కాస్త దారివ్వండి స్వామీ! | - | Sakshi
Sakshi News home page

కాస్త దారివ్వండి స్వామీ!

Feb 3 2026 7:42 AM | Updated on Feb 3 2026 7:42 AM

కాస్త

కాస్త దారివ్వండి స్వామీ!

అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో రావి చెట్టును సంరక్షించే క్రమంలో అన్నవరం దేవస్థానం అధికారులు తీసుకున్న చర్యలు భక్తులకు ఇబ్బందికరంగా మారాయి. అధికారుల ఉద్దేశం మంచిదే అయినప్పటికీ, భక్తులకు కలిగే ఇబ్బందులను పట్టించుకోలేదనే విమర్శలు వస్తున్నాయి. రత్నగిరిపై సత్యదేవుని దర్శనానికి వచ్చే భక్తులు ఆలయ తూర్పు రాజగోపురం ఎదురుగా ఉన్న రావి చెట్టు వద్ద ఆవు నేతి దీపాలు వెలిగించడం, ఆ దేవతా వృక్షానికి భక్తితో ప్రదక్షిణలు చేయడం ఆనవాయితీ. ఇక్కడ నేతి దీపాలు విక్రయించేందుకు తాజాగా వేలం నిర్వహించగా ఏడాదికి రూ.1.45 కోట్లకు ఖరారైంది. రావిచెట్టు మొదట్లో భక్తులు దీపాలు వెలిగిస్తూండటంతో ఆ సెగకు చెట్టు చనిపోయే ప్రమాదముందని గత ఏడాది సెప్టెంబర్‌ 11న ‘అశ్వత్థానికి దీపపు సెగ’ శీర్షికన ‘సాక్షి’ కథనం ప్రచురించింది. దీనిపై స్పందించిన అధికారులు ఆ చెట్టుకు దీపాల సెగ తగలకుండా కాండానికి రేకు అమర్చారు. ఆ తరువాత వచ్చిన కార్తిక మాసంలో ఎక్కువ మంది మహిళలు రావి చెట్టు వద్ద దీపాలు వెలిగిస్తారు కాబట్టి, వాడపల్లి దేవస్థానం నుంచి 4 అడుగుల ఎత్తున రెండు అరలుగా ఉన్న ఇనుప ర్యాకులు తెచ్చి, చెట్టు చుట్టూ అమర్చారు. మరికొన్ని ర్యాకులను చెట్టు పక్కనే ఖాళీ స్థలంలో ఉంచారు. దీంతో, అప్పట్లో మహిళలు ఎటువంటి ఇబ్బందీ లేకుండా దీపాలు వెలిగించుకున్నారు. కార్తికం తరువాత ఆ ర్యాకులను తిరిగి వాడపల్లి దేవస్థానానికి పంపించేశారు.

కొత్త ర్యాకుల తయారీ

ఇనుప ర్యాకుల ప్రయోగం సత్ఫలితం ఇవ్వడంతో దేవస్థానమే సొంతంగా అటువంటివి తయారు చేయించింది. వీటిని భీష్మ ఏకాదశి సందర్భంగా గురువారం నుంచి రావి చెట్టు చుట్టూ అమర్చారు. దీంతో, భక్తులు రావి చెట్టు కాండం వద్ద కాకుండా ఆ ర్యాకులపై దీపాలు వెలిగిస్తున్నారు. ఇంతవరకూ బాగానే ఉంది. రావి చెట్టుకు ఉత్తరం వైపు 20 చదరపు అడుగుల మేర ఉన్న ఖాళీ స్థలంలో మహిళలు గతంలో నీటితో కడిగి చిన్న ముగ్గు వేసి జ్యోతులు వెలిగించుకునేవారు. వారితో వచ్చిన పురుషులు అక్కడ వేచి ఉండేవారు. ఇప్పుడు ఆ ఖాళీ స్థలం నిండా సుమారు 20 ర్యాకులు పెట్టేశారు. దీని వలన వాటి మీద దీపాలు వెలిగించడం కాదు కదా.. అక్కడకు వెళ్లడానికి కూడా వీలు లేని పరిస్థితి ఏర్పడింది. దీనికితోడు ఆ ఖాళీ స్ధలానికి ఎదురుగా ఉన్న ప్లాట్‌ఫామ్‌పై కొత్తగా రెండు క్యూలు కూడా ఏర్పాటు చేశారు. ఫలితంగా ఆ ప్రాంతమంతా ఇరుకుగా తయారైంది. దీనిపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనికి బదులు అధికారులు రావిచెట్టు చుట్టూ పెట్టిన ర్యాకులను లాగే ఉంచి, పక్కన ఖాళీ స్థలంలో ఏర్పాటు చేసిన వాటిలో కొన్నింటిని ఆంగ్ల అక్షరం ‘యు’ ఆకారంలో అమర్చి, మధ్యలో ఖాళీ ఉంచితే అక్కడ కూడా మహిళలు దీపాలు వెలిగించుకునే అవకాశం ఉంటుంది. అధికారులు ఈ విధంగా మార్పులు చేయాలని భక్తులు కోరుతున్నారు.

ఫ రత్నగిరి రావి చెట్టు చుట్టూ

ఇనుప ర్యాకులు

ఫ అక్కడికి వెళ్లే మార్గం లేక భక్తుల అవస్థలు

కాస్త దారివ్వండి స్వామీ! 1
1/1

కాస్త దారివ్వండి స్వామీ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement