బీసీ సంక్షేమ వసతి గృహాల వార్డెన్ల సంఘం అధ్యక్షుడి నుంచి రూ.1.15 లక్షలు లంచం తీసుకుంటూ ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎం రాజు శనివారం రాత్రి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.
విజయనగరం కంటోన్మెంట్: బీసీ సంక్షేమ వసతి గృహాల వార్డెన్ల సంఘం అధ్యక్షుడి నుంచి రూ.1.15 లక్షలు లంచం తీసుకుంటూ ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎం రాజు శనివారం రాత్రి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. జిల్లాలోని బీసీ సంక్షేమ వసతి గృహాల వార్డెన్ల నుంచి వసూలు చేసిన ఈ మొత్తాన్ని బీసీ వెల్ఫేర్ అధికారిగా ఇన్‌చార్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎం.రాజు అందుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ సీహెచ్.లక్ష్మీపతి తన సిబ్బందితో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
డీఎస్పీ లక్ష్మీపతి విలేకరులతో మాట్లాడుతూ ప్రతీ నెలా విద్యార్ధులకు ఇచ్చే కాస్మొటిక్ చార్జీల్లో ఒక్కో విద్యార్థి నుంచి రూ.10 వసూలు చేసి బీసీ వెల్ఫేర్ అధికారికి ఇవ్వడం ఆనవాయితీ కాగా ఈ మొత్తాన్ని వార్డెన్ల సంఘం అధ్యక్షుడు మోహనరావు తీసుకువచ్చి ఇన్‌చార్జి బాధ్యతలు నిర్వర్తిస్తున్న రాజుకు అందించారని తెలిపారు. దీనిపై తమకు వచ్చిన సమాచారం ఆధారంగా ఆకస్మికంగా దాడులు నిర్వహించామని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి ఆయన్ను విచారిస్తున్నట్టు పేర్కొన్నారు. విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.