298వ రోజు పాదయాత్ర డైరీ

298th day padayatra diary - Sakshi

15–11–2018, గురువారం 
సూరంపేట క్రాస్, విజయనగరం జిల్లా

లంచాలు పాలకులకైతే.. శిక్ష రైతన్నలకా?

అసలే వెనుకబడిన జిల్లా విజయనగరం. ఓ వైపు వర్షాల్లేక, సాగునీరందక, గిట్టుబాటు ధరల్లేక అన్నదాతలు అల్లాడిపోతుంటే.. మరోవైపు కల్తీ విత్తనాలు కాటేస్తున్నాయి.ఈ రోజు సీతానగరం మండల రైతన్నలు కలిశారు. ప్రభుత్వంవారు కల్తీ విత్తనాలు పంపిణీ చేయడంతో నట్టేట మునిగిపోయామని వాపోయారు. ‘పంట పూర్తిగా నష్టపోయి అప్పుల పాలైపోయాం.. విత్తనాలు కల్తీ అని నిర్ధారణ అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి పరిహారం అందలేదు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

చాలా దారుణమనిపించింది.. గోరుచుట్టుపై రోకలిపోటు బాధవారిది. అన్నదాతలను అన్ని విధాలా ఆదుకోవాల్సిన ప్రభుత్వమే.. కంచే చేను మేసినట్లు కల్తీ విత్తనాలు సరఫరా చేసి రైతన్నల నడ్డి విరుస్తుంటే.. ఆ గోడు ఎవరికి చెప్పుకోవాలి? ఆ రైతన్నలు కల్తీ విత్తనాల కారణంగా పంట నష్టపోయి, అప్పులపాలవ్వడానికి ఈ ప్రభుత్వమే కారణం కాదా? రైతన్నలను ఆదుకునే బాధ్యత ఈ పాలకులకు లేదా? ఈ పాలక పెద్దలకు.. తమ బినామీ విత్తన సంస్థలపై ఉన్న ప్రేమ.. లక్షలాది పేద రైతులపై లేకపోవడం బాధాకరం. లంచాలు పాలకులకైతే.. శిక్ష రైతన్నలకా?  

 చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా చెరకు రైతులకు కష్టాలు తప్పడం లేదు. ఈ రోజు కలిసిన సీతానగరం చెరకు రైతులు ఇదే విషయం చెప్పారు. మూడేళ్లుగా ఇక్కడి చక్కెర ఫ్యాక్టరీ చెరకు రైతులకు డబ్బులు సరిగా చెల్లించక ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. గతేడాది బకాయిలే రూ.13 కోట్లు ఉన్నాయని తెలిపారు. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వపరంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు తీర్చడానికే పార్టీ ఫిరాయిస్తున్నానని సాకులు చెప్పి, మంత్రి పదవులు పొందాక మాటమార్చిన అమాత్యుల వారు.. ఈ రైతన్నలకు ఏం సమాధానం చెబుతారు? మీ కోసమే గోడ దూకుతున్నానని చెప్పి.. దూకేశాక దాక్కున్నట్లుంది ఆయన వ్యవహార శైలి.  

ఈ రోజు పాదయాత్ర ముగిసే సమయంలో జనహిత డీఎడ్‌ కాలేజీ విద్యార్థినులు కలిశారు. వారి ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. కోర్సు పూర్తవుతున్నా పరీక్షలు నిర్వహించడం లేదట. స్కాలర్‌షిప్‌లు అసలే రావడం లేదు. వస్తున్న అరకొర ఫీజురీయింబర్స్‌మెంట్‌ కూడా సంవత్సరాల తరబడి రాకపోవడంతో చదువు పూర్తయినా సర్టిఫికెట్లు చేతికందడం లేదు. తీరా అన్ని కష్టాలూపడి గట్టెక్కితే.. ఉద్యోగావకాశాలు ఉండటం లేదు. ‘ప్రభుత్వమేమో టెట్లు మీద టెట్లు పెడుతోంది.. డీఎస్సీ మాత్రం నిర్వహించనే లేదు. తీరా ఇప్పుడు ఎన్నికలకు మూడు నెలల ముందు.. నిర్వహిస్తామంటున్న డీఎస్సీలో పోస్టులను మూడో వంతుకు కుదించివేసింది’ అంటూ ఆ విద్యార్థినులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఉద్యోగంలేక.. ఉపాధీ దొరక్కపోతే.. యువత భవిత ఏం కావాలి?

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. వ్యవసాయానికి కావాల్సిన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందిస్తామని, ప్రత్యేక విత్తన చట్టాన్ని తెస్తామని మీ మేనిఫెస్టోలో గొప్పగా పేర్కొన్నారు. కల్తీ విత్తనాలు, ఎరువులను అరికడతామని, సరఫరా చేసిన వారిని కఠినంగా శిక్షిస్తామంటూ హామీలిచ్చారు.. మరి మీ ప్రభుత్వమే నకిలీ విత్తనాలను సరఫరా చేసినట్లు నిర్ధారణ అయింది. ఎవరిని శిక్షిస్తారు? మీ వల్ల నష్టపోయిన రైతన్నలకు కనీసం పరిహారమైనా ఇవ్వకపోవడం ధర్మమేనా?  
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top