ఢిల్లీ వర్సిటీ ఏబీవీపీదే! | ABVP sweeps Delhi University Students Union polls | Sakshi
Sakshi News home page

ఢిల్లీ వర్సిటీ ఏబీవీపీదే!

Sep 20 2025 6:10 AM | Updated on Sep 20 2025 6:10 AM

ABVP sweeps Delhi University Students Union polls

అధ్యక్షునిగా ఆర్యన్‌ మాన్‌ ఎన్నిక

ఎన్‌ఎస్‌యూఐ అభ్యర్థిపై 16,196 ఓట్ల మెజార్టీతో గెలుపు

ఉపాధ్యక్షునిగా ఎన్‌ఎస్‌యూఐ అభ్యర్థి రాహుల్‌ ఝాన్స్‌లా 

న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్‌ యూని యన్‌ (డీయూఎస్‌యూ) ఎన్నికల్లో ఆర్‌ఎస్‌ఎస్‌ మద్దతు గల ఏబీవీపీ అభ్యర్థి ఆర్యన్‌ మాన్‌ అధ్యక్ష పదవిని కైవసం చేసుకున్నారు. ఏడేళ్ల విరామం తర్వాత గత ఏడాది ఈ స్థానాన్ని గెలుచుకున్న ఎన్‌ఎస్‌యూఐ నుంచి అధ్యక్ష పదవిని ఏబీవీపీ చేజిక్కించుకోవడం విశేషం. ఏబీవీపీ అభ్యర్థి ఆర్యన్‌ మాన్, కాంగ్రెస్‌ అనుబంధ ఎన్‌ఎస్‌యూఐ అభ్యర్థి జోస్లిన్‌ నందిత చౌదరిపై 16,196 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 

ఆర్యన్‌ మాన్‌కు 28,841 ఓట్లు రాగా, ఎన్‌ఎస్‌యూఐ అభ్యర్థి జోస్లిన్‌కు 12,645 ఓట్లు వచ్చాయి. మొత్తం నాలుగు స్థానాలకు గాను.. ఏబీవీపీ అధ్యక్షుడు, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి పదవులను గెలుచుకుంది. అయితే ఉపాధ్యక్ష పదవిని కోల్పోయింది. ఏబీవీపీకి చెందిన కునాల్‌ చౌదరి, దీపికా ఝా.. కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి పదవులకు ఎన్నికయ్యారు, కాగా ఎన్‌ఎస్‌యూఐకి చెందిన రాహుల్‌ ఝాన్స్‌లా ఉపాధ్యక్ష పదవిని కైవసం చేసుకున్నారు. 

స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఐ), ఆల్‌ ఇండియా స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ (ఏఐఎస్‌ఏ)లు ఒక్క స్థానం కూడా గెలుచుకోలేకపోయాయి. ఈ ఎన్నికల్లో తమ సంస్థ బాగా పోరాడిందని ఎన్‌ఎస్‌యూఐ జాతీయ అధ్యక్షుడు వరుణ్‌ చౌదరి ఎక్స్‌లో పోస్టు చేశారు. ఏబీవీపీకి వ్యతిరేకంగానే కాకుండా.. ఢిల్లీ పాలన యంత్రాంగం, ఢిల్లీ, కేంద్ర ప్రభుత్వాలు, ఆర్‌ఎస్‌ఎస్‌–బీజేపీ, ఢిల్లీ పోలీసులకు వ్యతిరేకంగా కూడా తాము పోరాడినట్లు స్పష్టం చేశారు. వేలాది మంది ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులు తమకు గట్టి మద్దతుగా నిలిచారని, తమ అభ్యర్థులు బాగా పోరాడారని ప్రశంసించారు. 

ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌యుఐ ప్యానెల్‌ నుంచి ఉపాధ్యక్షునిగా ఎన్నికైన రాహుల్‌ ఝాన్స్‌లా, గెలిచిన ఇతర ఆఫీస్‌ బేరర్లకు శుభాకాంక్షలు తెలిపారు. గెలుపోటములతో సంబంధం లేకుండా ఎన్‌ఎస్‌యూఐ ఎల్లప్పుడూ సామాన్య విద్యార్థుల సమస్యల పరిష్కారానికి, ఢిల్లీ యూనివర్సిటీ పరిరక్షణకు పోరాడుతుందని స్పష్టం చేశారు. తాము మరింత బలపడతామని ధీమా వ్యక్తం చేశారు. 2024లో జరిగిన డీయూఎస్‌యూ ఎన్నికలలో, ఎన్‌ఎస్‌యూఐ ఏడేళ్ల విరామం తర్వాత అధ్యక్ష పదవిని, సంయుక్త కార్యదర్శి పదవిని గెలుచుకుంది. ఏబీవీపీ ఉపాధ్యక్ష పదవిని కైవసం చేసుకొని, కార్యదర్శి స్థానాన్ని నిలుపుకొని విద్యార్థి సంఘ ఎన్నికల్లో తన ఉనికిని చాటుకుంది. గురువారం జరిగిన ఈ ఎన్నికల్లో దాదాపు 40 శాతం పోలింగ్‌ నమోదైంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement