
ఏపీకే ఫైల్స్‌తో నయా సైబర్ మోసాలు
ట్రాఫిక్ చలానా యాప్‌లతో మోసం
20 రోజుల్లో 12కుపైగా కేసులు
ఒక్కొక్కరికి రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పైగా టోకరా
మోసపోయినవారిలో ఉపాధ్యాయులు, బ్యాంకు మేనేజర్ సహా ముగ్గురు ఎస్‌ఐలు
సోంపేట మండలానికి చెందిన ఓ ఉపాధ్యాయుడికి వారం రోజుల కిందట ఆర్‌టీఓ ట్రాఫిక్ చలాన్. ఏపీకే అనే లింకు వాట్సాప్ ద్వారా వచ్చింది. దీంతో క్లిక్ చేసి అన్ని లాంఛనాలు పూర్తి చేసి లాగిన్ అయ్యారు. లాగిన్ అయ్యాక ఓటీపీ అడగడం, ఓటీపీ ఎంటర్ చేసిన కొన్ని నిమిషాల్లోనే తన ఫోన్ సిమ్ పనిచేయకపోవడం.. కొన్ని గంటల్లోనే తన బ్యాంకు ఖాతాలోని సొమ్ము మాయమవ్వడం చకచకా జరిగిపోయాయి. దాదాపు రూ.7లక్షలు పోయినట్లు తేలడంతో పోలీసులను ఆశ్రయించారు.
కాశీబుగ్గకు చెందిన ఓ బ్యాంకు మేనేజర్ టెలిగ్రామ్ యాప్‌లో వచ్చిన ఇదే లింకుపై క్లిక్ చేశాడు. అంతే పై మాదిరిగానే సైబర్ కేటుగాళ్లు రూ.10 లక్షలకు పైగా తన వివిధ బ్యాంకు ఖాతాల నుంచి సొమ్మును లాగేసుకున్నారు.
శ్రీకాకుళం క్రైమ్ : ఆర్‌టీఓ ట్రాఫిక్ చలాన్.ఏపీకే.. శ్రీకాకుళం జిల్లాను దాదాపు నెల రోజులుగా వణికిస్తున్న లింకు ఇది. బండిపై ఎంత చలానా ఉందో తెలుసుకోవాలనే ఉత్సాహంతో ఈ యాప్‌లను డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేశారో.. ఇక అంతే.. ఖాతా ఖాళీ అయిపోతుంది. ఇప్పటికే గత 20 రోజుల్లో దాదాపు 12 కేసులు దీనిపైనే నమోదయ్యాయి. పైగా దీని బాధితులంతా ఉన్నత ఉద్యోగాలు చేస్తున్న వారే కావడం గమనార్హం.
మోసపోతున్నారిలా..
» ముందుగా ‘ఆర్‌టీఓ టిఆర్‌ఏఎఫ్‌ఎఫ్‌ఐసి సిహెచ్‌ఏఎల్‌ఎల్‌ఏఎన్.ఎపికె’ ఫైల్ మెసేజ్ లింక్ రూపంలో వస్తుంది.
» మనం క్లిక్ చేసిన వెంటనే లాగిన్ అని వస్తుంది. అయ్యాక వెంటనే ఓటీపీ అడుగుతుంది.
» ఓటీపీ ఎంటర్ చేశామా ఇక అంతే సంగతులు.. సైబర్ నేరగాళ్ల మెసేజ్ ఇన్‌బాక్స్‌లో మన ఫోన్ నంబర్ చేరుతుంది.
» వెంటనే మన ఫోన్ నంబర్ ఉన్న సిమ్‌ను అదే నంబర్‌తో ఎలక్ట్రానిక్ సిమ్‌గా మార్చుతారు.
» మన ఫోన్‌పై ఉన్న స్క్రీన్ వారి ఆ«దీనంలోకి వెళ్లిపోతుంది.
» మన ఫోన్ పనిచేయక తికమక పడుతున్న ఆ క్షణాల్లోనే సిమ్ అప్‌డేట్ అవ్వాలంటే మన మెయిల్ అడ్రస్ యాడ్ చేయాలని అందులో వస్తుంది.
» మనం మెయిల్ అడ్రస్ యాడ్ చేసిన వెంటనే సిమ్ ఛేంజెస్ ఎస్ ఆర్ నో అని వస్తుంది. ఎస్ అని క్లిక్ చేసిన వెంటనే ఐదు, పదినిమిషాల్లో ఓ క్యూఆర్‌కోడ్ రావడం.. మన ఫోన్ నంబర్‌తో ఉన్న సిమ్‌కార్డు సైబర్ నేరస్తుడి మొబైల్ నుంచి యాక్టివేట్ అయిపోవడం జరుగుతుంది.
» వెంటనే సైబర్ నేరగాడు ఎమ్.ఆధార్ యాప్ డౌన్‌లోడ్ చేసి మన ఫోన్ నంబరే కావడంతో వచ్చే ఓటీపీలను ఎంటర్ చేసి బయోయెట్రిక్ లాక్ చేసేస్తాడు. దాంతో మనం సిమ్ కొనాలని షాపులకు వెళ్లినా.. ఆధార్ అవసరంతో బ్యాంకు, రిజి్రస్టేషన్, ఇతర ఏ పనుల్లో మనం బయెమెట్రిక్‌కు థంబ్ వేయాలని అనుకున్నా అది లాక్ చేయడంతో కుదరదు. ఇక మనకు సిమ్ దొరకదు.
» ఈ లోగా సైబర్ నేరగాడు మన ఆధార్ నంబర్, ఫోన్ నంబర్‌తో ఇంటర్నెట్ త్రూ డెబిట్ కార్డ్ లోన్స్, లోన్ యాప్స్, పేయింగ్ యాప్స్ (ఫ్లిప్‌కా ర్ట్, అమెజాన్, మీషో, పేటీఎం, గూగుల్‌పే, ఫోన్‌పే) తదితర మార్గాల్లో వస్తువులు కొనేయ డం,డబ్బులు మాయంచేసి మన బ్యాంకు ఖాతా లను కొల్లగొట్టేయడమే కాక రూ.లక్షల్లో లోన్లు వాడేసి మనకు రుణ భారాన్ని మిగుల్చుతారు.
» ఇదే తరహాలో సోంపేట ఉపాధ్యాయునికి జరగడం, చాలా రోజుల వరకు తన నంబర్ ఉన్న సిమ్ రాకపోవడంతో తన వేలి ముద్రలు పనిచేయడం లేదని పాత (మాన్యువల్) పద్ధతిలోనే సిమ్‌ను పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో ఇటువంటి మోసాలు అత్యధికంగా కాశీబుగ్గ, సోంపేట, ఇచ్ఛాపురంలోనే జరిగాయని, చేసే సైబర్ నేరగాళ్లు జార్ఖండ్ వాసులుగా పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది.
పోలీసులకే బురిడీ
సైబర్ మోసాల విషయంలో ప్రజలకు అవగాహన కల్పించాల్సిన పోలీసుల్ని సైతం ఇదే తరహా లింక్‌తో సైబర్‌కేటుగాళ్లు మోసం చేశారు. జిల్లాలోని వివిధ సర్కిళ్లలో పనిచేస్తున్న ముగ్గురు ఎస్‌ఐలకు ఈ అనుభవం ఎదురైంది. జేబులు కూడా ఖాళీ అయినట్లు పోలీసు వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. ఈ అంశాన్ని పోలీస్ శాఖ సీరియస్‌గానే తీసుకుంది.
ఎం.పరివాహన్ యాప్‌లోనే కట్టాలి..
వాహన దారులు సామాజిక మాధ్యమాల్లో ఇలా వచ్చే ఏపీకే ఫైల్స్ లింక్‌లను ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయకూడదు. జిల్లా పోలీసు కార్యాలయం ఆదీనంలో ఉండే ఈ–చలానా యాప్ అనేది ట్రాఫిక్ పోలీసులకు, ఆ పరిధి పోలీస్‌స్టేషన్‌లో ఉండే పోలీసుల మొబైళ్లకు అనుసంధానంగా ఉంటుంది. ప్లేస్టోర్‌లో దొరకదు. సాధారణ ప్రజల వద్ద ఉండదు. దాని ద్వారా పోలీసులు ఫైన్‌లు వేశాక మీసేవలో గాని సొంత మొబైల్ ఫోన్‌లో గాని ఎం.పరివాహన్ యాప్ ద్వారానే కట్టాలి. ఎం.పరివాహన్ యాప్ అనేది ప్లేస్టోర్‌లో ఉంటుంది. – నాగరాజు, సీఐ, శ్రీకాకుళం ట్రాఫిక్