
ఇప్పట్లో లేనట్టే!
టీడీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ప్రజల్లో కొత్త ఇళ్లు వస్తాయనే ఆశలు నీరిగారిపోతున్నాయి.
ఏప్రిల్ తర్వాతే కొత్త ఇళ్ల మంజూరు
పెండింగ్‌లో రూ. 72.48 కోట్ల బిల్లులు
మంజూరైనా నిర్మాణం జరగని 28,612 గృహాలు
బిల్లుల కోసం లబ్ధిదారుల ఎదురుచూపులు
జియోట్యాగ్‌తో ఇళ్లను ఆన్‌లైన్ చేస్తున్న సిబ్బంది
సాక్షి, కడప : టీడీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ప్రజల్లో కొత్త ఇళ్లు వస్తాయనే ఆశలు నీరిగారిపోతున్నాయి. అదిగో ఇళ్లు ఇదిగో ఇళ్లు అంటూ ఎదురు చూసిన ప్రజలకు నిరాశే మిగులుతోంది. ఇలా నెల కాదు..రెండు నెలలు కాదు.. తొమ్మిది నెలలవుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబులో చలనం కనిపించలేదు. ఇళ్లులేని నిరుపేదలకు ఇప్పుడు ఇంటికి మంజూరు చేసే సొమ్మును మరింత రెట్టింపు చేసి అందజేస్తామని ఇచ్చిన హామీలు కూడా నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయి.
ఎప్పుడు వస్తాయా? అని ప్రజలు నూతన గృహాల కోసం ఎదురుచూస్తుండగా... ఎందుకు ఇళ్లు మొదలు పెట్టి చిక్కులు తెచ్చుకున్నామా? అని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఏమీ చేయకపోయినా ఏదో చేస్తున్నట్లుగా ప్రస్తుత అధికారులు జియో ట్యాగ్ పేరుతో కట్టిన ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన ఫొటోలు, వివరాలు సేకరిస్తున్నారు. కొత్త ఇళ్లు మంజూరు చేయలేదు..కొత్త ప్రభుత్వంలో బిల్లులు రాలేదు. సరికదా.. దీనికి తోడు ఒక్కో ఉద్యోగి రోజుకు 100 ఇళ్లకు సంబంధించి జియో ట్యాగ్ చేయాలని ఆదేశించడంతో సిబ్బంది క్షేత్రస్థాయిలో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.
ఏప్రిల్ తర్వాతే విడుదల
తెలుగుదేశం ఆధ్వర్యంలోని బాబు సర్కార్ హౌసింగ్ శాఖకు సంబంధించి ఇప్పట్లో నిధులు విడుదల చేసేలా కనిపించడం లేదు. దాదాపు 9 నెలలుగా అదిగో పులి...ఇదిగో నక్క అన్న చందాన కాలం గడుపుతూ సర్కార్‌ను నడిపిస్తున్న బాబు బిల్లుల మంజూరు, కొత్త ఇళ్ల విషయంలో శ్రద్ధ చూపడం లేదు. 2014-15 ఏడాదికి సంబంధించి కొత్త ఇళ్ల మంజూరు లేనట్లేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు. 2015-16కు సంబంధించి ఏప్రిల్ తర్వాత వచ్చే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. అప్పట్లో అయినా పూర్తి స్థాయిలో ప్రభుత్వం కొత్త ఇళ్ల మంజూరు, బిల్లులు విడుదల చేస్తుందా అనేది కూడా అనుమానమేనని పలువురు భావిస్తున్నారు.
జిల్లాలో రూ. 72 కోట్ల మేర బిల్లులు
జిల్లాలో నిరుపేదలు నిర్మించుకున్న, నిర్మించుకుంటున్న ఇతర ఇళ్లకు సంబంధించి సుమారు రూ. 72 కోట్ల మేర బిల్లులు రావాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొత్త ఇళ్లు కూడా 28,612 మంజూరైనా నిర్మాణానికి నోచుకోలేదు. అలాగే నిర్మాణ దశల్లో నిలిచిపోయిన ఇళ్లు కూడా దాదాపు 11,424 ఉండగా, పూర్తయిన గృహాలు 17,188 ఉన్నాయి. ఇలా బిల్లులు పెండింగ్‌లో ఉన్నా ఎవరూ పట్టించుకోకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. పైగా ఏడాది కాలంగా నిర్మించుకున్న ఇళ్లకు సంబంధించి ఇంతవరకు బిల్లులు ఇవ్వకపోతే తమ పరిస్థితి ఏంటని పలువురు లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జియోట్యాగ్‌తో ఇబ్బందులు పడుతున్న సిబ్బంది
హౌసింగ్‌శాఖ రాష్ట్ర వ్యాప్తంగా జియో ట్యాగ్ విధానాన్ని అమలులోకి తెచ్చింది. విధానం మంచిదే అయినా సిబ్బందికి జిల్లాలో కొంత ఇబ్బందిగా మారింది. జియో ట్యాగ్ విధానంతో పనిచేయించుకోవడం వరకు బాగానే ఉన్నా..రోజుకు ఒక్కో వర్క్ ఇన్‌స్పెక్టర్ 100 ఇళ్లకు సంబంధించి ఫొటోలు, వివరాలు సేకరించాలని హౌసింగ్‌శాఖ ఆదేశించింది. ఇంతకుమునుపు ఒక్కొక్కరు 50 ఇళ్లకు సంబంధించి జియో ట్యాగ్ తీసి ఆన్‌లైన్ చేయమని చెప్పిన అధికారులు ఈ మధ్యకాలంలో 100 ఇళ్లకు పెంచడంపై సిబ్బంది ఇబ్బందిగా భావిస్తున్నారు.