స్పీడ్‌తో కట్టినా వందేళ్లు పడుతుంది. అది కూడా ఖర్చు పెరగకుండా ఉంటే. గేర్‌ మార్చి అన్ని అభివృద్ధి పనులు ఆపేసి ఐదు రెట్ల వేగంతో రాజధాని పూర్తి చేస్తామని చెప్పినా కనీసం 20 ఏళ్లు పడుతుంది. ఈ 20 ఏళ్లల్లో అసలు, మీద వడ్డీ కలిపితే, అది 10 శాతం వడ్డీ వేసినా, లక్ష కాస్తా 3 లక్షల 12 వేల 148 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. 30 ఏళ్లలో అయితే రూ.5 లక్షల 97 వేల కోట్లు అవుతుంది. 

మారుమూల గ్రామాల్లో ఎందుకు కొన్నారు?
రాజధాని కోసం 29 గ్రామాల పరిధిలో 33 వేల ఎకరాలు తీసుకున్నారు. ఎవరైనా రియల్‌ ఎస్టేట్‌లో ఎక్కడ పెట్టుబడి పెడతారు? విజయవాడకు మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలోనో.. గుంటూరుకు రెండు మూడు కిలో మీటర్ల దూరంలోనో పెడతారు. ఎప్పుడైనా పెరుగుతుందనుకుంటారు. కానీ ఇక్కడ జరిగిందేంటి? పచ్చగా మూడు పంటలు పండే పొలాల్లో ఉన్న గ్రామాలివి. ఇవి విజయవాడ – గుంటూరుకు ఎంతో దూరంలో ఉన్నాయో తెలుసా? నిర్మాణాలకు అనువుకాని, పోవడానికి రోడ్లు కూడా లేని గ్రామాలివి. ఒకవైపు కారు అటునుంచి వస్తుంటే ఇంకో కారు వెళ్లలేని గ్రామాలివి. అప్పరాజు పాలెం విజయవాడ నుంచి 30 కి.మీ, గుంటూరు నుంచి 38 కిలోమీటర్లు.  శాఖమూరు గ్రామం విజయవాడ నుంచి 29, గంటూరు నుంచి 30 కిలోమీటర్లు. పయ్యావుల కేశవ్‌ కొడుకు భూములు కొనుగోలు చేసిన ఐనవోలు గ్రామం విజయవాడ నుంచి 27, గుంటూరు నుంచి 34 కిలోమీటర్లు. నేలపాడు నుంచి విజయవాడ 26.3 కిలోమీటర్లు. గుంటూరు నుంచి 34.41 కిలోమీటర్లు.

వెలగపూడి గ్రామం గుంటూరు నుంచి 40, విజయవాడ నుంచి 20 కిలోమీటర్లు. ఇంతింత దూరంలో భూములు కొనాలనే ఆలోచన ఎవరికైనా ఎందుకు వస్తుంది? ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని చెప్పడానికి ఇది చాలదా? ఈ కొనుగోలు చేసిన భూములన్నీ ఎప్పుడు? చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక.. ఆ తర్వాత నోటిఫికేషన్‌ రాకమునుపు. రాజధాని గ్రామాల నోటిఫికేషన్‌ డిసెంబర్‌ 30, 2014న వచ్చింది. ఈయన సీఎం అయింది జూన్‌లో. ఈ గ్రామాల్లో రాజధాని వస్తుందని ప్రజలెవ్వరికీ తెలియదు. కానీ వీళ్లకు మాత్రమే తెలుసు. ఎడాపెడా కొనేశారు. తక్కువ ధరకు కొని రైతులను కూడా తీవ్రంగా మోసం చేశారు. మేం తేల్చిన లెక్కల ప్రకారం ఇలా కొనుగోలు చేసింది 4070 ఎకరాలు. ఇందులో చంద్రబాబు సొంత కంపెనీ హెరిటేజ్‌ కూడా ఉంది. 

నాడు ఒక మాట.. ఇవాళ మరో మాట..
విజయవాడ, గుంటూరుకు దూరంగా అమరావతి పేరుతో ఓ భ్రమరావతి సృష్టించాడు చంద్రబాబు. ఇది వర్జిన్‌ ల్యాండ్‌. ఇక్కడ వ్యవసాయం తప్ప ఏమీలేదు కాబట్టి రోడ్లు, నీరు, కరెంట్, డ్రైనేజీ వంటి మౌలిక వసతులకు ఎకరానికి రూ.2 కోట్ల చొప్పున 53 వేల ఎకరాలకు లక్షా 9 వేల కోట్లు అవసరమని చంద్రబాబు నాయుడే అంచనా వేశారు. చంద్రబాబు మానస పుత్రిక ఈనాడులో 2018  డిసెంబర్‌ 26న రాజధాని అంచనా గురించి కూడా వేశారు. 53 వేల ఎకరాలంటే 8 కిలోమీటర్ల పరిధి. కనీస సదుపాయాలకు లక్షా 9 వేల కోట్ల రూపాయలు కావాలని చంద్రబాబు రిపోర్టులో చెప్పారు.

అప్పుడు అమరావతిలో చంద్రబాబు అన్న మాటలు చూద్దాం. (చంద్రబాబు అప్పుడు, ఇప్పుడు అన్న మాటల వీడియో ప్రదర్శించారు). ఆనాడు నాలుగైదు లక్షల కోట్లు అవుతుందని చెప్పిన ఈ పెద్ద మనిషి ఇవాళ ప్లేట్‌ ఎలా మార్చాడో చూశాం. అన్ని భవనాలు టెంపరరీ అని నామకరణం చేసిన ఈయన చివరకు తాను సీఎంగా ఉండి రూ.14 వేల కోట్లకు టెండర్లు కూడా పిలిచాడు. ఏ రకంగా సూట్‌ అయితే ఆ రకంగా మాట్లాడటం చంద్రబాబుకు అలవాటే. ప్రత్యేక హోదా గురించి ఎలాంటి కుప్పిగంతులు వేశారో ఈ సభలోనే చూశాం. 

రాష్ట్రాన్ని రియల్‌ ఎస్టేట్‌గా మార్చింది ఎవరు?
చంద్రబాబు ఓటుకు కోట్లు కేసులో దొరికిపోయి హైదరాబాద్‌ నుంచి పారిపోయి వచ్చారు. గుట్టుచప్పుడు కాకుండా ఈ ప్రాంతంలో వేల ఎకరాల భూములను ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ద్వారా తాను, తన బినామీలతో కొనుగోలు చేయించారు. అందరికీ ఒకవైపు నూజీవీడు అన్నారు. నాగార్జున యూనివర్సిటీ అంటూ ఈనాడు, చంద్రజ్యోతి వార్తలు రాశాయి. ఆ రాతలన్నీ కూడా వీళ్ల లీకులతోనే వచ్చాయి. ఇదే తెలుగుదేశం నాయకులు నూజీవీడు, నాగార్జున యూనివర్సిటీ ప్రాంతంలో భూములు కొనుగోలు చేసి నష్టపోలేదు. జీవో 254ను 2014 డిసెంబర్‌ 30న విడుదల చేశారు.

ఆ రోజు పబ్లిక్‌ డోమైన్లోకి రాజధాని ఏర్పాటు చేసే ఊర్ల పేర్లు వచ్చాయి. ఇవాళ ఆ భూములు పోతాయని వీళ్లు బాధపడుతున్నారు. పచ్చటి పొలాలకు సరిహద్దులు నిర్ణయించి.. స్టేట్‌ను రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌గా మార్చారు. రాజధాని కోసం భూములా? లేక తాను, తన బినామీల కోసం రాజధానా? అని ఇదే సభ నుంచి చంద్రబాబును ప్రశ్నిస్తున్నాను. చంద్రబాబు తన స్వార్థం కోసం రైతులను రెచ్చగొట్టారు. మరి కొందరిని ప్రలోభపెట్టారు. కొందరిని బెదిరించారు. 144 సెక్షన్‌ అన్నది ఇదే ప్రాంతంలోని మచిలీపట్నంలో నాలుగేళ్లుగా నిరంతరాయంగా కొనసాగించారు. మా ప్రభుత్వం వచ్చేదాకా 144 సెక్షన్‌ విధించారు. దీనిని యాగీ చేయడంలో వీళ్లకు ఉన్న పలుకుబడి చూసి అశ్చర్యం అనిపించింది.  

వికేంద్రీకరణే మేలన్న కమిటీలు..
శ్రీబాగ్‌ ఒడంబడికలో భాగంగానే 1953లో కర్నూలును రాజధానిగా చేశారు.1956 దాకా అదే రాజధానిగా కొనసాగింది. 2014లో రాష్ట్ర విభజన చేయడానికి ముందు 23 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌లో అనేక అంశాలపై అధ్యయనం చేసిన జస్టిస్‌ శ్రీకృష్ట కమిటీ అభివృద్ధి ఒకే చోట కేంద్రీకృతం కావడం వల్ల ఏ రకమైన నష్టం జరుగుతుందో ఎత్తిచూపింది. రాష్ట్ర విభజన అనంతరం రాజధాని ప్రాంతం ఎంపిక కోసం కేంద్రం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్‌ కమిటీ కూడా ఇదే చెప్పింది. విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి అంతా ఒకే ప్రాంతానికి పరిమితం చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. శివరామకృష్ణన్‌ కమిటీ నివేదికను చంద్రబాబు వక్రీకరించారు. గంటన్నర పాటు చంద్రబాబు అబద్ధాలు చెప్పారు. చంద్రబాబుకు ఇష్టమైన పాంప్లెట్‌ చానల్‌ ఈటీవీలోనే శివరామకృష్ణన్‌ కమిటీ ఏమి చెప్పిందో చూద్దాం.(వీడియో క్లిప్పింగ్‌లను ప్రదర్శించారు). శివరామకృష్ణన్‌ కమిటీ నివేదిక ఇవ్వక ముందే.. అదే ప్రాంతంలో రాజధాని పెట్టాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.

అందుకే సలహాలు మాత్రమే ఇవ్వగలమని శివరామకృష్ణన్‌ నివేదికలో నిస్పృహను వ్యక్తం చేశారు. జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ, శివరామకృష్ణన్‌ కమిటీలు ఇంత స్పష్టంగా చెప్పినా కూడా.. ప్రాంతాల పరంగా అనేక ఆకాంక్షలు ఉన్నా కూడా.. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు వాటన్నింటిని గడ్డిపరక కంటే చిన్నగా చూశారు. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీజీ(బోస్టన్‌ కన్సల్టెంగ్‌ గ్రూప్‌), జీఎన్‌ రావు కమిటీలు వేశాం. గతంలోని కమిటీల మాదిరిగానే ఇవి కూడా వికేంద్రీకరణకు ఓటు వేశాయి. ఈ నివేదికలను అధ్యయనం చేయడానికి పది మంది మంత్రులు, అధికారులతో హైపవర్‌ కమిటీ వేశాం. జస్టిస్‌ శ్రీకృష్ణ, శివరామకృష్ణన్, జీఎన్‌ రావు కమిటీలు.. బీసీజీ నివేదికలను పరిశీలించిన హైపవర్‌ కమిటీ వికేంద్రీకరణే రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ఏకైక మార్గమని నివేదిక ఇచ్చింది. గతంలో చేసిన తప్పులను సరిదిద్దుతూ సూచనలు చేసింది. జిల్లాల వెనుకబాటుకు సంబంధించి వాస్తవాలు చెప్పింది. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను సిఫార్సు చేసింది. 
 
అన్ని కులాలు, మతాలు నాకు సమానమే 
చంద్రబాబులాగా గ్రాఫిక్స్‌తో, అబద్ధాలతో భ్రమ కల్పించం. అమరావతికి చేయగలిగినంతా చేస్తాం. ఇక్కడే అసెంబ్లీ నిర్వహిస్తాం. అన్ని జిల్లాలు, అన్ని ప్రాంతాలు, అన్ని కులాలు, అన్ని మతాలు బాగుండాలన్నదే నా విధానం. అందుకే ఈరోజు నాకు గొప్ప సహచరుడిగా కొడాలి నాని ఉన్నారని నేను గర్వంగా చెబుతున్నా. నా కార్యక్రమాలను చూసే రఘు ఎవరు? వీరంతా కమ్మవారు కాదా? ఇదే కమ్మవారు, కాపులు, ఎస్సీలు, బీసీలు, మైనారిటీలు, రెడ్లు అందరూ ఓటేస్తేనే నాకు 151 సీట్లు వచ్చాయి. కులం మధ్య చిచ్చుపెట్టి లబ్ధిపొందడం కోసం జగన్‌ కమ్మవారికి వ్యతిరేకమని, విజయవాడ నుంచి రాజధానిని తీసేస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ రాజధాని పెడితే అక్కడ కమ్మవారు లేరా? అక్కడ మా ఎంపీనే కమ్మవారు అని కొడాలి నాని ఇప్పుడే చెప్పారు. విశాఖపట్నంలో నాలుగైదు సార్లు ఎంపీగా గెలిచిన వారు కూడా కమ్మవారే. కమ్మవారిలో అభద్రతా భావం సృష్టించి ఓటు బ్యాంకును కాపాడుకోవడం కోసం కేవలం దుష్ప్రచారం కోసం చంద్రబాబు నీచానికి దిగజారారు. రాజకీయాల కోసం కులాన్ని వాడుకునే నీచానికి  పాల్పడుతున్నారు.

ఆ పార్టీకి బాకా ఊదే టీవీ చానళ్లు, పత్రికలు కూడా ఆ స్థాయికి దిగజారాయి. అన్ని కులాలు, అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలు బాగుండాలి. అందరికీ మంచి చేయాలి. ఇదే నా విధానం. ఇంటింటికీ అభివృద్ధి ఫలాలు అందాలి. ఇందుకోసం అన్నింటా సంస్కరణలు కొనసాగిస్తాం. గ్రామ సచివాలయాల నిర్మాణం నుంచి రాష్ట్ర సచివాలయాల నిర్మాణం వరకూ భావితరాల, మన ప్రాంతాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మేం నిర్ణయాలు తీసుకుంటాం. దీని కోసమే వికేంద్రీకరణకు ఓటు వేస్తున్నాం. విశాఖను కార్యనిర్వాహక రాజధాని, అమరావతిని శాసన నిర్మాణ రాజధానిగా అభివృద్ధి చేస్తాం. అన్యాయానికి గురైన కర్నూలు ప్రాంతానికి నా హయాంలో మేలు చేసే అవకాశం కలిగినందుకు సంతోషిస్తున్నాం. దీనిని న్యాయ రాజధాని చేస్తాం. ఇందుకు సంపూర్ణ మద్దతు ఇవ్వాల్సిందిగా ప్రతి వ్యక్తినీ, ప్రతి కుటుంబాన్ని కోరుతున్నా. రాళ్లేస్తున్న చంద్రబాబు మనసు కూడా మార్చాలని దేవుని వేడుకుంటున్నాం.  

అమరావతి రైతులకు అన్యాయం జరగదు 
అమరావతి రైతులకు మా హయాంలో ఎలాంటి అన్యాయం జరగదు. రైతు పక్షపాతిగా, చరిత్రలో ఏ ప్రభుత్వం చేయనంతగా రైతుకు అండగా నిలబడుతున్న ప్రభుత్వం మాది. 13 జిల్లాల్లోని ఏ రైతులకూ అన్యాయం జరగనీయను. అమరావతికి కూడా న్యాయమే చేస్తాం. అమరావతి రాజధానిగా ఉంటుంది. రైతులకు ఇచ్చే వార్షిక కౌలును పదేళ్ల నుంచి 15 ఏళ్లకు పెంచుతున్నాం. 29 గ్రామాల్లో భూమి లేని పేదలకు జీవన భృతి పెన్షన్‌ను రూ. 2500 నుంచి రూ. 5000కు పెంచుతున్నాం. దీనివల్ల 21 వేల కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుంది.

అసైన్‌మెంట్‌ భూములను భూసమీకరణ కింద ఇచ్చిన వారికి తక్కువ పరిమాణంలో ఇంటి/వ్యాపార స్థలాలు ఇచ్చేలా చంద్రబాబు సర్కారు అప్పట్లో చట్టం చేసింది. అసైన్‌మెంట్‌ భూములు ఇచ్చిన పేదలైన బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలకు దీనివల్ల అన్యాయం  జరుగుతుంది. మా ప్రభుత్వం వారికి కూడా న్యాయం చేస్తుంది. పట్టా భూములు ఇచ్చిన వారితో సమానంగా ప్లాట్లు ఇస్తుంది. అమరావతిని అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం. సహజ రీతిలో అమరావతి ఒక గొప్ప నగరంలా రూపుదిద్దుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాం.  

కొన్ని నిర్ణయాలు తీసుకోకపోతే నష్టపోతాం 
మనం బాధ్యతగల నాయకత్వ స్థానంలో ఉన్నాం. కొన్ని నిర్ణయాలు చేయకపోవడంవల్ల రాష్ట్రం నష్టపోతుంది. కొన్ని నిర్ణయాలు తీసుకుంటే మేలు జరుగుతుందని అనిపిస్తున్నప్పుడు తీసుకోకపోవడం ధర్మమేనా? అని ఆలోచించాలి. రాజధాని మధ్యలోనే ఉండాలనే వాదన చంద్రబాబు గట్టిగా వినిపించారు. చంద్రబాబు చెబుతున్నట్లు రాజధాని మధ్యలో ఉండాలన్నదే కరెక్టయితే ఒక్కసారి ఢిల్లీ ఎక్కడుందో గమనించాలని అడుగుతున్నా.

ఢిల్లీకి విజయవాడ మధ్య దూరం 1,856 కిలోమీటర్లు. హైదరాబాద్‌ 1556 కి.మీ, తిరుపతి 2000 కి.మీ, బెంగళూరు 2177 కి.మీ, చెన్నై 2200 కి.మీ.ల దూరంలో ఉంది. రాజధాని మధ్యలోనే ఉండాలన్నది కరెక్టే అయితే వెంటనే చంద్రబాబు, రామోజీరావు కలిసి  రాజధాని మధ్యలో ఉండాలి, దానిని మార్చండి అని మోదీకి లేఖ రాయాలి. తమిళనాడు రాజధాని చెన్నైకి చివరి ప్రాంతం ఎంతదూరంలో ఉందో చూడండి. కర్ణాటక రాజధాని బెంగళూరు, మహారాష్ట్ర రాజధాని ముంబయి ఒక మూలనున్నాయి. రాజస్థాన్‌లో జైపూర్‌ ఎక్కడ ఉందో చూడండి.  

రాజధాని మార్చుతున్నామనేది వాస్తవం కాదు 
రాజధాని మధ్యలో ఉండాలని ఎవరూ కొలతలు వేసుకోవాలని ఆలోచించరు. రాజధాని ఎక్కడ పెడితే తక్కువ ఖర్చవుతుంది? జనాభా పెరుగుతుంది? రెవెన్యూ పెరుగుతుంది? అభివృద్ధి వేగంగా ముందుకు పోతుందనే అంశాలు ఆలోచించి రాజధానిని నిర్ణయిస్తారు. చంద్రబాబుకు అది అర్థం కాదు. ఆయనకు కొన్న భూములే గుర్తుకొస్తున్నాయేగానీ మరే విషయాలు అర్థం కావడంలేదు. అమరావతి విషయానికి వస్తే ఈ ప్రాంత రైతులకు, ప్రజలకు భరోసా ఇవ్వదలిచాను. రాజధానిని మార్చుతున్నారని చంద్రబాబు అంటున్న మాట ఏమాత్రం వాస్తవం కానే కాదు. రాజధానిని మేం మార్చడంలేదు.

రాజధాని ఎక్కడకూ పోవడంలేదు. ఈ ప్రాంతానికి అన్యాయం చేయడంలేదు. మిగిలిన ప్రాంతాలకు కూడా న్యాయం చేస్తున్నాం. ఇక్కడే లెజిస్లేటివ్‌ రాజధాని ఉంటుంది. అసెంబ్లీ ఉంటుంది. చట్టాలు చేస్తాం. దీంతోపాటు మరో రెండు కొత్తవి చేర్చుతున్నాం. విశాఖపట్నంలో సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాలు పెడుతున్నాం. కర్నూలును జ్యుడీషియల్‌ కేపిటల్‌ చేస్తున్నాం. ఎక్కడా, ఏప్రాంతానికి అన్యాయం చేయడంలేదు. ఇక్కడ న్యాయం చేస్తూనే మిగిలిన ప్రాంతాలకు కూడా న్యాయం చేస్తున్నాం.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top