
ఒడిశా బీఈడీ స్టూడెంట్ బలవన్మరణం కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ఇప్పటికే కళాశాల ప్రిన్సిపాల్, వేధింపులకు పాల్పడిన హెచ్‌వోడీని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఇద్దరిని అరెస్ట్ చేయగా.. అందులో ఒకరు ఏబీవీపీ నేత ఉండడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
సీనియర్ ఫ్యాకల్టీ వేధింపులు తాళలేక ఒడిశాలో 20 ఏళ్ల బీఈడీ సెకండ్ ఇయర్ విద్యార్థిని కాలేజీ ఆవరణలోనే నిప్పటించుకున్న సంగతి తెలిసిందే. జులై 13వ తేదీన జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. 90 శాతం కాలిన గాయాలతో రెండు రోజుల తర్వాత ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ బాధితురాలు కన్నుమూసింది.
ఈ ఘటన తీవ్ర దుమారం రేపడంతో.. వేధింపులకు పాల్పడ్డ ఫ్యాకల్టీ సమీర్ రంజన్ సాహోతో పాటు ప్రిన్సిపాల్ దిలీప్ ఘోష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. అందులో ఏబీవీపీ లీడర్ సుభాత్ సందీప్ నాయక్ కూడా ఉన్నట్లు సమాచారం. బాధితురాలు బలవనర్మణానికి పాల్పడే సమయంలో సందీప్ నాయక్ అక్కడే ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే ఆయనపై ఎలాంటి అభియోగాలు నమోదు అయ్యాయన్నది తెలియరావాల్సి ఉంది.
తన కోరికె తీర్చకపోతే పరీక్షల్లో ఫెయిల్ చేస్తానంటూ సమీర్ రంజన్ సాహో సదరు విద్యార్థిపై బెదిరింపులకు దిగాడు. లైంగిక వేధింపులను ఆమె కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లింది. అయినా కూడా అతనిపై చర్యలేవీ తీసుకోలేదని పోలీసుల విచారణలో తేలింది. పైగా.. తనకు చావే గతంటూ ఆమె రాసిన సూసైడ్ నోట్ వెలుగులోకి రావడం తీవ్ర చర్చనీయాంశమైంది.
అయితే ఘటన జరిగిన రోజు.. ప్రిన్సిపాల్‌ను కలిసిన కాసేపటికే ఆమె ఒంటికి నిప్పటించుకుందని పోలీసులు చెబుతున్నారు. హెచ్‌వోడీపై ఫిర్యాదు నేపథ్యంతో ఆరోజు ప్రిన్సిపాల్ గదిలో సమావేశం జరిగింది. సమీర్‌పై చేసిన ఫిర్యాదులను వెనక్కి తీసుకోవాలని ఆమెపై ఒత్తిడి చేశారని, కొంతమంది విద్యార్థులతో సదరు విద్యార్థిపై ఆ హెచ్‌వోడీ తప్పుడు ప్రచారం చేయించారని దర్యాప్తులో వెల్లడైంది. తాజా అరెస్టుల నేపథ్యంలో దర్యాప్తు మరో మలుపు తిరిగే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.