కొల్లేరు గ్రామమైన ప్రత్తికోళ్లలంక ప్రజలు ఒకప్పుడు ఒకే మాట.. ఒకే బాటగా ఉండేవారు.
భయంగుప్పెట్లో ప్రత్తికోళ్లలంక ప్రజలు
ఊరు వదిలి వెళ్లిపోయిన పురుషులు
దాడులకు సంబంధించి 53 మంది అరెస్ట్
కొల్లేరు గ్రామమైన ప్రత్తికోళ్లలంక ప్రజలు ఒకప్పుడు ఒకే మాట.. ఒకే బాటగా ఉండేవారు. కట్టుబాట్లతో కలిసిమెలిసి జీవించారు. గ్రామాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేసుకున్నారు. అంత ఐక్యతగా ఉండి ఇతర గ్రామాలకు రోల్‌మోడల్‌గా నిలిచిన వారే నేడు వర్గాలుగా చీలిపోయి ఎదురుపడితే కత్తులు దూసుకుంటున్నారు. ఊరిలో ఉండలేక భయంతో పక్క ఊళ్లో తలదాచుకుంటున్నారు. మూడేళ్లుగా ఆందోళనలు, దీక్షలు అంటూ రోడ్డున పడ్డారు. ఇన్ని మార్పులకు కారకులు ఎవరు? ఐక్యతతో కలిసిమెలిసి జీవించిన ఆ గ్రామ ప్రజల మధ్య నిప్పు రాజేసిందెవరు?
ఏలూరు రూరల్ : కొల్లేరు గ్రామం ప్రత్తికోళ్లలంక నేడు జిల్యావ్యాప్తంగా చర్చనీయూంశంగా మారింది. గురువారం జరిగిన ఘటనతో గ్రామస్తులు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. పోలీసులు ఎక్కడ అరెస్ట్ చేస్తారనే భయంతో మగాళ్లు పక్క ఊళ్లకు వెళ్లి తలదాచుకున్నారు. పోలీసులు గ్రామంలో 144 సెక్షన్ విధించారు. గురువారం నాటి దాడులకు సంబంధించి ఇప్పటికే 53 మందిని అరెస్ట్ చేశారు. నేడు ఊళ్లో కొద్దిమంది ఆడవాళ్లు మాత్రమే మిగిలారు.
వివాదానికి ఆజ్యం పోసిన ప్రజాప్రతినిధి
గ్రామంలో జరిగిన హింసాత్మక ఘటనలకు అధికారులు, పోలీసులే కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మాజీ సర్పంచ్ మహలక్ష్మీరాజు, గ్రామ పెద్దల మధ్య రేగిన వివాదంలో స్థానిక ప్రజాప్రతినిధి ఆజ్యం పోశారని కొల్లేరు గ్రామాల ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. మహలక్ష్మీ రాజుకి లోబడి అటవీ, రెవెన్యూ అధికారులు ప్రజలు అనుభవిస్తున్న 260.30 ఎకరాల పట్టా చెరువులను అభయారణ్యంగా పేర్కొనడం వల్లే వివాదం ముదిరిందని చెబుతున్నారు. ఈ కారణంగానే హైకోర్టు ఆ చెరువుల్లో చేపల పట్టుబడిపై నిషేధం విధించిందని గుర్తుచేస్తున్నారు.
దీనిపై ప్రజలు తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. గ్రామస్తులు 98 రోజుల పాటు నిరవధిక దీక్ష చేసినా అధికారులు పట్టించుకోలేదు. గ్రామస్తులను రెండు వర్గాలుగా విభజించి ప్రేరేపిస్తున్న వారిపై పోలీసులు ఉదాశీనంగా వ్యవహరిస్తున్నారని కొల్లేటి లంక గ్రామాల పెద్దలు ఆవేదన వ్యక్తం చేశారు. ఘర్షణ లను ఆసరా చేసుకుని కొందరు వ్యక్తులు గ్రామస్తులపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.
పరస్పర దాడుల్లో ఇద్దరు వ్యక్తులు చనిపోయారని, వారి కుటుంబ సభ్యులకు ప్రజాప్రతినిధులు, పెద్దలు, అధికారులు ఏం సమాధానం చెబుతారని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. పంచాయతీ లక్షల రూపాయల నిధులు ఉన్నప్పటికీ మూడేళ్లుగా గ్రామంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేపట్టలేదని చెప్పారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి గ్రామంలో సమస్యలను పరిష్కరించాలని ప్రత్తికోళ్లలంక ప్రజలు కోరుతున్నారు.