శివప్రసాద్.. అందరి పిల్లల్లాగే ఏడోతరగతి పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యాడు. కానీ ఇప్పుడు పరీక్ష రాయడంలేదు.
కష్టానికి.. నువ్వంటే ఇష్టమేమో!
Mar 8 2017 11:06 PM | Updated on Nov 9 2018 5:02 PM
శివా.. అని పిలవగానే ప్రెజెంట్ సార్!
అని పలికే ఈ కుర్రోడు.. వస్తున్నానయ్యా! అంటున్నాడు. పుస్తకాల బ్యాగును మోసే ఈ చిన్నోడి భుజాలు.. ఇప్పుడు కుటుంబ బాధ్యతను మోస్తున్నాయి. నిన్నమొన్నటిదాకా సరదాగా సాగిన ఈ బాలుడి బాల్యం.. ఇప్పుడు భారమైన బతుకీడుస్తోంది. ఎందుకు...? కష్టానికి.. శివ అంటే ఇష్టమా!! ఇతని కన్నీటి గాథ వింటే మీరే అవునంటారు..
శివప్రసాద్.. అందరి పిల్లల్లాగే ఏడోతరగతి పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యాడు. కానీ ఇప్పుడు పరీక్ష రాయడంలేదు. కనీసం బడికి కూడా వెళ్లడం లేదు. ఎందుకంటే పదిరోజుల కిందట శివ తండ్రి రామారావు చనిపోయాడు. కష్టాల్లో ఉన్న కుటుంబాన్ని వదిలిపెట్టి పెద్దన్నయ్య కూడా వెళ్లిపోయాడు. దీంతో తనకంటే పెద్దవాళ్లైన ఇద్దరు అక్కలు, అమ్మను పోషించాల్సిన బాధ్యత ఇప్పుడు శివ భుజానికెత్తుకున్నాడు. అంతేకాదు... తండ్రి చేసిన అప్పులను కట్టే బాధ్యత కూడా ఈ చిన్ని భుజాలపైనే ఉంది.
శివ తండ్రి రామారావు కౌలు రైతు. గుంటూరు జిల్లాలో ఎక్కువగా పండే మిర్చీ, పత్తిని పండించేందుకు నాలుగెకరాలు కౌలుకు తీసుకున్నాడు. దాదాపు రూ.2 లక్షలు అప్పుచేసి పంటను సాగుచేశాడు. వరుసగా కరువు కాటేస్తుండడంతో అప్పుల భారం పెరిగిపోయింది ఈ ఏడాది కూడా అప్పు తీరే పరిస్థితి కనిపించలేదు. దీంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనతో శివకు తండ్రి మాత్రమేకాదు ఉన్న ఇల్లు, చదువు కూడా దూరమయ్యాయి.
అప్పు కట్టేదాకా చదువు మానెయ్యమని అమ్మ చెప్పడంతో పుస్తకాలను పక్కకు పెట్టిన శివ.. ఊళ్లోనే ఓ ఇంటి నిర్మాణ పనులకు కూలీగా వెళ్తున్నాడు. చదువుకోవాలని లేదా? పలకరిస్తే... చదువుమీద ఆశల్లేవని చెబుతున్నాడు. కుటుంబం గడవడమే కష్టంగా ఉందని, పైగా కట్టాల్సిన అప్పు ఇప్పట్లో తీరేలా కనిపించడంలేదని చెబుతున్నాడు. కనీసం ప్రభుత్వమైనా ఆదుకొని శివకు ఓ దారి చూపించాలని కోరుకుందాం. –సాక్షి, స్కూల్ ఎడిషన్
Advertisement
Advertisement