ఆరు నిమిషాల సభ | 6 minutes meeting in assembly | Sakshi
Sakshi News home page

ఆరు నిమిషాల సభ

Dec 18 2013 2:03 AM | Updated on May 29 2018 2:55 PM

ఆరు నిమిషాల సభ - Sakshi

ఆరు నిమిషాల సభ

ఉభయ సభల్లో మంగళవారం కూడా సోమవారం నాటి పరిస్థితులే పునరావృతమయ్యూరుు

 తొలుత 3 నిమిషాలు, మరోసారి 3 నిమిషాలు మాత్రమే సాగిన అసెంబ్లీ
 పోడియంలో వైఎస్సార్‌సీపీ, టీడీపీ సీమాంధ్ర ఎమ్మెల్యేల నినాదాలు
 
 సాక్షి, హైదరాబాద్: ఉభయ సభల్లో మంగళవారం కూడా సోమవారం నాటి పరిస్థితులే పునరావృతమయ్యూరుు. అసెంబ్లీ, శాసనమండలి రెండింట్లోనూ సభ ప్రారంభం కావడం, ఆ వెంటనే సభ్యులు నినాదాలతో హోరెత్తించడం, ప్లకార్డుల ప్రదర్శనలు, సభాపతులు  వాయిదా తీర్మానాలు తిరస్కరిస్తున్నట్లు ప్రకటించడం సభ వాయిదా పడడం ఒకదాని వెంబడి మరొకటిగా వెంటవెంటనే జరిగిపోయూయి. అసెంబ్లీలో సభ ప్రారంభం కావడానికి ముందే  వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, టీడీపీ సీమాంధ్ర సభ్యులు పోడియంలోకి వెళ్లి జై సమైక్యాంధ్ర, సమైక్యాంధ్ర వర్ధిల్లాలి అంటూ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు మార్మోగించారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు వారి చేతుల్లోని ప్లకార్డులను లాక్కునే ప్రయత్నం చేశారు. ఈ దశలో సభలోకి వచ్చిన  స్పీకర్ నాదెండ్ల మనోహర్ సభ్యులు ప్రశాంతంగా ఉండాలని విజ్ఞప్తిచేసినా వారు శాంతించలేదు.
 
  గందరగోళం మధ్యనే ఆయన విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను చదివి, వాటిని తిరస్కరిస్తున్నట్లు చెప్పారు. అనంతరం సభను శాసనసభా సలహా మండలి (బీఏసీ) సమావేశం కోసం వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ఈ ప్రక్రియ మొత్తం కేవలం మూడు నిమిషాల వ్యవధిలో ముగిసింది. తిరిగి మధ్యాహ్నం 3.20 గంటలకు సభ ప్రారంభం కాగానే సీమాంధ్ర ఎమ్మెల్యేలు కొందరు పోడియంలోకి వెళ్లి సమైక్యాంధ్ర నినాదాలు ప్రారంభించారు. నినాదాల మధ్యే ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని ‘ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ నిర్వహణ, ద్రవ్య జవాబుదారీ చట్ట సవరణకు బిల్లు’ను ప్రతిపాదించాల్సిందిగా స్పీకర్ కోరారు. మంత్రి  బిల్లును ప్రతిపాదించగానే స్పీకర్ సభను బుధవారానికి వాయిదా వేశారు. బీఏసీలో చర్చించిన విషయాలను కానీ, తీసుకున్న నిర్ణయాలు కానీ ఏవీ స్పీకర్ వెల్లడించలేదు.
 
 కౌన్సిల్ గంట మోగుతుండగానే...
 మండలిలోనూ సభ ఆరంభంతోనే ఆందోళన ప్రారంభమైంది. కౌన్సిల్ ఆరంభానికి సూచికగా గంట మోగగానే పలువురు సీమాంధ్ర సభ్యులు పోడియంలోకి వెళ్లి బైఠాయించారు. టీడీపీ సభ్యులు నన్నపనేని రాజకుమారి, శమంతకమణి వెల్‌లోకి వెళ్లి తమకు న్యాయం చేయాలంటూ బైఠాయించారు. చైర్మన్ సభలోకి వస్తున్న సందర్భంగా పోడియంలో బైఠాయించడం చైర్‌ను అవమానించడమేనంటూ వారిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ తెలంగాణ ప్రాంత సభ్యుడు యాదవరెడ్డి డిమాండ్ చేశారు. తమకే రక్షణ లేకపోతే సామాన్యులకు ఏమి రక్షణ ఉంటుందని, దాడికి గురైన తాము న్యాయం కోరడం తప్పెలా అవుతుందని టీడీపీ సభ్యులు ప్రశ్నించారు. టీడీపీ సభ్యుడు సతీష్‌రెడ్డి, యాదవరెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. మరోవైపు తెలంగాణ బిల్లుపై చర్చ చేపట్టవద్దంటూ వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు కూడా పోడియంలో నిరసన తెలిపారు.
 
 బీఏసీలో చర్చించి న్యాయం చేస్తామని చైర్మన్ హామీ ఇచ్చినా సభ్యులు శాంతించలేదు. దీంతో 10.15 గంటల సమయంలో సభ వాయిదా పడింది. ఆ తర్వాత ఒంటిగంటకు మరోసారి భేటీ కాగా అప్పుడు కూడా వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీ సభ్యులు వెల్‌లోనే నిరసనకు దిగారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ స్వామిగౌడ్ జోక్యం చేసుకుని తన కారణంగా రాజకుమారి కిందపడిపోయారని భావిస్తే అందుకు తాను పశ్చాత్తాపపడుతున్నానని చెప్పారు. దీంతో టీ డీపీ సభ్యులు శాంతించారు. ఆ తర్వాత బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై లఘుచర్చ ప్రారంభించాలని డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ ప్రకటించారు. అయితే తెలంగాణపై చర్చ చేపట్టాలని ఆ ప్రాంత సభ్యులు, వద్దని సీమాంధ్ర సభ్యులు పోటాపోటీ నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగడంతో సభను బుధవారానికి వాయిదా వేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement