30 ఏళ్లలో 100 మందికి  పైగా మృత్యువాత | Sakshi
Sakshi News home page

30 ఏళ్లలో 100 మందికి  పైగా మృత్యువాత

Published Mon, Sep 16 2019 4:56 AM

100 people was dead in last 30 years in Boat Capsizes - Sakshi

సాక్షి ప్రతినిధి, రాజమండ్రి/సాక్షి అమరావతి: తూర్పు గోదావరి జిల్లాలో తరచూ చోటుచేసుకుంటున్న పడవ ప్రమాదాలు ఎంతోమందిని బలిగొంటున్నాయి. విధిలేని పరిస్థితుల్లో పడవ ప్రయాణాలు చేసి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇలా మూడు దశాబ్దాల కాలంలో వంద మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఆయా ప్రధాన ఘటనల వివరాలు..
- 1985లో.. వీఆర్‌ పురం మండలం శ్రీరామగిరిలోని శ్రీరామ నవమి కల్యాణాన్ని వీక్షించేందుకు సుమారు 50 మందితో వెళ్లిన బోటు ప్రమాదానికి గురై 40 మంది మృతిచెందారు. 
1990లో.. ఆత్రేయపురం మండల పరిధిలోని ఒద్దిపర్రు, వెలిచేరు, పేరవరం గ్రామాల ప్రజలు నిత్యం రాకపోకలు సాగించే లంకరేవులో పడవ మునిగి పది మంది చనిపోయారు. 
1992లో.. ఐ.పోలవరం మండలం పరిధిలోని గోగుళ్లంక–భైరవలంక మధ్య చింతేరుపాయ వద్ద పడవ బోల్తా పడి ముగ్గురు ఉపాధ్యాయులు మరణించారు. 
1996లో బోడసకుర్రు–పాశర్లపూడి మధ్య వైనతేయ నదీ పాయపై పడవ దాటుతుండగా బలమైన గాలులకు పడవ బోల్తా పడి పదిమంది వరకు కూలీలు చనిపోయారు. 
2004లో.. యానాం–ఎదుర్లంక వారధి నిర్మించక ముందు గౌతమీ గోదావరి నదీ పాయపై జరిగిన పలు పడవ ప్రమాదాల్లో 10మంది వరకు మృతిచెందారు. 
2007లో.. ఓడలరేవు–కరవాక రేవు మధ్య ప్రయాణికులతో వెళ్తున్న పడవ ప్రమాదానికి గురైంది. ఇంజ¯Œన్‌ చెడిపోవడంతో గాలికి సముద్రం వైపు కొట్టుకుపోతుండగా మరో పడవ ద్వారా అందులోని ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. 
2008లో రాజమహేంద్రవరానికి చెందిన న్యాయవాదులు పాపికొండల విహారయాత్రకు వెళ్తూ పడవ ప్రమాదానికి గురై ఇద్దరు మృతిచెందారు. 
2009లో.. అంతర్వేది–బియ్యపు తిప్ప మధ్యలో వశిష్ట సాగర సంగమం సమీపంలో ప్రయాణం చేస్తుండగా పడవ మునిగి పశ్చిమ గోదావరికి చెందిన ముగ్గురు బలయ్యారు.
2018లో.. మే 15న మంటూరు వద్ద 50 మందితో వెళ్తున్న లాంచీ బోల్తాపడిన ఘటనలో 19 మంది జలసమాధి అయ్యారు. మృతదేహాలను వెలికితీయడానికి మూడ్రోజులు శ్రమించాల్సి వచ్చింది.
2018 జులైలో.. ఐ.పోలవరం మండలం పశువుల్లంకవద్ద పడవ బోల్తా ఘటనలో ఏడుగురు మరణించారు. ఇందులో ముగ్గురి మృతదేహాలు ఇప్పటివరకు లభించలేదు.

కాగా, అప్పట్లోనే  120మంది ప్రయాణికులతో వెళ్తున్న పర్యాటక బోటు అగ్నిప్రమాదానికి గురైంది. డ్రైవర్‌ అప్రమత్తమై బోటును సమయస్ఫూర్తితో ఒడ్డుకు చేర్చడంతో అందరూ సురక్షితంగా బయటపడ్డారు. తాజాగా ఆదివారం దేవీపట్నం మండలం కచ్చలూరులో సంభవించిన దుర్ఘటన ఇదే ప్రాంతంలో మూడోది కావడం గమనార్హం. 

రెండు పెనుప్రమాదాలు ఆదివారమే 
2017 నవంబర్‌ 12న విజయవాడ సమీపంలోని పవిత్ర సంగమం వద్ద కృష్ణా నదిలో బోటు తిరగబడిన ఘటన,  తాజాగా తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలో జరిగిన బోటు ప్రమాదం రెండూ ఆదివారమే జరగడం గమనార్హం. కార్తీక మాసం సందర్భంగా నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి వచ్చిన భక్తులు విజయవాడ కృష్ణానదిలో బోటులో విహారానికి వెళ్లడంతో ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో 22 మంది జలసమాధి అయ్యారు. శనిఆదివారాలు సెలవులు కావ డంతో తెలంగాణ, ఏపీకి చెందిన అనేక మంది పాపికొండల యాత్రకు వచ్చారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement