క్వారీ..సర్కారు మారినా స్వారీ

A 50 Acre Sand Quarry On The Banks Of The Penna River Remains In TDP Leader Possession - Sakshi

టీడీపీ నేత గుప్పిట్లో 50 ఎకరాల క్వారీ

గత ప్రభుత్వ హయాంలో భారీ అక్రమార్జన

ఇప్పటికీ అతని ఆధీనంలోనే ఆక్రమిత భూమి

ప్రభుత్వం మారడంతో సాగుభూమిగా మార్చే యత్నం

సాక్షి, ప్రొద్దుటూరు: నిన్న మొన్నటి వరకూ ఇసుకతో కోట్లు కొల్లగొట్టిన ఓ టీడీపీ నేతకు కొత్త ప్రభుత్వం రావడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఎలాగైనా ఇసుక క్వారీని తన గుప్పిట్లోనే ఉంచుకోవాలని ఇప్పటికీ వ్యూహాలు పన్నుతున్నాడు. పెన్నానదీ తీరంలో 50 ఎకరాలను ఆధీనంలోనే పెట్టుకుని కొత్త నాటకాలకు తెర లేపుతున్నాడు. ప్రొద్దుటూరు మండలం రామాపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడొకరు ఇసుక డాన్‌గా గత ప్రభుత్వ హయాంలో చెలరేగిపోయాడు. ఇతను మాజీ ఎమ్మెల్యేకు ముఖ్య అనుచరుడు. దీంతో అతను ఆడిందే ఆట..పాడిందే పాటగా సాగింది. అధికారులూ మిన్నకుండిపోయారు. యథేచ్ఛగా ఇసుకను రాశులుగా పోసి ఇతర ప్రాంతాలకు భారీగా తరలిస్తూ అక్రమార్జన చేస్తున్నా ఏమీ చేయలేకపోయారు. క్వారీలో జేసీబీ, ట్రాక్టర్లను ఈ ప్రాంతంలో ఇందుకు వినియోగించుకునేవాడు. అడ్డుపడిన తహసీల్దార్లను అంతు చూస్తానని బహిరంగంగా బెదిరించిన సందర్భాలు ఉన్నాయి. ఇంతకాలం అతని ఆగడాలకు అడ్డు లేకుండా పోయింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి రావడంతో ఇతడు కంగు తిన్నాడు. ఇసుక పెత్తనానికి ఎక్కడ ఆటంకం కలుగుతుందోనని భయంతో ఇప్పుడు కొత్త ప్రణాలికలు రచిస్తున్నాడు. అధికారుల కళ్లు గప్పేందుకు ప్రయత్నాలు ప్రారంభించాడు.
 
50 ఎకరాలకుపైగా సాగు 
రామాపురానికి చెందిన ఇసుక డాన్‌ టీడీపీ ప్రభుత్వ హయాంలో పెన్నానది తీరాన సుమారు 50 ఎకరాల్లో ఇసుక క్వారీని ఆక్రమించాడు. సమయాన్ని బట్టి క్వారీ లేదా పక్కనే నదిలో ఉన్న ఇసుకను తరలించేవాడు. ఆయన ప్రొద్దుటూరులో ఈ కార్యకలాపాల నిర్వహణకు ఏకంగా ఓ కార్యాలయాన్నే ఏర్పాటు చేసుకున్నాడు. కొత్త  ప్రభుత్వంలో  న ఆగడాలు చెల్లవని గ్రహించాడు. అందుకే తన ఆధీనంలోని ఇసుక క్వారీని సాగుభూమిగా మారుస్తున్నాడు. ట్రాక్టర్ల ద్వారా మట్టిని తెచ్చి ఇసుకను కప్పేశాడు.  మొక్కలు కూడా పెంచుతున్నాడు. సుమారు 5 అడుగుల మేర ఇప్పటికీ ఇక్కడ ఇసుక నిల్వలున్నాయి. ప్రభుత్వం క్వారీని ఇక్కడి నుంచి ప్రారంభిస్తే కొన్నేళ్లపాటు ఈ నిల్వలు సరిపోతాయని గ్రామస్తులు చెబుతున్నారు. ఇటీవల రూరల్‌ ఎస్‌ఐ సునీల్‌కుమార్‌రెడ్డి గ్రామాన్ని సందర్శించి ఇసుక రవాణా చేయకుండా పెన్నానదిలో గోతులు తవ్వించారు. తహసీల్దార్‌ పి.చెండ్రాయుడును సాక్షి వివరణ కోరగా ప్రభుత్వం కొత్తగా ప్రొద్దుటూరు ప్రాంతంలో ఇసుక క్వారీని మంజూరు చేసిందని తెలిపారు. మైనింగ్‌ అధికారులు సర్వే చేసి క్వారీ ప్రదేశాన్ని నిర్ణయిస్తారన్నారు. ఇసుక డాన్‌ పెన్నానది భూమిని ఆక్రమించడంతోపాటు సమీపంలో అటవీభూమిని కూడా సాగు చేస్తున్నాడు. బోరు వేసి సాగు చేస్తున్నా అధికారులు పట్టించుకోలేదు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top