పరిశ్రమల్లో 75% ఉద్యోగాలు స్థానికులకే..

75 percent of jobs in industries are for locals - Sakshi

సాక్షి, అమరావతి: ఇక నుంచి రాష్ట్రంలో ఏర్పాటయ్యే పరిశ్రమలు, ఫ్యాక్టరీల్లో 75 శాతం ఉద్యోగాలను ప్రభుత్వం స్థానికులకే ఇవ్వనుంది. అంతేకాకుండా ఇప్పటికే ఉన్న పరిశ్రమలు, ఫ్యాక్టరీలు కూడా వచ్చే మూడేళ్లలో 75 శాతం ఉద్యోగాలను కూడా స్థానికులకే ఇచ్చేలా చట్టం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. ఈ మేరకు సోమవారం శాసనసభలో కార్మిక, ఉపాధి శిక్షణ శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్‌ బిల్లును ప్రవేశపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున పరిశ్రమలను, ఫ్యాక్టరీలను నెలకొల్పడం ద్వారా రాష్ట్ర యువతకు ఉపాధిని కల్పించాలని నిర్ణయించింది. మరింత సులువుగా వ్యాపారం చేసుకోవడానికి వీలుగా సరళతర విధానాలను రూపొందించనుందని బిల్లులో స్పష్టం చేసింది. విద్యుత్, గనులు, మౌలిక రంగాలు, పోర్టులు ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

జీవోనోపాధిని కోల్పోయేవారికి అండగా..: పరిశ్రమల స్థాపనకు ప్రైవేట్‌ వ్యవసాయ భూముల డిమాండ్‌ పెరిగిపోతోందని, పరిశ్రమలకు భూములిచ్చినవారు తమ భూమితోపాటు జీవనోపాధిని, ఆదాయాన్ని కోల్పోతున్నారని బిల్లులో ప్రభుత్వం స్పష్టం చేసింది. వీరికి ఆ పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు కల్పించాలనే డిమాండ్‌ ఉందని పేర్కొంది. అయితే.. పారిశ్రామికవేత్తలు చిన్న చిన్న ఉద్యోగాలకే స్థానికులను పరిమితం చేస్తున్నారని తెలిపింది. దీనివల్ల తక్కువ ఆదాయంతో స్థానిక యువతలో అసంతృప్తి పెరిగిపోతోందని వివరించింది. ఈ సమస్యను పరిష్కరించడానికి పరిశ్రమలు, ఫ్యాక్టరీల్లో కనీసం 75 శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వాలని చట్టం చేసేందుకు ఈ బిల్లును ప్రవేశపెట్టినట్లు తెలిపింది. స్థానికత అంటే.. ఏపీతోపాటు జిల్లా, జోన్‌గా పేర్కొంది. స్థానికంగా తగిన అర్హతలు ఉన్నవారు లేకపోతే పరిశ్రమలు, ఫ్యాక్టరీలు.. ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని, తగిన శిక్షణ ఇచ్చి మూడేళ్లలో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంది.

ఈ చట్టం అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటికే ఉన్న పరిశ్రమలు, ఫ్యాక్టరీలు, పీపీపీ విధానంలోని జాయింట్‌ వెంచర్‌ ప్రాజెక్టుల్లో మూడేళ్లలోగా 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ నిబంధనల నుంచి మినహాయింపు కోరాలంటే ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం మూడు వారాల్లోగా తగిన విచారణ చేసి నిర్ణయం తీసుకుంటుంది. 75 శాతం ఉద్యోగాలను స్థానికులకు ఇస్తున్నారా? లేదా? అనే అంశాన్ని నోడల్‌ ఏజెన్సీ ఎప్పటికప్పుడు రికార్డులను పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను సమర్పిస్తుంది. 75 శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇస్తున్నవారిపై ఎటువంటి న్యాయస్థానాలకు వెళ్లరాదనే నిబంధన విధించారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top