173 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత | 173 quintals of ration rice caught by Vigilance and Enforcement Officers | Sakshi
Sakshi News home page

173 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

Jul 10 2014 3:48 AM | Updated on Sep 2 2017 10:03 AM

173 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

173 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

నల్ల బజారుకు తరలించేందుకు సిద్ధంగా ఉన్న 173 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పట్టుకున్నారు.

దొనకొండ : నల్ల బజారుకు తరలించేందుకు సిద్ధంగా ఉన్న 173 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పట్టుకున్నారు. ఈ సంఘటన మండలంలోని ఇండ్లచెరువు పంచాయతీ గుట్టమీదపల్లెలో బుధవారం జరిగింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ అండ్ విజిలెన్స్ సీఐ వి.శ్రీరామ్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన తమ్మనేని వెంకటేశ్వరరెడ్డి రేకుల షెడ్‌లో అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ ఉన్నట్లు అధికారులకు సమాచారం అందింది.
 
ఎన్‌ఫోర్స్‌మెంట్ అండ్ విజిలెన్స్ ఎస్పీ కేఎస్‌కే రాజు ఆదేశాల మేరకు డీఎస్పీ వంగా సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో వెళ్లి వెంకటేశ్వరరెడ్డికి చెందిన రేకుల షెడ్‌లో 175 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. బాధ్యులైపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని తహశీల్దార్ కేవీ సత్యనారాయణకు ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సూచించారు. పట్టుకున్న బియ్యాన్ని వీఆర్‌ఓ మాల్యాద్రికి అప్పగించామని సీఐ శ్రీరామ్ తెలిపారు. బియ్యం పట్టుకున్న వారిలో ఎస్సై సాంబయ్య, సిబ్బంది ఎ.సత్యం, వి.మల్లికార్జున్, రఘురామిరెడ్డిలు ఉన్నారు.
 
మరోచోట 20 క్వింటాళ్లు..

పామూరు : నిబంధనలకు విరుద్ధంగా రెండు ఆటోల్లో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. మండలంలోని కంభాలదిన్నె జిల్లా పరిషత్ హైస్కూల్‌కు మధ్యాహ్న భోజన పథకం కోసం స్థానిక పౌరసరఫరాలశాఖ గోడౌన్ నుంచి రెండు ఆటోల్లో నిబంధనలకు విరుద్ధంగా 20 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారు. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు, పౌరసరఫరాలశాఖ అధికారులు, రెవెన్యూ సిబ్బంది కలిసి ఆ రెండు ఆటోలను మండలంలోని నుచ్చుపొద గ్రామం వద్ద అడ్డగించి అందులో ఉన్న రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
 
బియ్యాన్ని నిర్దేశించి కాంట్రాక్టర్ వాహనంలో తరలించకపోవడం.. వాహనానికి ఎలాంటి బోర్డు లేకపోవడం.. బియ్య రిలీజ్ ఆర్డర్ లేకపోవడం.. రూట్ ఆఫీసర్ లేకపోవడం.. తదితర కారణాలతో వాహనాలను సీజ్ చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ దుర్గాప్రసాద్ తెలిపారు. వాహనదారులపై 6 ఏ కేసు నమోదు చేయనున్నట్లు చెప్పారు. ఎక్కడైనా రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తుంటే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. ఆయనతో పాటు ఎస్సై మస్తాన్‌వలి, కనిగిరి ఎఫ్‌ఐ నాయబ్స్రూల్, ఆర్‌ఐ జి.పుల్లారెడ్డి, వీఆర్వోలు పి.రమేష్, ఎస్‌కే ర ఫీ, కాశయ్య ఉన్నారు.
 
ఇంకో చోట 280 కేజీలు..
చీరాలటౌన్ : అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉన్న 280 కేజీల రేషన్ బియ్యాన్ని ఆర్‌ఐ మహేశ్వరి బుధవారం రాత్రి తన సిబ్బందితో కలిసి స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. పేరాల సాయిబాబా గుడి సమీపంలో ఓ మహిళ రేషన్ బియ్యాన్ని గోనె సంచుల్లో కట్టుకుని ఆటోలో తరలించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం అందడంతో ఆర్‌ఐ తన సిబ్బందితో దాడి చేయగా ఆ మహిళ బియ్యం అక్కడే వదిలి పరారైంది. బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఆర్‌ఐ చెప్పారు. తనతో పాటు వీఆర్వోలు రాంబాబు, రాము, సురేష్ ఉన్నట్లు పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement