breaking news
-
బాత్రూమ్ సింక్‌లో మత్తు ఇంజక్షన్లు.. మిస్టరీగా యువతి మృతి!
సాక్షి,విశాఖపట్నం: అనకాపల్లి జిల్లా అచ్యుతపురంలో దారుణం చోటు చేసుకుంది. లాడ్జిలో మహాలక్ష్మి అనే యువతి అనుమానాస్పద మృతి చెందడంతో స్థానికంగా కలకలం రేపుతోంది. మహాలక్ష్మి శరీరంపై పలు చోట్ల కత్తిపోట్లు ఉండడం, ఘటనా స్థలంలో దొరికిన ఆధారాల బట్టి ఈ మృతి పలు అనుమానాలకు తావు తీస్తోంది. వివరాల ప్రకారం.. శ్రీనివాస్‌కుమార్ అచ్యుతాపురంలోని ఓ లాడ్జిలో రూం తీసుకుని అక్కడికి మహాలక్ష్మిని రప్పించారు. ఈ క్రమంలో ఇద్దరూ కత్తితో కోసుకున్న గాయాలతో కనిపించేసరికి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని అనుకున్న లాడ్జి సిబ్బంది అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. యువతి అక్కడికక్కడే మృతి చెందగా.. యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం యువతి మృతదేహాన్ని కేజీహెచ్ కు తరలించారు. అయితే, పథకం ప్రకారమే మహాలక్ష్మిని శ్రీనివాస్ హత్య చేశాడని, కేసు నుంచి తప్పించుకోవడానికే ఈ డ్రామా ఆడాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. దీంతో యువతి మృతి మిస్టరీగా మారింది. పోలీసులు ఈ కేసును హత్య అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వీరిద్దరూ ఇంటర్ నుంచి ప్రేమించుకుని కొద్ది నెలల క్రితం వరకు రిజిస్ట్రార్ కార్యాలయంలో పెళ్లి చేసుకున్నారు. అయితే కొన్ని కారణాలతో వీరువురూ దూరంగా ఉంటున్నారు. శ్రీనివాస్ మహాలక్ష్మితో మాట్లాడాలని చెప్పి లాడ్జికి రప్పించాడు. ఆ తర్వాత వారి మధ్య ఏం జరిగిందో గానీ యువతి మృతి చెందగా.. శ్రీనివాస్ కత్తి గాయలతో ఉన్నాడు. పోలీసులు జరిపిన తనిఖీలో లాడ్జి గదిలోని బాత్రూం సింక్‌లో మత్తు ఇంజక్షన్లు ఉండగా.. వాటిని స్వాధీనం చేసుకున్నారు. చదవండి: కర్నూలులో దారుణం.. ఇంట్లో అట్టపెట్టెలతో భర్త మృతదేహాన్ని తగలబెట్టింది! -
కోడి దొంగతనంపై గొడవ..హత్యాయత్నం.. అత్యాచారం కేసులో 10 ఏళ్ల జైలు
అమలాపురం టౌన్: భార్యాభర్తలపై హత్యాయత్నం చేయడమే కాకుండా భార్యపై అత్యాచారం చేసిన నేరం రుజువు కావడంతో పి.గన్నవరం మండలం ఊడిమూడి శివారు చింతావారిపేటకు చెందిన పచ్చిమాల శ్రీనివాసరావుకు రాజమహేంద్రవరంలోని జిల్లా 8వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి పీఆర్ రాజీవ్ పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ సోమవారం తీర్పు చెప్పారు. ముద్దాయికి రూ.5 వేల జరిమానా కూడా విధించారు. అమలాపురం జిల్లా ఎస్పీ కార్యాలయం ఈ కేసుకు సంబంధించిన వివరాలను సోమవారం రాత్రి ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సంవత్సరం జనవరి నెలలో ఊడిమూడి శివారు చింతావారిపేటలో తమ సొంత ఇంట్లో భార్యాభర్తలు నివసిస్తున్నారు. అదే ఇంట్లో ఓ పోర్షన్లో ఉంటున్న పచ్చిమాల శ్రీనివాసరావు హత్యాయత్నం, అత్యాచారం కేసుల్లో నిందితుడు. కోడి దొంగతనంపై జరిగిన విషయమై ఆరా తీసిన భర్తపై కోపంతో పచ్చిమాల శ్రీనివాసరావు ఈ అఘాయిత్యాలకు పాల్పడ్డాడు. తొలుత భర్త తలపై సన్నికల్లు పొత్రంతో కొట్టి తీవ్రంగా గాయపరిచి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా భార్యను కూడా తీవ్రంగా కొట్టి గాయపరిచాడు. ఇదే సందర్భంగా ఆమైపె అత్యాచారం కూడా చేశాడన్నది ముద్దాయి శ్రీనివాసరావుపై అభియోగం. అప్పట్లో ఈ కేసులకు సంబంధించి శ్రీనివాసరావుపై పి.గన్నవరం పోలీసు స్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. అప్పటి డీఎస్పీ వై.మాధవరెడ్డి సమగ్ర దర్యాప్తు చేసి బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా చార్జి షీటు నమోదు చేశారు. కోర్టులో సోమవారం జరిగిన తుది విచారణలో ముద్దాయి శ్రీనివాసరావుపై మోపిన నేరాలు రుజువు కావడంతో న్యాయమూర్తి రాజీవ్ పై విధంగా తీర్పు చెప్పారు. ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ మారిశెట్టి వెంకటేశ్వరరావు ప్రాసిక్యూషన్ తరఫున వాదనలు వినిపించారు. ప్రత్యేక పర్యవేక్షణ వల్ల ఘటన జరిగిన నాలుగు నెలల్లోనే ముద్దాయికి శిక్షలు పడ్డాయని ఎస్పీ సుసరాపు శ్రీధర్ తెలిపారు. -
బడుగు జీవితాలపై మృత్యువు పంజా .. మృతులందరూ వరుసకు బావ బావ మరుదులు
యర్రగొండపాలెం(ప్రకాశం): బడుగు జీవితాలపై మృత్యువు పంజా విసిరింది. చేతి వృత్తుల్లో కాయకష్టం చేసుకొని ఏ పూటకు ఆ పూట కుటుంబాలను నెట్టుకొస్తున్న ఐదుగురిని రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు కబళించింది. తాము పడిన కష్టానికి ఫలితాన్ని తీసుకొస్తామని ఇంట్లో చెప్పి సుదూర ప్రాంతానికి వెళ్లిన ఆ యువకులు విగతజీవులుగా మారిన ఘటన వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. తెల్లవారు జామునే ఇంటికి వస్తామని చెప్పిన వారి జీవితాలు తెల్లారిపోయాయి. మేదర పనులు చేసుకొని జీవించే ఐదుగురు యువకులు మృతి చెందడం విజయవాడలోని ప్రకాష్‌నగర్ కన్నీటి పర్యంతమైంది. మృతులందరూ వరుసకు బావ బావ మరుదులు. వారు కొబ్బరి ఆకులతో డెకరేషన్ మెటీరియల్ సప్లయ్ చేస్తుంటారు. ఈ క్రమంలో డెకరేషన్ మెటీరియల్‌కు సంబంధించి తమకు రావాల్సిన డబ్బుల కోసం విజయవాడకు చెందిన తంబి రాజు, పిల్లి చంద్రశేఖర్, పిల్లి శ్రీను, గ్రంధి వెంకటసాయి, కొయన రాజు, భవాని శంకర్ ఈ నెల 27వ తేదీన కారులో అనంతపురం వెళ్లారు. మరుసటి రోజు ఆదివారం మధ్యాహ్నం కారులో విజయవాడకు తిరుగు పయనమయ్యారు. రాత్రి 10.30 గంటల సమయంలో త్రిపురాంతకం ఊరి వెలుపల ఉన్న జాతీయ రహదారిపై ఉన్న ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై నుంచి దిగుతున్న సమయంలో ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొంది. వాస్తవంగా హిందూపురం వెళ్లే ఈ బస్సు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌కు వచ్చి అక్కడి నుంచి నేరుగా వెళ్లాల్సి ఉంది. అయితే త్రిపురాంతకానికి సంబంధించిన ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో గమ్యానికి తొందరగా చేరుకోవటానికి డ్రైవర్ ఆ బస్సును ఫ్లై ఓవర్ బ్రిడ్జిపైకి మళ్లించాడు. అనుకోకుండా ఎదురైన ఈ బస్సును కారు ఢీకొని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో తంబి రాజు, పిల్లి చంద్రశేఖర్, పిల్లి శ్రీను, గ్రంధి వెంకటసాయి, కొయన రాజు మృతి చెందగా, భవానీశంకర్ ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు. రాత్రి 9 గంటల సమయంలో తన అన్న వెంకటసాయి ఫోన్‌చేసి తెల్లారేలోపు ఇంటికి చేరుతామని చెప్పాడని, గంటన్నర తరువాత వారు ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైందని తెలిసిందని దుర్గారావు ఆవేదన వ్యక్తం చేశాడు. శివనాగేంద్ర, సింహాచలం కూడా ఆ కారులో ప్రయాణం చేయాల్సి ఉంది. అయితే వేరే పనుల నిమిత్తం వారు అనంతపురం వెళ్లలేదు. దీంతో వారు ప్రమాదం బారినపడలేదు. వీధిన పడిన చిన్న కుటుంబాలు తంబి రాజు, పిల్లి చంద్రశేఖర్, పిల్లి శ్రీను, గ్రంధి వెంకటసాయి, కొయన రాజు మృతితో వారి కుటుంబాలు వీధినపడ్డాయి. తంబి రాజు చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. అన్నతోపాటు కాయకష్టం చేసుకొని జీవనం సాగిస్తు న్నాడు. అతనికి భార్య మంగ ఉంది. రాజు మృతితో మంగ కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. పల్లి చంద్రశేఖర్‌కు వివాహం కాలేదు. అయితే వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు జానకిరాం, శారద అతనిపై ఆధారపడి జీవిస్తున్నారు. చేతికి అందొచ్చిన కుమారుడు ఇకలేడని తెలుసుకున్న జానకిరాం, శారద తల్లడిల్లిపోతున్నారు. పిల్లి శ్రీనుకు భార్య సత్య, ఎనిమిదేళ్ల కుమార్తె, ఆరేళ్ల కుమారుడు ఉన్నారు. అతని తల్లిదండ్రులు మహేష్, లక్ష్మిలు సైతం వైర్ కుర్చీలు అల్లుకుంటూ వచ్చిన అరకొర డబ్బులతో కుమారుడి సంపాదనను తోడు చేసుకొని కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. శ్రీను మృతితో కుటుంబ సభ్యులు భోరు మంటున్నారు. గ్రంధి వెంకటసాయికి భార్య విజయ, తల్లిదండ్రులు మహాలక్ష్మి, దాలయ్య ఉన్నారు. అల్లకం పనులు చేసుకుంటూ అతని కుటుంబం జీవనం సాగిస్తోంది. విజయవాడలోని ఆస్పత్రిలో మృతి చెందిన కొయన రాజుకు భార్య, రెండేళ్ల కుమారుడు ఉన్నారు. తన భర్త ఇక రాడని తెలిసిన మృతుడి భార్య కన్నీటి పర్యంతమైంది. అతని రెండేళ్ల కుమారుడు కూడా నాన్న.. నాన్న అంటూ గుక్కపెట్టి ఏడుస్తున్నాడు. వినుకొండ ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్న ఆరి భవానీ శంకర్‌కు వివాహం కాలేదు. -
కర్నూలులో దారుణం.. ఇంట్లో అట్టపెట్టెలతో భర్త మృతదేహాన్ని తగలబెట్టింది!
సాక్షి, పత్తికొండ రూరల్ (కర్నూలు): అనారోగ్యంతో చనిపోయిన భర్తకు ఇంట్లోనే దహన సంస్కారాలు చేసిన ఉదంతమిది. ఈ హృదయ విదారక ఘటన కర్నూలు జిల్లా పత్తికొండలో సోమవారం చోటుచేసుకుంది. సీఐ మురళీమోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. పత్తికొండలోని తేరు బజారులో మెడికల్ షాపు నిర్వహిస్తున్న హరికృష్ణప్రసాద్ (63)కు భార్య లలితమ్మతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. కన్నబిడ్డలకు ఎలాంటి లోటులేకుండా పెంచిపెద్ద చేసి ఉన్నత చదువులు చదివించారు. ఇద్దరికీ పెళ్లిళ్లు కూడా చేశారు. పెద్ద కుమారుడు దినేష్ ఎంబీబీఎస్ పూర్తి చేసి కర్నూలులోని ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తూ అక్కడే భార్యతో కాపురం ఉంటున్నారు. రెండో కుమారుడు ముఖేష్ కెనడాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. పదేళ్ల కిందట హరికృష్ణ ప్రసాద్‌కు పార్కిన్సస్ ప్లస్ వ్యాధి సోకింది. మరికొన్ని రోజులకు పక్షవాతంతో కాళ్లు చేతులు చచ్చుబడిపోయి మంచానికే పరిమితమయ్యాడు. కాలకృత్యాలు కూడా తీర్చుకోలేని దయనీయ స్థితిలో ఉన్న అతనికి భార్య లలితమ్మ సపర్యలు చేస్తూ వచ్చింది. ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో మూడేళ్ల నుంచి కర్నూలులో కుమారుడు దినేష్ వద్దే దంపతులిద్దరూ ఉన్నారు. రెండు వారాల క్రితం ఇద్దరూ పత్తికొండకు చేరుకున్నారు. కాగితాలు.. చీరలు వేసి నిప్పు కాగా, సోమవారం వేకువజామున భర్త హరికృష్ణప్రసాద్‌కు భార్య లలితమ్మ కాలకృత్యాలు తీర్చింది. ఆ తరువాత కొద్దిసేపటికి విగతజీవిగా పడి ఉన్న భర్తను చూసి గుండె పగిలేలా రోదించింది. ఆ తరువాత తేరుకుని టెంకాయ కొట్టి.. మృతదేహంపై ఇంట్లోని పుస్తకాలు చింపి కాగితాలు, చీరలు వేసి నిప్పు పెట్టింది. ఆ తరువాత పెద్దకుమారుడు దినేష్‌కు వీడియో కాల్ చేసి విషయం చెప్పింది. ఆ ఇంట్లోంచి పొగలు రావడంతో పోలీసులకు సమాచారం అందజేశారు. సీఐ మురళీమోహన్ సిబ్బందితో కలిసి ఘటనాస్థలానికి చేరుకోగా.. అప్పటికే మృతదేహం పూర్తిగా కాలిపోయింది. లలితమ్మ మానసిక పరిస్థితి సరిగా లేదని సీఐ తెలిపారు. ఇంట్లోనే మృతదేహం కాల్చిన ఘటన దావానలంలా వ్యాపించింది. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల కాలనీవాసులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. కంటికిరెప్పలా కాపాడుకుంటూ ఇన్నేళ్లు సపర్యలు చేసిన ఆమె భర్త మృతదేహాన్ని ఇంట్లోనే కాలి్చవేసిందంటే నమ్మలేకపోయారు. లలితమ్మ నిత్యం దైవారాధనలో ఎక్కువగా గడిపేదని కాలనీవాసులు తెలిపారు. నోట మాట రాలేదు అమ్మ ఉదయం 9.30 గంటలకు ఫోన్ చేసింది. ‘నాన్న చనిపోయాడు. ఇంట్లోనే దహన సంస్కారాలన్నీ పూర్తి చేశాను. మీరేం రాకండి’ అని చెప్పింది. ఆ మాట విని షాక్‌కు గురయ్యాను. వెంటనే పోలీసులకు సమాచారం అందజేసి పత్తికొండ చేరుకున్నాను. ఇంట్లోకి వెళ్లగా కాలిన నాన్న మృతదేహం చూసి నా నోట మాట రాలేదు. అమ్మ పూర్తిగా డిప్రెషన్‌కు గురైంది. అమ్మ దగ్గరకు వెళ్లి ఓదార్చాను. కెనడాలో ఉన్న తమ్ముడు ముఖేష్‌కు ఫోన్ చేశాను. వెంటనే బయల్దేరి వస్తున్నానని చెప్పాడు. – దినేష్, పెద్ద కుమారుడు చదవండి: Delhi: గాళ్‌ఫ్రెండ్‌తో గొడవ.. అందరూ చూస్తుండగానే..! -
ప్రకాశం: హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం..
సాక్త్క్షి, త్రిపురాంతకం: జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్న ఘటనలో నలుగురు మృతిచెందగా.. మరో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం సమీపంలోని హైవేపై ఆదివారం రాత్రి 10.15 సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విజయవాడ నుంచి హిందూపురం వెళ్తున్న ఆర్టీ బస్సు వినుకొండ వైపు వెళ్తున్న కారు ఎదురెదురుగా బలంగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న విజయవాడకు చెందిన సాయి(26), పిల్లి శ్రీనివాస్(23), చంద్రశేఖర్ (25) అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న స్థానికులు, పోలీసులు క్షతగాత్రులను హైవే అంబులెన్స్, 108లో వినుకొండకు తరలించారు. మార్గంమధ్యలో శకంర్ (24) మృతిచెందాడు. అనంతపురంలో ఒక పెళ్లి మండపం డెకరేషన్ కోసం వెళ్లి విజయవాడ వస్తుండగా ఈ ఘటన జరిగినట్టు ఎస్సై జీవీ సైదులు తెలిపారు. ఇది కూడా చదవండి: కోటిపల్లి రైల్వేలైన్‌కు కదలిక -
AP: జాబ్ పేరుతో నిరుద్యోగులకు టోకరా.. వీఆర్వో రేఖ అరెస్ట్
సాక్షి, విజయవాడ: నిరుద్యోగులను టార్గెట్ చేసి ఉద్యోగాల పేరుతో మోసం చేసిన మహిళా వీఆర్వోను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన విజయవాడ పరిధిలో చోటుచేసుకుంది. నిరుద్యోగులకు ఔట్ సోర్సింగ్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామని సదరు మహిళ డబ్బులు వసూలు చేసింది. వివరాల ప్రకారం.. వీఆర్వో రేఖ కొంత మందితో కలిసి నిరుద్యోగులకు టోకరా వేసింది. ఔట్ సోర్సింగ్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసాలకు పాల్పడింది. ఈ క్రమంలో నిరుద్యోగుల నుంచి రూ.3లక్షల నుంచి రూ.8లక్షల చొప్పున వసూలు చేసింది. దీంతో, ఉద్యోగాల విషయమై ఆమెను ప్రశ్నించడంతో ముఖం చాటేసింది. ఈ నేపథ్యంలో తాము మోసపోయామని గ్రహించిన బాధితులు.. సూర్యారావుపేట పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇక, బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: పెళ్లింట తీవ్ర విషాదం.. వరుడు సహా అక్కాచెల్లి మంటల్లో సజీవ దహనం -
మళ్లీ ఆడపిల్ల పుట్టిందని.. అమ్మేశారు !
పశ్చిమ గోదావరి: మూడో కాన్పులో కూడా ఆడపిల్లే పుట్టడంతో ఏం చేయాలో తెలియక ఆడ శిశువును వేరొకరికి మధ్యవర్తి ద్వారా విక్రయించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.. ఏలూరు జిల్లా నూజివీడు మండలం ఓగిరాల తండాకు చెందిన వడిత్యా మూర్తి, వసుంధర దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. మూర్తి ప్రైవేటు ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. గతేడాది నవంబరులో వసుంధరకు మూడో కాన్పులో కూడా స్థానిక ఏరియా ఆసుపత్రిలో ఆడపిల్ల జన్మించింది. మూడు రోజుల అనంతరం మధ్యవర్తి ద్వారా తణుకు సమీపంలోని దువ్వకు చెందిన పిల్లలు లేని దంపతులకు ఆడపిల్లను తండ్రి మూర్తి ఇచ్చేశాడు. ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి తన కుమార్తె కోసం తల్లి వసుంధర మనోవ్యధకు గురై భర్తను మన కూతురును తీసుకురమ్మంటూ రోజూ అడుగుతోంది. ఈ క్రమంలో ఈ విషయం ఆనోటా ఈనోటా పడి చైల్డ్‌లైన్ వారి దృష్టికి చేరింది. దీంతో వారు ఐసీడీఎస్ అధికారులకు ఈ నెల 17న సమాచారమిచ్చి విచారించమని చెప్పగా, నూజివీడు సీడీపీఓ ఎస్‌వై నూరాణి విచారించి నివేదికను చైల్డ్‌లైన్ నిర్వాహకులకు ఈ నెల 18న పంపారు. ఈ విషయంపై అదేరోజు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చైల్డ్‌లైన్ వారు ఏలూరులోని చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి తెలపగా, వారు శిశువుకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను, పెంచుకుంటున్న తల్లిదండ్రులను పిలిపించి విచారించారు. అనంతరం శిశువును నాలుగు రోజుల క్రితమే స్వాధీనం చేసుకొని శిశుగృహంలో ఉంచారు. పూర్తిస్థాయిలో విచారించిన తరువాత శిశువును ఎవరికి ఇవ్వాలి, లేదా ప్రభుత్వ సంరక్షణలో ఉంచాలా అనే విషయాన్ని నిర్ణయించనున్నారు. ఇటు పోలీసుల విచారణలో గాని, అటు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ నిర్వహించిన విచారణలో గాని తాము బిడ్డను విక్రయించలేదని, పిల్లలు లేరని పెంచుకుంటామంటే ఇచ్చామని చెబుతున్నారు. అమ్మినవారిపైన, కొన్నవారిపైన చర్యలు తీసుకుంటాం శిశువులను అమ్మడం, కొనడం చట్టప్రకారం నేరం. ఈ కేసును సమగ్రంగా విచారిస్తున్నాం. విచారణలో తేలిన అంశాలను బట్టి అమ్మినవారిపైన, కొన్నవారిపైన చర్యలు తీసుకుంటాం. – ఈడే అశోక్‌కుమార్ గౌడ్, డీఎస్పీ, నూజివీడు -
దారుణం: ఒక ఇంట్లో రెండేళ్లపాప నాన్నను ఇంకెపుడు చూడలేదు.. మరో ఇంట్లో
సాక్షి, మందస/పర్లాకిమిడి (శ్రీకాకుళం): ఒక ఇంటిలో తండ్రి కోసం ఎదురుచూస్తు న్న రెండేళ్ల పసిపాప ఇంకెప్పుడూ నాన్నను చూడ లేదు. అమ్మ కడుపులో పెరుగుతున్న బిడ్డకు నాన్న చేయి పట్టుకునే భాగ్యం ఇక లేదు. మరో ఇంటిలో కుటుంబానికి దిక్కుగా ఉండాల్సిన యువకుడు ఊపిరి వదిలేశాడు. ఇంకో ఇంటిలో పెళ్లి నవ్వుల బదులు ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. ఒక్క ప్రమాదం.. ఇన్ని కుటుంబాల్లో విషాదానికి కారణమైంది. ఒడిశాలోని గారబంద పెట్రోల్ బంక్ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుకల హరీష్ (32), బొడ్డపాటి తులసీదాసు(25)లు మృతి చెంద గా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒకరికి 17వ తేదీన పెళ్లి నిశ్చయమైంది. వివరాల్లోకి వెళితే.. మందస మండలంలో ని మూలిపాడు గ్రామానికి చెందిన పి.శివకుమార్ ఆర్మీ లో పని చేస్తున్నారు. ఆయనకు ఒడిశాలోని బీఎస్ పు రం గ్రామానికి చెందిన యువతితో ఈ నెల 17న వివాహం నిశ్చయమైంది. ఈ నేపథ్యంలో శివకు మార్ వధువు ఇంటికి వెళ్లడానికి తన స్నేహితుడు, అదే గ్రామానికి చెందిన వలంటీర్ హరీష్‌తో బైక్‌పై బయల్దేరాడు. ఒడిశాలోని గారబంద పెట్రోల్ బంక్ వద్ద ఎదురుగా వస్తున్న మరో బైక్ వీరి బండిని బలంగా ఢీకొట్టింది. ఘటనలో హరీష్ అక్కడికక్కడే మృతి చెందారు. శివకుమార్‌కు తీవ్ర గాయా లయ్యాయి. వీరి బండిని ఢీకొట్టిన బైక్‌పై ఉన్న బొడ్డపాటి తులసీదాసు కూడా ప్రమాద స్థలంలోనే ఊపిరి వదిలేశాడు. ఆయన వెనుక ఉన్న గోకర్ణపు రం గ్రామానికి చెందిన మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి గారబంద పోలీసులకు సమాచారం అందించారు.చదవండి: (నాగసులోచనా నన్ను క్షమించు..!.. నేను బాధపడుతూ నిన్ను మరింత..) క్షతగాత్రులను పర్లాఖిముండి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గోకర్ణపురం గ్రామానికి చెందిన వ్యక్తిని అక్కడి నుంచి శ్రీకాకుళంలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. శివకుమార్ పరిస్థితి విషమంగా ఉండడంతో బరంపురం మెడికల్ కాలేజీకి తరలించారు. మూలిపాడు సర్పంచ్ గుసిరి వెంకటరావు, మృతుడు హరీష్ సోదరుడు తెలుకల డొంబురు, తెలుకల సురేష్‌తో పాటు పలువురు సమాచారం తెలిసిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. హరీష్‌కు దీవెన అనే రెండేళ్ల కుమార్తె ఉండగా, ఆయన భార్య బబిత ప్రస్తుతం ఏడునెలల గర్భిణి. ఈ సంఘటనతో మూలిపాడు గ్రామంలో విషా దం చోటు చేసుకుంది. -
సైకిల్‌ను తప్పించబోయి..
సాక్షి, శ్రీకాకుళం : మండలంలోని సందూరు గ్రామం వద్ద ఎదురుగా వస్తున్న సైకిల్‌ను తప్పించబోయి ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న గిరిజన యువకుడు మరణించిన సంఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం..మండలంలోని కొండలోగాం పంచాయతీ, బంసుగాం గ్రామానికి చెందిన సవర రాజేష్(24) అదే గ్రామానికి చెందిన తన స్నేహితులు రామారావు, చిన్నలతో కలిసి పలాస మండలంలోని గొప్పిలి గ్రామానికి వెళ్లి ఆదివారం రాత్రి తిరిగి వస్తున్నారు.వీరు మందస మండలంలోని సందూరు వద్దకు చేరుకోగా ఎదురుగా వస్తున్న సైకిల్‌ను తప్పించబోయి బైక్ అదుపు తప్పడంతో రోడ్డుపై పడిపోయారు. ఈ ప్రమాదంలో రాజేష్‌కు తీవ్ర గాయాలవ్వగా, మిగతా ఇద్దరికీ స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన ముగ్గురునీ పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాజేష్ మరణించాడు. దీంతో ఒక్కగానొక్క కుమారుడు మరణిండంతో రాజేష్ తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృత దేహాన్ని బంసుగాం తీసుకొచ్చి సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు. మందస ఎస్ఐ చిట్టిపోలు ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అయేషా మీరా కేసులో కీలక మలుపు
హైదరాబాద్: సంచలనం సృష్టించిన నర్సింగ్ విద్యార్థిని అయేషా మీరా(19) హత్య కేసు కీలక మలుపు తిరిగింది. అయేషా కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. కేసును మొదటి నుంచి విచారణ చేయాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. 2007 డిసెంబర్ 26న విజయవాడ నగరం ఇబ్రహీంపట్నంలోని దుర్గ హాస్టల్లో అయేషా మీరాపై అత్యాచారం జరిపి ఆపై హత్య చేశారు. ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో అయేషా మీరా తల్లితో పాటు ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు పిటిషన్లు దాఖలు చేశాయి.సిట్ ఇన్వెస్టిగేషన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ హైకోర్టు ధర్మాసనం కేసును సీబీఐకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేసులో శిక్ష అనుభవించిన సత్యంబాబును 2017లో హైకోర్టు నిర్దోషిగా ప్రకటించిన సంగతి తెల్సిందే. అయేషా మీరా కేసుకు సంబంధించిన రికార్డులు ధ్వంసం చేసిన విజయవాడ కోర్టు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిపై కూడా కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కొత్తగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేయాలని సీబీఐకి హైకోర్టులు ఆదేశాలు జారీ చేసింది. -
జగన్నాథపురంలో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, పోడూరు: పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం జగన్నాథపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ఆటోను టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డవారిని 108 వాహనాల్లో పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదసమయంలో మొత్తం ఆరుగురు ప్రయాణికులు ఉన్నారు. మార్టేరు నుంచి పాలకొల్లు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పండిత విల్లూరుకు చెందిన ఆటోడ్రైవర్ డి. వెంకటేశ్వరరావు(40), కృష్ణా జిల్లా మూలలంకకు చెందిన ఈతకోట నాగరాజు మృతిచెందినట్టుగా గుర్తించారు. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసి మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
కాటేసిన ‘కునుకు’
తెల్లవారుజామున చల్లగాలి వీస్తుండడంతో బస్సు డ్రైవర్ కునుకు తీశాడు. అంతే బస్సు ఒక్కసారిగా పక్కకు దూసు కెళ్లి బోల్తా పడింది. డ్రైవర్, మరో ప్రయాణికుడు మృతిచెందారు. ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. బస్సు మరోసారి తిరిగి ఉంటే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. దేవుడే రక్షించాడని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.సాక్షి, తిరుపతి: తిరుపతి –చంద్రగిరి 150 అడుగుల బైపాస్ రోడ్డులో ఆదివారం తెల్లవారుజామున తమిళనాడుకు చెందిన బస్సు బోల్తా పడింది. దీంతో ఇద్దరు మృతిచెందారు. ఎమ్మార్‌పల్లి సీఐ విజయకుమార్ కథనం మేరకు.. తమిళనాడు ఆర్టీసీ బస్సు 28 మంది ప్రయాణికులతో ఆదివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో వేలూరు నుంచి తిరుపతికి బయలుదేరింది. 5.30 గంటల ప్రాంతంలో తిరుపతి రూరల్ పరిధిలోని పాతకాల్వ వద్దకు చేరుకుంది. ఆ సమయంలో డ్రైవర్ నిద్రమత్తులో కునుకుతీయడంతో బస్సు పిట్టగోడ పక్క నుంచి పక్కనే ఉన్న ముళ్లపొదల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ వెంకటాచలపతి (48), ప్రయాణికుడు పెరుమాల్ సుందరరాజన్ (29) బస్సు కింద పడి మృతి చెందారు. సుందరరాజన్ తల్లి పెరుమాల్ సరోజ, కండక్టర్‌కు చిన్నపాటి గాయాలయ్యాయి. మిగిలిన వారు క్షేమంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న వెస్ట్ సబ్ డివిజనల్ డీఎస్పీ కనకరాజు, ఎమ్మార్‌పల్లి సీఐ విజయకుమార్, ఎస్ఐలు ఈశ్వరయ్య, తిమ్మయ్య సంఘటనా స్థలం చేరుకున్నారు. మిగతా ప్రయాణికులను వేరే బస్సు ఎక్కించి తరలించారు. హుటాహుటిన క్రేన్‌ను తెప్పించి బస్సును తొలగించారు. మృతదేహాలను బయటకు తీసి ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. కొడుకు పెరుమాల్ సుందరరాజన్ కంటి ముందే మృతి చెందడంతో తల్లి సరోజ కన్నీరుమున్నీరయ్యారు. దీనిని చూసిన ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టారు.బస్సు మరోసారి తిరిగి ఉంటే..బస్సు కల్వర్టులో పడినా అదృష్టవశాత్తు పెనుప్రమాదం తప్పింది. బస్సుబోల్తా కొట్టిన ఐదు అడుగుల దూరంలోనే హైవే లైన్ ట్రాన్స్ఫార్మర్ ఉంది. బస్సు మరోసారి పొర్లి ఉంటే పెద్దప్రమాదమే చోటు చేసుకునేది. దీనికి తోడు బస్సు డీజిల్ ట్యాంక్ పగిలి పెద్ద మొత్తంలో లీక్ అయింది. ఏదైనా అనుకోని సంఘటన జరిగి ఉంటే పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం జరిగి ఉండేదని పోలీసులు పేర్కొన్నారు. బస్సు డ్రైవర్ నిద్రమత్తువల్లే ప్రమాదం జరిగినట్టు తెలిపారు. బస్సు బోల్తా కొట్టిన విషయాన్ని గ్రామప్రజలు గమనించినా మానవవత్వం మరచి రక్షించే ప్రయత్నం చేయలేదు. బస్సులోని వారే కొంతమంది బయటకు దిగి మరికొంత మందిని బయటకు తీశారు. -
పోలీసులు - మావోయిస్టుల ఎదురుకాల్పులు
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లాలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కూంబింగ్ కోసం వెళ్లిన పోలీసులకు దారిలో మావోయిస్టులు ఎదురు కావడంతో ఇరువర్గాల మధ్య చాలాసేపు ఎదురు కాల్పులు జరిగాయి. దీనిలో చివరకు పోలీసులదే పైచేయి అయ్యింది. ఐదుగురు మావోయిస్టులను అరెస్టు చేసిన పోలీసులు.. భారీ మొత్తంలో ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటన అనంతరం ఆ ప్రాంతంలో కూంబింగ్ కార్యకలాపాలను మరింత ఉధృతం చేశారు. ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దుల్లో కూడా ఈ సంఘటనతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినట్లు తెలుస్తోంది. -
ప్రేమను నిరాకరించిందని యువతిపై దాడి
తాడేపల్లిగూడెం: పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. తన ప్రేమను నిరాకరించిదనే అక్కసుతో ఓ ఉన్మాది దాడికి పాల్పడ్డాడు. ఇంట్లో నిద్రిస్తున్న యువతిని భాష అనే యువకుడు బ్లేడ్‌తో దాడి చేశాడు. తాడేపల్లి గూడెంలోని భాగ్యలక్ష్మిపేటలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. దాడిలో గాయపడిన బాధితురాలు ప్రస్తుతం ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. గత కొంతకాలంగా భాష.... ఈ యువతిని వేధిస్తున్నట్లు సమాచారం. గతంలో ఇదే విషయంపై యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నట్లు సమాచారం.