breaking news
-
ఏయ్.. నేను ఎవర్నో తెలుసా?
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: ఆమె వితంతువు. మరో వ్యక్తితో రిలేషన్షిప్లో ఉంది. అయితే ఆ ప్రియుడి సాయంతోనే తన అత్తమామలను హతమార్చేెందుకు ప్రయత్నించి పట్టుబడి పోయింది. ఆ ప్రియుడేమో ‘‘ఏయ్.. నేను ఎవర్నో తెలుసా?. నా బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?.. జనసేన లీడర్ని, ఇక్కడి ఎమ్మెల్యే పీఏని’’ అంటూ ఊరి జనంపైనే బెదిరింపులకు దిగాడు. నందిగామ మండలం అనాసాగరం గ్రామంలో చోటు చేసుకున్న ఘటన వివరాల్లోకి వెళ్తే.. మమత అనే మహిళ భర్త ఐదేళ్ల కిందట బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో ఆమె అత్తమామల దగ్గరే ఉంటూ వస్తోంది. అయితే గత కొంతకాలంగా కర్రి హనుమంతరావు అనే వ్యక్తితో ఆమె వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. విషయం తెలిసి పెద్దలు ఆమెను మందలించారు. దీంతో కోపం పెంచుకున్న ఆమె ఏకంగా వాళ్ల అడ్డు తొలగించుకోవాలని ప్రయత్నించింది. ఈ క్రమంలో.. ప్రియుడు హనుమంతరావుతో కలిసి అత్తమామలను హతమార్చేందుకు ప్లాన్ వేసింది. గత రాత్రి మరో వ్యక్తితో కలిసి వచ్చిన హనుమంతరావు.. కొబ్బరి కాయలు కొట్టే కత్తితో వెంకటేశ్వర్లు, మంగమ్మలపై దాడి చేయబోయాడు. దీంతో వాళ్లు పెద్దగా కేకలు వేయగా చుట్టుపక్కల వాళ్లు అప్రమత్తమయ్యారు. ఈ పరిణామంతో షాక్ తిన్న హనుమంతరావు పారిపోయే యత్నం చేయగా.. గ్రామస్తులు వెంబడించి పట్టుకున్నారు. ఆ సమయంలో తాను.. జనసేన లీడర్నని, నందిగామ ఎమ్మెల్యే పీఏ వాళ్లను బెదిరించే ప్రయత్నం చేశాడు. అయితే గ్రామస్తులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి వచ్చారు. పోలీసులకు గ్రామస్తులకు మధ్య చాలాసేపు వాగ్వాదం జరిగింది. చివరకు.. హనుమంతరావు ఫోన్లోని ఫొటోలు, ఇతర వివరాల ఆధారంగా పోలీసులు జనసేన నేతగా నిర్ధారించి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి కత్తిని స్వాధీనం చేసుకుని.. పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం గాలింపు చేపట్టారు. -
ఏపీ కేంద్రంగా ప్ర‘మాదక’ర దందా!
పోలీసు వ్యవస్థ ప్రభుత్వం చేతిలో ఉంది. కూటమి సర్కారు వచ్చి ఏడాదవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే మద్యం, గంజాయి దందాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. సర్కారే బెల్టుషాపులను ప్రోత్సహిస్తోంది. పర్మిట్ రూంలకు ఇష్టానుసారం అనుమతులిచ్చేస్తోంది. దీనికితోడు ఇప్పుడు డ్రగ్స్ దందా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌లో రూ.కోటి విలువైన కొకైన్ పట్టుబడిన కేసులో ప్రధాన నిందితుడిగా ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ఉండడం కూటమి ప్రభుత్వం, పోలీసుశాఖ వైఫల్యానికి నిదర్శనం. దీనికి బాధ్యత తీసుకోవాల్సిన కూటమి సర్కారు ప్రతిపక్ష ఎంపీపై ఎదురుదాడికి దిగడం నిజంగా సిగ్గుచేటు.. హాస్యాస్పదం.. జీడిమెట్ల(హైదరాబాద్)/తిరుపతిక్రైమ్: తిరుపతి నుంచి హైదరాబాద్‌కు కొకైన్, ఎఫిడ్రిన్ వంటి మత్తు పదార్థాలు తీసుకువచ్చి అమ్మేందుకు యత్నించిన ఐదుగురు సభ్యుల ముఠాను బాలానగర్ ఎస్వోటీ, కూకట్పల్లి పోలీసులు పట్టుకున్నారు. ఏపీలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ప్రధాన నిందితుడు గుణశేఖర్ పరారీలో ఉన్నాడు.వీరి వద్ద రూ.కోటి విలువచేసే 820 గ్రాముల కొకైన్, ఎఫిడ్రిన్ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం హైదరాబాద్ షాపూర్‌నగర్‌లోని డీసీపీ కార్యాలయంలో ఇన్చార్జి డీసీపీ ఎన్.కోటిరెడ్డి, ఎస్వోటీ డీసీపీ డి.శ్రీనివాస్ తదితరులు కలిసి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. స్నేహితుడి చేత డ్రగ్స్ తరలింపు తిరుపతికి చెందిన గుణశేఖర్ ఏపీలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. అతని స్నేహితుడు ఉన్నం సురేంద్రకు డబ్బు ఆశచూపి మే 29న 820 గ్రాముల కొకైన్, ఎఫిడ్రిన్ డ్రగ్స్ ఇచ్చి తిరుపతి నుంచి హైదరాబాద్‌కు పంపించాడు. గుణశేఖర్ చెప్పినట్లుగానే సురేంద్ర కొకైన్ తీసుకుని గుంటూరు మీదుగా నగరంలోని కూకట్‌పల్లికి చేరుకున్నాడు. ఇక్కడ సురేంద్ర తన మనుషులైన బాపట్ల జిల్లాకు చెందిన దోతిరెడ్డి హరిబాబురెడ్డి, దేవరాజు యేసుబాబులను హైదరాబాద్ రప్పించాడు. అదేవిధంగా చేగూడి మెర్సి మార్గరెట్, షేక్ మస్తాన్ వలీలను సైతం పిలిపించుకున్నాడు. అందరూ కలిసి కూకట్‌పల్లిలోని జయనగర్‌లో కలుసుకున్నారు. జూన్ 2న పోలీసులు బిజీగా ఉంటారని.. రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2న పోలీసులు బిజీగా ఉంటారని భావించి ఆ రోజే కొకైన్ అమ్మేందుకు పథకం వేశారు. ఈ మేరకు ఐదుగురు కూకట్పల్లి భాగ్యనగర్ వైపు వెళ్తుండగా అనుమానం వచ్చిన పోలీసులు వారిని ఆపి తనిఖీ చేయగా కొకైన్ లభించింది. వెంటనే ఐదుగురిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించి విచారించగా అసలు బండారం బయటపెట్టారు. అసలు డ్రగ్స్ వీరికి ఎక్కడ నుంచి వచ్చిoదనే విషయం తెలియలేదు. ప్రధాన నిందితుడు గుణశేఖర్ పోలీసులకు పట్టుబడితే అసలు విషయాలు బయటకు వస్తాయి. సమావేశంలో కూకట్పల్లి ఏసీపీ రవికుమార్, ఇన్స్పెక్టర్ రాజేశ్, బాలానగర్ ఎస్వోటీ ఇన్స్పెక్టర్ శివకుమార్, ఎస్సై కట్కం గౌతం పాల్గొన్నారు. పోలీస్‌శాఖ ఆరా గుణశేఖర్ తిరుపతిలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఇతను పంపిన మనుషులు డ్రగ్స్‌తో హైదరాబాద్‌లో పట్టుబడడంతో పోలీసు శాఖ అప్రమత్తమైంది. ఘటనపై పూర్తిస్థాయిలో ఆరా తీస్తోంది. దీనిపై తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో మాట్లాడగా.. గుణశేఖర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని చెప్పారు. పోలీస్ ఉద్యోగం చేస్తున్న వ్యక్తి ఇలా చేయడం బాధాకరమన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే కానిస్టేబుల్ గుణశేఖర్‌కు తిరుపతి ఎంపీ గురుమూర్తికి సంబంధాలు అంటగట్టే యత్నాలు జరుగుతుండడం అందరినీ విస్తుగొలుపుతోంది. కొన్ని నెలల క్రితం గుణశేఖర్ ఎంపీ వద్ద కొద్ది రోజులు గన్‌మేన్‌గా ఉద్యోగం నిర్వహించాడు. దానిని సాకుగా తీసుకుని ఈ కేసును ఎంపీకి అంటగట్టాలని కూటమి నేతలు యత్నించడం కుట్రపూరితమే. -
ప్రకాశం: మర్రిపూడి ఎస్ఐ దౌర్జన్యం కేసులో ట్విస్ట్
సాక్షి, ప్రకాశం జిల్లా: రెడ్‌బుక్ రాజ్యాంగంలో సామాన్యుల పట్ల పోలీసుల దాడులు పెరిగిపోతున్నాయి ప్రకాశం జిల్లా కొండపి మండలం జాళ్లపాలెంలో మర్రిపూడి ఎస్ఐ ఎ.రమేష్‌బాబు మహిళపై దౌర్జన్యం చేసిన ఘటన వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. బాధితులపైనే పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంట్లోకి చొరబడి మహిళపై చేయివేసి విసిరిపడేసి.. అమర్యాదగా ప్రవర్తించిన ఎస్సై రమేష్ బాబును ఎస్పీ వెనుకేసుకొచ్చారు.బాధితులపైనే కేసులు పెడుతున్నట్లు ఎస్పీ ఏఆర్ దామోదర్ మీడియా ముందు ప్రకటించారు. దళిత ఎస్‌ను అడ్డగించి విధులకు ఆటంకం పరిచారంటూ ఇద్దరు మహిళలతో పాటు ఇంటి యజమాని మారంరెడ్డి కొండలరావుపై అట్రాసిటీ కేసులు నమోదు చేశారు.కాగా, ఈ కేసులో జాళ్లపాలెం గ్రామానికి చెందిన మారంరెడ్డి కొండలరావు అదేరోజు కొండపి పోలీస్‌స్టేషన్‌కు, ఎస్పీ ఏఆర్ దామోదర్‌కు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోవటంతో సోమవారం జిల్లా ఎస్పీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. బాధితుల కథనం ప్రకారం.. జాళ్లపాలెంలో మారంరెడ్డి కొండలరావు నిర్వహిస్తున్న కిరాణా దుకాణంలో సీసీ కెమెరా ఏర్పాటు చేసుకున్నారు. గత నెల 28న కొండపి మండలం పెట్లూరు శివాలయంలో రూ.7 లక్షల విలువైన బంగారు, వెండి వస్తువులు, జరుగుమల్లి మండలం ఎన్ఎన్ కండ్రిక పంచాయతీ కొత్తపాలెం అంకమ్మ తల్లి ఆలయంలో రూ.70 వేల విలువైన వెండి వస్తువులు, హుండీలో సుమారు రూ.20 వేల నగదు చోరీకి గురయ్యాయి.ఈ కేసుల విచారణలో భాగంగా మర్రిపూడి ఎస్ఐ రమేష్‌బాబు జాళ్లపాలెం వెళ్లారు. కొండలరావు షాపు వద్ద సీసీ కెమెరా ఉన్నట్టు తెలుసుకుని అతడి కుటుంబ సభ్యులను సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించాలని కోరారు. వారు యజమాని కొండలరావు లేరని చెప్పగా.. ఎస్సై రమేష్‌బాబు వెంటనే కొండలరావు కుమారుని ద్వారా ఫోన్ చేయించి అతడితో మాట్లాడారు. కొండలరావు ఎస్ఐతో మాట్లాడుతూ తాను ఊళ్లో లేనని, సాయంత్రం వస్తానని, పెన్‌డ్రైవ్ ఇస్తే సీసీ ఫుటేజీ కాపీ చేసి పంపిస్తానని మర్యాదపూర్వకంగా చెప్పారు.దీంతో ఎస్ఐ రమేష్‌బాబు తాను స్వయంగా సీసీ కెమెరా ఫుటేజీ చెక్ చేసుకుంటానని చెప్పడంతో ‘సార్ మీరు నా ఇంట్లోకి వెళ్లడానికి వీల్లేదు. మీ మీద నాకు నమ్మకం లేదు’ అని చెప్పాడు. దీంతో అహం దెబ్బతిన్న ఎస్సై ‘మా మీద నమ్మకం లేదా’ అనడంతో కొండలరావు ‘నమ్మకం లేదు. గత ఏడాది నవంబర్‌లో మర్రిపూడి మండలం జగ్గరాజుపాలెం పెట్రోల్ బంకులో నాపై దాడి జరిగిందని ఫిర్యాదు చేస్తే నన్ను మూడు గంటలపాటు నిలువరించటమే కాక మీరు నేరస్తుల పక్షాన నిలబడి నాపై తప్పుడు కేసు పెట్టమని సలహా ఇచ్చారు.నేటి వరకు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు’ అనడంతో ఎస్ఐ ఫోన్ కట్ చేశారు. తరువాత కొండలరావు కుటుంబ సభ్యులపై ఎస్ఐ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘ఎంత పొగరు. తలుపులు వేసేస్తారా’ అని తలుపులు నెట్టుకుంటూ షాపులోకి వెళ్లి కుటుంబ సభ్యులను కొట్టారు. షాపులో ఉన్న కొండలరావు చెల్లెలు చంద్రమ్మను చేతితో నెట్టుకుంటూ ఆమెను దూషిస్తూ బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించి సీసీటీవీ ఎన్వీఆర్, మొబైళ్లు, పెన్‌డ్రైవ్‌లు జేబులో వేసుకుని వెళ్లిపోయారు. ఈ ఘటనపై కొండలరావు కొండపి పోలీస్‌స్టేషన్‌లోను, ఎస్పీకి వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేశారు. అయినా ఇంతవరకు న్యాయం జరగలేదని, తక్షణమే విచారించి న్యాయం చేయటంతో పాటు దోషులను శిక్షించి తమ వద్ద లూటీ చేసిన ఆస్తులను రికవరీ చేసి ఇప్పించాలని మరోమారు ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. -
డైవర్షన్ గమనించలేదా?
రంగంపేట/రాజానగరం/రాజమహేంద్రవరం రూరల్: అప్పటి వరకూ ఆనంద సాగరంలో ఓలలాడిన వారిన్ని విధి చిన్నచూపు చూసింది.. కొద్దిసేపటిలో ఇంటికి చేరుకునేవారే.. అయినవారితో సంతోషంగా గడిపేవారే.. కానీ, అంతలోనే వారిపై మృత్యువు పంజా విసింది.. రహదారిపై మృత్యుఘోష ప్రతిధ్వనించింది.. రంగంపేట మండలం వడిశలేరు వద్ద ఏడీబీ రోడ్డుపై జరిగిన ఘోర ప్రమాదం రెండు కుటుంబాల్లో ఎప్పటికీ తీరని విషాదాన్ని నింపింది. అయినవారందరినీ శోక సంద్రంలో ముంచింది.ఏం జరిగిందంటే..ఈ ప్రమాదంలో మృతి చెందిన ఐదుగురు, గాయ పడిన వారు దగ్గర బంధువులు. రాజానగరం మండలం రఘుదేవపురానికి చెందిన రేలంగి శివన్నారాయణ (40), ఆయన భార్య దేవీ లలిత (34), కుమార్తెలు వర్షిత (13), హర్షితతో పాటు.. రాజమహేంద్రవరం రూరల్ మండలం కవలగొయ్యి గ్రామానికి చెందిన శివన్నారాయణ బావమరిది తీగిరెడ్డి శివ (30), ఆయన భార్య భవాని, వారి కుమార్తె సాన్వి (4) కలసి కారులో సోమవారం కాకినాడ బీచ్‌కు వెళ్లారు. అక్కడ ఆనందంగా గడిపారు. తిరిగి వస్తున్న క్రమంలో వడిశలేరు గ్రామ సమీపాన హెచ్‌పీ పెట్రోలు బంకు వద్ద వారు ప్రయాణిస్తున్న కారు ఆగి ఉన్న పాల ట్యాంకర్‌ను వేగంగా ఢీకొంది. ఆ వేగానికి కారు సగ భాగం ట్యాంకర్‌లోనికి చొచ్చుకుపోయింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న శివన్నారాయణ (40), దేవీ లలిత (34) దంపతులు, వారి కుమార్తె వర్షిత (13), తీగిరెడ్డి శివ (30), ఆయన కుమార్తె సాన్వి (4) అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. వెనుక సీటులో కూర్చున్న శివ భార్య భవాని, శివన్నారాయణ కుమార్తె హర్షిత తీవ్రంగా గాయపడ్డారు. వారిని రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కల్లు గీతపై ఆధారపడి ఈ కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. శివ తండ్రి సూరిబాబు గత ఏడాది తాటిచెట్టు పైనుంచి పడి, మంచాన ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఈ ఘోరం జరగడం ఆయా కుటుంబాలను తీవ్రంగా కలచివేస్తోంది. సరదాగా బీచ్‌కు వెళ్లి వస్తామని చెప్పి వెళ్లిన వారు ఇలా కనుమరుగైపోతారనుకోలేదంటూ మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ ప్రమాదంతో రెండు గ్రామాల్లోనూ విషాద ఛాయలు అలముకున్నాయి.డైవర్షన్ గమనించలేదా?ఏడీబీ రోడ్డును నాలుగు లేన్లుగా విస్తరిస్తున్నారు. ఈ పనుల నేపథ్యంలో వడిశలేరు హెచ్‌పీ పెట్రోల్ బంకు వద్ద అటుగా వెళ్లాల్సిన ట్రాఫిక్‌ను పక్క మార్గంలోకి మళ్లిస్తూ డైవర్షన్ ఇచ్చారు. దీనికి కొద్ది దూరంలోనే పాల ట్యాంకర్ ఆగి ఉంది. ప్రమాద సమయానికి శివన్నారాయణ కారు నడుపుతున్నారు. ఆయన ఆగి ఉన్న ట్యాంకర్‌ను, డైవర్షన్‌ను గమనించకుండా వేగంగా దూసుకుని రావడం వల్లనే ఈ ఘోరం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జయిపోయింది. రహదారిపై డైవర్షన్‌ను గమనించి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండకపోవచ్చని స్థానికులు భావిస్తున్నారు. ప్రమాద స్థలాన్ని జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్, అడిషనల్ ఎస్పీ ఎన్‌బీఎం మురళీకృష్ణ, అడిషనల్ ఎస్పీ (క్రైం) ఎల్.అర్జున్, రాజమహేంద్రవరం ఈస్ట్ జోన్ డీఎస్పీ బి.విద్య, అనపర్తి సీఐ సుమంత్ సందర్శించారు. మృతదేహాలను రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతదేహాలను చూసి బంధువులు, కవలగొయ్యి, రఘునాథపురం గ్రామస్తులు కన్నీరు మున్నీరయ్యారు. ప్రభుత్వాసుపత్రి వద్ద కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు మిన్నంటాయి. రంగంపేట పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.ఆధార్ ఇబ్బందులు తొలగిపోతాయనుకుంటే..మృతుడు శివన్నారాయణ కుమార్తెలు హర్షిత, వర్షితలు కవల పిల్లలు. 13వ సంవత్సరంలోకి వచ్చారు. ఇద్దరూ ఒకే రూపంలో ఉండటంతో ఆధార్ అయ్యేది కాదు. ఈ క్రమంలో కాకినాడలో ఇందుకు సంబంధించిన పని చేసే వారున్నారని వారికి తెలిసింద. బీచ్‌లో సరదాగా గడిపిన అనంతరం వారు హర్షిత ఆధార్ పని పూర్తి చేసుకోవాలని వెళ్లారు. తిరిగి వచ్చే సమయంలో ఈ కవలల్లో ఒకరు మృతి చెందగా.. మరొకరు తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. ఆధార్ ఇబ్బందులు తొలగిపోతాయనుకుంటే ఇలా జరిగిందంటూ వారి బంధువులు కన్నీటి పర్యంతమవతున్నారు. -
పాముకాటుతో మహిళ మృతి
ఇచ్ఛాపురం టౌన్(శ్రీకాకుళం): మున్సిపాలిటీలోని అమీన్సాహెబ్పేటలో ఆదివారం రాత్రి తలగాన పూజ(27), వంజరాన జయరాం, గీత కృష్ణవేణిలు నిద్రిస్తున్న సమయంలో పాము కాటు వేయడంతో తలగాన పూజ మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతురాలి బంధువులు ఇచ్చిన సమాచారం ప్రకారం కవిటి మండలం శావసానపుట్టుగ గ్రామానికి చెందిన తలగాన పూజ అమీన్‌సాహెబ్ పేటలో జరుగుతున్న ఆలయ ప్రతిష్టకు అమ్మమ్మ గారింటికి వచ్చింది. దీనిలో భాగంగా కుటుంబ సభ్యులతోపాటు అర్థరాత్రి వరకు సాంస్కృతిక కార్యక్రమాలు చూశారు. అనంతరం ఇంటికి వెళ్లగా ఉక్కగా ఉండడంతో ఇంటి వరండాలో పడుకున్నారు. అయితే ఆ సమయంలో వారి ముగ్గురినీ పాముకాటు వేసింది. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు ఇచ్ఛాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. ముగ్గురి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం బరంపురం తరలిస్తుండగా మార్గమధ్యలో తలగాన పూజ మృతి చెందినట్లు తెలిపారు. వంజరాన జయరాం, గీత కృష్ణవేణిలకు ఐసీయూ ఉంచి వైద్యసేవలు అందిస్తున్నారు. మృతురాలి భర్త తలగాన శంకర్ రోజుకూలీ చేస్తూ జీవిస్తుంటారు. -
కర్నూలు జిల్లాలో మరో సీఐ వేధింపులు.. వైఎస్సార్సీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం
సాక్షి టాస్క్‌ఫోర్స్: టీడీపీ కూటమి నాయకులు పోలీసులను ఇష్టారాజ్యంగా వాడుకుంటూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చి వైఎస్సార్సీపీ సానుభూతిపరులు, కార్యకర్తలను బెదిరించి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. తెనాలి పోలీసుల మాదిరిగానే కర్నూలు జిల్లా పత్తికొండ సీఐ వేధింపులు, బెదిరింపులు తట్టుకోలేక మండల పరిధిలోని దూదేకొండ గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త పి.ప్రవీణ్‌కుమార్ ఆదివారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు పత్తికొండ ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఆసుపత్రికి వెళ్లి బాధితుడిని పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. మరోవైపు బాధితుడు తనకు జరిగిన అన్యాయంపై హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులను ఉద్దేశిస్తూ సెల్ఫీ వీడియో తీశాడు. పోలీస్‌స్టేషన్‌లో బెదిరింపులు.. రెండేళ్ల క్రితం దూదేకొండ గ్రామానికి చెందిన తలారి కృష్ణమూర్తి నుంచి రూ.10 వడ్డీతో ప్రవీణ్‌కుమార్ రూ.లక్ష అప్పు తీసుకున్నాడు. రూ.50 వేలు చెల్లించాడు. ఇంకా రూ.50 వేలు చెల్లించాల్సి ఉంది. అయితే, కృష్ణమూర్తికి మద్దతుగా మాజీ ఎంపీటీసీ మునిలక్ష్మి కుమారుడు రంగస్వామి, రంగన్న ఇద్దరు కలిసి పోలీసుస్టేషన్‌కు వచ్చి అధికార పార్టీ నాయకుల సహకారంతో సీఐ జయన్నపై ఒత్తిడి తీసుకొచ్చారు. ప్రవీణ్‌కుమార్ వైఎస్సార్సీపీ సానుభూతిపరుడు కావడంతో వారు ఒత్తిడి పెంచారు. పైగా.. గతంలో కొంత చెల్లించినా కూడా మళ్లీ అప్పు ఉన్నట్లుగా ప్రామిసరి నోటు రాయించారు. మిగిలిన బాకీ రూ.50వేలు తనకిస్తే అప్పు ఇచ్చిన వారికి తాను ఇచ్చి సెటిల్చేస్తానని సీఐ కొద్దిరోజుల క్రితం చెప్పారు. అలాగే, పొలం అమ్మకానికి సంబంధించిన మరో అంశంలో కూడా ప్రవీణ్‌కుమార్ వేరొకరికి ఇవ్వాల్సిన రూ.లక్ష నగదు, తలారి కృష్ణమూర్తికి ఇవ్వాల్సిన రూ.50వేలు మే 31లోగా చెల్లించకపోతే రౌడీషిట్ ఓపెన్ చేస్తానని పచ్చిబూతులు తిడుతూ బెదిరించారు. అంతేకాక.. గతంలో జరిగిన ఇంటి గొడవలో ఎలాంటి విచారణ చేపట్టకుండానే ప్రవీణ్‌కుమార్, అతని భార్యపై కేసు నమోదు చేశారు. జేఎం తండా, హోసూరుకు చెందిన ఇద్దరి వద్ద చీటీ విషయమై రాసుకున్న ప్రామిసరీ నోటుకు బదులుగా పోలీసుస్టేషన్లో మరో ప్రామిసరీ నోటు బలవంతంగా రాయించారు. ఇలా కక్షపూరితంగా టార్గెట్ చేసి వేధిస్తుండడాన్ని భరించలేక తాను పురుగుల మందు తాగినట్లు బాధితుడు ప్రవీణ్‌కుమార్ చెప్పాడు. -
జీతాలు రాక.. ఎంటీఎస్ టీచర్ ఆత్మహత్య
కోరుకొండ: టీడీపీ కూటమి ప్రభుత్వంలో జీతాలు సక్రమంగా అందకపోవడంతో తూర్పుగోదావరి జిల్లాలోని మినిమమ్ టైమ్ స్కేల్ (ఎంటీఎస్) టీచర్ బలవన్మరణానికి పాల్పడ్డారు. కోరుకొండ మండలం పశ్చిమ గానుగూడేనికి చెందిన కన్నాబత్తుల విజయకుమార్ (43) కాపవరం మండల పరిషత్ పాఠశాలలో ఎంటీఎస్ టీచర్‌గా పనిచేస్తున్నారు. మే నెలలో జీతాలు అందకపోవడంతో అప్పులపాలై, ఆర్థిక సమస్యలతో మానసిక వేదనకు గురై ఆదివారం రాత్రి ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ హుక్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు. పిల్లలు ఇంటర్మిడియెట్ చదువుతున్నారు. విజయకుమార్ 2008 డీఎస్సీలో ఎంపికై, నాలుగేళ్లుగా సర్విసులో ఉన్నారు. ఆ టీచర్లకు సక్రమంగా జీతాలు లేకే సమస్యలు.. 1998, 2008 సంవత్సరాల్లో టీచర్లుగా చేరిన వారికి ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం రెగ్యులర్‌గా జీతాలు ఇవ్వకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. ఉద్యోగానికి ఎంపికైనా కూడా వారికి 16 సంవత్సరాలుగా ఉద్యోగాలివ్వలేదు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 1998, 2008 సంవత్సరాల్లో డీఎస్సీకి ఎంపికైన అభ్యర్థులకు ఎంటీఎస్ టీచర్లుగా అవకాశం కల్పించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వీరికి సరిగా వేతనాలు ఇవ్వడం లేదు. వారిలో పలువురు వయస్సు రీత్యా వివిధ వ్యాధులతో బాధపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో పలువురు రిటైర్మెంట్ వయస్సుకు చేరుకుంటూ, కుటుంబ పోషణ కష్టమై, ఆర్థిక సమస్యలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.సమస్యలు పరిష్కరించాలి.. ఉద్యోగ భద్రత కల్పించడంలో విఫలమవుతున్న కూటమి ప్రభుత్వం నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కృషిచేయడంలేదు. ఎంటీఎస్ టీచర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. ఆత్మహత్యలను అరికట్టాలి. – కె.చంద్రశేఖర్‌రెడ్డి, రాష్ట్ర కన్వీనర్, ఎంటీఎస్ టీచర్స్ అసోసియేషన్రెగ్యులరైజ్ చేయాలి.. ఎంటీఎస్ టీచర్లను బేషరతుగా రెగ్యులరైజ్ చేయాలి. వారి కుటుంబాల్లో ఆర్థిక సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలి. ఒత్తిడి లేకుండా విధులు నిర్వహించేందుకు అవకాశం కల్పించాలి. – బైరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు, ఎంటీఎస్ టీచర్స్ అసోసియేషన్ కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలి.. టీచర్ల ఆత్మహత్యలకు టీడీపీ కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలి. వసతుల కల్పనలో, జీతాలందించడంలో ప్రభుత్వం విఫలమైంది. – మార్తార్ బాల్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంటీఎస్ టీచర్స్ అసోసియేషన్ -
కాళ్లు, చేతులు కట్టేసి..కడపలో వ్యక్తి దారుణ హత్య
కడప అర్బన్: కడప నగరం చిన్నచౌక్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అశోక్‌నగర్‌లో మసీద్ వీధిలో ఆదివారం సాయంత్రం సయ్యద్ చాంద్‌బాషా (36) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటనపై అతని తల్లి సయ్యద్ జుబేదా, పోలీసుల ప్రాథమిక సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. కడప నగరంలోని రామకృష్ణ నగర్లో నివాసం వుంటున్న సయ్యద్ జుబేదా చిన్నకుమారుడు సయ్యద్ చాంద్‌బాషాకు, అశోక్‌నగర్ మసీద్ వీధిలో నివాసం వుంటున్న షేక్ మహబూబ్ బాషా కుమార్తె ఆయేషాకు 9 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు కుమారులు సంతానం. చాంద్‌బాషా ఆటోడ్రైవర్గాను, ఎలక్ట్రికల్ పనులు, ఇంకా తనకు వచ్చిన పనులను చేసుకుంటూ జీవనం సాగించేవాడు. భార్య ఆయేషా కడప నగరంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తోంది. ఈ క్రమంలో వివాహమైనప్పటి నుంచి భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. అతను అశోక్‌నగర్‌లోనే తన అత్తగారింటికి సమీపంలో ఇల్లు అద్దెకు తీసుకుని వుండేవాడు. వీరి మధ్య మనస్పర్థలు తీవ్రం కావడంతో పోలీసుస్టేషన్, కేసుల దాకా వెళ్లారు. గత ఆరునెలల నుంచి ఆయేషా తన పుట్టింటిలోనే వుంటూ పిల్లలను తనదగ్గరే పెట్టుకుంది. ఈ క్రమంలో పరస్పరం ఘర్షణ పడుతూనే వున్నారు.20 రోజుల క్రితం ఆయేషా తండ్రి షేక్ మహబూబ్ బాషా కువైట్ నుంచి వచ్చాడు. ఒకసారి తన అల్లుడు సయ్యద్ చాంద్‌బాషాపై హత్యాయత్నానికి పాల్పడ్డాడని ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే ఆదివారం మధ్యాహ్నం చాంద్‌బాషా తల్లి జుబేదాకు దావత్ ఉందని చెప్పి వెళ్లాడు. తన అత్తారింటికి సమీపానికి వెళ్లాడు. ఆ సమయంలో మామ షేక్ మహబూబ్‌బాషా, వారి కుటుంబ సభ్యులు సయ్యద్ చాంద్ బాషాను తమ ఇంటికి తీసుకుని వెళ్లారు. చేతులు, కాళ్లను తాళ్లతో కట్టేసి, కత్తి, కొడవలితో దారుణంగా నరికి హత్య చేశారు. రక్తపుమడుగులో పడివుండగా ప్రధాన నిందితుడైన షేక్ మహబూబ్‌బాషా, ఇతర కుటుంబ సభ్యులు పరారయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు, చిన్నచౌక్ సీఐ ఓబులేసు, ఎస్ఐ రవికుమార్, సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని ప్రాథమిక దర్యాప్తు చేపట్టారు.మామ, కుటుంబ సభ్యులే మా కుమారుడిని పొట్టన పెట్టుకున్నారు– హతుని తల్లి జుబేదా తన కుమారుడు సయ్యద్ చాంద్ బాషా అన్ని పనులను చేసుకుంటూ తన భార్య ఆయేషాను, ముగ్గురు పిల్లలను పోషించేవాడు. తన కోడలికి, కుమారునికి మనస్పర్థలుండటం, తన కుమారుడిని మామ షేక్ మహబూబ్‌బాషా ఇంటి వద్దకు తీసుకుని వెళ్లి పొట్టన బెట్టుకున్నాడని ఆరోపించారు. మామతో పాటు, అతని భార్య, కుమార్తె, ముగ్గురు కుమారులే కారణమని ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.షేక్ మహబూబ్బాషానే తన అల్లుడు సయ్యద్ చాంద్‌బాషాను దారుణంగా హత్య చేశాడని, ఇందులో బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కడప చిన్నచౌక్ సీఐ ఓబులేసు తెలిపారు. కాగా పోలీసుల అదుపులో ప్రధాన నిందితుడు షేక్ మహబూబ్‌బాషాతో పాటు, ఇతర నిందితులు ఉన్నారని తెలిసింది. కాగా ఈ హత్యను ఆప్ కి ఆవాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి, వక్ఫ్ పరిరక్షణ కమిటీ జేఏసీ నగర కో కన్వీనర్ ఒక ప్రకటనలో ఖండించారు. -
తెనాలిలో విషాదం.. బంగారం వ్యాపారి ఆత్మహత్య
సాక్షి, గుంటూరు: తెనాలిలో విషాదం చోటు చేసుకుంది. బంగారం వ్యాపారి సిద్దేశ్ శివాజీ ఆత్మహత్యకు పాల్పడ్డారు. బంగారం వ్యాపారి ఆత్మహత్య పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిద్దేశ్ శివాజీ ఆత్మహత్యకు పోలీసులు వేధింపులే కారణమని సమాచారం.దొంగ బంగారం కేసులో సిద్దేశ్ శివాజీని కొంత బంగారం ఇవ్వమని పోలీసులు వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. పోలీసుల వేధింపులు భరించలేకే ఆత్మహత్య చేసుకున్నట్లు కొందరు ఆరోపిస్తున్నారు. సిద్ధేష్ శివాజీ మృతితో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
వైఎస్సార్ జిల్లాలో దారుణం.. భార్యపై అనుమానంతో..
సాక్షి, వైస్సార్ జిల్లా: జిల్లాలో దారుణం జరిగింది. భార్యపై అనుమానంతో ఉరివేసి చంపిన భర్త.. తాను ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చెన్నూరు పట్టణంలో ఈ ఘటన జరిగింది. బంధువుల సమాచారం ప్రకారం.. కొత్త గాంధీనగర్ చెందిన వల్లెపు నిత్యానంద్ 11 రోజుల క్రితం కువైట్ నుంచి స్వగ్రామానికి నిత్యానంద తిరిగి వచ్చాడు. అప్పటి నుంచి భార్యపై అనుమానంతో చిన్నపాటి తగాదాలు జరుగుతున్నాయి.ఈ క్రమంలో ఇవాళ తెల్లవారుజామున నిత్యానంద్ తన భార్య లక్ష్మీకుమారితో గొడవపడ్డాడు. దీంతో భార్యకు ఉరివేసిన భర్త.. తాను కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతులకు ఇద్దరు కుమార్తెలు గంగా మేఘన (8) గంగా మౌనిక (5) ఉన్నారు. సంఘటనా స్థలికి చేరుకున్న సీఐ కృష్ణారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను కడప రిమ్స్‌కు తరలించారు. -
సైబర్ మోసాలు పదిరకాలు
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త తరహా మోసానికి పాల్పడుతున్నారు. కంటికి కనిపించకుండా వివరాలు చెప్పించుకొని మరీ బ్యాంకు ఖాతాలు ఊడ్చేస్తున్నారు. అవగాహనా లేమి, అత్యాశలే సైబర్ మోసాలకు ప్రధాన కారణాలు. మన చుట్టూ సైబర్ నేరాలకు సంబంధించిన వార్తలు నిత్యం చక్కర్లు కొడుతున్నా వాటిపై చాలా మంది ధ్యాస పెట్టడం లేదు. మాకు అంతా తెలుసులే అనే అతిధోరణితో మోసపోతున్నారు. సైబర్ మోసాలపై నమోదవుతున్న కేసులను గమనిస్తే ప్రధానంగా పది రకాల మోసాలే ఎక్కువగా జరుగుతున్నట్లు సైబర్ భద్రతాధికారులు చెబుతున్నారు. ఈ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. 1. పెట్టుబడుల పేరిట స్టాక్ మార్కెట్ మోసాలు విపరీతంగా పెరిగాయి. తక్కు వ కాలంలో ఎక్కువ లాభాలు వస్తాయన్న ఆశ తో ఎంతో మంది అమాయకులు సులువుగా సైబర్ నేరగాళ్ల వలకు చిక్కుతున్నారు. సోషల్ మీడియా ప్రకటనలతో స్టాక్ మార్కెట్లో 30–40% లాభాలంటూ సైబర్ నేరగాళ్లు ఊదరగొడుతున్నారు. ఈ ప్రకటనలకు స్పందించే వారికి వాట్సాప్‌లో లింక్‌లు పంపుతూ వారు రూపొందించిన మోసపూరిత వెబ్సైట్ లలో పెట్టుబడి పెట్టిస్తున్నారు. లాభాలు వస్తున్నట్లు చూపుతూ మరింత పెట్టుబడి పెట్టేలా చేస్తున్నారు. నగదు ఉపసంహరణకు ప్రయతి్నంచినప్పు డు డబ్బులు రాక లబోదిబోమంటున్నారు. అందు వల్ల ఇలాంటి ప్రకటనలు సైబర్ మోసమని గ్రహించాలి. 2. లైక్‌లు.. షేర్ల పేరిట.. సోషల్ మీడియా పోస్టులను లైక్, షేర్ చేయడం వంటి సులువైన టాస్క్‌లతో డబ్బులు సంపాదించండంటూ ప్రకటనలిస్తూ సైబర్ ఉచ్చులోకి లాగుతున్నారు. తొలుత చిన్నచిన్న మొత్తాలు రాబడి రూపంలో చూపుతారు. అవతలి వ్యక్తి నమ్మకం పెరిగాక అసలు మోసానికి తెరతీస్తున్నారు. ఫొటోలు, వీడియోలకు లైక్, షేర్ చేస్తే అవతలి వ్యక్తులు డబ్బులు ఎందుకు ఇస్తారు? ఈ చిన్న లాజిక్ మరవొద్దు. 3. క్రెడిట్‌కార్డు మోసాలు స్కామర్లు బ్యాంక్ ఎగ్జిక్యూటివ్‌ల మాదిరిగా ఫోన్ చేసి క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామంటూ సీవీవీ, క్రెడిట్ కార్డు నంబర్లు, పుట్టిన తేదీ, బ్యాంకు ఖాతా వివరాలు సేకరిస్తారు. ఆ తర్వాత డబ్బులు కొల్లగొడతారని గుర్తుపెట్టుకోండి.4. తప్పుగా డబ్బులు పడ్డాయంటూ.. బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ అయినట్లు మెసేజ్‌లు పంపుతారు. ఆ తర్వాత సైబర్ మోస గా ళ్లు ఫోన్ చేసి మీ బ్యాంకు ఖాతా లో పొరపాటున జమ అయిన మొత్తాన్ని తిరిగి పంపాలంటూ డబ్బులు కాజేస్తారు. ఇలాంటి సమ యాల్లో బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకోకుండా స్పందించవద్దు.5. కేవైసీ అప్డేట్ పేరిట.. మీ బ్యాంకు ఖాతా వివరాలు, పేరు చెబుతూ ఫోన్ చేస్తారు. కేవైసీ వివరాలు అప్డేట్ చేసుకోవాలని సూచిస్తారు. లేదంటే ఎస్ఎంఎస్, ఈ–మెయిల్ ద్వారా కొన్ని లింక్‌లు పంపి అందులో మీ బ్యాంకు ఖాతా కేవైసీ అప్డేట్ చేసుకోవాలని సూచిస్తారు. వారు అడిగిన వివరాలు ఇస్తే మీ బ్యాంకు ఖాతా ఖాళీ అయినట్టేనని గుర్తుపెట్టుకోండి.6. కస్టమ్స్ అధికారులమంటూ.. మీ బంధువులు, స్నేహితులు విదేశాల నుంచి సర్ప్రైజ్ గిఫ్ట్ పంపారని.. అది మీకు చేరాలంటే కస్టమ్స్ సుంకం చెల్లించాలని.. తాము కస్టమ్స్ అధికారులమంటూ ఎస్ఎంఎస్లు లేదా ఫోన్లు చేస్తారు. బహుమతిపై ఆశతో ఎంతో మంది సైబర్ నేరగాళ్లు చెప్పినట్లు డబ్బు పంపి మోసపోతున్నారు. మీ పేరిట వచ్చిన పార్సిల్లో నిషేధిత వస్తువులు ఉన్నాయని.. మీపై కేసులు పెడతామని బెదిరిస్తూ ఫోన్ చేస్తారు. ఇతరులకు ఈ విషయం చెబితే మీకే చిక్కులంటూ భయాందోళనలకు గురిచేసి అందినకాడికి ఆన్లైన్లో డబ్బులు వేయించుకుంటున్నారు. అనుమానాస్పద ఫోన్‌కాల్స్ విషయంలో తస్మాత్ జాగ్రత్త.7. ఐటీ చెల్లింపులు, రిటర్న్‌ల పేరు చెప్పి.. ఆదాయపు పన్ను చెల్లింపుల పేరిట సైబర్ మోసాలు పెరుగుతున్నాయి. ఐటీ శాఖ నకిలీ లోగోతో సందేశాలు పంపుతారు. పన్ను చెల్లింపుదారులకు తాము ఐటీ అధికారులమని చెప్పి.. రీఫండ్‌ను వేగవంతం చేయడానికి బ్యాంకు వివరాలు ఇవ్వాలంటూ ఫోన్ చేస్తారు. ఇలాంటి ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్లు మోసపూరితమైనవిగా గుర్తించాలి. 8. ట్రాయ్ పేరిట.. టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) అధికారుల పేరిట ఇటీవల ఫోన్ చేస్తారు. మీ ఫోన్ నంబర్‌పై చట్టవిరుద్ధ కార్యకలాపాలు నమోదయ్యాయని.. ఉగ్రవాదులు, ఇతర నేరగాళ్ల ఫోన్ లిస్టులో మీ నంబర్ ఉందని బెదిరిస్తారు. మీ నంబర్‌ను ఆ లిస్టులోంచి తీసేయాలంటే డబ్బులు ఇవ్వాలంటూ పట్టుబడతారు. తీవ్రంగా ఒత్తిడి తెచ్చి అందినకాడికి డబ్బులు దండుకుంటారు. ట్రాయ్ అధికారులు ఈ తరహా ఫోన్‌కాల్స్ చేయరని గుర్తుంచుకోవాలి. 9. డిజిటల్ అరెస్టులు.. ఈ మధ్యకాలంలో అత్యధికంగా నమోదవుతున్న సైబర్ మోసాల్లో డిజిటల్ అరెస్టులు ప్రధానమైనవి. సీబీఐ, పోలీసు అధికారులమని వాట్సాప్‌లో ఆడియో, వీడియో కాల్స్ చేస్తారు. వాట్సాప్ డీపీలో పోలీస్ యూనిఫాంతో ఉన్న ఫొటోలు, వీడియో కాల్ మాట్లాడేటప్పుడు పోలీస్ యూనిఫాంలో ఉంటూ మీ కుమారుడు అత్యాచారం, హత్య కేసులో చిక్కినందున మిమ్మల్ని డిజిటల్ అరెస్టు చేశామని బెదిరిస్తారు. ఈ విషయాలు ఎవరితో పంచుకోవద్దని, బయటికి వెళ్లవద్దని హెచ్చరిస్తారు. కేసు లేకుండా చేయాలంటే తాము చెప్పిన నంబర్‌కు డబ్బులు పంపాలని డిమాండ్ చేస్తారు.10. ఏఐతో వలవేసి.. సైబర్ నేరగాళ్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను సైతం మోసాలకు వాడుతున్నారు. ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, ఎక్స్ వంటి సోషల్ మీడియా వేదికల్లో పంచుకొనే ఫొటోలు, వీడియోలను ఆధారంగా చేసుకొని.. ఏఐ సాయంతో వారి గొంతును అనుకరిస్తూ ఆడియోలు తయారు చేస్తారు. వాటిని కుటుంబ సభ్యులకు, స్నేహితులకు పంపి అత్యవసరమనో లేదా ఆసుపత్రిలో ఉన్నామనో చెబుతూ వెంటనే డబ్బులు పంపాలని అభ్యర్థిస్తారు. డబ్బులు ఇవ్వకపోతే మీ కుటుంబ సభ్యుల మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలు బయటపెడతామని బెదిరించి డబ్బులు డిమాండ్ చేస్తారు. ఇలాంటి సందర్భాల్లో వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. -
అడ్డు తొలగించుకోవాలనే యువతి హత్య
యలమంచిలి రూరల్(అనకాపల్లి): రెండేళ్ల క్రితం యలమంచిలి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో బీపీసీఎల్ పెట్రోల్ బంక్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో దారుణ హత్యకు గురైన యువతి ఎల్లబిల్లి దివ్య(20) హత్య కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. యువతిని హతమార్చి, పెట్రోల్ పోసి తగలబెట్టిన ఈ ఘటన అప్పట్లో జిల్లాలో సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే. అయితే సరైన ఆధారాలు లేకపోవడంతో 25 నెలలుగా నిందితులను పోలీసులు పట్టుకోలేకపోయారు. ఇటీవల జిల్లా ఎస్పీ ఆదేశాలతో పెండింగ్ కేసుల దర్యాప్తుపై దృష్టి సారించిన యలమంచిలి సర్కిల్ పోలీసులు చాకచక్యంగా పలు సాంకేతిక ఆధారాలతో నిందితులను పట్టుకోగలిగారు. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ హత్య కేసును ఛేదించిన యలమంచిలి సీఐ ధనుంజయరావు, ట్రైనీ డీఎస్పీ కృష్ణ చైతన్య, యలమంచిలి పట్టణం, మునగపాక ఎస్ఐలు కె.సావిత్రి, పి.ప్రసాదరావులను పరవాడ డీఎస్పీ వి.విష్ణుస్వరూప్ అభినందించారు. ఈ సందర్భంగా యలమంచిలి పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు వివరాలను డీఎస్పీ మీడియాకు వెల్లడించారు. అచ్యుతాపురం మండలం పూడిమడక గ్రామానికి చెందిన ఎల్లబిల్లి దివ్య(20) 2023 ఫిబ్రవరి 22న యలమంచిలి మున్సిపాలిటీ పరిధి ఎర్రవరం సమీపంలో దారుణ హత్యకు గురైంది. కాలిపోయిన ఆమె మృతదేహాన్ని గుర్తించిన ఎర్రవరం వీఆర్వో చేవేటి అప్పారావు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొదట్లో ఆమె ఎవరనేది, ఎవరు హత్య చేశారో కూడా గుర్తించలేని పరిస్థితి ఉండడంతో వీఆర్వో ఫిర్యాదు మేరకు గుర్తు తెలియని మృతదేహంగాను, గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్టు కేసు నమోదు చేశారు. హత్యకు గురైన మహిళను తొలుత ట్రాన్స్‌జెండర్‌గా కూడా భావించారు. ఆ తర్వాత హత్యకు గురైంది పూడిమడకకు చెందిన ఎల్లబిల్లి దివ్యగా తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హతురాలు యలమంచిలిలో పలువురు యువకులతో ఎక్కువగా తిరుగుతూ ఉండడంతో ఆమెతో పరిచయం ఉన్న చాలా మంది యువకులపై అనుమానంతో పోలీసులు విచారించారు. అయినా సరైన ఆధారాలు లభ్యం కాకపోవడంతో నిందితులను గుర్తించలేకపోయారు. ఇటీవల ఈ కేసు దర్యాప్తుపై దృష్టి సారించిన పోలీసులు పలు సాంకేతిక ఆధారాలతో యలమంచిలి ధర్మవరం సీపీ పేటకు చెందిన ప్రగడ రవితేజ(30), సెలంశెట్టి సాయికృష్ణ(20), కాకివాని వీధికి చెందిన బంగారి శివ(23)లను నిందితులుగా నిర్ధారణకు వచ్చారు. వారిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించడంతో నిందితులు నేరాన్ని అంగీకరించారు.వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేయడంతోనే.. దివ్యకు కేసులో ప్రధాన నిందితుడు ప్రగడ రవితేజకు రిలేషన్షిప్ ఉండేది. రవితేజ మరో అమ్మాయిని కూడా ప్రేమిస్తున్నాడు. ఆమెతో వివాహం కూడా నిశ్చయమైంది. ఈ విషయం తెలుసుకున్న దివ్య.. తనను వివాహం చేసుకోవాలని రవితేజను కోరింది. లేకపోతే ఇంటికి వచ్చి గొడవ చేస్తానని బెదిరించింది. దివ్యను వివాహం చేసుకోవడానికి ఇష్టం లేని రవితేజ ఆమెను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని పథకం రచించాడు. ఇందుకు స్నేహితులైన సెలంశెట్టి సాయికృష్ణ, బంగారి శివల సహాయం కోరాడు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం దివ్యను పిడిగుద్దులు గుద్ది, చాకుతో పొడిచి చంపారు.అక్కడితో ఆగకుండా మృతురాలి ఆనవాళ్లు తెలియకుండా ఉండేందుకు మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగులబెట్టారు. నిందితుల్లో ప్రగడ రవితేజ, సెలంశెట్టి సాయి కృష్ణలు యలమంచిలి రూరల్ పీఎస్‌లో గంజాయి చోరీ చేసిన కేసులో నిందితులుగా ఉన్నారు. మూడో నిందితుడు బంగారిశివపై కొట్లాట కేసు ఉంది. అంతేకాకుండా నిందితులు ముగ్గురూ గంజాయికి అలవాటు ఉందని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇంకెవరూ నిందితులు లేరని పోలీసులు స్పష్టం చేశారు. నిందితులు ముగ్గుర్నీ శుక్రవారం రాత్రి న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చగా జ్యుడీíÙయల్ రిమాండ్ విధించారు. -
AP: ఒంటరి మహిళలు, వివాహితలే టార్గెట్.. యూట్యూబర్ అరెస్ట్
సాక్షి, తిరుపతి: తిరుపతిలో దారుణ ఘటన వెలుగు చూసింది. మహిళలను లైంగికంగా వేధిస్తున్న యూట్యూబర్ హేమాద్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. సదరు వ్యక్తి.. సోషల్ మీడియా వేదికగా మహిళలను వేధింపులకు గుర్తిచేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.వివరాల ప్రకారం.. తిరుపతిలో యూట్యూబర్ హేమాద్రిని తిరుచానూర్ పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. నిందితుడు హేమాద్రి.. సోషల్ మీడియా ద్వారా అమ్మాయిలు, ఒంటరి మహిళలకు, వివాహితలతో పరిచయాలు పెంచుకున్నాడు. అనంతరం, వారితో సన్నిహితంగా ఉంటూ ఫొటోలు సేకరించాడు. కొద్ది రోజుల తర్వాత వారిని సోషల్ మీడియా వేదికగా వేధింపులకు గురిచేసినట్టు బాధితులు.. పోలీసులు ఆశ్రయించారు. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు.. హేమాద్రిని అరెస్ట్ చేశారు. మరోవైపు.. హేమాద్రి అరెస్ట్ తెలియడంతో తిరుచానూర్, తిరుపతి, చంద్రగిరి నుంచి బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి ఫిర్యాదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిందితుడిని పోలీసులు విచారిస్తున్నట్టు తెలిపారు. -
ప్రతీ పనికి నిన్ను ఇబ్బంది పెడుతున్నా.. ఈ జీవితం నాకొద్దు!
ఏలూరు టౌన్: అన్నింటికీ నీపై ఆధారపడుతున్నాను.. ఇక నీకు భారం కాలేను.. పిల్లల్ని జాగ్రత్తగా చూస్కోండి అంటూ భర్తకు ఫోన్లో మెసెజ్ పెట్టి ఓ వివాహిత గోదావరిలోకి దూకి తనువు చాలించింది. వివరాలు ఇలా ఉన్నాయి. రాజమండ్రి లాలా చెరువు స్పిన్నింగ్ మిల్లు ప్రాంతానికి చెందిన సుంకరం రామకృష్ణ, కళ్యాణి (32) దంపతులు. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. ఏలూరు శాంతినగర్ 21 వ డివిజన్ సచివాలయంలో కళ్యాణి ఏఎన్ఎంగా పనిచేస్తుండడంతో ఆమె కుటుంబంతో స్థానికంగానే నివాసముంటున్నారు. రెండేళ్ల క్రితం ఆమెకు ఒక రోడ్డు ప్రమాదంలో కాలికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమె సరిగా నడవలేని పరిస్థితిలో భర్తపై ఆధారపడి జీవనం సాగిస్తోంది. ఆమె చేస్తున్న ఉద్యోగంలో, కుటుంబ జీవనంలోనూ భర్తపై ఆధారపడుతోంది. ఒకవైపు కరోనా వ్యాప్తి చెందుతుందనే భయం, మరోవైపు పని భారం పెరగడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన ఆమె బుధవారం ఎవరికీ చెప్పకుండా రాజమండ్రి వెళ్లింది. భర్త రామకృష్ణకు ఫోన్లో.. ప్రతి పనికి నీ మీద ఆధార పడి ఉంటున్నా.. నిన్ను ఇబ్బంది పెడుతున్నాను.. నాకు జీవితంపై విరక్తి కలిగింది.. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో అని మెసేజ్ పెట్టింది. దీంతో ఏలూరు త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా సెల్‌ఫోన్ సిగ్నల్ ట్రేస్ చేశారు. లొకేషన్ రాజమండ్రిలో చూపించగా అక్కడకు వెళ్లి వెదికారు. తీరా చూస్తే ఆమె గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై రాజమండ్రి త్రీ టౌన్ సీఐ వీ అప్పారావు ఆధ్వర్యంలో మృతదేహాన్ని రాజమండ్రి సర్వజన ఆసుపత్రి మార్చురీకి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. రాజమండ్రి త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
ప్రేమ జంట ఆత్మహత్య
తిరుపతి జిల్లా: జిల్లాలోని నాయుడుపేటలో ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. నాయుడుపేటలోని అమరావతి లాడ్జి నందు ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడిని ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆత్మహత్యకు పాల్పడిన జంటను కుప్పరెడ్డిపాలెం గ్రామానికి చెందిన మణి, శిరీషగా గుర్తించారు. ఈ ఘటనలో శిరీష ఉరి వేసుకుని ఉండగా, మణి కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిపై కుటుంబ సభ్యుల సమక్షంలోనే లాడ్జి గది తలుపులు పగలగొట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు పోలీసులు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
తల్లిదండ్రులు మందలించారని బాలిక ఆత్మహత్య
చింతపల్లి(అల్లూరి సీతారామరాజు): మండలంలో తల్లిదండ్రులు ఇంటి పనులు చేయలేదని మందలించడంతో బాలిక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన రామారావుపాలెం జరిగింది. అన్నవరం ఎస్ఐ వీరబాబు, కు టుంబీకులు అందించిన వివరాలిలా ఉ న్నాయి. లోతుగెడ్డ పంచాయతీ పరిధిలో రామారావుపాలెం గ్రామానికి చెందిన బాలిక పాంగి దివ్య(13) వంగసార గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో 8వ తరగతి చదువుతుంది. వేసవి సెలవులకు ఇంటికి వచ్చిన బాలిక అధిక సమయం చదవకుండా, ఏ పని చేయకుండా ఉండడంతో తండ్రి పాంగి బిట్టు, తల్లి కుమారి రెండురోజులు క్రితం మందలించారు. బుధవారం ఉదయం కూడా ఖాళీగా ఉండవద్దు ఇంటి పనులు, వ్యవసాయ పనుల్లో సహాయం చేయాలని మందలించి తల్లిదండ్రు లు వ్యవసాయ పనులకు వెళ్లిపోయారు. దీంతో మనస్థాపానికి గురైన బాలిక గ్రా మానికి సమీపంలో ఉన్న పంటపొలాల్లో ఉన్న చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 10 గంటల సమయంలో అటుగా వెళ్తున్న స్థానికులు ఉరి వేసుకున్న బాలికను గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. చింతపల్లి ఏరియా ఆసుపత్రిలో బాలిక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్టు ఎస్ఐ వీరబాబు తెలిపారు. -
హ్యాండర్లతో టచ్‌లో ఉంటూ బాంబు పేలుళ్లకు కుట్ర చేశాం!
విజయనగరం: ఉగ్రవాదం, పేలుళ్ల కుట్ర కేసుకు సంబంధించి పోలీసుల విచారణ ముగిసింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న సిరాజ్, సమీర్ లను ఆరు రోజుల పాటు విచారించారు పోలీసులు. ఈ రోజు(బుధవారం) వైద్య పరీక్షల అనంతరం వీరిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు పోలీసులు. అయితే పోలీసుల విచారణలో పలు చోట్ల బాంబు పేలుళ్లకు కుట్ర చేసినట్లు సిరాజ్ అంగీకరించాడు. దీనిలో భాగంగా పలు దేశాల హ్యాండర్లు టచ్ లో ఉన్నట్లు సిరాజ్ స్పష్టం చేశాడు.ఉగ్రవాదం, పేలుళ్ల కుట్ర కేసులో సిరాజ్ అరెస్ట్ తర్వాత విజయనగరంలో అదృశ్యమైన వారు ఎవరు?. హైదరాబాద్‌లో సమీర్ ఇంట్లో సమావేశమైన వారు ఇప్పుడు ఎక్కడ?’’ అనే వివరాలను పోలీసులు సేకరించే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే పోలీసులు పురోగతి సాధించినట్లు కనబడుతోంది.బాంబు పేలుళ్లకు కుట్ర పన్నిన సూత్రధారి సిరాజేనని, దేశ వ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో బాంబు పేలుళ్లకు వ్యూహరచన చేశాడని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) విచారణలో తేలినట్టు సమాచారం. ఉగ్రవాద భావజాలం, పేలుడు పదార్థాలు కలిగిన హైదరాబాద్‌కు చెందిన సమీర్, విజయనగరం జిల్లా ఆబాద్‌వీధికి చెందిన సిరాజ్ ఉర్ రెహ్మాన్‌ను ఈ నెల 16న కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాల మేరకు వీరిద్దరినీ ఆరు రోజులు పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. విజయనగరం పోలీస్ ట్రైనింగ్ కళాశాలలో ఎన్ఐఏ, స్థానిక పోలీస్ అధికారులు విచారించారు.ఆరు రోజుల పాటు విచారణలో తొలి మూడు రోజులు నోరు విప్పని సిరాజ్, సమీర్లు.. ఆ తర్వాత కీలక విషయాలను బహిర్గతం చేయక తప్పలేదు. ప్రధానంగా పేలుళ్లకు పథకం ర.చన చేసింది సిరాజేనని సమీర్ స్నష్టం చేశాడు. అయితే దీనిపై ఈరోజు(బుధవారం) సిరాజ్‌ను పోలీసులు విచారించగా నిజాన్ని అంగీకరించాడు. బాంబు పేలుళ్లకు పథకం రచన చేసింది తానేనని చెప్పుకొచ్చాడు. పల ఉగ్ర కుట్ర హ్యాండర్లతో టచ్ లో ఉంటూ బాంబు పేలుళ్లకు కుట్ర చేసినట్లు తెలిపాడు. ఇదిలా ఉండగా, సౌదీలో పూర్తిస్థాయిలో శిక్షణ పొందిన సిరాజ్, హైదరాబాద్‌లో ఉంటూ తరచూ సౌదీతోపాటు ఓమెన్ దేశాలకు వెళ్లినట్టు ఎన్ఐఏ గుర్తించింది. వరంగల్‌కు చెందిన ఫర్హన్, ఢిల్లీకి చెందిన బాదర్, సౌదీకి చెందిన ఇమ్రాన్‌తో మిలాఖత్ అయ్యి పాకిస్థాన్‌కు చెందిన ఓ ముస్లిం సంస్థతో టై అప్ అయినట్టు సమాచారం. అహీం గ్రూప్ ద్వారా ఆ సంస్థతో సిరాజ్ ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ భారీ కుట్రకు ప్లాన్ చేసినట్లు వెల్లడైంది. -
ప్రాణం తీసిన మైక్రో ఫైనాన్స్ అప్పులు!
పలమనేరు: కేవలం ఆధార్ కార్డుతో అప్పులిచ్చి అధిక వడ్డీలతో జనం రక్తాన్ని తాగుతున్న మైక్రోఫైనాన్స్ దాష్టీకానికి చిత్తూరు జిల్లాకు చెందిన ఓ వ్యక్తి బలయ్యాడు. వాటిని కట్టేందుకు మరిన్ని అప్పులు చేసినా ప్రయోజనం లేకపోవడంతో తండ్రి సమాధి సాక్షిగా చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన పలమనేరు మండలం కొలమాసనపల్లి పంచాయతీ మాదిగబండ గ్రామంలో మంగళవారం జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. తలారి గంగప్ప కుమారుడు తలారి మోహన్ (43) ఉన్న 40 సెంట్ల స్థలంలో వ్యవసాయం, ఖాళీ సమయంలో కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ మధ్య కాలంలో అవసరాల నిమిత్తం కొన్ని ప్రైవేటు మైక్రో ఫైనాన్స్ కంపెనీలనుంచి రుణం తీసుకున్నాడు. అధిక వడ్డీలతో వీటిని చెల్లించలేకపోవడం, పైగా వారినుంచి ఒత్తిళ్లు ఎదురవడంతో మంగళవారం పొలానికెళ్లి తండ్రి సమాధి వద్ద చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతునికి భార్య, డిగ్రీ, ఇంటర్ చదివే ఇద్దరు కొడుకులున్నారు. -
విజయనగరం ఉగ్ర కుట్ర కేసు.. ఆ 20 మంది ఎక్కడ?
సాక్షి, హైదరాబాద్: ఉగ్రవాదం, పేలుళ్ల కుట్ర కేసులో విచారణ కొనసాగుతోంది. ఇవాళ ఐదో రోజు పోలీస్ కస్టడీలో సిరాజ్, సమీర్‌ను పోలీసులు విచారిస్తున్నారు. మరో 20 మంది సభ్యులు ఉన్నట్టు ధ్రువీకరించిన సిరాజ్, సమీర్.. ఆ 20 మంది పేర్లు తెలిసినా.. వారు ఎక్కడున్నారనేది చెప్పడం లేదు. ఆ 20 మంది కోసం తెలంగాణ పోలీసులు వేట మొదలుపెట్టారు. సిరాజ్ అరెస్ట్ తర్వాత విజయనగరంలో అదృశ్యమైన వారు ఎవరు?. హైదరాబాద్‌లో సమీర్ ఇంట్లో సమావేశమైన వారు ఇప్పుడు ఎక్కడ?’’ అనే వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.బాంబు పేలుళ్లకు కుట్ర పన్నిన సూత్రధారి సిరాజేనని, దేశ వ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో బాంబు పేలుళ్లకు వ్యూహరచన చేశాడని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) విచారణలో తేలినట్టు సమాచారం. ఉగ్రవాద భావజాలం, పేలుడు పదార్థాలు కలిగిన హైదరాబాద్‌కు చెందిన సమీర్, విజయనగరం జిల్లా ఆబాద్‌వీధికి చెందిన సిరాజ్ ఉర్ రెహ్మాన్‌ను ఈ నెల 16న కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాల మేరకు వీరిద్దరినీ వారం రోజులు పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. విజయనగరం పోలీస్ ట్రైనింగ్ కళాశాలలో ఎన్ఐఏ, స్థానిక పోలీస్ అధికారులు విచారణ జరుపుతున్నారు.గత మూడురోజులుగా నోరు విప్పని సమీర్.. సోమవారం పలు విషయాలు బహిర్గతం చేసినట్టు సమాచారం. పేలుళ్లకు పథక రచన చేసింది సిరాజేనని చెప్పినట్టు తెలిసింది. అహీం గ్రూప్‌నకు అడ్మిన్ కూడా సిరాజ్ అని, అతనితోపాటు మరో 20 మంది క్రియాశీలక సభ్యులు ఉన్నారని చెప్పినట్టు సమాచారం. సౌదీలో పూర్తిస్థాయిలో శిక్షణ పొందిన సిరాజ్, హైదరాబాద్‌లో ఉంటూ తరచూ సౌదీతోపాటు ఓమెన్ దేశాలకు వెళ్లినట్టు ఎన్ఐఏ గుర్తించింది. వరంగల్‌కు చెందిన ఫర్హన్, ఢిల్లీకి చెందిన బాదర్, సౌదీకి చెందిన ఇమ్రాన్‌తో మిలాఖత్ అయ్యి పాకిస్థాన్‌కు చెందిన ఓ ముస్లిం సంస్థతో టై అప్ అయినట్టు సమాచారం. అహీం గ్రూప్ ద్వారా ఆ సంస్థతో సిరాజ్ సంప్రదింపులు జరిపినట్టు తెలిసింది. -
కోనసీమలో విషాదం.. గోదావరిలో ఎనిమిది మంది గల్లంతు!
సాక్షి, అమలాపురం/ముమ్మిడివరం/సాక్షి, అమరావతి: కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కమినిలంక పంచాయతీ శివారు సలాదివారిపాలెంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎనిమిది మంది యువకులు గోదావరి నదిలో గల్లంతయ్యారు. గ్రామంలో శుభకార్యం కోసం వచ్చిన వారిలో 11మంది యువకులు సోమవారం మధ్యాహ్నం సరదాగా నదీస్నానానికి వెళ్లగా ప్రమాదవశాత్తూ ఎనిమిది మంది మునిగిపోయారు. కాకినాడకు చెందిన సబ్బిత క్రాంతి మాన్యూల్ (19), సబ్బిత పాల్ మాన్యూల్ (18), తాతపూడి నితీష్ (19), ఎలుపర్తి సాయి (18), మండపేట మండలానికి చెందిన కాలపాక రోహిత్ (18), కె.గంగవరం మండలం శేరిలంకకు చెందిన ఎలిపే మహేష్ (14), ఐ.పోలవరం మండలం ఎర్రగరువుకు చెందిన వడ్డి మహేష్ (15), వడ్డి రాజేష్ (18) గల్లంతయ్యారు. ఒకరిని కాపాడబోయి వరుసగా.. కె.గంగవరం మండలం శేరిలంకలో పోలిశెట్టి నాగరాజు, చిన్నారి దంపతుల కుమార్తె ప్రేమ జ్యోతి ఓణీ ఫంక్షన్ జరిగింది. ఇందుకోసం ఇక్కడకొచ్చిన 11 మంది యువకులు భోజనాల అనంతరం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో గౌతమి గోదావరిని చూసేందుకు వెళ్లారు. స్నానానికి దిగారు. వీరిలో స్థానికంగా నివాసముంటున్న ఎలిపే మహేష్ లోతుగా ఉన్న ప్రాంతంలోకి వెళ్లి దిగాడు.అతనిని రక్షించేందుకు నలుగురు వెళ్లి వారు కూడా మునిగిపోయారు. మరో ముగ్గురూ వారిని కాపాడేందుకు వెళ్లి గల్లంతయ్యారు. అర్థరాత్రి వరకు వీరి ఆచూకీ లభ్యంకాలేదు. స్నానానికి దిగిన వారిలో ముగ్గురు మాత్రమే గట్టు మీదకు చేరారు. వీరిలో కాకినాడకు చెండిన డి.కరుణ్‌కుమార్ ప్రమాదం జరిగిన విషయాన్ని స్థానికులకు తెలిపారు. గల్లంతైన వారంతా 20 ఏళ్లలోపు వారే.. విషయం తెలుసుకున్న కె.గంగవరం, ఐ.పోలవరం, ముమ్మిడివరం పోలీసులు ఘటనా స్థలం వద్దకు చేరుకుని నాటు పడవలపై గాలింపు చర్యలు చేపట్టారు. అయినా ఫలితంలేదు. అధికారుల బృందాలతోపాటు స్థానికులు గౌతమీ గట్టు వెంబడి గాలించారు. రాత్రి సమయంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను జిల్లా యంత్రాంగం రప్పించింది. పడవలపై ఫ్లడ్‌లైట్లు ఏర్పాటుచేసి గాలిస్తున్నారు. గల్లంతైన వారంతా 20 ఏళ్లలోపు యువకులే. యువకుల కుటుంబ సభ్యులు ఘటన స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.కలెక్టర్ ఆర్. మహేష్‌కుమార్, జాయింట్ కలెక్టర్ టి. నిషాంతి, ఎస్పీ బి.కృష్ణారావు గాలింపును పర్యవేక్షించారు. గ్రామస్తుల ఆగ్రహం.. ఎనిమిది మంది యువకులు గల్లంతైనా గాలింపు చర్యలు చేపట్టడంలో పోలీసులు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తంచేశారు. మధ్యాహ్నం మూడు గంటలకు ఘటన జరిగితే రాత్రి ఏడు గంటల వరకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పిలిపించకపోవడంపై మండిపడ్డారు. కలెక్టర్, జేసీలపై అసంతృప్తిని వెళ్లగక్కారు. సకాలంలో రాకుంటే గల్లంతైన యువకుల ఆచూకీని ఎలా తెలుసుకుంటారని నిలదీశారు.వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి.. గోదావరిలో స్నానానికి దిగి ఎనిమిది మంది యువకులు గల్లంతవడంతో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. గల్లంతైన వారిని రక్షించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు.ప్రమాద హెచ్చరిక బోర్డులు పెట్టండి : సీఎం చంద్రబాబు ఎనిమిది మంది యువకులు గల్లంతవ్వడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఘటనపై జిల్లా కలెక్టర్‌తో ఆయన ఫోన్లో మాట్లాడారు. గల్లంతైన వారిని రక్షించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధిత కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని సూచించారు. రాష్ట్రంలోని నీటి వనరులున్న అన్ని ప్రాంతాల్లో ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేయాలన్నారు. -
చంపిందేమో జూలకంటి అనుచరులు.. కేసేమో పిన్నెల్లిపై!
సాక్షి, టాస్క్‌ఫోర్స్: టీడీపీలోని ఆధిపత్య పోరుతోనే పల్నాడు జిల్లా గుండ్లపాడులో జంట హత్యలు జరిగాయని సాక్షాత్తూ జిల్లా ఎస్పీ ప్రకటించినా.. ప్రత్యక్ష సాక్షి అయిన మృతుడి అల్లుడు వెల్లడించినా కూడా కూటమి సర్కార్ బరితెగించి నీచ రాజకీయాలు చేస్తోంది. కళ్లెదుటే వాస్తవాలు కనిపిస్తున్నా.. రాజకీయ కక్షతో వైఎస్సార్సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్ని రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిపై అక్రమ కేసులు బనాయించింది. జూలకంటి ఫ్లెక్సీతో మొదలైన గొడవ.. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడులో తోట చంద్రయ్య హత్య అనంతరం గ్రామ టీడీపీ నాయకత్వం జవిశెట్టి వెంకటేశ్వర్లు చేతిలోకి వెళ్లింది. ఇది టీడీపీ నాయకుడు తోట వెంకట్రామయ్య వర్గానికి ఇబ్బందికరంగా మారింది. కొంతకాలంగా ఇరువర్గాలు విడివిడిగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మరెడ్డి జన్మదినం సందర్భంగా తోట వెంకట్రామయ్య వర్గానికి చెందిన ఉప్పుతోళ్ల శ్రీను గత నెలలో జవిశెట్టి వెంకటేశ్వర్లు ఉన్న వీధిలో ఫ్లెక్సీ ఏర్పాటు చేశాడు. దీంతో వెంకటేశ్వర్లు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. తన వర్గంతో కలిసి శ్రీనుపై దాడి చేసి రెండు కాళ్లు విరగ్గొట్టాడు. ఈ నేపథ్యంలో కక్ష పెంచుకున్న తోట వెంకట్రామయ్య పక్కా కుట్రతో జవిశెట్టి వెంకటేశ్వర్లు, ఆయన తమ్ముడు కోటేశ్వరరావును కారుతో ఢీకొట్టి పాశవికంగా హత్య చేశాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. హత్యకు ఉపయోగించిన కారు కూడా టీడీపీ ఎమ్మెల్యే జూలకంటి అనుచరుడైన తోట వెంకట్రామయ్యదే. ఆ కారు వెనుక జేబీఆర్ పేరుతో పసుపు రంగులో పెద్ద స్టిక్కర్ సైతం ఉంది. హత్యల అనంతరం ముందు టైర్ల సస్పెన్షన్ విరిగిపోవడంతో కారును అక్కడే వదిలేసి నిందితులు పారిపోయారు. టీడీపీ నాయకుల మారణకాండ ఇది.. ఈ హత్యలు పూర్తిగా గ్రామ టీడీపీ నాయకులు చేసిన మారణకాండ అని.. దీనిని వైఎస్సార్‌సీపీపైకి నెట్టి తప్పించుకునేందుకు ఎమ్మెల్యే జూలకంటి కుట్ర పన్నారంటూ మృతుల బంధువులు వాపోతున్నారు. అసలు ఈ హత్యలతో ఎలాంటి సంబంధం లేని పిన్నెల్లి సోదరుల పేర్లు ఎఫ్ఐఆర్లో చేర్చడం ద్వారా అసలైన నిందితులను తప్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలైన దోషులకు శిక్షలు పడకపోతే.. ప్రతీకార దాడులు కొనసాగే ప్రమాదముందని టీడీపీ కార్యకర్తలు సైతం సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. హత్యకు ఉపయోగించిన కారు మన టీడీపీ వాళ్లదే అయితే.. వైఎస్సార్సీపీ పైకి నెట్టడం ఎందుకని వారు ప్రశ్నిస్తున్నారు. హత్య చేసింది టీడీపీ వాళ్లేనంటూ నిర్ధారణ.. హత్య జరిగిన సమయంలో అక్కడే ఉన్న టీడీపీ కార్యకర్త, మృతుల అల్లుడు తోట ఆంజనేయులు మాట్లాడుతూ.. టీడీపీ నేత తోట వెంకట్రామయ్య వర్గమే ఈ ఘాతుకానికి పాల్పడిందని మీడియాతో పాటు పోలీసులకు సాక్ష్యం చెప్పాడు. ప్రాథమిక విచారణ అనంతరం పల్నాడు జిల్లా ఎస్పీ కె.శ్రీనివాసరావు ఓ వీడియో విడుదల చేశారు. హత్యకు గురైన వారు, హత్యలు చేసిన వారు.. టీడీపీకి చెందిన వాళ్లేనని స్పష్టంగా ప్రకటించారు. దీనిని నిర్ధారిస్తూ ఎస్పీ కార్యాలయం కూడా పత్రికా ప్రకటన విడుదల చేసింది. పోలీసులపై జూలకంటి ఒత్తిడి.. అనంతరం హత్య జరిగిన ప్రదేశానికి శనివారం రాత్రి చేరుకున్న ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మరెడ్డి నీచ రాజకీయాలకు తెరలేపారు. ఈ హత్యల వెనుక పిన్నెల్లి సోదరుల కుట్ర ఉందని ఆరోపించారు. కేసు నమోదులో సైతం వారి పేర్లు ఉండాల్సిందేనంటూ పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో పోలీసులు మాట మార్చి పిన్నెల్లి సోదరులపై అక్రమ కేసులు నమోదు చేశారు. దీని వల్ల ఎస్పీ మాటలకే విలువ లేకుండా పోయిందంటూ పోలీస్ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. -
ఆ హత్యలతో నాకేం సంబంధం?
సాక్షి, నరసరావుపేట: పల్నాడు జిల్లా గుండ్లపాడులో జరిగిన జంట హత్యలకు టీడీపీలోని ఆధిపత్య పోరే కారణమని మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చెప్పారు. ఈ విషయాన్ని ప్రత్యక్ష సాక్షితో పాటు జిల్లా ఎస్పీ కూడా ప్రకటించారని పేర్కొన్నారు. అయినా కూడా కూటమి సర్కార్ రాజకీయ కక్షతో తనపై అక్రమ కేసు నమోదు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుండ్లపాడు జంట హత్యలపై వెల్దుర్తి పోలీసుస్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్లో తన పేరు చేర్చడంపై పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆదివారం స్పందించారు. టీడీపీలోని ఆధిపత్య పోరుతోనే జవిశెట్టి వెంకటేశ్వర్లు, జవిశెట్టి కోటేశ్వరరావును అదే పార్టీలోని ప్రత్యర్థి వర్గం పొట్టన పెట్టుకుందన్నారు. ఈ విషయాన్ని హత్య జరిగినప్పుడు చూసిన ప్రత్యక్ష సాక్షి, మృతుల అల్లుడు తోట ఆంజనేయులు మీడియాతో పాటు పోలీసులకు కూడా తెలియజేశారన్నారు. టీడీపీలోని వర్గపోరు వల్లే ఈ హత్యలు జరిగాయని పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు సైతం శనివారం ప్రకటించారని గుర్తు చేశారు. ఇటీవల ఫ్లెక్సీల విషయంలో గొడవలు జరగ్గా. ఇరు వర్గాలు టీడీపీ వాళ్లేనని వదిలేయడంతో సమస్య పెద్దదైందన్నారు. ఆనాడే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకొని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. హత్య జరిగిన ప్రదేశంలో జేబీఆర్ పేరుతో టీడీపీ ఎమ్మెల్యే జూలకంటి అనుచరుడి కారు దొరికినా.. ప్రత్యక్ష సాక్షులు సైతం హత్యలు చేసింది టీడీపీ వాళ్లేనని చెబుతున్నా.. తనపై ఎందుకు నిందలు వేస్తున్నారని పిన్నెల్లి ప్రశ్నించారు. జంట హత్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదన్న విషయం మాచర్ల ప్రజలందరికీ తెలుసునన్నారు.అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకే టీడీపీ ఎమ్మెల్యే జూలకంటి తనపై అక్రమ కేసు నమోదు చేయించారని మండిపడ్డారు. ఈ హత్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఏ గుడిలోనైనా ప్రమాణం చేసేందుకు సిద్ధమన్నారు. ధైర్యం ఉంటే బ్రహ్మారెడ్డి తన పిల్లలపై ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజల తరఫున పోరాడుతామని పిన్నెల్లి స్పష్టం చేశారు. -
భర్త, పిల్లలు వద్దు.. సురేశ్ కావాలని కాళహస్తిలో..
సాక్షి, తిరుపతి: సోషల్ మీడియా పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసి.. చివరకు ఇద్దరు ప్రాణాలను బలితీసుకుంది. భర్త, పిల్లలను విడిచిపెట్టి ప్రియుడిని వివాహం చేసుకున్న మహిళ.. చివరకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోగా.. ఆమెను పెళ్లాడిన వ్యక్తి విషం తాగి మృతిచెందాడు. ఈ విషాదకర ఘటన తిరుపతి జిల్లాలో చోటుచేసుకుంది.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఏపీలోని శ్రీకాళహస్తికి చెందిన సురేశ్, విశాఖపట్నానికి చెందిన వివాహిత పద్మతో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ సోషల్ మీడియా ఇన్స్‌స్టాగ్రామ్‌లో కలుసుకున్నారు. ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. వీరి సంబంధం పెరిగి చివరకు ఎంత వరకు వెళ్లిదంటే.. పద్మకు వివాహమై భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ ఆమె మాత్రం ప్రియుడే కావాలనుకుంది. ఈ క్రమంలో భర్త, పిల్లలను విడిచిపెట్టి శ్రీకాళహస్తిలోని కైలాసగిరి కాలనీలో ప్రియుడిని వివాహం చేసుకుంది. గత 9 నెలలుగా సురేశ్‌తో కాపురం చేస్తోంది.అయితే, వీరద్దరి మధ్య ఇటీవల తరచుగా గొడవలు జరుగుతున్నట్టు సమాచారం. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం మరోసారి ీవీరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. టిఫిన్, భోజనాన్ని వృథా చేస్తోందని పద్మను సురేశ్ మందలించడంతో ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఆత్మహత్యతో శవాన్ని కిందకు దించి సురేశ్ భయాందోళనకు లోనయ్యాడు. ఏం చేయాలో తెలియక.. అతను కూడా విషం తాగాడు. ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు. దీంతో, అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న సురేశ్, చివరకు ఆసుపత్రిలో మరణించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇక, సోషల్ మీడియాలో మొదలైన పరిచయం.. చివరకు ఇద్దరి ప్రాణాలను బలితీసుకున్న విషాద ఘటనగా మారింది. అటు ఇద్దరు పిల్లలు అనాథలుగా మిగిలిపోయారు. -
ఉగ్ర కుట్ర కేసు.. వెలుగులోకి విస్తుపోయే కొత్త కోణాలు
సాక్షి, హైదరాబాద్: సిరాజ్ ఉగ్ర కదలికలపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఏడేళ్లుగా హైదరాబాద్‌లో మకాం వేసిన సిరాజ్.. సమీర్ కలిసి ఐదు చోట్ల రెక్కీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్, విజయనగరం, ఢిల్లీ, బెంగళూరు, ముంబైలో రెక్కీ నిర్వహించారు. వరంగల్‌కు చెందిన ఫర్హాన్ మోయినుద్దీన్ కోసం పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారు. యూపీకి చెందిన బాదర్‌తో సిగ్నల్ యాప్ ద్వారా సిరాజ్ కాంటాక్ట్ అయినట్లు పోలీసులు గుర్తించారు. మహారాష్ట్ర, కర్ణాటక ఇతర రాష్ట్రాల వారితో జరిగిన సమావేశాలపై పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నారు.సిరాజ్ సోషల్ మీడియా అకౌంట్లపై కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎమ్మెల్యే రాజాసింగ్ వీడియోలకు సిరాజ్ కౌంటర్ ఇవ్వగా.. సిరాజ్ కౌంటర్‌ను మెచ్చుకుంటూ ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. రాజాసింగ్‌కు ఇంకా గట్టి కౌంటర్ ఇవ్వాలని చెప్పిన గుర్తు తెలియని వ్యక్తికి, సిరాజ్‌కు నాలుగు రోజుల పాటు ఇద్దరి మధ్య సోషల్ మీడియా చాటింగ్స్ కొనసాగినట్లు పోలీసులు నిర్థారించారు.రాజాసింగ్‌తో పాటు పలువురికి ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇవ్వాలని ఆదేశాలిచ్చిన.. ఆ గుర్తు తెలియని వ్యక్తి.. తనకు తాను విశాఖ రెవెన్యూ అధికారిగా పరిచయం చేసుకున్నాడు. సోషల్ మీడియా ద్వారానే సిరాజ్‌తో టచ్‌లో ఆ గుర్తు తెలియని వ్యక్తి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సిరాజ్‌ను కాంటాక్ట్ చేసిన అకౌంట్లను అధికారులు పరిశీలిస్తున్నారు. -
లారీ–కారు ఢీ: ఆరుగురు దుర్మరణం
కొమరోలు/సాక్షి, అమరావతి/బాపట్ల టౌన్: ప్రకాశం జిల్లా కొమరోలు మండలం తాటిచెర్లమోటు గ్రామం సమీపంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఎదురుగా వస్తున్న లారీని కారు ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. మహానంది పుణ్యక్షేత్రం దర్శనం అనంతరం తిరుగుముఖంలో ఈ ప్రమాదం జరిగింది. వివరాలివీ.. బాపట్ల జిల్లా స్టూవర్టుపురంలో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది తమ కుటుంబ సమస్యలపై చర్చించుకునేందుకు నంద్యాల జిల్లా డోన్ వెళ్లారు. అక్కడ నుంచి మహానంది వెళ్లి దైవదర్శనం చేసుకుని కారులో ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం అమరావతి–అనంతపురం జాతీయ రహదారిపై తాటిచెర్లమోటు గ్రామం సమీపంలోని పెట్రోల్ బంకు వద్దకు వచ్చేసరికి ఎదురుగా వస్తున్న లారీని కారు బలంగా ఢీకొట్టింది. దీంతో కారులోని ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ఇద్దరు చిన్నారులకు తీవ్రగాయాలు కావడంతో వారిని 108లో గిద్దలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, నలుగురు పురుషులున్నారు. మృతులను గజ్జెల అంకాలు (40), గజ్జెల భవాని (25), గజ్జెల నరసింహులు (20), గజ్జెల జనార్ధన్ (30), బొచ్చు సన్ని (30), కర్రెద్దుల దివాకర్ (30)లుగా గుర్తించారు. గాయపడిన చిన్నారుల్లో జీతన్, శిరీష ఉన్నారు. వీరిలో జీతన్ పరిస్థితి విషమంగా ఉండటంతో నంద్యాల వైద్యశాలకు తరలించారు. కారు డ్రైవర్ దివాకర్ నిర్లక్ష్యంవల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌లో గుర్తించారు. ప్రమాద స్థలాన్ని మార్కాపురం డీఎస్పీ నాగరాజు పరిశీలించారు. మృతదేహాలన్నింటిని పోస్టుమార్టం నిమిత్తం గిద్దలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి.. ఈ రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఢిల్లీలో ఉన్న ఆయన ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. వారికి అవసరమైన సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. అత్యంత బాధాకరం: వైఎస్ జగన్ రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతిచెందడంపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. దైవ దర్శనం ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్లే సమయంలో ఇటువంటి దుర్ఘటన చోటుచేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.