అగ్రిగోల్డ్‌ బాధితుల వినూత్న నిరసన

Agrigold Victims Protest In Prakasam - Sakshi

ఒంగోలు సబర్బన్‌: రాష్ట్ర ప్రభుత్వం అగ్రిగోల్డ్‌ బాధితుల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై బాధితులు సోమవారం వినూత్న నిరసన తెలిపారు. ప్రభుత్వం సీఐడీని అడ్డంపెట్టుకుని సాగతీత కార్యక్రమానికి పాల్పడుతుందంటూ అగ్రిగోల్డ్‌ కస్టమర్‌ అండ్‌ ఏజెంట్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఒంగోలులో ర్యాలీ చేపట్టారు. నెల్లూరు బస్టాండ్‌లోని అగ్రిగోల్డ్‌ కార్యాలయం నుంచి ర్యాలీగా బయల్దేరిన నిరసనకారులు ప్రకాశం భవనం వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి చర్చి సెంటర్‌ వద్దకు వెళ్లి తిరిగి ప్రకాశం భవనం మీదుగా, ప్రకాశం భవనం పక్కనే ఉన్న అంబేడ్కర్‌ విగ్రహం వద్దకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు.

అక్కడ ప్రభుత్వ చర్యకు నిరసనగా అసోసియేషన్‌ నాయకులు వి.తిరుపతిరావు, అనుమోలు శ్రీను, పాకల రవణయ్య సామూహిక కేశఖండన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.తిరుపతిరావు మాట్లాడుతూ హైకోర్టు వాయిదాల మీద వాయిదాలు వేయడానికి రాష్ట్ర సీఐడీలే ప్రధాన కారణమని ఆయన వ్యాఖ్యానించారు. సీఐడీ అధికారులు త్వరితగతిన కేసు పరిష్కారం చేయాలంటే అగ్రిగోల్డ్‌ బాధితులకు ఇంతటి తీవ్ర అన్యాయం జరిగేది కాదన్నారు. రాష్ట్రంతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో బాధితులు ఉన్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో అగ్రిగోల్డ్‌ బాధితులు నాయుడు శ్రీను, బాపూజీ, ఈ.సుబ్బారావు పాల్గొన్నారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top