Kolleru: కొరమీను, ఇంగిలాయి, జల్ల, బొమ్మిడాయి, గొరక, వాలుగ.. ఇక్కడ పుట్టినవే!

Kolleru Lake And Village Specialities In Telugu - Sakshi

అరుదైన చేపలకు జన్మస్థలం... వలస పక్షులకు ఆవాసం... మూడున్నర లక్షల మందికి నివాసం...పెద్దింట్లమ్మ కొలువు దీరిన పుణ్యక్షేత్రం... మన కొల్లేరు. 901 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి దేశంలోనే అత్యంత పెద్ద మంచినీటి సరస్సుగా... జీవవైవిధ్యానికి జలతారుగా కొల్లేరు ప్రత్యేకతను సంతరించుకుంది. ఉప్పునీటిని, మురుగునీటిని తనలో ఇముడ్చుకుని... తనను నమ్మి వచ్చిన పక్షులు, మనుషులు... ఒకటేమిటి సకలజీవరాశులను అక్కున చేర్చుకుని స్వచ్ఛమైన గాలి, నీరు, ఆహారం అందిస్తోంది.

ఘన చరిత్రకు ఆనవాళ్లు.. 
మూడో శతాబ్దం నుంచి ఈ సరస్సు పురాతన గ్రంధాల్లో ఉంది. కొల్లేరుపై పట్టు కోసం పూర్వం రాజుల మధ్య యుద్ధాలు జరిగినట్లు చరిత్ర చెబుతోంది. చైనా యాత్రికుడు హ్యూయాన్‌త్సాంగ్‌.. వెంగీ నగరంతోపాటు కొల్లేరును దర్శించినట్టు పలు గ్రం­థాల ద్వారా తెలుస్తోంది. ఇక కొల్లేరును నూజివీ­డు జమీందార్లు తమకు విశ్వాసంగా ఉండే ‘కామదాన’ కుటుంబానికి దానం ఇచ్చినట్టు చెబుతారు.

సరస్సులో ఊళ్లు ఎలా వెలిశాయంటే.. 
వరుస యుద్ధాల కారణంగా 17వ శతాబ్దంలో ఒడిశాలో తీవ్ర కరువు ఏర్పడింది. దీంతో అక్కడి వడ్డెర కులాలకు చెందిన పలు కుటుంబాలు జీవనాధారం వెదుక్కుంటూ వలస వెళ్లాయి. ఆ క్రమంలో సుమారు 10 కుటుంబాలు కొల్లేరు ప్రాంతానికి వచ్చాయి. సరస్సు మధ్యలో మట్టి దిబ్బలపై గుడిసెలు వేసుకుని చేపలను వేటాడి తింటూ జీవనం గడిపేవారు. ఆ తర్వాత పచ్చి, ఎండు చేపల విక్రయం ద్వారా జీవనోపాధి పొందారు. క్రమంగా ఇక్కడే స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. పక్క గ్రామాల దురాక్రమణ నుంచి తమను కాపాడుకోవడానికి పలు సందర్భాల్లో కత్తులు, బరిసెలతో గ్రామాల మధ్య హోరాహోరీ యుద్ధాలు జరిగేవి.

సుమారు 30 ఏళ్ల క్రితం ప్రత్తికోళ్లలంక, పందిరిపల్లిగూడెం గ్రామాల మధ్య సరిహద్దు విషయమై రెండు పర్యాయాలు జరిగిన పోరులో సుమారు 15 మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఇటువంటి కొట్లాటలు ఎన్నో కొల్లేరులో జరిగాయి. తొలినాళ్లలో రవాణాకు తాటిదోనెలను వాడేవారు. ఆ తర్వాత నాటు పడవలు, లాంచీలు వినియోగించేవారు. ఇప్పుడు రోడ్లు అభివృద్ధి చెందడంతో వాహ­నాలు ఉపయోగిస్తున్నారు. కొల్లేరుపై ఆధారపడి జీవించే ప్రజలు చేపలను వేటాడి విక్రయిస్తుంటారు. 

పర్యాటకంతో కొత్త అందాలు
కొల్లేరును పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. కొల్లేరులో కొలువైన పెద్దింట్లమ్మ అమ్మవారి ఆలయం, రోడ్లు, వంతెనల అభివృద్ధి, అటపాక పక్షుల కేంద్రాన్ని తీర్చిదిద్దడం, ఉప్పుటేరుపై అక్విడక్ట్‌ల నిర్మాణం వంటి అనేక పనులు వేగంగా జరుగుతున్నాయి. కొల్లేరులో అతిథి గృహాలు, రిసార్టులు, బోట్‌ షికారు వంటివి ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఉంది.  

వలస పక్షులకు పుట్టిల్లు.. 
సైబీరియా, ఆ్రస్టేలియా, నైజీరియా వంటి అనేక దేశాల నుంచి ఏటా డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో వలస పక్షులు ఇక్కడికి వచ్చి సంతానాన్ని వృద్ధి చేసుకుంటాయి.  
గతంలో వలస పక్షులకు తోడు స్థానిక పక్షులన్నీ కలిపి 189 రకాలు కొల్లేరుపై ఆధారపడి జీవించేవి. ఇప్పుడు సుమారు 73 రకాల పక్షులున్నట్టు లెక్కతేల్చారు. 
కైకలూరు సమీపంలోని అటపాక పక్షుల విహార కేంద్రం వద్ద శీతాకాలంలో పెలికాన్, పెయింటెడ్‌ సాŠట్క్‌ వంటి విదేశీ పక్షులు సందడి చేస్తుంటాయి.
కొల్లేరులో దాదాపు 140 రకాల చేప జాతులు ఉన్నట్టు అంచనా. 
అరుదైన నల్ల జాతి చేపలు ఇక్కడే పురుడుపోసుకున్నాయి.  
మార్పు, కొరమీను, ఇంగిలాయి, జల్ల, బొమ్మిడాయి, గొరక, వాలుగ, ఇసుక దొందులు వంటి చేపలు ఇక్కడ పుట్టినవే.  

కొల్లేరు విస్తరణ ఇలా..
ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల పరిధిలో ఉన్న తొమ్మిది మండలాల్లో 77,138 ఎకరాల్లో విస్తరించింది.  
సుమారు 901 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన కొల్లేరు ప్రాంతంలో 122 గ్రామాలున్నాయి. వాటిలో సుమారు మూడున్నర లక్షల మంది జీవిస్తున్నారు. 
అతిపెద్ద మంచినీటి (చిత్తడి నేలల) సరస్సుగా 1971లో ఇరాన్‌లోని రాంసార్‌ సదస్సు తీర్మానించింది. 
67 డ్రెయిన్లు, వాగుల ద్వారా లక్షా 10 వేల క్యూసెక్కుల నీరు ఈ సరస్సులోకి చేరుతుంది.   
ఉప్పుటేరు ద్వారా కొల్లేటి నీరు సముద్రంలో కలుస్తుంది.

మరిన్ని వార్తలు :

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top