సకల జనభేరి సభకు భారీగా తరలివెళ్లేందుకు తెలంగాణవాదులు సన్నద్ధమవుతున్నారు. హైదరాబాద్ నిజాం కళాశాల గ్రౌండ్‌లో తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం జరిగే సభకు ఓరుగల్లు నుంచి 30వేల మందిని తరలించేందుకు తెలంగాణవాదులు కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు
వరంగల్ సిటీ, న్యూస్‌లైన్
సకల జనభేరి సభకు భారీగా తరలివెళ్లేందుకు తెలంగాణవాదులు సన్నద్ధమవుతున్నారు. హైదరాబాద్ నిజాం కళాశాల గ్రౌండ్‌లో తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం జరిగే సభకు ఓరుగల్లు నుంచి 30వేల మందిని తరలించేందుకు తెలంగాణవాదులు కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. ప్రజాసంఘాలు, తెలంగాణ ఉద్యోగ, విద్యార్థి, వృత్తి సంఘాలు, న్యాయవాదులు, డాక్టర్ల జేఏసీలు తమ శ్రేణులను తరలించేందుకు ప్రణాళికలు రూపొందిం చుకున్నాయి. బస్సులు, రైళ్లలో తరలి వెళ్లే వారితోపాటు, ప్రైవేటు బస్సులు, డీసీఎంలు, వ్యాన్‌లు, ఇతరత్రా ప్రైవేటు వాహనాలు ఏర్పాటు చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. తెలంగాణవాదుల నుంచి అంచనాలకు మించి స్పందన వస్తున్నందున వాహనాల సమస్య తలెత్తనున్నట్లు భావిస్తున్నారు. వీటిని అధిగమించేందుకు ముఖ్యనాయకులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
సకల జనభేరి సభ నేపథ్యంలో తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో వారం రోజులుగా మండల స్థాయిలో సమావేశాలు, ప్రచారం నిర్వహించారు. ఉద్యోగ జేఏసీలు ప్రత్యేక ప్రచారం చేపట్టారుు. విద్యుత్, వైద్య, రెవెన్యూ, పంచాయతీరాజ్ ఇతరత్రా ఉద్యోగులు తరలివెళ్ళేందుకు సిద్ధమవుతున్నారు. ఈ విషయమై టీఆర్‌ఎస్ నేతలు సమావేశాలు ఏర్పాటు చేసుకుని జనసమీకరణపై పని విభజన చేసుకున్నారు. నియోజకవర్గాల వారీగా బాధ్యతలు కేటాయించారు. బీజేపీ, న్యూడెమోక్రసీ, సీపీఐ నాయకులు, కార్యకర్తలు కూడా హైదరాబాద్ సభకు భారీగా వెళ్లనున్నారు. ఈ దఫా పోలీసుల అడ్డంకులు, నిఘా లేకపోవడంతోపాటు ప్రత్యేక సందర్భంలో సభ నిర్వహిస్తున్నందున తెలంగాణవాదుల్లో పట్టుదల కనిపిస్తోంది