
ఒంగోలు: శ్రీ చైతన్య, నారాయణ జూనియర్ కాలేజీల్లో వరుసగా జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలను నిరసిస్తూ అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆధ్వర్యంలో స్థానిక శ్రీచైతన్య కాలేజీ వద్ద కార్పొరేట్ యాజమాన్యాల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా భాగ్ కన్వీనర్ అశోక్ మాట్లాడుతూ కడప జిల్లాలో నారాయణ కాలేజీలో పావని ఆత్మహత్య జరిగి వారంరోజులు కూడా గడవకముందే హైదరాబాదు, ఏపీల్లో మొత్తం అయిదుగురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. కార్పొరేట్ కాలేజీల్లో నిజంగా ఆత్మహత్యలు జరుగుతున్నాయా లేక హత్య జరిగిన తరువాత వాటిని ఆత్మహత్యలుగా చిత్రీకరిస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయన్నారు.
నారాయణ, శ్రీచైతన్య కాలేజీల్లో జరిగిన ఆత్మహత్యలపై సీబీఐతో విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. కార్పోరేట్ వ్యవస్థల గుర్తింపు రద్దుచేసి డాక్టర్ ప్రొఫెసర్ నీరదారెడ్డి నివేదికను అమలు చేయాలన్నారు. ఇప్పటివరకు జరిగిన ఆత్మహత్యలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజీనామా చేయాలని, ఎక్కడైనా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడితే దానికి ముఖ్యమంత్రి కూడా బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా సంఘటనా కార్యదర్శి హనుమంతు, వినయ్, బాలు, సాయి, సంతోష్, గోపాల్, నవీన్, ప్రభుకుమార్, రాజశేఖర్, సురేంద్ర, షరీఫ్ పాల్గొన్నారు.