
‘కమిట్‌మెంట్’ అడిగిన ఆడియో వైరల్ అంశంలో బాధితురాలికి వేధింపులు
హిందూపురం ఖాళీచేసి వెళ్లాలని బెదిరిస్తున్నటీడీపీ నాయకుడు చింటు
ఫిర్యాదు చేసినా సీఐ పట్టించుకోవడం లేదని బాధితురాలి ఆవేదన
చిలమత్తూరు: శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు అధికారం అండతో రెచ్చిపోతున్నారు. వారి ఆగడాలు, అకృత్యాలపై ఫిర్యాదు చేసిన బాధితులను మరింతగా వేధిస్తున్నారు. టీడీపీ హిందూపురం నాయకుడు యుగంధర్ అలియాస్ చింటు స్థానిక ప్రభుత్వాస్పత్రిలో పారిశుద్ధ్య కారి్మకురాలిని వేధించిన ఆడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో టీడీపీ నేతల తీరుపై వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం తీవ్రంగా స్పందించి బాధిత మహిళకు అండగా నిలిచింది. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
ఈ నేపథ్యంలో టీడీపీ మొక్కుబడి చర్యగా ఆడియోలో మాట్లాడిన కగ్గల్లప్ప, అతడి సోదరుడు నగేష్ కు పార్టినుంచి సస్పెండ్ చేసి, ప్రధాన నిందితుడైన చింటును మాత్రం వదిలేసింది. ఇప్పుడు చింటు బాధిత మహిళపై ప్రతీకార చర్యకు దిగారు. ఆమెను ఊరి నుంచి ఖాళీ చేసేయాలని ఒత్తిడి తీసుకురావడంతో పాటు చంపేస్తానని బెదిరించారు. దీంతో ఆమె పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించింది. అక్కడా సీఐ స్పందించకపోవడంతో ఓ వీడియో ద్వారా తన ఆవేదనను బయటపెట్టింది. తనను చింటు వేధిస్తున్నాడని, ఇల్లు ఖాళీ చేయాలని బెదిరిస్తున్నాడని, పోలీసులు పట్టించుకోవడంలేదని వాపోయింది. చింటు తనను చంపేస్తానని బెదిరిస్తున్నాడని తెలిపింది.
బాలకృష్ణ సపోర్ట్ చేస్తున్నారా?
మహిళలను వేధించే నాయకులకు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సపోర్ట్ చేస్తున్నారా అని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త టి.ఎన్.దీపిక ప్రశ్నించారు. ఆమె సోమవారం మీడియాతో మాట్లాడుతూ అధికార మదంతో మహిళను ఉద్యోగం నుంచి తొలగించి, లైంగిక వేధింపులకు పాల్పడిన టీడీపీ నేతలను జైలుకు పంపించాల్సింది పోయి.. నిందితుడైన వ్యక్తిని వెనకేసుకురావడం ఏమిటని నిలదీశారు. ఈ ఘటన జరిగిన తర్వాతే ఎమ్మెల్యే సతీమణి వసుంధరాదేవి హిందూపురంలో పర్యటించారని, నిందితుడి నుంచి బొకే తీసుకున్నారని గుర్తుచేశారు. అతడు మహిళను వేధించాడని తెలిసి కూడా చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. టీడీపీ కార్యకర్తలు మహిళల జోలికి వస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. బాధిత మహిళకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని ఆమె తెలిపారు.
బాధితురాలి ఆత్మగౌరవం దెబ్బతీసేలా సీఐ ప్రవర్తన
టీడీపీ నేత నుంచి లైంగిక వేధింపులకు గురైన మహిళ పేరు, ఆమె భర్త పేరు, నివాస ప్రాంతాన్ని ప్రస్తావిస్తూ హిందూపురం వన్‌టౌన్ సీఐ రాజగోపాల్‌నాయుడు వీడియో చేసి వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేశారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు, ఎఫ్‌ఐఆర్ కాపీలను కూడా జతచేసి పోస్ట్ చేయడం ద్వారా బాధితురాలి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా సీఐ వ్యవహరించారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీఐ రాజగోపాల్‌నాయుడు ఆది నుంచి టీడీపీకి అనుకూలంగా ఉంటూ ఆ పార్టీ లీడర్‌లా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బాధితురాలి భద్రత, ఆత్మగౌరవాన్ని పట్టించుకోకుండా.. ఆమె గోప్యతకు భంగం కలిగిస్తూ టీడీపీ నేతల స్క్రిప్ట్ ప్రకారం నడుచుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.