మంచిరోజులొచ్చాయ్‌..

Alcohol Ban Policy Start in West Godavari - Sakshi

రాత్రి ఎనిమిది దాటితే మందు బంద్‌

మూతపడిన బెల్ట్‌ దుకాణాలు

దశల వారీగా సంపూర్ణ మద్య నిషేధానికి చర్యలు

నూతన మద్యం పాలసీపై బాధిత మహిళల హర్షం

పెయింటర్‌ పనిచేస్తూకుటుంబాన్ని పోషించే నిడదవోలుకు చెందిన విప్పర్తి నాగరాజు మద్యానికి బానిస అయ్యాడు. పనికి వెళ్లినా వచ్చిన డబ్బులతో తాగేవాడు. కొంతకాలానికి లివర్‌ చెడిపోయి 2016లో మృత్యువాత పడ్డాడు. అతని భార్య కూడా అనారోగ్యంతో ఉండటంతో వృద్ధాప్యం లోనూ నాగరాజు తల్లి సుబ్బలక్ష్మి కూలి పనులకు వెళ్లి ముగ్గురుమనవలను సాకుతోంది. మద్యంకారణంగా ఎన్నో కుటుంబాలు నాశనం అయ్యాయని, తన కుమారుడిని తమకు కాకుండా చేసిన ఆ మద్యం మహమ్మారిని లేకుండా చేయాలని కోరుతోంది.ఇప్పటికైనా దశలవారీ మద్య నిషేధానికి ముందుకు వచ్చిన జగన్‌మోహనరెడ్డి చాలా మంచి పని చేస్తున్నారని, తన కష్టం ఏ కుటుంబానికి రాకూడదని ప్రార్థిస్తోంది.

సాక్షి ప్రతినిధి, ఏలూరు, నిడదవోలు:  ‘మద్య నిషేధాన్ని గత ప్రభుత్వాలు చేసి ఉంటే మా బతుకుల్లో వెలుగులు ఉండేవి. అలా చేయకుండా గ్రామ గ్రామాన మద్యం దుకాణాలు పెట్టి మా పిల్లలను మాకు కాకుండా చేశారు. ఇప్పటికైనా జగన్‌మోహన్‌రెడ్డి దశల వారీ మద్య నిషేధంతో ముందుకు రావడం మంచి పరిణామం’ అంటూ మద్యం వల్ల తమ భర్తలను, పిల్లలను పొగొట్టుకున్న కుటుంబాలుఆనందం వ్యక్తం చేస్తున్నాయి. మద్యాన్ని ఆదాయ వనరుగా చూడకుండా దశలవారీ మద్య నిషేధాన్ని అమలు చేయాలనుకోవడం మంచి పరిణామమని వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దశలవారీ మద్య నిషేధంలో భాగంగా ఏటా 20 శాతం మద్యం షాపులు తొలగిస్తామని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మహిళలకు వాగ్దానం చేశారు. ఈ వాగ్దానాన్ని సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన కొన్ని నెలల్లోనే ఆయన నిలబెట్టుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనమద్యం పాలసీలో భాగంగా ఇప్పటికే జిల్లాలో ఉన్న 474 మద్యం దుకాణాలు ఇప్పుడు 379కి తగ్గిపోయాయి. ప్రస్తుతం ప్రభుత్వం ఆధ్వర్యంలోనే అమ్మకాలు జరుగుతున్నాయి. మద్యంను ఆదాయ వనరుగా, బీరును హెల్త్‌ డ్రింక్‌గా ప్రమోట్‌ చేసిన ప్రభుత్వం ఇంటికి వెళ్లిపోయింది. దశల వారీగా మద్య నిషేధం అమలు చేస్తామని ఇచ్చిన హామీలో భాగంగా మొదటి ఏడాదే షాపులు తగ్గించడంతో పాటు ప్రభుత్వమే నిర్వహణను చేపట్టడం పట్ల హర్షం వ్యక్తం అవుతోంది. రాత్రి ఎనిమిది గంటలు దాటితే మద్యం అందుబాటులో ఉండటం లేదు.

బెల్టు షాపుల నిర్మూలన, మద్యం అమ్మకాలకు చెక్‌పెట్టడం కోసం ఎలాంటి లాభాపేక్ష లేకుండా ప్రభుత్వం ఈ మద్యం దుకాణాలను నిర్వహిస్తోంది. ప్రభుత్వం ఆధ్వర్యంలో మద్యం షాపుల ఏర్పాటుకు ఎక్సైజ్‌ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మున్సిపాలిటీ, మండల కేంద్రాల్లో ఉండే మద్యం షాపుల్లో ఒక సూపర్‌వైజర్, ముగ్గురు సేల్స్‌మెన్‌లు, మిగిలిన ప్రాంతాల్లో ఒక సూపర్‌వైజర్, ఇద్దరు సేల్స్‌మెన్‌లు చొప్పున జిల్లా వ్యాప్తంగా సుమారు వెయ్యి మందికి ఉపాధి దొరికింది. 

నిడదవోలుకు చెందిన చెరుకూరి పార్వతి భర్త దుర్గామహేష్‌ (26) పెయింటర్‌ పనులు చేస్తూ  గత ఐదేళ్లుగా మద్యానికి బానిసగా మారాడు. మద్యం అలవాటు కారణంగా కిడ్నీలు పాడైపోయాయి. స్తోమత కొద్ది వైద్యం చేయించినా ఇటీవలే మహేష్‌ మృతి చెందడంతో కుటుంబ పోషణ అతని భార్యపై పడింది. దీంతో చర్చిపేటలో చిన్న తోపుడు బండి పెట్టుకుని టిఫిన్‌ అమ్మడం ప్రారంభించింది. అయినకాడికి అప్పులు చేసి చిన్న హోటల్‌ నడుపుతున్నా ఆశించిన లాభాలు లేకపోవడంతో అర్థికంగా ఇబ్బందులు పడుతోంది. తన ఇద్దరు పిల్లలతోపాటు అత్తను ఆ హోటల్‌పై వచ్చిన ఆదాయంతోనే పోషిస్తోంది. తన భర్త మరణానికి కారణమైన మద్యాన్ని పూర్తిగా నిషేధించాలని పార్వతి మనస్ఫూర్తిగా కోరుతోంది. అధికారంలోకి రాగానే దశలవారీ మద్య నిషేధానికి ముందడుగు వేసిన ముఖ్యమంత్రి జగన్‌ను అభినందిస్తోంది. మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తే తమలా రోడ్డున పడాల్సిన అవసరం ఏ కుటుంబానికి ఉండదనేది పార్వతి అభిప్రాయం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top