కడుపు కోతను దిగమింగి.. న్యాయం కోసం రోడ్డెక్కి.. | - | Sakshi
Sakshi News home page

కడుపు కోతను దిగమింగి.. న్యాయం కోసం రోడ్డెక్కి..

Feb 3 2026 7:42 AM | Updated on Feb 3 2026 7:42 AM

కడుపు కోతను దిగమింగి.. న్యాయం కోసం రోడ్డెక్కి..

కడుపు కోతను దిగమింగి.. న్యాయం కోసం రోడ్డెక్కి..

సర్పవరం పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఆందోళన

విద్యార్థిని తల్లిదండ్రులు,

బంధువుల నిరసన

తమ బిడ్డ మృతికి కారకుడైన టిప్పర్‌

డ్రైవర్‌ను అరెస్టు చేయాలని డిమాండు

కాకినాడ రూరల్‌: కళ్లెదుటే చెంగుచెంగుమంటూ తిరుగుతూ.. ‘అమ్మా బడికి వెళ్లి వస్తాన’ని చెప్పి ఆ చిన్నారి ఆటోపై వెళ్లింది. ముద్దులొలికే తమ బిడ్డవి అవే చివరి మాటలవుతాయని ఆ తల్లిదండ్రులు ఊహించలేదు. ముక్కుపచ్చలారని ఆ చిన్నారి ప్రాణాలను మృత్యువు.. టిప్పర్‌ రూపంలో వచ్చి కబళించేసింది. కేంద్రీయ విద్యాలయలో నాలుగో తరగతి చదువుతున్న లక్ష్య ఐశ్వర్య గత నెల 29న స్కూలుకు వెళ్తూండగా.. ఆమెతో పాటు ఇతర విద్యార్థినులు వెళ్తున్న ఆటోను కాకినాడ రూరల్‌ రాయుడుపాలెం జంక్షన్‌ సమీపాన ఓ టిప్పర్‌ ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఐశ్వర్య మృతి చెందింది. విద్యార్థిని మృతిపై ప్రభుత్వం నుంచి ఎటువంటి ఓదార్పూ లభించలేదు. మరోవైపు బిడ్డను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న తమకు.. ప్రమాదం జరిగి రోజులు గడుస్తున్నా న్యాయం చేయడంలో పోలీసులు తాత్సారం చేస్తున్నారంటూ ఐశ్వర్య తల్లిదండ్రులు దుర్గాభవాని, వినోద్‌ కుమార్‌లు మరింత కుంగిపోయారు. కడుపు కోతను దిగమింగుకుంటూనే.. తమకు న్యాయం చేయాలంటూ వారు సోమవారం రోడ్డెక్కారు. తమ బిడ్డ మృతికి కారకుడైన టిప్పర్‌ డ్రైవర్‌ను అరెస్టు చేయకుండా పోలీసులు రక్షిస్తున్నారని ఆరోపిస్తూ కాకినాడ – పిఠాపురం రోడ్డుపై సర్పవరం పోలీసు స్టేషన్‌ ఎదురుగా వారు, వారి బంధువులు బైఠాయించారు. దీంతో, ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. ఐశ్వర్యకు న్యాయం చేయాలని పెద్ద పెట్టున నినాదాలు చేశారు, ఐశ్వర్య తల్లి దుర్గాభవాని మాట్లాడుతూ, ప్రమాదంలో తమ పాప మృతి చెంది ఐదు రోజులైందని, ఇప్పటి వరకూ టిప్పర్‌ డ్రైవర్‌ను అరెస్టు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్కూల్‌ జోన్‌లో టిప్పర్లను అంత వేగంగా నడిపేందుకు ఎందుకు అనుమతించారని ప్రశ్నించారు.

టిప్పర్‌ డ్రైవర్‌ను అరెస్టు చేయకుండా జాప్యం చేస్తూ పోలీసులు యూనియన్‌కు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. అంత మందిని ఎందుకు ఆటో ఎక్కించారంటూ పోలీసులు ప్రశ్నిస్తున్నారని, బిడ్డల ప్రాణాలు తీయాలని ఏ తల్లిదండ్రులూ అనుకోరని చెప్పారు. కేంద్రీయ విద్యాలయను పి.వెంకటాపురానికి మార్చడంతో రెండేళ్లుగా ఆటోల్లోనే తమ పిల్లలు వెళ్లాల్సి వస్తోందన్నారు. ఆందోళన అనంతరం, సీఐ పెద్దిరాజు తమను స్టేషన్‌ లోపలకు పిలిచి, ‘మాదేనాన రెస్పాన్స్‌బిలిటీ.. పేరెంట్స్‌కు లేదా?’ అని ప్రశ్నించారన్నారు. పోలీసు కాకుండా ఉండి ఉంటే ఎలా స్పందిస్తారంటూ తాను అడిగితే ఆగ్రహం వ్యక్తం చేశారని దుర్గాభవాని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు సేవ చేయడానికే కదా సీఐ ఉన్నదని అన్నారు. ఆర్టీఓ కార్యాలయ అధికారులు తమ బిడ్డ ఫొటో పెట్టి, శాంతి ర్యాలీ చేసి, డైవర్షన్‌కు పాల్పడ్డారని ఐశ్వర్య తండ్రి వినోద్‌ కుమార్‌ ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement