750 మంది ఎంపీడీవోల బదిలీ


సాక్షి, హైదరాబాద్: పంచాయతీరాజ్ చరిత్రలో తొలిసారిగా 75 శాతం మంది ఎంపీడీవోలు బదిలీ అయ్యారు. ఎన్నికల సంఘం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో పంచాయతీరాజ్ కమిషనర్ వరప్రసాద్ వీరిని బదిలీ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ ఉత్తర్వులను ఆయా జిల్లాల కలెక్టర్లకు, జిల్లా పరిషత్‌ల ముఖ్య కార్యనిర్వాహక అధికారులకు పంపించారు. ఒకే జిల్లాలో 15 సంవత్సరాలుగా పాతుకుపోయిన  వారందర్నీ బదిలీ చేశారు. రాష్ట్రంలో 1,104 మండలాలు ఉండగా.. వీరిలో 750 మంది ఎంపీడీవోలను బదిలీ చేశారు. తమకు ఎన్నికల విధులతో ప్రత్యక్షంగా సంబంధం లేదని తమను బదిలీ చేయడానికి వీల్లేదంటూ ఎంపీడీవోలు ఇప్పటికే కోర్టుకెళ్లారు. ఈనెల 10వ తేదీన సాధారణ బదిలీల ప్రక్రియ ముగియడంతో ఇక బదిలీలు ఉండవని భావించారు. అయితే ప్రభుత్వం ఈనెల 25వ తేదీ వరకు బదిలీలు చేయడానికి అనుమతించడంతో.. సోమవారం రాత్రి ఎన్నికల సంఘం అనుమతి తీసుకుని ఈ బదిలీలు చేశారు. బదిలీ అయిన అధికారులు మంగళవారం విధుల్లో చేరాల్సి ఉంటుంది. గతంలో ఒక జిల్లాలోనే ఇతర ప్రాంతాలకు బదిలీ చేసిన అధికారులు ఈసారి పక్క జిల్లాలకు బదిలీ చేశారు.




 బదిలీలపై సీఎస్ సమీక్ష: సాధారణ ఎన్నికలతో సంబంధం ఉన్న అధికారులను బదిలీ చేసినా.. వారు ఆ పోస్టుల్లో చేరడం లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ మహంతి సోమవారం సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో వెల్లడైంది. రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా బదిలీ అయిన వారు ఇంకా ఆ పోస్టుల్లో చేరలేదని సీఎస్‌కు ఉన్నతాధికారులు వివరించారు. బదిలీ అయిన అధికారులంతా విధుల్లో తప్పకుండా చేరేలా చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని వివిధ శాఖల ఉన్నతాధికారులను సీఎస్ ఆదేశించారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top