
సాక్షి, కోనేరు సెంటర్: కృష్ణాజిల్లా కేంద్రం మచిలీపట్నంలో తెలుగుదేశం పార్టీ నేతలు ఒక దుర్మార్గమైన పంచాయితీకి తెరతీశారు. యువతిని మోసగించిన టీడీపీ నేత, మంత్రి అనుచరుడి కుమారుడి తరఫున రంగంలోకి దిగారు. అతడిని రక్షించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.
వివరాల ప్రకారం.. టీడీపీ నాయకుడు, రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అనుచరుల్లో ముఖ్యుడైన మచిలీపట్నం మున్సిపల్ మాజీ ఫ్లోర్‌లీడర్ పల్లపాటి సుబ్రహ్మణ్యం కుమారుడు అభినవ్ స్థానికంగా ఒక యువతిని ప్రేమలోకి దించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. నాలుగు రోజుల కిందట ఆమెను బలవంతంగా గోవా తీసుకెళ్లాడు. 24 గంటలైనా కుమార్తె రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు చిలకలపూడి పోలీసులను ఆశ్రయించారు. తమ కుమార్తెను టీడీపీ నేత పల్లపాటి సుబ్రహ్మణ్యం కుమారుడు అభినవ్ బలవంతంగా తీసుకువెళ్లినట్లు తెలుస్తోందని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.
దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు అభినవ్‌ను గోవాలో పట్టుకున్నారు. అతడిని, ఆ యువతిని మంగళవారం చిలకలపూడి పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఈ క్రమంలో ఆ యువతిని పెళ్లి చేసుకునేందుకు అభినవ్ నిరాకరించాడు. సుబ్రహ్మణ్యం రంగంలోకి దిగి, యువతిని బెదిరించి ఇంటికి పంపేందుకు ప్రయత్నించారు. అధికార పార్టీల నేతలకే పోలీసుల మద్దతు ఉంటుందని యువతి తల్లిదండ్రులు భయపడ్డారు. తన కుమార్తెకు అన్యాయం జరుగుతుందనే భయంతో ఆ యువతి తల్లి పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది.
