తిరుపతి రెవెన్యూ డివిజన్ పరిధిలో 97,076 ఎకరాల ప్రభుత్వ భూములను గుర్తించారు.
25లోపు నివేదిక ఇవ్వాలని గ్రామ కమిటీలకు ఆదేశం
నేటి నుంచి కమిటీల పర్యటన
తిరుపతి తుడా: తిరుపతి రెవెన్యూ డివిజన్ పరిధిలో 97,076 ఎకరాల ప్రభుత్వ భూములను గుర్తించారు. జిల్లాలో ఐఐటీ, ఐఐఎస్‌ఈఆర్ విద్యాసంస్థలతో పాటు పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన విషయం తెలి సిందే. ఈ మేరకు తిరుపతి డివిజన్ మండలాల్లో ప్రభుత్వ భూములను గుర్తించాలని గతంలో జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో తిరుపతి ఆర్డీవో వీరబ్రహ్మయ్య తూర్పు మండలాల్లో భూములను గుర్తించేందుకు చర్యలు చేపట్టారు. ఆయా మండలాల తహశీల్దార్లు ప్రభుత్వ భూములను గుర్తించారు.ఏర్పేడు, శ్రీకాళహస్తి, సత్యవేడు మండలాల్లో మొత్తం 97,076 ఎకరాలను గుర్తించి ఆర్డీవో కార్యాలయానికి నివేదికలు పంపించారు.
అటవీ భూముల గుర్తింపు
పరిశ్రమల ఏర్పాటుకు అనువుగా ఉండే అటవీ భూములను అధికారులు గుర్తించారు. అటవీ శాఖ భూములను డీనోటిఫై చేసి ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు వీలుగా ఉండే అటవీ భూములను గుర్తించారు. ఏర్పేడులో 958.28 ఎకరాలు, శ్రీకాళహస్తిలో 3999.66 ఎకరాలు, సత్యవేడులో 11,331.47 ఎకరాలను గుర్తించారు. అదేవిధంగా 55,714.94 ఎకరాల ప్రభుత్వ భూములు( చెరువులు, కుంటలు, వాగులు, వివిధ రకాల భూములు) గుర్తించారు.
ఏర్పేడులో 784.56 ఎకరాలు, శ్రీకాళహస్తిలో 35,119.62 ఎకరాలు, సత్యవేడులో 19,810.76 ఎకరాలు అందుబాటులో ఉన్నాయని సూచించారు. అయితే నీరు నిల్వ ఉండే చెరువులు, వాగులు, కుంటలను కాకుండా మిగిలిన ప్రభుత్వ భూములను మాత్రమే గుర్తించాలని మళ్లీ ఆయా మండల అధికారులకు ఆదేశించారు. ఈ మూడు మండలాల్లో 25,072.03 ఎకరాల డీకేటీ భూములు ఉన్నాయని తేల్చారు. ఏర్పేడులో 7,043.34, శ్రీకాళహస్తిలో 15,019.66, సత్యవేడులో 3,009.03 ఎకరాలు అందుబాటులో ఉన్నాయని నివేదిక అందజేశారు.
25వ తేదీ కల్లా భూముల వివరాల నివేదిక
గ్రామ స్థాయిలో ప్రభుత్వ, డీకేటీ, అటవీ భూములను మరింత స్పష్టంగా గుర్తించేందుకు ప్రత్యేక కమిటీలను వేశారు. ఏర్పేడు, శ్రీకాళహస్తి, సత్యవేడు మండలాలతో పాటు అదనంగా మరో మూడు మండలాల్లో ప్రభుత్వ భూములను గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బీఎన్ కండ్రిగ, కేవీబీ పురం, చంద్రగిరి మండలాల్లో ప్రభుత్వ, డీకేటీ, అటవీ భూములను గుర్తించాలని నిర్ణయించారు. ఇందుకోసం గ్రామస్థాయి కమిటీలు శనివారం నుంచి భూములను గుర్తించనున్నాయి. ఈ నెల 28న సీఎం చంద్రబాబు నాయుడు జిల్లాకు రానున్న నేపథ్యంలో ఈలోపు భూములను గుర్తించి నివేదికను సమర్పించాలని అధికారులు నిర్ణయించారు. ఈ నెల 25 లోపు గ్రామ స్థాయిలో ప్రభుత్వ, అటవీ, డీకేటీ భూములను గర్తించాలని అధికారులకు ఆదేశాలు అందాయి.