
అప్పుల భారంతో బ్యాంకు ఉద్యోగి ఆత్మహత్య
బ్యాంకు బాత్‌రూంలో ఉరి వేసుకున్న వైనం
అనంతపురం: ‘హరిత నన్ను క్షమించు. నేను బతికి మీకు ఎలాంటి లాభమూ లేదు. పిల్లల్ని, నిన్ను వదిలి వెళ్లాలంటే మనసు ఒప్పుకోవడం లేదు. నేను చేసుకున్న అప్పులే నా పాలిట శాపంగా మారాయి’ అంటూ లేఖ రాసి ఓ బ్యాంకు ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడ్డారు. అధిక వడ్డీలకు అప్పులు చేసి..వాటిని తీర్చేమార్గం కానరాక బ్యాంకు బాత్‌రూంలో ఉరేసుకుని తనువు చాలించాడు. వివరాలు..కర్నూలు నగరంలోని సీ క్యాంప్‌కు చెందిన సంకుల రవికుమార్ (40) గత 12 ఏళ్లుగా సెంట్రల్ బ్యాంకులో అటెండరుగా పనిచేస్తున్నారు.
బుధవారం ఉదయం 9.30 గంటలకు అనంతపురంలో నివాసం ఉంటున్న ఇంటి నుంచి బ్యాంకుకు వెళ్లారు. 9.45 గంటలకు భార్య హరితకు ఫోన్ చేసి మనసు బాగోలేదని చెప్పారు. 10.20 గంటలకు బ్యాంకు ఉద్యోగి పద్మజ ..అటెండర్ రవికుమార్ భార్యకు ఫోన్ చేశారు. బాత్‌రూంలోకి వెళ్లి లోపల లాక్ చేసుకున్నాడని, పిలిస్తే పలకడం లేదని, మీరు వెంటనే బ్యాంకుకు రావాలని చెప్పారు. 20 నిమిషాల్లో ఆమె అక్కడికి చేరుకుంది. కార్పెంటర్ సాయంతో బాత్‌రూం తలుపు పగులగొట్టారు. అప్పటికే బాత్‌రూం కిటికీ ఇనుప కడ్డీకి నైలాన్ తాడుతో ఉరివేసుకున్న రవికుమార్ విగత జీవిగా పడి ఉన్నాడు. అప్పులు అధికం కావడంతో మానసిక ఒత్తిడికి గురై అఘాయిత్యానికి పాల్పడినట్లు మృతుడి భార్య హరిత స్థానిక త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మృతుడికి భార్యతో పాటు కుమారుడు సూర్యతేజ, కుమార్తెలు ఎస్.దీక్షిత, ఎస్.వీక్షిత ఉన్నారు.
అప్పులే శాపంగా మారాయి..
రవికుమార్ ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ రాశాడు. అందులో ఏముందంటే... ‘హరిత క్షమించు. నేను బతికి మీకు ఎలాంటి లాభమూ లేదు. పిల్లల్ని, నిన్ను వదిలి వెళ్లాలంటే మనసు ఒప్పుకోవడం లేదు. నేను చేసుకున్న అప్పులే నా పాలిట శాపంగా మారాయి. నేను ఎలాంటి జూదాలూ ఆడలేదు. అధిక వడ్డీలు కట్టలేక..వడ్డీలకు తిరిగి అప్పు చేసి అలా ఒకదానికి ఒకటి తోడయ్యాయి. కరణ్ నన్ను క్షమించరా.. నిన్ను మోసం చేశాను. అమ్మా.. నువ్వు జాగ్రత్త.. పిల్లలు జాగ్రత్త. నా టైం ఇక్కడితో అయిపోయింది. హుస్సేన్.. నేను ఎవరినీ మోసం చేయలేదు. ఎవరినైనా అప్పు అడుగుదామనుకుంటే నా పరిస్థితి బాగోలేదు.
హుస్సేన్ నాకో హెల్ప్ చెయ్.. నా తర్వాత హరితకు బ్యాంకుకు సంబంధించి ఏదైనా సహాయం చేస్తావని నమ్ముతున్నాను. గుజ్జల రాముడు అనే వ్యక్తి దగ్గర రూ.50 వేలు అప్పు చేస్తే రూ.15 వేలు పట్టుకుని రూ.35 వేలు ఇచ్చాడు. ప్రతి నెలా రూ.15,000 వడ్డీ కడుతూనే ఉన్నాను. ఇప్పటి వరకు రూ.1,20,000 కట్టాను. ఇక నా వల్ల కాదు. హరీష్ సారీ రా..నీవు చాలా సార్లు హెల్ప్ చేశావు. నా కోసం చీటీ కూడా ఎత్తేసి డబ్బిచ్చావు. నువ్వు చాలా చాలా హెల్ప్ చేసినా.. నేను నీకోసం ఏమీ చేయలేని పరిస్థితి. కిశోర్ ఇకనైనా లోన్ కట్టుకోరా.. చాలా సార్లు హెల్ప్ చేశాను. కానీ నువ్వు చాలా మోసం చేశావు. హరిత పిల్లలు జాగ్రత్త.. శ్రావణి పిల్లలు జాగ్రత్త..వదిన చిన్నారిని నువ్వే చూసుకో’ అని పేర్కొన్నారు.