
కాకినాడ జిల్లా సామర్లకోటలో ఘటన
సామర్లకోట: వివాహిత, ఇద్దరు బాలికలు దారుణంగా హత్యకు గురైన ఘటన కాకినాడ జిల్లా సామర్లకోటలో ఆదివారం జరిగింది. జిల్లా ఎస్పీ బిందుమాధవ్ కథనం మేరకు.. సామర్లకోట ప్రభుత్వ జూనియర్ కళాశాల వెనుక ఉన్న సీతారామ కాలనీలో ములపర్తి ధనుప్రసాద్ కుటుంబం నివసిస్తోంది. ధనుప్రసాద్ స్థానిక ఏడీబీ రోడ్డు కాంట్రాక్టు పనులకు సంబంధించిన లారీకి డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆదివారం రాత్రి డ్యూటీకి వెళ్లిన అతడు సోమవారం ఉదయం ఇంటికి వచ్చాడు.
ఎంత కొట్టినా కుటుంబ సభ్యులు తలుపులు తెరవలేదు. ఏసీ పని చేస్తూనే ఉంది. దీంతో, అతడు తలుపులు పగులగొట్టి లోపలకు వెళ్లాడు. అప్పటికే అతడి భార్య మాధురి (30), కుమార్తెలు పుష్పకుమారి (8), జెస్సీలోన (6) చనిపోయి ఉన్నారు. ఇరుగుపొరుగు వారికి విషయం చెప్పడంతో వారు పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఎస్పీ బిందుమాధవ్, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ సత్యనారాయణ, డీఎస్పీ శ్రీహరిరాజు, సీఐలు కృష్ణభగవాన్, శ్రీనివాస్, తదితరులు ఘటనా స్థలం వద్ద వివరాలు సేకరించారు. డాగ్ స్క్వాడ్, వేలిముద్ర నిపుణులను రప్పించి, ఆధారాలు సేకరించారు. హతురాలు మాధురి తల నుజ్జునుజ్జయ్యింది. తలపై కొట్టడంతో పలు కోణాల్లో దర్యాప్తు
ఈ హత్యలపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. డాగ్ స్క్వాడ్ ధనుప్రసాద్ ఇంటి వెనుక తలుపు నుంచి గోడ దూకి సమీపంలో ఉన్న కాలనీ వైపు వెళ్లింది. ఈ నేపథ్యంలో హంతకుడు ఇంటి వెనుక తలుపు తీసి పారిపోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. హతురాలి వద్ద ఉండాల్సిన 2 ఉంగరాలు, 2 సెల్ ఫోన్లు కనిపించడం లేదని చెబుతున్నారు. ధనుప్రసాద్ రాత్రంతా రోడ్డు పనిలోనే ఉన్నట్లు సూపర్‌వైజర్ చెప్పారని సమాచారం. ఈ హత్యలు వివాహేతర సంబంధం కారణంగా జరిగిందా లేక భర్త చేసి ఉంటాడా లేదా దొంగలు చేసిన పనా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హంతకులను త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ చెప్పారు.
