భూచి చూపి..
సాక్షి ప్రతినిధి, కాకినాడ: సంపద సృష్టిస్తామన్నారు. కానీ, అందుకు తగిన విధానాలు అమలు చేయాలనే ఆలోచనను వదిలేశారు. ఫలితంగా సంపద ఏమాత్రం పెరగని పరిస్థితి ఎదురైంది. దీంతో, బుర్రకు పదును పెట్టారు. జనానికి ఏదైనా బూచి చూపించి ఆదాయం పెంచుకోవచ్చనే ఎత్తుగడ వేశారు. అనుకున్నట్టుగానే రాబడి కాస్త పెరిగింది. కానీ, పరిణామాలను గమనిస్తున్న జనం మాత్రం.. ప్రభుత్వం లేనిపోని భయాన్ని సృష్టించి, వంచించి, తమ జేబులు ఖాళీ చేసి, ఖజానా నింపుకొందని గుర్తించి మండిపడుతున్నారు.
ఏం జరిగిందంటే..
అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తానని గత ఎన్నికల సమయం నుంచి చంద్రబాబు గొప్పగా చెప్పుకొచ్చారు. అయితే, అధికారంలోకి వచ్చిన తరువాత ఆ దిశగా తీసుకున్న చర్యలు శూన్యం. పైగా, అంతకుముందు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలను ఆపేయడం.. కొన్నింటికి లబ్ధిదారుల సంఖ్యను కుదించడం.. పలు పథకాలను అటకపైకి ఎక్కించడంతో ప్రజల్లో కొనుగోలు శక్తి పడిపోయింది. దీనికి తోడు గత ఏడాది ఒకసారి భూముల మార్కెట్ విలువను సర్కారు గణనీయంగా పెంచింది. ఫలితంగా క్రయవిక్రయాలు మందగించి, రియల్ ఎస్టేట్ వ్యాపారం కుదేలైంది. పలువురు రియల్టర్లు అప్పులపాలై దివాలా తీసిన దుస్థితి నెలకొంది. అప్పటికే భూములు కొనుగోలు చేసి, అన్ని అనుమతులూ తీసుకుని, లే అవుట్లు వేసి, ప్లాట్లుగా అమ్మకానికి పెట్టినా భూముల రేట్లు పెరగడం, రిజిస్ట్రేషన్లు భారం కావడంతో పెద్దగా కొనేవారే లేకుండా పోయారు. పెట్టుబడులు కూడా తిరిగి దక్కని పరిస్థితుల్లో రియల్టర్లు పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయారు. అయినప్పటికీ, స్థిరాస్థి సంపాదించుకోవాలనే ఆశతో పలువురు నానా కష్టాలూ పడి, డబ్బులు సంపాదించుకుని, రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. ఫలితంగా రిజిస్ట్రేషన్ల ఆదాయం దాదాపు లక్ష్యం మేరకు వచ్చింది.
భయంతో ముందస్తు రిజిస్ట్రేషన్లు
ప్రభుత్వం నిజంగానే భూముల ధరలు పెంచేస్తుందేమోనే భయంతో పలువురు ఆ భారాన్ని తప్పించుకోవాలనే ఆశతో ముందుగానే రిజిస్ట్రేషన్లకు సిద్ధపడ్డారు. ఫలితంగా గత నెల మూడో వారం వచ్చేసరికి రిజిస్ట్రేషన్ల ఆదాయం కాస్త మెరుగుపడింది. అంటే ఆమేరకు జనం జేబుల నుంచి డబ్బును ముందుగానే లాగేశారన్నమాట. గత నెల 21 నుంచి 31 వరకూ జిల్లాలోని 9 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 4,062 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. వీటి ద్వారా రూ.26,13,26,322 ఆదాయం వచ్చింది. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది జనవరి 31వ తేదీ వరకూ జిల్లాలో రిజిస్ట్రేషన్ల శాఖకు ఇచ్చిన లక్ష్యం రూ.387.47 కోట్లు కాగా, రూ.382.11 కోట్లు వచ్చింది. అంటే, లక్ష్యంలో 98.62 శాతం సాధించారన్నమాట. మొత్తం 74,013 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఆదాయం బాగానే వచ్చినప్పటికీ.. మరింతగా రాబట్టాలనే ఉద్దేశంతోనే భూముల విలువ పెంచేస్తామంటూ భయపెట్టి, ప్రభుత్వం తమను బురిడీ కొట్టించినట్టు కనిపిస్తోందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తేదీ డాక్యుమెంట్లు రాబడి
(రూ.కోట్లు)
20.01.2026 246 73,44,992
21.01.2026 367 1,72,54,289
22.01.2026 307 1,71,10,071
23.01.2026 340 1,59,83,134
24.01.2026 322 1,34,96,980
27.01.2026 201 50,53,121
28.01.2026 526 4,07,95,507
29.01.2026 661 6,81,31,214
30.01.2026 476 2,67,12,515
31.01.2026 616 4,94,44,499
ఫ భూముల విలువ పెంపుపై సర్కారు హడావుడి
ఫ ఈ నెల 1 నుంచే అమలు అని లీకులు
ఫ ఆ భయంతో రిజిస్ట్రేషన్లకు జనం
ఫ తీరా చూస్తే కానరాని పెంపు
ఫ ఆదాయం కోసం తమను బురిడీ కొట్టించారని క్రయవిక్రయదార్ల ఆగ్రహం
ఆదాయం పెంచుకునే ఎత్తుగడేనా!
అయినప్పటికీ జనం నుంచి డబ్బు మరింత రాబట్టాలనో ఏమో కానీ.. ఈ నెల ఒకటో తేదీ నుంచి భూముల విలువ పెంచనున్నట్టు ప్రభుత్వం సంకేతాలిచ్చింది. తద్వారా రిజిస్ట్రేషన్ల 10 నుంచి 15 శాతం రిజిస్ట్రేషన్ల ఆదాయం పెంచుకోవాలని భావించింది. గత నెల మొదటి వారంలోనే ఈ సమాచారం రిజిస్ట్రార్ కార్యాలయాలకు ఈ సమాచారం వచ్చింది. అయితే, ఫిబ్రవరి నెల మొదలై అప్పుడే రెండు రోజులు గడిచిపోయింది. కానీ, భూముల విలువ పెంచుతూ ప్రభుత్వం ఇప్పటి వరకూ ఎటువంటి ఉత్తర్వులూ ఇవ్వలేదు. దీనినిబట్టి భూముల విలువ పెంపును బూచిగా చూపిస్తే క్రయవిక్రయదారులు రిజిస్ట్రేషన్లకు తొందర పడతారని, తద్వారా ఆర్థిక సంవత్సరం చివరి రెండు నెలల్లో ఆదాయం మరింత పెరుగుతుందనేది ప్రభుత్వ ఎత్తుగడగా కనిపిస్తోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
భూచి చూపి..


