చింతూరు దుర్ఘటనలో బాలుడి మృతి | Sakshi
Sakshi News home page

చింతూరు దుర్ఘటనలో బాలుడి మృతి

Published Mon, Jul 1 2019 12:48 PM

2 years Boy Died In Lorry Accident In East Godavari District - Sakshi

సాక్షి, రంపచోడవరం(తూర్పు గోదావరి) : హోటల్లోకి లారీ దూసుకెళ్లిన ఘటనలో ప్రాణాలతో బయటపడిన రెండేళ్ల బాలుడు భద్రాచలం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారు జామున మృతి చెందాడు. మండలంలోని చట్టి జంక్షన్‌లో ఓ లారీ శనివారం అదుపు తప్పి హోటల్లోకి దూసుకెళ్లిన ఘటనలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన నలుగురు మహిళలు మృతి చెందగా బాలుడితో పాటు డ్రైవర్, క్లీనర్‌కు గాయాలైన సంఘటన విదితమే. గాయాలతో పరిస్థితి విషమంగా ఉన్న బాలుడిని మెరుగైన చికిత్స కోసం భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. ఈ బాలుడిని ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం సుక్మా జిల్లా నేండ్రకు చెందిన ముచ్చిక అభిరాం (2)గా గుర్తించారు. అభిరాం తల్లి సుబ్బమ్మ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందింది. ఆమె రెండేళ్ల కొడుకు కూడా మృతి చెందడం చూపరులను కంటతడి పెట్టించింది.

బాలుడి మృతితో ఈ ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య ఐదుకు చేరింది. మరోవైపు ఈ ఘటనలో మృతి చెందిన నాలుగో మహిళను నేండ్ర గ్రామానికి చెందిన ముచ్చిక ముత్తి (50)గా గుర్తించారు. ప్రస్తుతం లారీ డ్రైవర్‌ మయారాం, క్లీనర్‌ దిలీప్‌ చికిత్స పొందుతున్నారు. మృతదేహాలకు చింతూరు ఏరియా ఆస్పత్రిలో ఎటపాక సీఐ హనీష్, చింతూరు ఎస్సై సురేష్‌బాబు పోస్ట్‌మార్టం చేయించారు. అనంతరం మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతదేహాల కోసం వచ్చిన మృతుల కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో ఆస్పత్రి ప్రాంగణంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Advertisement
Advertisement