1999–గ్రూప్‌ 2 పోస్టులను దారి మళ్లించారు

1999–గ్రూప్‌ 2 పోస్టులను దారి మళ్లించారు - Sakshi


- అనుమానం వ్యక్తం చేస్తున్న నిరుద్యోగులు

- రూల్‌ 7 వర్తింపచేయకపోవడంపై అనుమానాలు

- పాత పోస్టులను కొత్త నోటిఫికేషన్లో కలిపేశారని ఆరోపణ

- టీడీపీ హయాంలోని తప్పిదాలే ఈ పరిస్థితికి కారణమని ఆవేదన



సాక్షి, హైదరాబాద్‌: గ్రూప్‌2–1999 నోటిఫికేషన్‌కు సంబంధించిన పోస్టుల్లో కొన్నిటిని ప్రభుత్వం దారిమళ్లించిందా? 17 ఏళ్లుగా ఆ పోస్టులకోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల్లో ఇప్పుడివే అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల నియామక నిబంధనల్లోని రూల్‌ 7 కింద (క్యారీ ఫార్వర్డ్‌ ఆఫ్‌ మెరిట్‌) మెరిట్‌ జాబితాలోని తదుపరి అభ్యర్థులకు దక్కాల్సిన పోస్టులను వారికి ఇవ్వకుండా ఇటీవల జారీచేసిన కొత్త నోటిఫికేషన్లోకి ప్రభుత్వందారి మళ్లించినట్లుగా కనిపిస్తోందని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ఆ పోస్టులను పాత వారితో భర్తీచేసే కన్నా కొత్తగా భర్తీ చేస్తే ప్రస్తుతం తమ హయాంలో భర్తీ అయినట్లు చెప్పుకోవడానికే అలా దారి మళ్లించినట్లు కనిపిస్తోందని చెబుతున్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని ఇప్పటివరకు  అధ్వానంగా మారిన ఈ 1999 గ్రూప్‌2 పోస్టుల భర్తీ వ్యవహారానికి అప్పుడు... ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వమే కారణమని మండిపడుతున్నారు. నోటిఫికేషన్‌ వెలువడిన 1999లో, ఇప్పుడూ చంద్రబాబు ప్రభుత్వమే ఉందని గుర్తు చేస్తున్నారు.



రూల్‌ 7 తకరారు పోస్టుల మళ్లింపునకే!

రూల్‌ 7 ప్రకారం ఎవరైనా పోస్టుల్లో జాయిన్‌ కాకపోయినా, రాజీనామా చేసినా, కొత్తగా పోస్టులు వచ్చినా ఆయా పోస్టులకు మెరిట్‌ జాబితాలో తదుపరి ఉన్న వారికి అవకాశం కల్పించాల్సి ఉంటుందని నిరుద్యోగులు పేర్కొంటున్నారు. కానీ 1999 గ్రూప్‌2లోని మొదటి రెండు విడతలకు రూల్‌ 7ను వర్తింపచేయకుండా మూడో విడతకు మాత్రమే పరిమితం చేయడం వల్ల 17 ఏళ్లుగా పరీక్ష ఫలితాలకోసం ఎదురుచూస్తున్న వారికి పోస్టులు దక్కకుండా పోతున్నాయని పేర్కొంటున్నారు. ఆనాడు పరీక్షలు రాసి జాబితాలో తదుపరి దశల్లో ఉన్నవారికి పోస్టులు దక్కనీయకుండా తాజా నోటిఫికేషన్లోకి మళ్లించడం ద్వారా కొత్తవారికి తాము పోస్టులు ఇస్తున్నామని ప్రచారం చేసుకోవడానికి ప్రభుత్వం చేస్తున్న పన్నాగమని విమర్శిస్తున్నారు. ఇటీవల 982 పోస్టులకు ఏపీపీఎస్సీ కొత్తగా జారీచేసిన నోటిఫికేషన్లో ఉన్న పోస్టుల్లో అప్పటి మిగిలిన పోస్టులు  కలిపేసి ఉంటారంటున్నారు.



వయోపరిమితి దాటిపోయింది..

ఇన్నేళ్ల ఎదురుచూపులో తమ వయోపరిమితి కూడా దాటిపోయిందని, కొత్తగా ఇచ్చే నోటిఫికేషన్‌లోని పోస్టులకు దరఖాస్తు చేసుకొనే అవకాశమూ కోల్పోయామని కొంతమంది నిరుద్యోగులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇలా ఉండగా ప్రస్తుతం 17 ఏళ్ల నాటి నోటిఫికేషన్‌కు చెందిన మెరిట్‌ జాబితాను తిరిగి రూపొందించడంతో దాదాపు అందరి జాతకాలు తారుమారు అవుతున్నాయి. గతంలో పైస్థానాల్లో ఉన్నవారు ఇప్పుడు కింది స్థానాల్లోకి, కింది స్థానాల్లో ఉన్న వారు పైస్థానాల్లోకి మారుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top