పదవీ విరమణ వయస్సు 58 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళకు పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు ఎయిడెడ్ ఉపాధ్యాయులకు వర్తించేలా చర్యలు తీసుకోవాలని పలు ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేశాయి.
సాక్షి, హైదరాబాద్: పదవీ విరమణ వయస్సు 58 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళకు పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు ఎయిడెడ్ ఉపాధ్యాయులకు వర్తించేలా చర్యలు తీసుకోవాలని పలు ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేశాయి. 1984లో 55 ఏళ్ళ నుంచి 58 ఏళ్ళకు పదవీ విరమణ వయస్సు పెంచినప్పుడు ఎయిడెడ్ ఉపాధ్యాయులకు వర్తింపజేశారని, ఎయిడెడ్ ఉపాధ్యాయులకు 310, 311 పద్దు కింద వేతనాలు చెల్లిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యన్.రఘురామిరెడ్డి, పి.పాండురంగ వరప్రసాద్‌లు మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
ఎస్టీయూ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు కత్తి నరసింహారెడ్డి, ప్రధాన కార్యదర్శి జోసఫ్ సుధీర్‌బాబులు సచివాలయంలో ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ పీవీ రమేష్‌ను కలిసి ఎయిడెడ్ టీచర్లను పదవీ విరమణ వయస్సు పెంపులో విస్మరించడం తగదని వినతి చేశారు. తక్షణమే సీఎం చంద్రబాబు నాయుడు స్పందించి ఎయిడెడ్ సిబ్బందికి 60 ఏళ్ళు పెంచుతూ నిర్ణయం తీసుకోవాలని ఏపీటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సదాశివరావు, జి.హృదయరాజులు ఓ ప్రకటనలో కోరారు.


