సచివాలయ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు

Anantapuram District Collector Says Arrangements Should Be Made For Secretarial Examinations - Sakshi

సమస్యల పరిష్కారంలో వేగం పెంచాలి 

హౌసింగ్, రేషన్‌ కార్డులపై దృష్టి సారించండి 

సాక్షి, అనంతపురం అర్బన్‌: గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ ఎస్‌.సత్యనారాయణ ఆదేశించారు. మంగళవారం ఆయన కలెక్టరేట్‌లోని ఎన్‌ఐసీలో సచివాలయ ఉద్యోగాల పరీక్ష నిర్వహణ, ప్రజాసమస్యల పరిష్కారంపై జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, సచివాలయ ఉద్యోగాల భర్తీకి నోటిపికేషన్‌ విడుదలైనందున.. వెంటనే పరీక్ష కేంద్రాలను ఎంపిక చేయాలన్నారు. అలాగే పరీక్ష నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభించాలన్నారు. ఈ ప్రక్రియను పర్యవేక్షించాలని డీఆర్‌ఓ సుబ్బారెడ్డిని ఆదేశించారు. ఎక్కడా పొరపాట్లు దొర్లకూడదని సూచించారు. గ్రామ సచివాలయాల్లో 11 మంది సిబ్బంది, కంప్యూటర్, ఇతర వసతులకు అనుగుణంగా ఉండే భవనాలను గుర్తించాలన్నారు. 

సమస్యలకు వేగవంతంగా పరిష్కారం చూపాలి
ప్రజా సమస్యలకు వేగవంతంగా పరిష్కారం చూపాలని కలెక్టర్‌ జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రధానంగా హౌసింగ్, రేషన్‌ కార్డులపై సంబంధిత అధికారులు దృష్టి సారించాలన్నారు. పెన్షన్ల అర్జీలు వెంటనే పరిష్కరించేందుకు ప్రత్యేకంగా డిప్యూటీ సీఈఓను నియమించాలని జెడ్పీ సీఈఓ శోభస్వరూపారాణిని ఆదేశించారు. సర్వే సమస్యలు 30 రోజుల్లోగా పరిష్కారం అవుతున్నాయో...లేదో  పరిశీలించుకోవాలని సర్వే శాఖ ఏడీ మశ్చీంద్రనాథ్‌ను ఆదేశించారు. అలాగే ఆర్డీఓలు ప్రతి శనివారం కోర్టు నిర్వహించి సమస్యలు పరిష్కరించాలన్నారు. ఆర్‌ఓఆర్, 1–బి, అడంగల్‌లో వివరాలు సరిజేయడం, తదితర సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. నిర్దేశిత గడువులోగా సమస్యలు పరిష్కారమయ్యేలా చూడాలన్నారు. ‘పల్లెపిలుపు’ కార్యక్రమం సందర్భంగా సమస్యల పరిష్కారాన్ని ర్యాండమ్‌గా పరిశీలించాలన్నారు. పాఠశాలలు, వసతి గృహాలోని పరిస్థితులను ప్రతిబింబించే ఫొటోలు తీయాలన్నారు. వాటిలో అభివృద్ధి, మరమ్మతు పనులు చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో జేసీ–2 హెచ్‌.సుబ్బరాజు, అసిస్టెంట్‌ కలెక్టర్‌ జాహ్నవి, డీఆర్‌ఓ ఎం.వి.సుబ్బారెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్‌ అలీంబాషా పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top