గుంటూరు జిల్లా వినుకొండలో ఆదివారం కుక్కల దాడిలో 20 మందికి గాయాలయ్యాయి.
వినుకొండ టౌన్ (గుంటూరు) : గుంటూరు జిల్లా వినుకొండలో ఆదివారం కుక్కల దాడిలో 20 మందికి గాయాలయ్యాయి. రెండు గంటల వ్యవధిలో కుక్కలు చెలరేగిపోయి వీధుల్లో ప్రజలపై దాడి చేశాయి. స్థానిక మసీదు మాన్యానికి చెందిన వృద్ధురాలు ఎం.శారమ్మను కుక్క కరవడంతో 108 ద్వారా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇంతలోనే చెక్‌పోస్టు సెంటర్, మార్కాపురం రోడ్డు, రాణాహుస్సేన్ పంజా, మెయిన్ బజారు, ఎన్‌ఎస్‌పీ కాలనీ, విఠంరాజుపల్లి ప్రాంతాల్లో కుక్కలు తిరుగుతూ ఒకరి వెంట ఒకరిని గాయపరిచాయి.
బాధితులంతా గాయాలతో పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లారు. కుక్కల దాడి విషయం ఆ ప్రాంతమంతా వ్యాపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. శానిటరీ ఇన్‌స్పెక్టర్ షేక్ ఇస్మాయిల్ స్పందించి సిబ్బందిని మూడు బృందాలుగా విభజించి పిచ్చికుక్క వేట మొదలెట్టారు. బాధితులకు ఆస్పత్రి సిబ్బంది వ్యాక్సిన్లు వేసి పంపారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న బాధితులను స్థానిక ఎమ్మెల్యే జి.వి.ఆంజనేయులు పరామర్శించారు. తీవ్రగాయాలైన శారమ్మను నరసరావుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.