రేషన్ బియ్యంలో ఎఫ్‌ఆర్‌కేకి మంగళం
ఇక పేదలకు ఇచ్చేది వట్టి బియ్యమే
ఎఫ్‌ఆర్‌కే లేకుంటే రేషన్ అక్రమ రవాణా మరింత సులభం
ఏటా 25 లక్షల టన్నుల రేషన్ బియ్యం పంపిణీ
రాష్ట్రంలో 1.47 కోట్ల రైస్ కార్డుదారులకు గడ్డుకాలమే
⇒ పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు గత ప్రభుత్వం విటమిన్లు, ఫోలిక్ యాసిడ్, ఐరన్ కలిపిన బియ్యం పంపిణీ చేసింది.
⇒ ఇది క్షేత్రస్థాయిలో మంచి ఫలితాలిచ్చింది. ముఖ్యంగా మహిళలు, చిన్నారుల్లో రక్తహీనతను తగ్గించడంలో కీలక భూమిక పోషించింది.
⇒ తలసేమియా, సికిల్ సెల్, రక్తహీనత వంటి హిమోగ్లోబిన్ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారితో సహా ప్రజలందరికీ ఈ బలవర్ధకమైన బియ్యం సురక్షితమని శాస్త్రీయ ఆధారాలతో నిరూపితమైంది.
⇒ ఫోలిక్ యాసిడ్ బాలింతల ఆరోగ్య రక్షణకు ఎంతగానో తోడ్పడింది. చిన్నారుల మెదడు, వెన్నెముక పెరుగుదలకు తోడ్పుతున్నట్టు తేలింది.
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పేదలకు అందించే సబ్సిడీ రేషన్‌కు చంద్రబాబు సర్కార్ మంగళం పాడేస్తోంది. బహిరంగ మార్కెట్‌లో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకుతుంటే సామాన్యులను ఆదుకోకుండా వేడుక చూస్తోంది. పౌష్టికాహార లోపాన్ని అధిగమించేందుకు మిల్లెట్లు పంపిణీ చేయాలని ఉచిత ఉపన్యాసాలు ఇచ్చే చంద్రబాబు.. తన జమానాలో చౌకదుకాణాల ద్వారా సరఫరా చేసే బలవర్ధక బియ్యాన్ని (ఫోర్టిఫైడ్ రైస్‌ను) నిలిపేస్తుండటం విస్తుగొలుపుతోంది. పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు గత ప్రభుత్వం విటమిన్లు, ఫోలిక్‌యాసిడ్, ఐరన్ కలిపిన బియ్యం పంపిణీ చేసింది.
ఇది క్షేత్రస్థాయిలో మంచి ఫలితాలిచ్చింది. ముఖ్యంగా మహిళలు, చిన్నారుల్లో రక్తహీనతను తగ్గించడంలో కీలక భూమిక పోషించింది. అయితే ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్‌ను (పోషకాహార పదార్థాలతో చేసిన బియ్యం గింజలను) ఎక్కువకాలం నిల్వ ఉంచడం ద్వారా వాటిలోని పోషక ప్రయోజనాలు తగ్గిపోవడం, తయారీదారులు నిబంధనల్ని సక్రమంగా పాటించకపోవడంతో ఆ బియ్యం నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉండటంలేదు. దీనిని సాకుగా చూపి రబీ సీజన్ తర్వాత వచ్చే సీఎంఆర్‌లో సాధారణ బియ్యాన్నే పేదలకు పంపిణీ చేయాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా రేషన్ అక్రమ రవాణాను మరింత సులభతరం చేసి తమ అనుయాయుకుల లబ్ధి చేకూర్చనుంది.
సార్టెక్స్‌కు తోడు ఫోర్టిఫైడ్
వైఎస్ జగన్ ప్రజాపంపిణీ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. పేదలకు నాణ్యమైన బియ్యాన్ని అందించాలనే సంకల్పంతో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా, దేశం ఆశ్చర్యపోయేలా ‘సార్టెక్స్’ చేసిన బియ్యాన్ని ఎండీయూ వాహనాలు పెట్టి మరీ ఇంటింటికీ పంపిణీ చేశారు. అంతకుముందు చంద్రబాబు ఏలుబడిలో చౌకదుకాణాల్లో ఇచ్చే బియ్యం ముక్కిపోయి, పురుగుపట్టి, మట్టి, చెత్తాచెదారాలతో ఉండేవి. లబ్ధిదారులు వాటిని శుభ్రం చేసుకోవడానికి ఒకరోజు కేటాయించాల్సి వచ్చేది.
ఆ దుస్థితి నుంచి పేదలకు ఊరటనిస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వం నాణ్యమైన బియ్యాన్ని.. ఫోర్టిఫైడ్ కెర్నల్స్ కలిపి అందించడం ప్రారంభించింది. బియ్యం సార్టెక్స్‌కు కిలోకి రూపాయి వెచ్చించి మరీ పేదలకు నాణ్యమైన రేషన్ బియ్యాన్ని సరఫరా చేసింది. తద్వారా రేషన్ అక్రమ రవాణా చాలావరకు తగ్గిపోయి పేదలు నాణ్యమైన బియ్యాన్ని తినడం ప్రారంభించారు. కానీ ఇప్పుడు బాబు ప్రభుత్వంలో సార్టెక్స్ నాణ్యత దెబ్బతినడంతో పాటు ఫోర్టిఫైడ్ కలపడాన్ని నిలిపేసి పేదలకు సాధారణ బియ్యాన్ని ఇచ్చేస్తున్నారు.
రేషన్ అక్రమ రవాణాకు గ్రీన్ సిగ్నల్
ఫోర్టిఫైడ్ బియ్యం సరఫరా లేకపోతే రేషన్ అక్రమ రవాణాకు అడ్డూఅదుపు ఉండదు. గతంలో సాధారణ బియ్యంలో ఫోర్టిఫైడ్ కెర్నల్స్ కలపడం ద్వారా సులభంగా రేషన్ బియ్యాన్ని గుర్తించేందుకు వీలుండేది. తద్వారా రేషన్ అక్రమార్కులు తాము సేకరించిన చౌక బియ్యంలోని ఫోర్టిఫైడ్ కెర్నల్స్‌ను తొలగించేందుకు అవస్థలు పడేవారు. ఇప్పుడు సాధారణ బియ్యాన్ని ఇస్తే అక్రమార్కుల దందాకు ఇబ్బందులు ఉండవు. సులభంగా బియ్యాన్ని పాలిష్ పట్టి ఫైన్ వెరైటీస్‌లో కలిపేసి మార్కెట్‌లో సొమ్ము చేసుకునేందుకు ప్రభుత్వమే అక్రమార్కులకు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది.
ప్రపంచం అనుసరిస్తున్న ఫోర్టిఫికేషన్..
ప్రస్తుతం రాష్ట్రంలో 1.47 కోట్ల రైస్ కార్డులున్నాయి. ఏటా 25 లక్షల టన్నుల బియ్యాన్ని పేదలకు పంపిణీ చేయాలి. ఇక్కడ కేంద్రం బియ్యాన్ని ఉచితంగా ఇస్తుండటంతో చంద్రబాబు సర్కార్ ఆ బియ్యాన్ని మాత్రమే ఇస్తోంది. గతంలో కిలో రూ.67కు అందించే కందిపప్పును నిర్దాక్షిణ్యంగా రద్దు చేసింది. బహిరంగ మార్కెట్‌లో కిలో కందిపప్పు రూ.150కి పైగా పలుకుతుంటే కళ్లప్పగించి చోద్యం చూస్తోంది. ఇక కిలో రూ.16కే ఫోర్టిఫైడ్ (విటమిన్లు కలిపిన) గోధుమ పిండిని అందిస్తే.. చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు కిలో రూ.20కి పెంచి అరకొరగా సాధారణ గో«ధుమ పిండి ఇస్తూ ప్రజలను నిలువునా ముంచేసింది. రాగులు, జొన్నల పంపిణీని పూర్తిగా అటకెక్కించి పౌష్టికాహారంపై ఉచిత ఉపన్యాసాలు ఇస్తూ కాలం గడుపుతోంది.
ఇలా ఒక్కొక్కటిగా రేషన్ సబ్సిడీలను ఎత్తేసిన చంద్రబాబు సర్కార్ ఇప్పుడు ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణీకి మంగళం పాడేస్తోంది. అంటే నాణ్యత లేని సాధారణ బియ్యాన్ని మాత్రమే పేదలకు ఇవ్వనుంది. వాస్తవానికి బియ్యం ఫోర్టిíœకేషన్ విధానానికి ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. గ్లోబల్ ఫోర్టిఫికేషన్ డేటా ఎక్సే్ఛంజ్ ప్రకారం 18 దేశాలు బియ్యం ఫోర్టిఫికేషన్‌ను అనుసరిస్తున్నాయి. 147 దేశాలు ఉప్పును ఫోర్టిఫికేషన్ చేస్తుండగా 105 దేశాలు గోధుమ పిండిని, 43 దేశాలు నూనెలను, 21 దేశాలు మొక్కజొన్న పిండిని ఫోర్టిఫికేషన్ చేస్తున్నాయి.


