విధుల్లో చేరిన కలెక్టర్ షణ్మోహన్
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): ముస్సోరిలో సుమారు నెల రోజుల పాటు జరిగిన శిక్షణ ముగించుకున్న జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి సోమవారం తిరిగి తన విధులకు హాజరయ్యారు. కలెక్టరేట్‌లో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, అసిస్టెంట్ కలెక్టర్ మనీషా తదితరులు పాల్గొన్నారు.
పీజీఆర్‌ఎస్‌కు 554 అర్జీలు
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు 554 అర్జీలు సమర్పించారు. వారి నుంచి కలెక్టర్ షణ్మోహన్‌తో పాటు వివిధ శాఖల అధికారులు అర్జీలు స్వీకరించారు. బియ్యం కార్డుల మంజూరు, ఇళ్ల స్థలాలు, ఆన్‌లైన్‌లో భూమి వివరాల నమోదు, పూడికల తొలగింపు, పారిశుధ్యం, వివిధ సంక్షేమ పథకాలు లబ్ధి తదితర అంశాలపై ప్రజలు విజ్ఞాపనలు సమర్పించారు. ఈ అర్జీలను గడువులోగా పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
లడ్డూలో కల్తీ లేదని తేలడంతో డైవర్షన్ పాలిటిక్స్
సామర్లకోట: తిరుమల లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో ఎటువంటి కల్తీ లేదని కోర్టుకు సీబీఐ సిట్ స్పష్టమైన నివేదిక ఇవ్వడంతో.. దీని నుంచి తప్పించుకునే క్రమంలో భాగంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని వైఎస్సార్ సీపీ అయ్యరక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆవాల లక్ష్మీనారాయణ అన్నారు. సోమవారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ, రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని ఆరోపించారు. లడ్డూలో కల్తీ ఎక్కడని ప్రశ్నిస్తున్న వైఎస్సార్ సీపీ నేతలపై దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. దీనిలో భాగంగానే మాజీ మంత్రి అంబటి రాంబాబు, బీసీ మంత్రి జోగి రమేష్ ఇళ్లపై దాడులకు తెగబడ్డారన్నారు. లడ్డూ వ్యవహారంపై కాకుండా ఈ దాడులపై ప్రజల దృష్టి మళ్లుతుందనే కుటిల రాజకీ యం దీని వెనుక ఉందని అన్నారు. టీడీపీని స్థాపించిన సొంత మామ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి, ఆయన మనోవేదనతో మరణించడానికి చంద్రబాబు కారణం కాదా అని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక ఆయనపై బురద జల్లడంలో భాగంగానే పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదంపై కూడా రాజకీయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అరాచక పాలన పెరిగిపోతోందని, వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు.
పెద్దాపురం సబ్ డివిజన్‌లో సెక్షన్ 30 అమలు
పెద్దాపురం (సామర్లకోట): స్థానిక పోలీసు సబ్ డివిజన్ పరిధిలో మార్చి రెండో తేదీ వరకూ సెక్షన్ 30 అమలు చేస్తున్నట్లు పెద్దాపురం డీఎస్పీ డి.శ్రీహరిరాజు సోమవారం విలేకర్లకు తెలిపారు. డివిజన్ పరిధిలోని పెద్దాపురం, సామర్లకోట, జగ్గంపేట, గండేపల్లి, కిర్లంపూడి, ప్రతిపాడు, ఏలేశ్వరం, అన్నవరం, రౌతులపూడి, తుని టౌన్, తుని రూరల్, తొండంగి, కోటనందూరు పోలీసు స్టేషన్ల పరిధిలో దీనిని అమలు చేస్తున్నామని వివరించారు. దీని ప్రకారం ముందస్తు అనుమతులు లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఊరేగింపుల వంటివి నిర్వహించడానికి వీలు లేదన్నారు. దీనిని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
పెద్దపులి జాడ కోసం అన్వేషణ
తొర్రేడు–వెంకటనగరం గ్రామాల మధ్యే
సంచరిస్తున్న వైనం
రాజమహేంద్రవరం రూరల్: తొర్రేడు గ్రామంలో పెద్దపులి రెండో రోజులుగా జనానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తొర్రేడు శివారులోని మొక్కజొన్న తోట ప్రాంతంలో మాటు వేసిన పెద్దపులి అక్కడ నుంచి వెంకటనగరం గ్రామంలోని మొక్కజొన్న తోటల్లో నుంచి వెళ్లినట్లు కాలిముద్రలను బట్టి అటవీశాఖ అధికారులు సోమ వారం గుర్తించారు. ఈ నేపథ్యంలో జిల్లా అటవీశాఖ అధికారి ప్రభాకరరావు నేతృత్వంలో అటవీరేంజ్ ఆఫీసర్ దావీదు రాజు, సిబ్బంది, పోలీ సులు, రెవెన్యూ అధికారులు ఉదయం నుంచి తొ ర్రేడు, వెంకటనగరం గ్రామాలలో పులిజాడ కో సం గాలింపు చర్యలు చేపట్టారు. తొర్రేడు మొక్కజొన్న తోటలో ఉన్న పెద్దపులి వెంకటనగరం గ్రామం వైపు వెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షి చెప్పడంతో అధికారులు ఆ దిశగా వెళ్లి పులి అడుగుజాడలు గుర్తించారు. అక్కడి నుంచి మొక్కజొన్న తోటలు ఉండడంతో పులి అడుగుజాడలు కనిపించలేదు. పులి వచ్చిన మార్గానే వెనక్కి వెళ్లిపోయిందా అనే కోణంలోను అధికారులు అన్వేషిస్తున్నారు.
విధుల్లో చేరిన కలెక్టర్ షణ్మోహన్
విధుల్లో చేరిన కలెక్టర్ షణ్మోహన్


