breaking news
-
యువతిపై టీడీపీ నాయకుడు లైంగికదాడి
రాయదుర్గం: కుమార్తె వయసు కలిగిన ఓ యువతిపై టీడీపీ నాయకుడు దారుణానికి ఒడిగట్టాడు. ఎవరూ లేని సమయంలో యువతి ఇంట్లోకి చొరబడి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలిసి అతనికి బాధిత యువతి బంధువులు దేహశుద్ధి చేశారు. ఈ ఘటన అనంతపురం జిల్లా డి.హీరేహాళ్ మండలం హులికల్లులో చోటుచేసుకుంది. పోలీసులు, బాధిత కుటుంబం తెలిపిన వివరాల మేరకు... హులికల్లు గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులుకు ప్రధాన అనుచరుడైన బోయ సోమశేఖర్ (45) వరుసకు కోడలైన 20 ఏళ్ల యువతిపై ఎప్పటినుంచో కన్నేశాడు. అమ్మాయిని ఎలాగైనా లోబర్చుకోవాలని కొంతకాలంగా ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఏదో ఒక కారణంతో తరచూ ఆమె ఇంటి వద్దకు వెళ్లి గంటల తరబడి కాలక్షేపం చేసేవాడు. సోమవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఆ యువతి తల్లిదండ్రులు బయటకు వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉంది. ఇదే అదనుగా భావించిన సోమశేఖర్ ఆమె ఇంట్లోకి చొరబడి అస్యభకరంగా ప్రవర్తించాడు. ఆమె ప్రతిఘటిస్తున్నప్పటికీ బలవంతంగా లైంగికదాడి చేశాడు. అనంతరం చెప్పులు అక్కడే వదిలి పారిపోయాడు. యువతి ఇంట్లోనే ఏడుస్తూ కూర్చుంది. కొద్దిసేపటి తర్వాత యువతి తండ్రి ఇంటికి రావడంతో జరిగిన దారుణం గురించి తెలియజేసి కన్నీటిపర్యంతమైంది. అదే సమయంలో చెప్పుల కోసం తిరిగి యువతి ఇంటి వద్దకు వచ్చిన సోమశేఖర్‌ను గుర్తించిన బాధితురాలి తండ్రి, బంధువులు చితకబాదారు. అనంతరం తన తల్లిదండ్రులతో కలిసి బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన రూరల్ సీఐ యుగంధర్ మంగళవారం నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 376 కింద (రేప్) కేసు నమోదుచేసి అరెస్ట్ చేశారు. నిందితుడు సోమశేఖర్‌ను కళ్యాణదుర్గం జూనియర్ సివిల్ జడ్జి ఎదుట ప్రవేశపెట్టగా, రిమాండ్ విధించారు. -
గుంతకల్లులో డ్రగ్స్ కలకలం
గుంతకల్లు టౌన్: గోవా నుంచి హైదరాబాద్‌కు మాదక ద్రవ్యాల ప్యాకెట్లను సరఫరా చేస్తున్న ఇద్దరు యువకులను అనంతపురం జిల్లా గుంతకల్లు వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారినుంచి రూ.65 వేల విలువజేసే 12.890 గ్రాముల ‘మేథాంపేటామైన్’ అనే నిషేధిత డ్రగ్‌తో పాటు రెండు సెల్ఫోన్లను స్వా«దీనం చేసుకున్నారు. మంగళవారం వన్‌టౌన్ పోలీసుస్టేషన్లో సీఐ రామసుబ్బయ్య తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి నగరానికి చెందిన ఎరెల్లి దయాకర్, మలికపురం మండలం అడవిపాలెం గ్రామానికి చెందిన రాసిబట్టుల వివేక్ హైదరాబాద్‌కు వెళ్లి ఉద్యోగాన్వేషణలో ఉన్నారు. ఈ క్రమంలోనే వీరిరువురు డ్రగ్స్‌కు బానిసలయ్యారు. హైదరాబాద్‌లో వీరికి పరిచయమైన స్నేహితులకు డ్రగ్స్ గురించి తెలియజేయగా, తమకు కూడా తెచ్చివ్వాలని వారు కోరడంతో గోవాకు వెళ్లి డ్రగ్స్ కొనుగోలు చేసి సోమవారం సాయంత్రం గుంతకల్లుకు చేరుకున్నారు. అయితే రాత్రి వరకు హైదరాబాద్‌కు రైలు లేకపోవడంతో రోడ్డు మార్గం ద్వారా ఏదైనా వాహనంలో వెళ్లేందుకు ఇద్దరు యువకులూ స్థానిక బీరప్పగుడి సర్కిల్లో వేచి ఉన్నారు. అందిన సమాచారం మేరకు పోలీసులు ఇద్దరు యువకుల్నీ అదుపులోకి తీసుకుని విచారించగా అసలు గుట్టు రట్టయ్యింది. స్వా«దీనం చేసుకున్న డ్రగ్ ఒక్కో గ్రాము రూ.5 వేల ధర పలుకుతుందని పోలీసులు తెలిపారు. నిందితులిద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వెల్లడించారు. -
ఎన్టీఆర్ జిల్లా: రన్నింగ్ కారులో మంటలు.. ఒక్కసారిగా
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: ఇబ్రహీంపట్నం మండలం కిలేశపురం దగ్గర రన్నింగ్ కారులో మంటలు చెలరేగాయి. గ్యాస్ లీకవ్వడంతో కారు దగ్ధమైంది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఘటన జరిగింది. కారు డ్రైవర్ అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది. గ్యాస్ లీకవ్వడంతో ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగాయి. కారును రోడ్డు పక్కన నిలిపివేసి అందులో ఉన్న వ్యక్తులు తమ ప్రాణాలను దక్కించుకున్నారు. చదవండి: రంగారెడ్డి: వీడిన మైనర్ రాజా కేసు మిస్టరీ -
వైఎస్సార్సీపీ నేతపై టీడీపీ మూకల దాడి
పుంగనూరు(చిత్తూరు జిల్లా) : టీడీపీ శ్రేణులు మళ్లీ బరితెగించాయి. వైఎస్సార్సీపీ నేత ఇంట్లోకి జొరపడి రాళ్లు, కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయర్చాయి. పుంగనూరు మండల వైస్ ఎంపీపీ సరోజమ్మ, ఆమె భర్త ప్రభాకర్‌నాయక్ మండలంలోని పాళ్యెంపల్లెలో ఉంటున్నారు. ఈ నెల 4న చంద్రబాబు పర్యటనలో టీడీపీ శ్రేణులు పోలీసులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన విషయం తెలిసిందే. ఈ కేసులో మండలంలోని జెడీ తాండాకు చెందిన టీడీపీ నేత కృష్ణానాయక్, ఆయన కుమారులు నిందితులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు ప్రభాకర్‌నాయక్ తమ ఆచూకీ తెలిపి ఉంటారన్న అనుమానంతో కృష్ణానాయక్ ఆయన కుమారుడు శ్రీనివాసనాయక్, వారి అనుచరులు కలిసి పథకం ప్రకారం ఆదివారం రాత్రి 10:30 గంటల సమయంలో ప్రభాకర్‌నాయక్ ఇంటిపై దాడి చేసి, భయానక వాతావరణం సృష్టించారు. ప్రభాకర్నాయక్పై రాళ్లు, కత్తులతో దాడి చేసి గాయపరిచారు. అడ్డు వచ్చిన ఆయన బావమరిది మునీంద్రనాయక్పైనా దాడి చేశారు. గ్రామస్తులు రావడంతో నిందితులు పరారయ్యారు. గాయపడిన ప్రభాకర్నాయక్ను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ మోహన్‌కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించి నిందితులపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. కాగా, ప్రభాకర్నాయక్ను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ నేతలు పరామర్శించి ధైర్యం చెప్పారు. -
ఏపీలో కస్టమ్స్ అధికారుల ఆపరేషన్.. 6కోట్ల బంగారం స్వాధీనం
సాక్షి, విజయవాడ: ఏపీలో కస్టమ్స్ అధికారులు అక్రమంగా తరలిస్తున్న రూ.6.4కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్, శ్రీలంక నుంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని పట్టుకున్నారు. పట్టుబడింది విదేశీ బంగారమని కస్టమ్స్ అధికారులు గుర్తించారు. వివరాల ప్రకారం.. కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో విదేశాల నుంచి అక్రమంగా తరలించిన బంగారం భారీగా పట్టుబడింది. ఓ కారులో రూ.6.4 కోట్ల విలువైన 11.1 కిలోల బంగారం, రూ.1.5 లక్షల విదేశీ నగదును కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, శ్రీలంక, దుబాయ్ దేశాల నుంచి బంగారాన్ని తీసుకువచ్చి, చెన్నై మీదుగా విజయవాడకు బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్నారన్న సమాచారంతో కస్టమ్స్ అధికారులు ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపట్టారు. శుక్రవారం తెల్లవారుజామున బొల్లాపల్లి టోల్‌ఫ్లాజా వద్ద విజయవాడ వైపు వస్తున్న ఓ కారులో తరలిస్తున్న 4.3 కిలోల బంగారం, 6.8 కిలోల బంగారు అభరణాలు, రూ.1.5 లక్షల విదేశీ నగదును స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడింది విదేశీ బంగారమని కస్టమ్స్ అధికారులు గుర్తించారు. కేసు నమోదు చేసి నిందితుడిని విశాఖలోని కోర్టులో హాజరు హాజరుపరచగా, న్యాయమూర్తి రిమాండ్ విధించారు. రెండేళ్లలో విజయవాడ కస్టమ్స్ కమిషనరేట్ పరిధిలో సుమారు రూ.40 కోట్ల విలువైన 70 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు విజయవాడ కస్టమ్స్ అధికారులు తెలిపారు. ఇది కూడా చదవండి: ప్రేమ విఫలమై.. యువతి తీవ్ర నిర్ణయం.. చివరికి.. -
వేధిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేయించిన ‘దిశ’
తెనాలిరూరల్ : వ్యక్తి వేధింపులు తాళలేని ఓ మహిళ దిశ యాప్ ఎస్ఓఎస్ ద్వారా పోలీసులను ఆశ్రయించింది. ఆ వ్యక్తిని దిశ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన గుంటూరు జిల్లా తెనాలి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెనాలిలో నివాసముండే మహిళ తన కుమార్తె పెళ్లి ఖర్చుల నిమిత్తం శ్రీనివాసరావు అనే వ్యక్తి నుంచి రూ.రెండు లక్షలు అప్పుగా తీసుకుంది. కొన్ని నెలల తర్వాత వడ్డీతో సహా చెల్లించింది. అయినా శ్రీనివాసరావు ఆ మహిళకు కాల్ చేసి అసభ్యంగా మాట్లాడేవాడు. గతంలో అప్పు కోసం తన ఆఫీస్‌కు వచ్చినప్పటి ఫొటోలు, కాల్ రికార్డ్లున్నాయని బెదిరించేవాడు. బాధిత మహిళ తన భర్తకు, పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పినా శ్రీనివాసరావు ప్రవర్తనలో మార్పు రాలేదు. ఈ నేపథ్యంలో శ్రీనివాసరావు శుక్రవారం సాయంత్రం బాధిత మహిళకు, ఆమె భర్తకు మార్ఫింగ్ ఫొటోలు పంపి వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు దిశ ఎస్ఓఎస్కు కాల్ చేసి ఫిర్యాదు చేసింది. తెనాలి వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న బాధిత మహిళ ఇంటికి దిశ పోలీసులు ఆరు నిమిషాల్లో చేరుకున్నారు. ఆమెకు శ్రీనివాసరావు పంపించిన అసభ్యకర సందేశాలను, అప్పు చెల్లించినట్టు ఉన్న వివరాలను పోలీసులు సేకరించారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీనివాసరావుపై ఐపీసీ సెక్షన్ 354 ఈ, 506 కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. -
భర్త చేతిలో భార్య దారుణహత్య
కృష్ణా :అనుమానం పెనుభూతమైంది. కట్టుకున్న మొగుడే భార్యను కడతేర్చి కాలయముడయ్యాడు. మండలంలోని కుమ్మమూరు ఎస్సీ కాలనీలో శనివారం సాయంత్రం వీర్ల రమ్యతేజ (32) దారుణహత్యకు గురయింది. భర్త రామకృష్ణ సెల్‌ఫోన్ చార్జింగ్ వైరుతో రమ్యతేజను హతమార్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. కుమ్మమూరు గ్రామానికి చెందిన వీర్ల రామకృష్ణ అదే గ్రామానికి చెందిన రమ్యతేజ ప్రేమించుకుని గత 11 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. గతంలో రామకృష్ణ కారు డ్రైవర్‌గా పనిచేస్తూ ఉండేవాడని, ప్రస్తుతం స్థానికంగానే కూలీ పనులకు వెళుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. రమ్యతేజ డ్వాక్రా గ్రూపుల తరపున వీఓఏగా పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో భార్య రమ్యతేజపై గత కొంతకాలంగా భర్త రామకృష్ణ అనుమానం పెంచుకున్నాడు. ఏడాది కాలంగా ఇద్దరి మద్య గొడవలు ఎక్కువగా జరుగుతున్నట్లు తెలిసింది. నెల క్రితం అత్త జయలక్ష్మిపై కూడా రామకృష్ణ దాడికి పాల్పడి తల పగులగొట్టినట్లు సమాచారం. రమ్యతేజ గత ఇరవై రోజుల క్రితం గ్రామంలోని పుట్టింటికి వెళ్లింది. శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో భర్త రామకృష్ణ వద్దకు వచ్చింది. సాయంత్రం 5 గంటలకు రమ్యతేజ హత్యకు గురయ్యిందనే సమాచారం గ్రామంలో కలకలం రేపింది. టబ్చైర్లో విగతజీవిగా పడిఉన్న కూతురిని చూసి తల్లి జయలక్ష్మి, కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. గ్రామస్తులు పెద్ద ఎత్తున ఘటనా ప్రాంతానికి తరలివచ్చారు. మృతురాలు రమ్యతేజకు ఇద్దరు కుమార్తెలు ఖ్యాతి (9), రిషిత (7) ఉన్నారు. వీరు ఉయ్యూరులోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుకుంటున్నారు. రమ్యతేజ మృతదేహాన్ని పమిడిముక్కల సీఐ చలపతిరావు, ఎస్ఐ రమేష్ సందర్శించి పరిశీలించారు. మృతురాలి తండ్రి మెల్లంపల్లి కోటేశ్వరరావు ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రమేష్ తెలిపారు. భార్య రమ్యతేజను హత్య చేసిన అనంతరం భర్త రామకృష్ణ పోలీసులకు లొంగిపోయినట్లు తెలుస్తోంది. -
నాడు మైనర్ బాలిక..నేడు మేజర్
అనకాపల్లిటౌన్ : రెండేళ్ల క్రితం ఓ మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన కేసులో నిందితుడిని పట్టుకుని అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచినట్టు డీఎస్పీ బి.సుబ్బరాజు చెప్పారు. తన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసుకు సంబంధించి ఆయన తెలిపిన వివరాలివి. మండలంలో తగరంపూడి గ్రామానికి చెందిన మైనర్ బాలిక 2021 జూలై 13న రాత్రి నుంచి కనిపించడం లేదంటూ ఆమె తండ్రి నడిగట్ల శ్రీను ఫిర్యాదు మేరకు అదే నెల 15న గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు అందింది. అస్సాం రాష్ట్రం గౌహతి నుంచి ఎలుసూరి ప్రసాద్‌బాబు అనే వ్యక్తి తగరంపూడిలో తన స్నేహితుని ఇంటికి వచ్చాడు. స్నేహితుడి ద్వారా పట్టణంలోని ఓ ప్రైవేటు కళాశాలలో చదువుతున్న ఓ మైనర్ బాలిక పరిచయం కావడంతో ఆమెను లోబర్చుకున్న ప్రసాద్‌బాబు అస్సాంకు తీసుకెళ్లిపోయాడు. దీనిపై ఫిర్యాదు అందడంతో నిందితుడి కోసం రెండేళ్లుగా కోల్కత్తా, ఒడిశా, తెలంగాణతో పాటు విశాఖపట్నం పలు ప్రాంతాల్లో గాలించారు. ఎట్టకేలకు ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్ సమీపంలో ఒక మారుమూల గ్రామంలో మైనర్ బాలికతో కలిసి ప్రసాద్‌బాబు ఉన్నట్టు తెలుసుకున్న ఐటీ కోర్ బృందం ఈ నెల 25న అతడిని భువనేశ్వర్ చందక పోలీస్‌స్టేషన్‌లో హాజరుపరిచి అక్కడ నుంచి అనకాపల్లికి తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిచారు. మైనర్ బాలిక ప్రస్తుతం మేజర్ కావడంతో చైల్డ్ వెల్ఫేర్ అధికారుల సహకారంతో వైద్యపరీక్షలకు తరలించి కోర్టులో హాజరుపర్చడం జరుగుతుందని చెప్పారు. నిందితుడిని ఈనెల 25న భువనేశ్వర్‌లో అరెస్టు చేసినట్టు డీఎస్పీ చెప్పారు. ప్రసాద్‌బాబుకు గతంలో వివాహమై ఒక పాప ఉంది. అతని తల్లిదండ్రులు గౌహతిలో ప్రభుత్వాస్పత్రిలో విధులు నిర్వహిస్తున్నారు. అక్కడికి కొద్ది దూరంలో కోడలు కూడా నివసిస్తోంది. నిందితుడ్ని శనివారం కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించినట్టు డీఎస్పీ చెప్పారు. ఈ సమావేశంలో గ్రామీణ సీఐ ఎ.రవికుమార్, ఎస్ఐ సీహెచ్. నర్సింగరావు, అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడ హెచ్‌సీ ఎస్.వి.రామకృష్ణ, రూరల్ కానిస్టేబుళ్లు పి.నరేంద్రకుమార్, ఎం.నరేష్, ఐటీకోర్ సిబ్బంది మూర్తి, దిలీప్, గ్రామీణ హెచ్‌సీ జె.రమేష్ పాల్గొన్నారు. -
ప్రాణం తీసిన అతి వేగం
విశాఖపట్నం: అతివేగం ఓ విద్యార్థి ప్రాణం తీసింది. అతని నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా మరో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. భీమిలి బీచ్‌రోడ్డులో చోటుచేసుకున్న ఈ ఘటన ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. భీమిలి పోలీసులు తెలిపిన వివరాలివీ.. లాసన్స్‌బే కాలనీకి చెందిన పెండ్యాల ప్రఖ్యాత్(20), సీతమ్మధారకు చెందిన కొల్లా అఖిలేష్, ఎండాడకు చెందిన ఆర్.సాయిలక్ష్మి స్నేహితులు. రుషికొండలోని గీతం కళాశాలలో ప్రఖ్యాత్, అఖిలేష్ సీఎస్సీ మూడో సంవత్సరం.. సాయిలక్ష్మి బీబీఏ చదువుతున్నారు. వీరు ముగ్గురూ శనివారం ఉదయం కళాశాలలో కలుసుకుని ఒకే కారులో భీమిలిలో టిఫిన్ చేసేందుకు వెళ్లారు. తిరిగి వస్తుండగా ఐఎన్ఎస్ కళింగ సమీపంలో కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టి.. అక్కడే ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్రఖ్యాత్‌కు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే గీతం ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. వెనుక సీటులో ఉన్న అఖిలేష్, సాయిలక్ష్మి గాయాలతో బయటపడ్డారు. వీరికి గీతంలో చికిత్స అందించి ఇంటికి పంపించేశారు. ప్రఖ్యాత్ అతి వేగంగా కారు నడుపుతూ అదుపు చేయలేక డివైడర్‌ను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. ప్రఖ్యాత్ తండ్రి అరవింద్ నగరంలో బిజినెస్‌మన్. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. భీమిలి ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రఖ్యాత్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఎస్ఐ భరత్ కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
విశాఖ: చైనా వెళ్తున్నానని చెప్పి లాడ్జిలో..
సాక్షి, విశాఖపట్నం: నగరంలో మెడికో రమేష్ కృష్ణ ఆత్మహత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. వాట్సాప్ చాటింగ్, ఫోన్ కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రియుడితో ఏర్పడిన మనస్పర్ధలే ఆత్మహత్యకు కారణమని పోలీసులు తేల్చారు. ఈ నెల 23వ తేదీన విశాఖకు వచ్చిన యువతి రమేష్ కృష్ణ.. అంతకు ముందే ఇండోర్‌లో ఉన్న ప్రియుడిని కలిసింది. చైనాలో ఎంబీబీఎస్ ఫోర్త్ ఇయర్ చదువుతున్న మెడికో.. స్వస్థలం కేరళ, త్రిశూర్ జిల్లా, వందనపల్లి మండలం. చైనా వెళ్తున్నానని చెప్పి ఇంటి నుండి బయలుదేరిన రమేష్ కృష్ణ... విశాఖ నుంచి సింగపూర్‌కు కనెక్టింగ్ ఫ్లైట్‌కి వెళ్లడానికి దాబా గార్డెన్‌లోని ఓ లాడ్జిలో దిగింది. ఈ నెల 24న చెక్ అవుట్ చేయాల్సి ఉండగా, ఆమె గది నుంచి బయటకు రాలేదు.. లోపల నుంచి గడియాపెట్టి ఉండటంతో లాడ్జి నిర్వహకులకు అనుమానం వచ్చి.. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తలుపును బద్దలుగొట్టి లోపలికి ప్రవేశించగా, ఆ యువతి గదిలో ఫ్యానుకు ఉరి వేసుకుని వేలాడుతున్నట్టు కనిపించింది. ‘‘తన చావుకు ఎవరూ కారణం కాదనీ.. సారీ అమ్మ’’ అంటూ ఆ సూసైడ్ నోట్లో పేర్కొంది. చదవండి: భర్త వేధింపులపై ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్! -
భర్త వేధింపులపై ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్!
నెల్లూరు(క్రైమ్): వారిద్దరు ఉన్నతోద్యోగులు. అయితే విభేదాలు చోటుచేసుకున్నాయి. దీంతో భర్త తనను వేధిస్తున్నాడంటూ భార్య ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టడంతో పోలీసులు స్పందించి వారికి కౌన్సెలింగ్ ఇచ్చా రు. వివరాలిలా ఉన్నాయి. జీవీఆర్ఆర్ కళాశాల సమీపంలో దంపతులు తమ కుమార్తెతో కలిసి నివాసం ఉంటున్నారు. భర్త పశుసంవర్థక శాఖలో, భార్య వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు చేస్తున్నారు. వారి మధ్య కొంతకాలంగా మనస్పర్థలతో ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భర్త వేధిస్తున్నాడంటూ భార్య శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు. దీనిపై స్పందించిన వేదాయపాళెం పోలీసులు దంపతుల ఇంటికి చేరుకుని మాట్లాడారు. తర్వాత పోలీస్‌స్టేషన్‌కు తరలించి కౌన్సెలింగ్ ఇచ్చారు. -
స్కూటీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు యువతి దుర్మరణం
శ్రీకాకుళం: పలాస మండలం సరియాపల్లి పెట్రోల్ బంకు వద్ద శుక్రవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇప్పిలి కల్యాణి(20) అనే యువతి దుర్మరణం పాలైంది. వివరాల్లోకి వెళ్తే.. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ 20వ వార్డు శివాజీనగర్‌లో నివాసం ఉంటున్న ఇప్పిలి కల్యాణి అలియాస్ శిల్ప (20) శ్రావణ శుక్రవారం సందర్భంగా వేకువజామున తల్లితో పాటు వ్రతం ఆచరించింది. వివిధ రకాల ప్రసాదాలను తయారుచేసి చుట్టు పక్కలవారికి పంచిపెట్టింది. కాశీబుగ్గ గాంధీనగర్‌లో డాక్టర్ పొందల జగదీష్ నడుపుతున్న శ్రీకృష్ణా ఆస్పత్రిలో ఆమె ఫిజియోథెరపిస్టుగా పని చేస్తోంది. పేషెంట్ నుంచి కాల్ రావడంతో ఆమె వజ్రపుకొత్తూరు మండలం నగరంపల్లి గ్రామానికి వెళ్లేందుకు తన స్కూటీపై బయల్దేరింది. సరియాపల్లి పెట్రోల్ బంకు వద్దకు వచ్చేసరికి విశాఖ–ఇచ్ఛాపురం ఎక్స్‌ప్రెస్ బస్సు ఆమె స్కూటీని ఢీకొట్టింది. తలపై పెద్ద దెబ్బ తగిలి తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సంఘటన చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ పరారైపోయాడు. మృతురాలిది పలాస పురుషోత్తపురం స్వగ్రా మం కాగా శివాజీనగర్‌లో అద్దె ఇంటిలో ఉంటున్నా రు. ఆమె తండ్రి ఇప్పిలి బాలరాజు జీడి కార్మికుడిగా పనిచేస్తుండగా తల్లి ఇప్పిలి పుణ్యావతి జీడి కార్మికురాలుగా రోజువారీ కూలి పనిచేస్తుంటారు. సోదరుడు ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. వేకువనే లేచి అమ్మవారికి పూజ చేసి లక్ష్మీదేవిలా కనిపించిన కుమార్తె గంటల వ్యవధిలో ఇలా విగతజీవిగా కనిపించడంతో ఆమె తండ్రి గుండెలవిసేలా రోదించారు. ఫోన్‌కాల్ రావడమే తన బిడ్డపాలిట మృత్యువుగా మారిందని ఆయన కన్నీరుమున్నీరయ్యారు. నలభై రోజుల కిందటే ఆమె కొత్త స్కూటీ తీసుకోవడం గమనార్హం. కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పలాస ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం అంత్యక్రియలు చేశారు. -
Vizag: లాడ్జిలో మెడికో ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏముందంటే!
సాక్షి, విశాఖపట్నం: డాబా గార్డెన్స్‌లో కేరళకు చెందిన మెడికో ఆత్మహత్యకు పాల్పడింది. హోటల్ గదిలో రమేష్ కృష్ణ అనే యువతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె చైనాలో ఎంబీబీఎస్ ఫోర్త్ ఇయర్ చదువుతోంది. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టు మార్టం కోసం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. కేరళ రాష్ట్రం ఒలరిక్కర ప్రాంతానికి చెందిన రమేష్ కృష్ణ.. సెలవుల కోసం సొంత గ్రామానికి వచ్చింది. ఈనెల 13న తన ఇంటి నుంచి తిరుగు ప్రయాణమై 18వ తేదీన వైజాగ్ చేరుకున్న ఆ యువతి.. డాబా గార్డెన్స్‌లోని లాడ్జిలో అద్దెకు దిగి.. ఆగస్టు 9వ తేదీన గది ఖాళీ చేసింది. తిరిగి మళ్లీ ఈ నెల 24న ఆమె అదే గదికి వచ్చింది. 24న చెక్ అవుట్ చేయాల్సి ఉండగా, ఆమె గది నుంచి బయటకు రాలేదు.. లోపల నుంచి గడియాపెట్టి ఉండటంతో లాడ్జి నిర్వహకులకు అనుమానం వచ్చి.. పోలీసులకు సమాచారం అందించారు. చదవండి: ప్రేమ పేరుతో మోసం.. జబర్దస్త్ కమెడియన్ అరెస్ట్ పోలీసులు తలుపును బద్దలుగొట్టి లోపలికి ప్రవేశించగా, ఆ యువతి గదిలో ఫ్యానుకు ఉరి వేసుకుని వేలాడుతున్నట్టు కనిపించింది. ‘‘తన చావుకు ఎవరూ కారణం కాదనీ.. సారీ అమ్మ’’ అంటూ ఆ సూసైడ్ నోట్లో ఉందని టూ టౌన్ సిఐ తెలిపారు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
‘బెంగాల్ రామోజీ’ బిశ్వప్రియ గిరి అరెస్టు
సాక్షి, అమరావతి: మార్గదర్శి తరహాలో పశ్చిమ బెంగాల్లో చిట్‌ఫండ్ కుంభకోణానికి పాల్పడిన ‘యూఆర్‌వో చిట్‌ఫండ్స్’పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కొరడా ఝళిపించింది. రామోజీరావు మాదిరిగానే చందాదారుల నిధులను మళ్లించిన యూఆర్‌వో చిట్‌ఫండ్స్ డైరెక్టర్ బిశ్వప్రియ గిరిని ఈడీ అధికారులు అరెస్టు చేశారు. చందాదారుల డబ్బులను తమకు చెందిన వివిధ వ్యాపార సంస్థలకు మళ్లించిన కేసులో ఆయన్ను అరెస్టు చేసి ఆయన్ను అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరు పరిచారు. బిశ్వప్రియ గిరికి న్యాయస్థానం సెప్టెంబరు 1 వరకు రిమాండ్ విధించింది. యూఆర్‌వో చిట్‌ఫండ్స్, మార్గదర్శి చిట్‌ఫండ్స్ మోసాలు ఒకే తరహాలో ఉన్నాయి. నిజానికి యూఆర్‌వో చిట్‌ఫండ్స్ కంటే మార్గదర్శి చిట్‌ఫండ్స్ మోసాలు అనేక రెట్లు పెద్దవి కావడం గమనార్హం. రూ.200 కోట్లు మళ్లించిన యూఆర్‌వో చిట్‌ఫండ్స్ యూఆర్‌వో చిట్‌ఫండ్స్ ప్రమోటర్, డైరెక్టర్ బిశ్వప్రియ గిరి ఈ కుంభకోణానికి సూత్రధారి. చిట్‌ఫండ్స్ పేరుతో అధిక వడ్డీ ఆశ చూపి భారీగా అక్రమ డిపాజిట్లు వసూలు చేశారు. కేంద్ర చిట్‌ఫండ్స్ చట్టాన్ని ఉల్లంఘిస్తూ చందాదారుల సొమ్మును తమ సొంత వ్యాపార సంస్థల్లోకి మళ్లించారు. చందాదారుల సంతకాలను ఫోర్జరీ చేయడంతోపాటు పలు అక్రమాలకు పాల్పడ్డారు. రూ.200 కోట్లను ఇతర సంస్థల్లో అక్రమ పెట్టుబడులుగా మళ్లించారు. బిశ్వప్రియ గిరి కుటుంబానికే చెందిన అగ్రో ఇండస్ట్రీ, లైఫ్‌కేర్, ఆటోమోటివ్, హోటళ్లు–రిసార్టులు, రియల్ ఎస్టేట్ సంస్థల్లో పెట్టుబడులుగా పెట్టారు. చందాదారుల సొమ్మును తమ సొంత ఆర్థిక ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేశారు. ఈ క్రమంలో చందాదారులకు సక్రమంగా చెల్లించలేక మోసానికి పాల్పడ్డారు. ఈడీ అధికారులు తనిఖీలు జరిపి పూర్తి ఆధారాలతో కేసు నమోదు చేశారు. బిశ్వప్రియ గిరిని ఈడీ అధికారులు మంగళవారం అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరు పరిచారు. అంతకు మించి మార్గదర్శి మోసాలు యూఆర్‌వో చిట్‌ఫండ్స్ వసూలు చేసినట్లుగానే మార్గదర్శి చిట్‌ఫండ్స్ కూడా తమ చందాదారుల నుంచి అక్రమ డిపాజిట్లు వసూలు చేసింది. 4 నుంచి 5 శాతం వడ్డీ చెల్లిస్తామని చెప్పి రశీదు రూపంలో అక్రమ డిపాజిట్లు సేకరించింది. బిశ్వప్రియ గిరి తరహాలోనే రామోజీరావు కూడా చిట్‌ఫండ్ చట్టానికి విరుద్ధంగా చందాదారుల సొమ్మును ఇతర సంస్థల్లోకి మళ్లించారు. తమ సొంత వ్యాపార సంస్థలైన ఉషాకిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, ఉషోదయ ఎంటర్ ప్రైజస్‌లో చిట్‌ఫండ్ చందాదారుల డబ్బును పెట్టుబడులుగా పెట్టారు. అంతేకాకుండా వివిధ మ్యూచువల్ ఫండ్ సంస్థల్లో అక్రమ పెట్టుబడులుగా వాటిని మళ్లించారు. యూఆర్‌వో గ్రూప్‌నకు చెందిన బిశ్వప్రియ గిరి కేవలం కేవలం రూ.200 కోట్లు మాత్రమే మళ్లించగా రామోజీరావు అంతకు ఎన్నో రెట్లు అధికంగా రూ.వేల కోట్లను అక్రమంగా దారి మళ్లించడం గమనార్హం. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టిన అక్రమ పెట్టుబడులే రూ.1,035 కోట్లుగా ఉన్నట్లు స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ, సీఐడీ అధికారులు గుర్తించారు. ఉషాకిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్‌లో 88.50 శాతం, ఉషోదయ ఎంటర్‌ప్రైజస్‌లో 44.55 శాతం పెట్టుబడులుగా పెట్టారు. వాటి మార్కెట్ విలువ భారీగా ఉంటుదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దీన్నిబట్టి యూఆర్‌వో చిట్‌ఫండ్స్ మోసాల కంటే మార్గదర్శి చిట్‌ఫండ్స్ భారీగా అక్రమాలకు పాల్పడినట్లు స్పష్టమవుతోంది. చందాదారుల నిధులను అక్రమంగా మళ్లించిన కేసులో యూఆర్‌వో చిట్‌ఫండ్స్ డైరెక్టర్ బిశ్వప్రియ గిరి అరెస్టు అయ్యారు. మరి అంతకంటే భారీగా చందాదారుల నిధులను మళ్లించిన రామోజీరావుపై దర్యాప్తు సంస్థలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయన్నది ఆసక్తికరంగా మారింది. మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాల గురించి సీఐడీ విభాగం ఇప్పటికే ఈడీ ప్రధాన కార్యాలయానికి ఆధారాలతో సహా నివేదికను సమర్పించింది. -
ఘోర రోడ్డు ప్రమాదం
కృత్తివెన్ను (కృష్ణా జిల్లా): రెండు కార్లు, లారీ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందడంతో పాటు మరో తొమ్మిది మంది తీవ్రగాయాల పాలయ్యారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం కృష్ణాజిల్లా కృత్తివెన్ను మండలం సంగమూడి సమీపంలో 216 జాతీయ రహదారిపై బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో సంభవించింది. ముందు వెళ్తున్న లారీని కారు ఓవర్ టేక్ చేస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. కృత్తివెన్ను పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం మొగళ్ళమూరు తూర్పుచెరువు నుంచి ఓ కుటుంబంలోని ఇద్దరు మహిళలు, నలుగురు చిన్నారులు, కారు డ్రైవర్‌తో కలసి మొత్తం ఏడుగురు గుంటూరు బయలుదేరారు. అక్కడి దేవదాసు చర్చిలో దాసుబాబుకి మొక్కు తీర్చుకోవడానికి వీరంతరూ బుధవారం ఉదయం 6 గంటలకు బయలుదేరారు. అల్లవరం మండలం మొగళ్ళమూరుకు చెందిన తెన్నేటి అనామణి, గోడికి చెందిన మడికి రాజేశ్వరి, మడికి మెరాకిల్, మడికి షారోన్ జ్యోతి, మడికి రమ్య, మడికి దాసుబాబు కారులో ఉన్నారు. మొక్కులు తీర్చుకుని మధ్యాహ్నం తిరుగు ప్రయాణమయ్యారు. యలవర్తి అఖిలేష్, యలవర్తి రవి, దేవరకొండ నాగబసవయ్య, అజయ్‌కుమార్ నర్సాపురం నుంచి అవనిగడ్డకు కారులో వెళుతున్నారు. సంగమూడి సమీపానికి వచ్చే సరికి లారీని తప్పించబోయి రెండు కార్లు ఎదురెదురు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో గుంటూరు నుంచి మొగళ్ళమూరు వెళుతున్న కారులోని తెన్నేటి అనామణి (70) ఘటనా స్థలంలోనే మరణించింది. అదే కారు డ్రైవర్ అల్లవరం మండలం అల్లవరం పొలంనకు చెందిన పెయ్యిల బాలస్వామి(20) తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మరణించాడు. ఈ కారులోని రాజేశ్వరీతో పాటు నలుగురు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. భర్తతో గొడవల కారణంగా ఐదు నెలలుగా రాజేశ్వరీ తన పిల్లలతో పుట్టింట్లో ఉంటోంది. భర్త మడికి చిరంజీవి ప్రైవేటు లైన్మెన్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలింపు ఈ ప్రమాదంలో మరో కారులోని నాగబసవయ్య, రవిలకు తీవ్రగాయాలు కాగా, అఖిలేష్, అజయ్‌కుమార్‌లకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులందరినీ 108, ఎన్‌హెచ్ అంబులెన్సుల్లో మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులతో పాటు కృత్తివెన్ను పోలీసులు సకాలంలో స్పందించిన తీరు ప్రశంసనీయం. ప్రమాద విషయాన్ని తెలుసుకున్న వెంటనే బందరు రూరల్ సీఐ వీరప్రసన్నగౌడ్, బంటుమిల్లి ఎస్ఐ పైడిబాబులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు సీఐ తెలిపారు. -
కనిగిరి – వెలిగండ్ల రహదారిలో రక్తపు మరకలు
కనిగిరి రూరల్: కనిగిరి – వెలిగండ్ల రహదారిలో రక్తపు మరకలు అంటుకుంటున్నాయి. నిత్యం వాహన రాకపోకలు సాగిస్తున్న ఈ రోడ్డు మార్గంలో గతంలో కే రాధ హత్య ఘటన, నేడు విద్యార్థిని బీ మంజుల హత్య చోటుచేసుకున్నాయి. ఒకే రహదారిలో రాత్రి 6–8 గంటల మధ్యలోనే హత్యలు జరిగాయి. అంతేగాక ప్రధాన రోడ్డుకు ఎక్కడో దూరంగా జన సంచారం లేని ప్రాంతాల్లో జరిగినవి కాదు. కనిగిరి టు వెలిగండ్ల నిత్యం ఈ రోడ్డు మార్గంలో వందల వాహనాల రాకపోకలు సాగుతుంటాయి. పల్లె గ్రామాలన్నీ పక్క పక్కనే రోడ్డు వెంబడే ఉంటాయి. కానీ దుండగులు మాత్రం ఈ దారినే ఎంచుకుని హత్యలు చేస్తున్నారు. అంతేగాక గతంలో హత్యకు గురైన రాధ మృతదేహం ప్రధాన రహదారిలో తారు రోడ్డుకు పక్కన 5 అడుగులు దూరంలోనే పడేశారు. అర్ధరాత్రి దాటే దాకా ఎవరూ గమనించ లేదు. గుర్తించలేదు. తాజాగా సోమవారం జరిగిన బీ మంజుల హత్యోదంతం కూడా అదే పరిస్థితి. కనిగిరి – వెలిగండ్ల ప్రధాన రోడ్డుకు 20 అడుగుల దూరంలో, కనిగిరి – సుల్తాన్పురం కాలినడక మార్గంలో రోడ్డుకు అడుగు దూరంలోనే మృతదేహం పడేశారు. మంజుల హత్య కూడా 6–7 గంటల మధ్యలోనే జరిగిందనేది పోలీసుల విచారణలో స్పష్టంగా తేలింది. దాన్నిబట్టి చీకటి పడక ముందే మంజుల హత్య జరిగిందని భావించవచ్చు. పోలీసింగ్ మరింత పెరగాలి.. నాలుగు నెలల వ్యవధిలో ఒకే రోడ్డులో సుమారు 10 కి.మీల దూరంలో రోడ్డు పక్కనే రెండు హత్యలు జరగడం పట్ల కనిగిరిలో చర్చనీయాంశంగా మారింది. కనిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని లేదా వెలిగండ్ల స్టేషన్ పరిధిలోని మొబైల్ టీం రాత్రి పూట కచ్చితంగా గస్తీ చేయాలని ప్రజలు కోరుతున్నారు. వారంలో మూడు రోజులు కనిగిరి స్టేషన్ నుంచి వెలిగండ్ల వరకు, మరో మూడు రోజులు వెలిగండ్ల నుంచి కనిగిరి వరకు పోలీసింగ్ నిర్వహించి మరో నేరం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అంతేగాక కనిగిరి–పామూరు రోడ్డులోని డిగ్రీ కళాశాల ప్రాంతంలో.. కనిగిరి–పొదిలి రూట్లోని లారీ ఆఫీస్ అవుట్ కట్స్ ఏరియాలో, కనిగిరి–కందుకూరు రోడ్డులోని చిన ఇర్లపాడు అవుట్ కట్స్ ఏరియాలో, గార్లపేట రోడ్డులోని క్వారీ అవుట్ కట్స్ ఏరియాలో అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా తప్పనిసరిగా ప్రతి రోజు పోలీస్ గస్తీ నిర్వహించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. -
విద్యార్థినిది ఆత్మహత్యా.. లేక హత్యా..?
విశాఖపట్నం: ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి కేసు నగర పోలీస్ శాఖలో ప్రకంపనలు రేపుతోంది. తమ కుమార్తెది హత్యేనని, కేసును నీరుగార్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారంటూ విద్యార్థిని తల్లిదండ్రులు ఆరోపించడం సంచలనంగా మారింది. నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో విద్యార్థిని రితీ సాహా హాస్టల్ భవనం పైనుంచి పడి మృతి చెందితే.. పశ్చిమ బెంగాల్లో నేతాజీనగర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది. వివరాలిలా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్‌కు చెందిన రితీ సాహా విశాఖలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఆ కాలేజీకి అనుసంధానంగా నెహ్రూబజార్ ప్రాంతంలో ఉన్న సాధనా హాస్టల్లో ఉండేది. ఈ క్రమంలో గత నెల 14న హాస్టల్ 4వ అంతస్తు పైనుంచి దూకి చనిపోయిందని తల్లిదండ్రులకు హాస్టల్ యాజమాన్యం సమాచారమిచ్చింది. వెంటనే ఆమె తల్లిదండ్రులు విశాఖకు వచ్చి విగత జీవిగా ఉన్న కుమార్తెను చూసి తల్లడిల్లిపోయారు. అయితే విద్యార్థిని మరణానికి గల కారణాలపై హాస్టల్ సిబ్బంది, పోలీసులు పొంతన లేకుండా చెప్పడంతో వారికి అనుమానం వచ్చింది. ఒకసారి ప్రమాదవశాత్తు కింద పడిపోయిందని, మరోసారి దూకేసిందంటూ చెప్పుకొచ్చారు. సీసీ ఫుటేజ్‌లతో మరిన్ని అనుమానాలు రీతి సాహా మృతిపై ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెబుతుండడంతో ఆమె తల్లిదండ్రులు హాస్టల్లో ఉన్న సీసీ కెమెరాలనే కాకుండా దాని ఎదురుగా ఉన్న భవనం సీసీ ఫుటేజ్‌లను కూడా పరిశీలించారు. రితీ సాహా నాలుగో అంతస్తు పైకి వెళ్లే సమయంలో ఒక డ్రెస్‌లో ఉండగా.. కింద పడి ఉన్న మృతదేహంపై మరో కలర్ డ్రెస్ ఉందని గ్రహించినట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు. ఆ విషయాన్ని పోలీసులకు చెప్పినప్పటికీ పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక పోలీసులపై నమ్మకం లేదంటూ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఫిర్యాదు చేశారు. దీనిపై సీఎం సీరియస్ అవడంతో పాటు మంత్రి అనూప్‌ను ఏకంగా రితీ సాహా ఇంటికి పంపించినట్లు సమాచారం. అంతే కాకుండా సీఎం ఆదేశాలతో అక్కడి పోలీస్‌స్టేషన్‌లో కూడా కేసు నమోదు చేశారు. సాధారణంగా ఒక రాష్ట్రంలో సంఘటన జరిగితే మరో రాష్ట్రంలో కేసు నమోదు కావడం అరుదు. కానీ రితీ సాహా అనుమానాస్పద మృతిపై బెంగాల్లో కేసు నమోదు కావడం చర్చకు దారితీస్తోంది. కేసును నీరుగార్చే ప్రయత్నం? రితీ సాహాను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కాలేజ్, హాస్టల్ నిర్వాహకుల నుంచి స్థానిక పోలీసులు డబ్బులు తీసుకొని కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై వారు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ సి.ఎం.త్రివిక్రమ్ వర్మకు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టాలని డీసీపీ విద్యాసాగర్‌నాయుడును ఆదేశించినట్లు సమాచారం. వారంలో ఫోరెన్సిక్ నివేదిక ఈ కేసుపై డీసీపీ–1 విద్యాసాగర్‌నాయుడును మీడియా ప్రశ్నించగా.. రితీ సాహా మృతిపై సెక్షన్ 174 కింద కేసు నమోదు చేశామని చెప్పారు. ఫోరెన్సిక్ నివేదిక మరో వారం రోజుల్లో వస్తుందని దాని ప్రకారం తదుపరి విచారణ ఉంటుందని స్పష్టం చేశారు. -
ప్రియుడి ఆత్యహత్య.. అతడి బాటలోనే ప్రియురాలు
తూర్పు గోదావరి: ప్రేమించిన యువకుడు గంజాయికి బానిసై క్షణికావేశంతో ఆత్మహత్య చేసుకోవడంతో మనస్తాపానికి గురైన యువతి తనువు చాలించారు. ఈ ఘటనతో యానాంలో విషాదం నెలకొంది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. యానాంలోని యూకేవీనగర్‌కి చెందిన మీసాల మౌనిక(22)కు ఓ అక్క, చెల్లి ఉన్నారు. వీరి తల్లిదండ్రులు పదేళ్ల క్రితం చనిపోయారు. మౌనిక తాళ్లరేవు మండలం చొల్లంగిలోని రాయల్ కాలేజీలో నర్సింగ్ తృతీయ సంవత్సరం చదువుతోంది. ఈమె అక్క, చెల్లెలు వివాహాలై అత్తవారిళ్లలో ఉంటున్నారు. మౌనిక ప్రస్తుతం మేనమామ త్రిమూర్తులు సంరక్షణలో ఉంటోంది. రెండేళ్లుగా కురసాంపేటకు చెందిన నిమ్మకాయల చిన్నాతో ప్రేమలోఉంది. గంజాయికి బానిసైన చిన్నా రెండు నెలల క్రితం రూ.500 అడిగితే.. తన సోదరుడు డబ్బులివ్వలేదనే కోపంతో ఒంటికి నిప్పంటించుకుని తీవ్రంగా గాయపడ్డాడు. కాకినాడలోని ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందాడు. అప్పట్నుంచి మౌనిక కళాశాలకు వెళ్లడం మానేసింది. చిన్నాకు సంబంధించిన దుస్తులు, వస్తువులను గదిలో పెట్టుకుని ఫొటోలు గోడలకు అతికించి చూసుకుంటూ.. మానసిక కుంగుబాటుతో ఉంటోంది. సోమవారం ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని ప్రాణం తీసుకుంది. మేనమామ త్రిమూర్తులు పోలీసులకు ఫిర్యాదు చేయగా యువతి మృతదేహానికి ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. ఘటనపై ఎస్సై నూకరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
పర్చూరులో టీడీపీ దొంగ ఓట్లపై ఫిర్యాదు
సాక్షి ప్రతినిధి, బాపట్ల: బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో ఓటర్ల జాబితాలో 2013 నుంచి 2023 వరకు జరిగిన అవకతవకలపై వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి ఆమంచి కృష్ణమోహన్ సోమవారం రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్కుమార్మీనాను కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమంచి మాట్లాడుతూ.. 2013లో కేవలం మూడునెలల వ్యవధిలోనే సుమారు 20 వేల దొంగ ఓట్లు చేర్చగా.. అప్పటి ఆర్ఓ ఈ అవకతవకలపై విచారణ చేయమని క్రిమినల్ కేసు పెట్టారన్నారు. అప్పటి నుంచీ అది పెండింగ్‌లో ఉందన్నారు. 2014లో టీడీపీ ప్రభుత్వం రాగానే ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు ఏఆర్ఓ ఆఫీస్ నుంచి నివేదిక లేదంటూ కోర్టుకు అప్పటి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తప్పుడు సమాచారం ఇచ్చారన్నారు. 2018లో సుమారు 15 వేల దొంగ ఓట్లు చేర్చారన్నారు. ఇలా ఇప్పటికి 2013 నుంచి 2023 జనవరి 1వ తేదీ కొత్త ఓటరు జాబితా ప్రకారం, సప్లిమెంటరీ ఓటరు జాబితా వరకు సుమారు 40వేల దొంగ ఓట్లు ఇప్పటి టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు చేర్చి అక్రమ పద్ధతిలో స్వల్ప మెజార్టీతో ఎమ్మెల్యే అయ్యారన్నారని ఆరోపించారు. వీటితోపాటు విదేశాలలో ఉంటున్న వారి ఓట్లు, చనిపోయిన వారి ఓట్లు, దేశంలో ఇతర ప్రాంతాలలో స్థిరపడిన వారి ఓట్లు, పెళ్లి చేసుకుని వేరే ప్రాంతాలకు వెళ్లిన ఆడపడచుల ఓట్లు తొలగించకుండా వాటిపేరుతో దొంగ ఓట్లతో అప్రజాస్వామికంగా ఎన్నికలు పర్చూరులో జరుగుతోందని వివరించారు. మార్టూరు ప్రస్తుత ఏఈఆర్ఓ తన లాగిన్‌లోని డేటాను ఏలూరికి ఎలా ఇచ్చారని ప్రశి్నంచారు. ఒక ప్రత్యేక అధికారి బృందంతో ఇంటింటికి సమగ్ర విచారణ జరిపి ప్రత్యేక ఓటరు ధ్రువీకరణ చేయాలని, ఓట్లు చేర్పు కార్యక్రమాన్ని చేపట్టాలని కోరారు. -
మొదటి భార్యకు తెలియకుండా రెండో పెళ్లి.. మనస్తాపంతో నిద్రమాత్రలు మింగి
అన్నమయ్య :భర్త తనను ఇంటి నుంచి గెంటివేసి, రెండోపెళ్లి చేసుకున్నాడని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా న్యాయం జరగకపోవడంతో ఓ వివాహిత ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన సోమవారం మదనపల్లెలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని కురవంకకు చెందిన డేరంగుల రమేష్, బాబూకాలనీకి చెందిన శివజ్యోతికి 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. పిల్లలు లేరు. దీంతో శివజ్యోతిపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ రమేష్ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేశాడు. శివజ్యోతి తండ్రితో కలిసి బాబూకాలనీలో నివాసం ఉంటోంది. ఈ క్రమంలో మొదటిభార్యకు తెలియకుండా చరితను రెండో వివాహం చేసుకుని ఒక బిడ్డకు తండ్రి అయ్యాడు. విషయం తెలుసుకున్న శివజ్యోతి శనివారం భర్త ఇంటి ముందు తనకు న్యాయం చేయాలంటూ నిరసన వ్యక్తం చేసింది. భర్తపై తాలూకా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. రెండు రోజులుగా పోలీసులు ఫిర్యాదుపై స్పందించకపోవడం, భర్తపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో శివజ్యోతి మనస్తాపం చెంది ఆదివారం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్సల అనంతరం ఆమె తేరుకోకపోవడంతో మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. -
తల్లి కర్మకాండకు వెళ్లి వస్తూ.. తిరిగిరాని లోకాలకు..
హైదరాబాద్: ఏపీలోని కడప సమీపంలో చెన్నూరు హైవేౖపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నగరానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. ఖైరతాబాద్ ప్రేమ్‌నగర్‌లోని ఇంజినీర్ కాసెల్‌లో హన్నె పద్మావతి (60) నివాసముంటున్నారు. ఆమె కూతురు కొండేటి విజయరాణి (35), అల్లుడు కొండేటి కృష్ణ (43), మనవడు రుషి (14), మనవరాలు నిహారిక (18)లు ఆనంద్‌నగర్‌లోని ఓ అపార్ట్మెంట్లో నివాసముంటున్నారు. శుక్రవారం కొండేటి కృష్ణ తండ్రి మరణించడంతో అంత్యక్రియల కోసం తిరుపతిలోని బైరాగి పట్డేడకు పద్మావతి సహా అయిదుగురు కారులో బయల్దేరారు. శనివారం అంత్యక్రియలకు హాజరైన తర్వాత ఆదివారం ఉదయం తిరిగి నగరానికి బయల్దేరారు. వీరు ప్రయాణిస్తున్న కారు కడప దాటి చెన్నూరు సమీపంలోకి రాగానే ఆగి ఉన్న లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ముందు కూర్చున్న పద్మావతి అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్ర గాయాలపాలైన కృష్ణ, రుషి కడప రిమ్స్ ఆస్పత్రిలో కన్నుమూశారు. విజయరాణి, నిహారికలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృత్యు ముఖం నుంచి అప్పుడు బయటపడినా.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఖైరతాబాద్ ప్రేమ్‌నగర్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. రెండేళ్ల క్రితం ఈ కుటుంబ సభ్యులు యాదాద్రి వెళ్లి తిరిగి నగరానికి వస్తూ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. కారు పూర్తిగా ధ్వంసమైంది. అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. కానీ.. ఆదివారం మరోసారి జరిగిన రోడ్డు ప్రమాదం ముగ్గురు ప్రాణాలను బలిగొనడంతో మృతుల బంధువులు కన్నీటి పర్యంతమవుతున్నారు. పద్మావతి కుమారుడు మున్నా కుమార్ లండన్‌లో ఉన్నత చదువుల కోసం ఇటీవల వెళ్లాడు. తల్లి మరణ వార్తతో సోమవారం తిరిగి వస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పద్మావతి తాను నివసించే అపార్ట్‌మెంట్‌కు సెక్రటరీగా ఉన్నారు. అందరితోనూ ఆమె కలుపుగోలుగా ఉండేవారని అపార్ట్మెంట్ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. -
పాడేరులో బస్సు ప్రమాదం
సాక్షి, పాడేరు, పాడేరు రూరల్, సాక్షి, అమరావతి, నెట్వర్క్: విశాఖ నుంచి పాడేరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఘాట్ రోడ్డులో అదుపుతప్పి లోయలోకి దూసుకుపోయిన ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. మరో 28 మందికి గాయాలయ్యాయి. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో విశాఖలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఈ దుర్ఘటన గురించి తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు మంత్రి గుడివాడ అమర్నాథ్ అక్కడకు చేరుకున్నారు. ఆర్టీసీ, పోలీస్ శాఖ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించాలని సీఎం జగన్ ఆదేశించారని తెలిపారు. శాశ్వత అంగవైకల్యం పొందిన వారికి రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.లక్ష చొప్పున పరిహారం అందజేస్తామన్నారు. పాడేరు జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మంత్రి పరామర్శించారు. అత్యవసర వైద్యం అవసరమైతే విశాఖ కేజీహెచ్ లేదా కార్పొరేట్ ఆస్పత్రులకు తరలించాలని, క్షతగాత్రులు పూర్తిగా కోలుకునే వరకు వైద్య సాయం అందించాలని స్పష్టం చేశారు. పాడేరు ఘాట్‌లో ప్రమాదాలు నివారించేందుకు రవాణ శాఖ అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపిస్తామన్నారు. ఎలా జరిగింది..? మధ్యాహ్నం 12 గంటల సమయంలో విశాఖ కాంప్లెక్స్ నుంచి ఆర్టీసీ బస్సు(ఏపీ 31జెడ్ 0285) పాడేరుకు బయలుదేరింది. ఈ క్రమంలో చోడవరంలో కొంతమంది ప్రయాణికులు ఎక్కారు. మొత్తం 34 మంది ప్రయాణికులతో బస్సు వెళుతోంది. పాడేరుకు 12 కిలోమీటర్ల దూరంలో ఘాట్‌లోని వ్యూపాయింట్ వద్ద మలుపులో రోడ్డు పక్కన చెట్టు కొమ్మలను తప్పించే ప్రయత్నంలో బస్సు అదుపు తప్పింది. రక్షణ గోడను ఢీకొట్టి వందడుగుల లోయలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం సూర్రెడ్డిపాలెంకు చెందిన నరవ నారాయణమ్మ(50), అల్లూరి జల్లా పాడేరు మండలం జి.కొత్తూరు గ్రామానికి చెందిన గిరిజనుడు సీసా కొండన్న(55) తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద ఘటనను ప్రత్యక్షంగా చూసిన ద్విచక్రవాహనదారులు గడ్డంగి రమేష్, ఆనంద్, కారులో వెళ్తున్న టి.శేషగిరి లోయలోకి దిగి బాధితులను కాపాడారు. గాయాలపాలైన వారిన రోడ్డుపైకి మోసుకొచ్చి 108 సాయంతో పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. లోయలో బస్సు కింద పడి ఉన్న మృతదేహాలను బయటకు తీసేందుకు సీఐ సుధాకర్, ఎస్ఐ రంజిత్, స్థానికులంతా ఎంతో శ్రమించారు. కలెక్టర్ సుమిత్‌కుమార్ జిల్లా ఆస్పత్రిని సందర్శించి బాధితులను పరామర్శించారు. మెడికవర్‌కు తరలింపు క్షతగాత్రుల్లో కొందరిని మెరుగైన వైద్యం కోసం రాత్రి విశాఖలోని మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో రోలుగుంట మండలం యర్రవరం గ్రామానికి చెందిన ఒకే కుటుంబ సభ్యులు కిల్లో బోడిరాజు (39), బొట్ట చిన్నమ్ములు (48), బొట్ట దుర్గాభవాణి (14), బొట్ట రామన్న (14), సామర్ల బాబురావు (50) ఉన్నారు. ఐసీయూకి తరలించి చికిత్స అందిస్తున్నారు. చిన్నమ్ములుకు తీవ్రగాయాలైనట్లు వైద్యులు వెల్లడించారు. ఆమె తలకు బలమైన గాయం కావడంతో పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. మనవడు, మనవరాలిని చూసేందుకు వెళ్లి.. బస్సు ప్రమాదంలో అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం సూరెడ్డిపాలేనికి చెందిన నారాయణమ్మ మృతి చెందడంతో గ్రామంలో విషాదచాయలు నెలకొన్నాయి. అనారోగ్యంతో ఉన్న తమ మనవడు, మనవరాలిని చూసేందుకు ఈశ్వరరావు, నారాయణమ్మ దంపతులు ఉదయం 10 గంటల సమయంలో సబ్బవరం వద్ద బస్సు ఎక్కారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో కోడలికి ఫోన్ చేసి దారిలో ఉన్నట్లు చెప్పారు. అంతలో ప్రమాదం జరగడంతో నారాయణమ్మ అక్కడికక్కడే మృతి చెందారు. కళ్ల ముందే భార్య చనిపోవడంతో ఈశ్వరరావు గుండెలవిసేలా రోదించారు. ఆయనకు స్వల్ప గాయాలు కావడంతో పాడేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. తల్లి మృతి చెందిన వార్త తెలియటంతో కుమారులు ప్రసాద్, అర్జునరావు, వెంకట రమణ విషాదంలో కూరుకుపోయారు. చెట్టును తప్పించబోయి.. ‘వంజంగి కాంతమ్మ వ్యూ పాయింట్’ వద్ద రోడ్డుకు అడ్డంగా పడి ఉన్న చెట్టు పక్క నుంచి బస్సును పోనిచ్చే క్రమంలో డ్రైవర్ అంచనా తప్పింది. బస్సు రోడ్డు అంచు వరకు వెళ్లడంతో వెనుక చక్రాలు రక్షణ గోడను దాటి లోయవైపు జారిపోవడం అంతా క్షణాల్లో జరిగిపోయింది. ఆ సమయంలో నేను పాడేరు నుంచి బైకుపై ఘాట్ రోడ్డులో దిగువకు వస్తున్నా. ఎదురుగా బస్సును చూసి బైకు పక్కకు తీసి ఆపా. చెట్టును దాటుకుని వస్తుందనుకున్న బస్సు ఒక్కసారిగా లోయలోకి జారిపోవటాన్ని చూసి చేష్టలుడిగిపోయా! రోడ్డు అంచుకు పరిగెత్తుకుని వెళ్లాం. అన్నీ పరిమి డొంకలు కావడంతో కిందకు వెళ్లడానికి అవకాశం లేదు. తుప్పల్లో పడిపోయి ఒకరు చనిపోగా.. బస్సులో మరొకరు మృతి చెందారు. గాయాలతో బయట పడ్డ వారిని అంతా కలసి 108, ఇతర వాహనాల్లో పాడేరు ఆస్పత్రికి తరలించాం. బస్సులో ఆర్నెళ్ల చిన్నారి కూడా ఉంది. కళ్ల ముందే లోయలోకి.. మైదాన ప్రాంతానికి కారులో వెళుతున్నాం. మా కళ్ల ముందే ఆర్టీసీ బస్సు లోయలోకి దూసుకుపోయింది. లోయలోకి దిగి తీవ్ర గాయాల పాలైన ప్రయాణికులను రోడ్డుపైకి మోసుకొచ్చాం. అదే దారిలో వస్తున్న కొందరు వాహనదారులు మాకు సహాయపడ్డారు. ఇద్దరు వృద్ధులు చనిపోయారు. పోలీసులకు సమాచారం అందించి అంబులెన్స్‌లు, 108 వాహనాల్లో గాయపడిన వారిని పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించాం. – ప్రత్యక్ష సాక్షులు గడ్డంగి రమేష్‌బాబు, పూజారి ఆనంద్, శేషగిరి చెట్టు కొమ్మను తప్పించబోయి.. ఘాట్‌లో బస్సును నెమ్మదిగా నడుపుతున్నా. మలుపులో రోడ్డు పక్కన ప్రమాదకరంగా ఉన్న చెట్టు కొమ్మను తప్పించబోయే క్రమంలో బస్సు అదుపు తప్పింది. అదే సమయంలో ఓ బైక్ ఎదురుగా రావడంతో బస్సు లోయలోకి దూసుకుపోయింది. చెట్టు అడ్డుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దిగువ రోడ్డులో బస్సు బోల్తా కొట్టి ఉంటే ప్రాణనష్టం అధికంగా ఉండేది. ఇద్దరు ప్రయాణికులు మృతి చెందడం, అనేకమంది గాయపడడం ఎంతో బాధగా ఉంది. –కిముడు సత్తిబాబు, బస్సు డ్రైవర్ ఆ చిన్నారి మృత్యుంజయురాలు.. పాడేరు ఘాట్‌లో జరిగిన బస్సు ప్రమాదంలో నెలల వయసున్న ఓ శిశువు సురక్షితంగా బయటపడింది. డుంబ్రిగుడ మండలం తూటంగి గ్రామానికి చెందిన తాంగుల జ్యోతి, సత్యనారాయణ దంపతులకు నాలుగు నెలల క్రితం శిశువు జన్మించింది. ప్రస్తుతం వీరు విశాఖలో ఉంటున్నారు. పాడేరు మండలం పి.గొందూరులో తమ బంధువుల ఇంటికి వచ్చేందుకు విశాఖలో బస్సెక్కారు. ప్రమాదంలో తల్లి జ్యోతి తన బిడ్డకు ఎలాంటి గాయాలు కాకుండా కాపాడుకుంది. ఆమె తలకు మాత్రం తీవ్ర గాయమైంది. క్షతగాత్రులలో కొందరి వివరాలు.. అల్లూరి జిల్లా చింతపల్లి మండలం కోటగున్నలకు చెందిన పాంగి సింహాద్రి, హుకుంపేట మండలం ఇసుకగరువుకు చెందిన వంతాల కోటిబాబు, అడ్డుమండకు చెందిన వంచంగిబోయిన రవిబాబు, పాడేరు మండలం దిగుమోదాపుట్టుకు చెందిన కిరసాని వెంకటేష్, కించూరు పంచాయతీ దోనెలకు చెందిన కోడా పద్మ, కిండంగి గ్రామానికి చెందిన జంబు మాధవి, డోకులూరు పంచాయతీ మండిపుట్టుకు చెందిన బోయిన నాగేశ్వరరావు, గెడ్డంపుట్టుకు చెందిన చల్లా పెంటమ్మ, జి.మాడుగుల మండలం గెమ్మెలి పంచాయతీకి చెందిన పి.చిట్టిబాబు, అనకాపల్లి జిల్లా వి.మాడుగుల మండలం లోవ కృష్ణాపురం గ్రామానికి చెందిన కిముడు సత్తిబాబు, చింతపల్లి మండలం కోటగున్నల గ్రామానికి చెందిన పాంగి సింహాద్రి, గెమ్మెలి నగేష్, హుకుంపేట మండలం రంగశీల పంచాయతీ ఒంటిపాకకు చెందిన బంటు రఘునాథ్, అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం సూరెడ్డిపాలేనికి చెందిన నరవ ఈశ్వరరావు, నాతవరం మండలం యర్రవరంలోని ఒకే కుటుంబానికి చెందిన బొట్టా చిన్నమ్మలు, బొట్టా నర్శింహమూర్తి, బొట్టా దుర్గాభవాని, బొట్టా రమణ, ముంచంగిపుట్టు మండలం సొనియాపుట్టుకు చెందిన కిల్లో బొదినేష్, హుకుంపేట మండలం భీమవరం పంచాయతీ గంగరాజుపుట్టు గ్రామానికి చెందిన కొర్రా బొంజుబాబు, ముంచంగిపుట్టు మండలం కిలగాడకు చెందిన సమల లక్ష్మీకాంత్. -
‘ఘోస్ట్’ చందా.. మార్గదర్శి దందా!
సాక్షి, అమరావతి: ఈయన పేరు సుబ్రహ్మణ్యం. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలం కోటపోలూరు గ్రామస్తుడు. బాపట్ల జిల్లా చీరాలలోని మార్గదర్శి చిట్‌ఫండ్స్ బ్రాంచి కార్యాలయంలో ఓ చిట్టీ గ్రూపులో చందాదారుగా నమోదయ్యారు. ఈయన ఏనాడూ చీరాల మార్గదర్శి చిట్ ఫండ్స్ కార్యాలయానికి వెళ్లలేదు. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో చందాదారుగా చేరనే లేదు. కానీ చీరాల మార్గదర్శి చిట్ ఫండ్స్ కార్యాలయంలో మాత్రం ఆయన్ను చందాదారుగా నమోదు చేయడం గమనార్హం. విడ్డూరంగా ఉన్నప్పటికీ ఇది నిఖార్సైన నిజం. దేశంలో ఇంత వరకు ఏ చిట్ ఫండ్స్ సంస్థలు, ప్రైవేటు బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు చేయని రీతిలో వినూత్న రీతిలో మార్గదర్శి సాగిస్తున్న ఆర్థిక అక్రమాలకు ఇది తాజా నిదర్శనం. ఇలా ఎందుకు చేశారంటే.. ఇక్కడ మార్గదర్శి చిట్ ఫండ్స్ ఇలా ఎలా చేసిందనే సందేహం రావడం సహజం. ఎలా అంటే సుబ్రహ్మణ్యం ఆధార్ కార్డును తమ ఏజంట్ల ద్వారా సేకరించి ఆయనకు తెలియకుండానే చిట్టీ గ్రూపులో చందాదారునిగా చేర్చింది. ఇలాంటి వారిని ‘ఘోస్ట్ చందాదారులు’ అని వ్యవహరిస్తారు. అంటే చందాదారులు లేకుండానే వారి పేరిట చిట్టీ గ్రూపుల్లో సభ్యత్వం కొనసాగిస్తారు. అయితే తాను చందాదారునిగా ఉన్నానని సుబ్రహ్మణ్యానికి తెలియదు కాబట్టి ఆయన చందా చెల్లించరు. ఆయన్ని ఎవరూ అడగరు కూడా. దాంతో అసలు విషయం బయటకు వచ్చే అవకాశమే లేదు. ఆయన పేరిట ఉన్న చిట్టీకి ప్రతి నెలా మార్గదర్శి చిట్ ఫండ్స్ యాజమాన్యం చందా చెల్లించకపోయినా, చెల్లించినట్టుగా రికార్డుల్లో నమోదు చేస్తుంది. ప్రతి నెల చందాదారునికి వచ్చే డివిడెండ్‌ను మాత్రం సుబ్రహ్మణ్యం పేరిట తానే తీసుకుంటుంది. ఒక నెల సుబ్రహ్మణ్యం పేరిట చిట్టీ పాట పాడతారు. ఆ చిట్టీ పాట మొత్తం (ప్రైజ్‌మనీ) మార్గదర్శి యాజమాన్యం తమ సొంత ఖాతాలో వేసుకుంటుంది. అంటే రూపాయి చందా చెల్లించకుండానే.. ప్రతి నెల డివిడెండ్ మొత్తం తీసుకోవడంతోపాటు చిట్టీ పాట పేరిట ప్రైజ్ మనీ కూడా కొల్లగొడుతోంది. ఇలా వెలుగు చూసింది.. మార్గదర్శి చిట్ ఫండ్స్ కార్యాలయాల్లో సోదాల్లో భాగంగా సందేహం కలిగిన చందాదారులను స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ, సీఐడీ అధికారులు సంప్రదిస్తున్నారు. ఆ విధంగా సూళ్లూరుపేటకు చెందిన సుబ్రహ్మణ్యం చీరాలలో చిట్టీ గ్రూపులో సభ్యుడిగా ఉండటం ఏంటనే సందేహం వచ్చి అధికారులు సంప్రదించడంతో అసలు వ్యవహారం బట్టబయలైంది. మార్గదర్శి చిట్ ఫండ్స్‌కు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 37 బ్రాంచీల పరిధిలో ఇలాంటి ఘోస్ట్ చందాదారులు భారీగా ఉండొచ్చనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ఘోస్ట్ చందాదారుల దందాతోపాటు చందాదారులను దురుద్దేశంతో అప్పుల ఊబిలోకి నెట్టేస్తూ వారిని ఆర్థికంగా ఇక్కట్ల పాటు చేస్తోందని కూడా ఈ సోదాల్లో వెల్లడైంది. సీఐడీ అదనపు డీజీ సంజయ్, స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రామకృష్ణ, సీఐడీ ఎస్పీ అమిత్ బర్దర్ మంగళగిరిలోని సీఐడీ ప్రధాన కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఘోస్ట్ చందాదారులు, చందాదారులకు తెలియకుండానే వారిని ష్యూరిటీగా చూపించడం తదితర మోసాలకు పాల్పడిన ఫిర్యాదులతో మార్గదర్శి చిట్ ఫండ్స్‌పై మూడు కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. విలేకరుల సమావేశంలో వారు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఘోస్ట్ చందాదారులతో భారీగా అక్రమాలు వ్యక్తులకు తెలియకుండానే వారి ఆధార్ నంబర్లు సేకరించి, చిట్టీ గ్రూపుల్లో సభ్యులుగా చూపిస్తున్నారు. ఆ విధంగా ఘోస్ట్ చందాదారుల పేరిట డివిడెండ్లతోపాటు చిట్టీ మొత్తాన్ని మార్గదర్శి చిట్ ఫండ్స్ తమ ఖాతాల్లో జమ చేసుకుంటూ మోసానికి పాల్పడుతోంది. ఇది చిట్‌ఫండ్ చట్టానికి విరుద్ధం. ఇతర చందాదారుల ప్రయోజనాలకు విఘాతం కూడా. ఎందుకంటే ఇతర చందాదారుల ఆర్థిక ప్రయోజనాలకు విరుద్ధంగా అంటే వారికి తక్కువ డివిడెండ్ వచ్చేలా చేస్తున్నారు. మరోవైపు ఘోస్ట్ చందాదారునికి ఎక్కువ వేలంపాట మొత్తం (ప్రైజ్‌మనీ) వచ్చేట్టుగా వేలం నిర్వహిస్తున్నారు. అప్పుల ఊబిలోకి చందాదారులు చిట్టీ గ్రూపు ప్రారంభంలోనే చందాదారుల నుంచి సంతకాలు తీసుకుని తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు. ఏకంగా చందాదారుల ఆస్తులను తమ పేరిట రాయించుకోవడం మార్గదర్శి చిట్‌ఫండ్స్ దారుణాలకు నిదర్శనం. ముందుగా తీసుకున్న సంతకాలను దుర్వినియోగం చేస్తూ ఓ చందాదారునికి కనీసం సమాచారం ఇవ్వకుండానే ఆయన్ను మరో చందాదారునికి ష్యూరిటీగా రికార్డుల్లో నమోదు చేస్తున్నారు. దాంతో చిట్టీ పాట పాడిన చందాదారుడు వాయిదాలు చెల్లించ లేదు కాబట్టి, ష్యూరిటీగా పేర్కొన్న చందాదారుడు చెల్లించాలని రికార్డుల్లో చూపిస్తున్నారు. ఓ చిట్టీ పాట పాడిన చందాదారు ప్రైజ్‌మనీ తీసుకుని రెండు వాయిదాలు చెల్లించిన తర్వాత మిగిలిన వాయిదాలు చెల్లించకపోతే.. ఆ చిట్టీ పాటను రద్దు చేసి సంబంధిత నెలకు కొత్తగా చిట్టీ పాట నిర్వహించాలని చట్టం చెబుతోంది. కానీ దీన్ని మార్గదర్శి చిట్ ఫండ్స్ పట్టించుకోవడం లేదు. చిట్టీ వాయిదాలు చెల్లించలేని చందాదారులతో మాట్లాడి వారిని మరో చిట్టీ గ్రూపులో సభ్యులుగా చేరుస్తోంది. ఆ కొత్త గ్రూపులో డివిడెండ్‌తో పాత గ్రూపు వాయిదాలు చెల్లించవచ్చు అని చెబుతోంది. ఇలా ఒక చందాదారుని లెక్కకు మించి చిట్టీ గ్రూపుల్లో చందాదారుగా చూపిస్తోంది. దాంతో ఆ చందాదారు మార్గదర్శి చిట్ ఫండ్స్‌కు భారీగా బకాయిలు పడేట్టు చేస్తోంది. అతి సామాన్య పూజారిని ఏకంగా 22 చిట్టీ గ్రూపుల్లో చందాదారునిగా చేర్చారు. మరో వ్యక్తిని ఏకంగా 60 చిట్టీ గ్రూపుల్లో చందాదారునిగా చేర్చినట్టు చెప్పారు. కానీ ఆయన ఏకంగా 90 చిట్టీ గ్రూపుల్లో చందాదారునిగా చూపించినట్టు సోదాల్లో వెల్లడైంది. ఇలాంటి అక్రమాలకు అంతే లేదు. ఆ చందాదారుడు ఓ చిట్టీలో పాటపాడినప్పటికీ అతి తక్కువ అంటే నామమాత్రంగానే ప్రైజ్‌మనీ పొందుతున్నారు. ఎంతగా అంటే రూ.50 లక్షల చిట్టీ గ్రూపులో సభ్యుడైన ఓ చందాదారుడు రూ.46 లక్షలకు చిట్టీ పాట పాడితే ఆయనకు మార్గదర్శి చిట్‌ఫండ్స్ చేతికి ఇచ్చింది కేవలం రూ.20 మాత్రమే. మరో చందాదారుడు రూ.18 లక్షలకు చిట్టీ పాట పాడితే చేతికి వచ్చింది కేవలం రూ.200. మార్గదర్శి చిట్ ఫండ్స్‌లో ఇలాంటి అక్రమాలు కుప్పలు కుప్పలుగా బయటపడుతున్నాయి. వందకుపైగా ఫిర్యాదులు చందాదారుల నుంచి ఫిర్యాదులు లేకుండానే మార్గదర్శి చిట్‌ఫండ్స్‌పై కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలను స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ, సీఐడీ అధికారులు ఖండించారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ పాల్పడుతున్న మోసాలపై పెద్ద సంఖ్యలో చందాదారులు పోలీసులు, సీఐడీ అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. మూడు రోజుల్లోనే దాదాపు వంద మందికిపైగా లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. అధికారులు వాటిని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటున్నారు. కాగా, చందాదారులు పూర్తి వివరాలతో ఫిర్యాదులు చేసేందుకు సీఐడీ విభాగం ప్రత్యేకంగా వాట్సాప్ నంబర్ 9493174065 కేటాయించింది. మూడు చోట్ల చీటింగ్ కేసులు నమోదు చీరాల, అనకాపల్లి, రాజమహేంద్రవరం టూ టౌన్ పోలీస్ స్టేషన్లలో మార్గదర్శి చిట్ ఫండ్స్‌పై మూడు కేసులు నమోదు చేశారు. మూడు చోట్ల బ్రాంచి మేనేజర్లు (ఫోర్‌మెన్)లతోపాటు మార్గదర్శి చిట్‌ఫండ్స్ యాజమన్యాంపై వివిధ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఆ మూడు బ్రాంచిల మేనేజర్లను సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారిని అరెస్టు చూపించి న్యాయస్థానంలో హాజరు పరుస్తామని సీఐడీ అదనపు డీజీ సంజయ్ తెలిపారు. ► సూళ్లూరుపేటకు చెందిన సుబ్రహ్మణ్యానికి తెలియకుండా ఆయన్ను చీరాలలో చందాదారునిగా నమోదు చేసినందుకు చీరాల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ► అనకాపల్లికి చెందిన బి.వెంకటేశ్వరరావు నెలకు రూ.10 వేలు చొప్పున చందా చెల్లిస్తూ చిట్టీ గ్రూపులో చేరారు. 50 నెలల చందాలు చెల్లించిన తర్వాత ఆయన రూ.4,61,989కు చిట్టీ పాడారు. ఆయన ఎన్నిసార్లు మార్గదర్శి చిట్‌ఫండ్స్ కార్యాలయం చుట్టూ తిరిగినా ప్రైజ్‌మనీ ఇవ్వలేదు. ఎట్టకేలకు ఆయనకు రూ.20 మాత్రమే వస్తుందని చెప్పారు. మిగిలిన మొత్తం ఆయన ష్యూరిటీ ఇచ్చిన మిగిలిన చిట్టీల్లో సర్దుబాటు చేసినట్టు చూపారు. అసలు తాను ఎవరికీ ష్యూరిటీ ఇవ్వలేదని చెప్పినా, బ్రాంచి మేనేజర్ వినిపించుకోలేదు. ఆయన సంతకాలు ఫోర్జరీ చేసిన పత్రాలు చూపించారు. ఆ కాపీలు కావాలని అడిగినా సరే ససేమిరా అన్నారు. దాంతో వెంకటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ► కోరుకొండ విజయ్‌కుమార్ అనే చందాదారుడు మార్గదర్శి చిట్‌ఫండ్స్ రాజమహేంద్రవరం బ్రాంచిలో రూ.5 లక్షల చిట్టీ గ్రూపులో చేరారు. కొన్ని వాయిదాలు చెల్లించాక 2020 జూన్‌లో రూ.3 లక్షలకు చిట్టీ పాట పాడారు. కానీ ఆయనకు ప్రైజ్‌మనీ ఇచ్చేందుకు మార్గదర్శి చిట్ ఫండ్స్ మేనేజర్ తిరస్కరించారు. విజయ్‌కుమార్ తన స్నేహితుడు మల్లికార్జున రావుకు 2019లో ష్యూరిటీ ఇచ్చారని, ఆ స్నేహితుడు వాయిదాలు చెల్లించడం లేదు కాబట్టి ఆయనకు ప్రైజ్‌మనీ ఇవ్వమని చెప్పారు. అసలు మల్లికార్జునరావు చిట్టీ మొత్తం గడువు తీరనే లేదని తెలిసింది. తనను మార్గదర్శి చిట్ ఫండ్స్ యాజమాన్యం మోసం చేసిందని విజయ్‌కుమార్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. మార్గదర్శి ఓ ‘నల్ల’ ఖజానా సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్ ఫండ్స్ నల్ల కుబేరుల అడ్డా అన్నది బట్టబయలైంది. తవ్వేకొద్దీ అక్రమాలు పుట్టలు పుట్టలుగా వెలుగు చూస్తున్నాయి. రాష్ట్రంలో అక్రమ సంపాదనను దాచుకునేందుకు రామోజీరావు సృష్టించిన ఓ మినీ స్విస్ బ్యాంకు అని ఆధారాలతో స్పష్టమవుతోంది. ఉభయతారకంగా నల్లకుబేరులు, రామోజీరావు ఈ బ్లాక్ మనీ దందా సాగిస్తున్నారన్నది తేటతెల్లమవుతోంది. మరోవైపు మార్గదర్శి చిట్‌ఫండ్స్ బ్రాంచి మేనేజర్లు చందదారుల సొమ్మును భారీగా తమ సొంతానికి మళ్లించుకున్న గుట్టు కూడా రట్టు అవుతోంది. శని, ఆదివారాల్లో స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ, సీఐడీ అధికారుల సోదాల్లో ఈ వ్యవహారం వెలుగు చూసింది. మనీ లాండరింగ్ జరుగుతున్నట్టుగా వెల్లడి కావడం గమనార్హం. రూ.కోటి కంటే అధికంగా చిట్టీలు వేసిన, అక్రమ డిపాజిట్లు చేసిన వారు దాదాపు వెయ్యి మంది వరకు ఉన్నట్టు ఇప్పటి వరకు గుర్తించినట్టు సమాచారం. వారి మార్గదర్శి లెడ్జర్ పుస్తకాల్లోగానీ, ఆ చందాదారులకు ఇచ్చిన పాస్బుక్లోగానీ వారి పాన్ నంబర్లు, ఆధార్ నంబర్లు నమోదు చేయనే లేదన్నది వెల్లడైంది. కొందరు చందాదారులను సీఐడీ అధికారులు పిలిచి విచారించగా వారికి అన్ని కోట్ల రూపాయలు ఏలా వచ్చాయన్నది చెప్పలేకపోయారు. పాన్ కార్డు, ఆధార్ కార్డు వివరాలను ఆన్లైన్ ఖాతాల్లో ఎందుకు లింక్ చేయలేదని మార్గదర్శి చిట్ ఫండ్స్ బ్రాంచి మేనేజర్లను ప్రశ్నిస్తే వారు విస్మయకర సమాధానమిచ్చారు. ఈ అక్రమాల్లో మేనేజర్లు కీలక పాత్ర పోషిస్తున్నట్టు స్పష్టమైంది. రాష్ట్రంలోని ముఖ్య పట్టణంలోని ఓ బ్రాంచి మేనేజర్‌ను పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. దాంతో రామోజీరావుతోసహా మొత్తం మార్గదర్శి చిట్ ఫండ్స్ యాజమాన్యం హడలెత్తిపోయింది. ఆ మేనేజర్, ఆయన కుటుంబ సభ్యుల పేరిట దాదాపు రూ.100 కోట్ల వరకు ఆస్తులు ఉన్నట్టు వెల్లడైంది. ఈ మేనేజర్ చాలా మంది పెద్దలకు బినామీ అన్నది స్పష్టమవుతోంది. ఇలా పలువురు మేనేజర్లు ఉన్నట్లు సమాచారం. కాగా, కొందరు బ్రాంచి మేనేజర్లు చందాదారుల చందా మొత్తాలను తమ సొంతానికి వాడుకుంటున్నట్టు కూడా వెల్లడైంది. విశాఖపట్నంలో దీనిని నిర్ధారించారు. ఇతర బ్రాంచి కార్యాలయాల్లో ఆరా తీస్తున్నారు. పలు చోట్ల అవకతవకలకు సంబంధించి లెడ్జర్ ఖాతాలు, చిట్టీ పాటల మినిట్స్ పుస్తకాలు స్వాదీనం చేసుకున్నారు. చీటింగ్‌కు ‘మార్గదర్శి’గా కడప మేనేజర్ కడప అర్బన్: మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాల్లో కొత్త కోణం వెలుగుచూసింది. చందాదారులను మోసం చేసి అక్రమార్జనకు పాల్పడటంలో మార్గదర్శి యాజమాన్యమే కాదు.. సంస్థలో కొందరు మేనేజర్లు కూడా సిద్ధహస్తులేనన్న విషయాన్ని ఆ సంస్థ పూర్వపు ఉద్యోగులు వెలుగులోకి తెచ్చారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ సంస్థ వైఎస్ఆర్ జిల్లాలో కడప బ్రాంచి మేనేజర్‌గా పనిచేస్తున్న డి. శేషుబాబు అక్రమార్జనను వివరిస్తూ, ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ సీబీఐ విజయవాడ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఆయన ఏజెంట్స్ కోడ్లతో చిట్లు భారీ మొత్తంలో అక్రమంగా సంపాదించాడని తెలిపారు. ఆ ఫిర్యాదులో పేర్కొన్న వివరాలివీ.. శేషుబాబు ఆయన సొంత ఏజెంట్ వి. శ్రీనివాసులరెడ్డి (ఏజెంట్ కోడ్ నం: సిపి0000160) కోడ్ ద్వారా ఎక్కువ మంది చిట్ సభ్యులను చేర్పించారు. ఎన్.వి బాలాజీ (ఏజెంట్ కోడ్ నం. జె0000088), గౌరి (ఏజెంట్ కోడ్ నం: జె0000167), ఎ.వి మహేష్ (ఏజెంట్ కోడ్ నం: సిపి000077)తో పాటు ఇంకా ఇతర ఏజెంట్ కోడ్లలో కూడా చిట్లు వేసి విపరీతంగా సంపాదించాడు. తనకు అనుకూలమైన వారికి తక్కువ బిడ్ అమౌంట్ కేటాయిస్తారు. మిగిలిన వారికి (స్టాఫ్) ఎక్కువ బిడ్‌ను మేనేజరే ఇంత అని నిర్ణయిస్తారు. పాట సమయానికి కస్టమర్ వచ్చినప్పుడు కూడా బిడ్ ఎక్కువగా వచ్చేట్లు ఉద్యోగులతో పాడిస్తాడు. ఈ విధంగా సంపాదించిన సొమ్ముతో బంగారం, బెంగళూరులో సొంత ఇల్లు, కడపలో స్థలాలు, అపార్ట్మెంట్లో ఒక ఫ్లాటు కూడా కొన్నారు. మిగిలిన మార్గదర్శి ఉద్యోగులను స్టాఫ్ కోడ్లతో చిట్స్ వేయమనీ వేధిస్తాడు. చెప్పినట్లు చేయకుంటే దుర్భాషలాడతాడు. దీంతో కొందరు సీనియర్ స్టాఫ్ వేరే సంస్థలకు వెళ్లిపోయారు. శేషుబాబు కొందరు ఖాతాదారులకు ఇవ్వాల్సిన గిఫ్ట్‌లను కూడా అమ్మేసుకున్నారు. ఆయనకు అనుకూలమైన ఉద్యోగులైన శివసతీష్, రిసెప్షనిస్టు వరలక్షుమ్మ కూడా ఏజెంట్ కోడ్లలో వేసుకోవడానికి ప్రాధాన్యత కల్పించాడు. శివసతీష్ చిట్టీ కమీషన్ డబ్బులను వడ్డీలకు ఇచ్చి మరింత సంపాదిస్తున్నాడు. పాట పాడటానికి ఎవ్వరూ రాకపోతే శేషుబాబు, శివసతీష్, వరలక్షుమ్మ కలిసి తక్కువ బిడ్ పోతున్నా ఎక్కువ బిడ్ పోయేలా చేస్తారు. దీనిద్వారా అసలైన చందాదారులకు వడ్డీ ఎక్కువ పడుతుంది. కస్టమర్లకు బిడ్ వచ్చిన తర్వాత కూడా డబ్బు ఇవ్వడానికి వీరు ఇబ్బందులకు గురిచేస్తారని వారు సీబీఐకి ఇచ్చిన వినతిపత్రంలో పేర్కొన్నారు. మార్గదర్శి మేనేజర్ అరెస్ట్ సాక్షి, రాజమహేంద్రవరం: మార్గదర్శి రాజమహేంద్రవరం బ్రాంచ్‌లో చిట్ డబ్బులు తిరిగి ఇవ్వకుండా మూడేళ్లుగా తిప్పుకుంటున్న వైనం బహిర్గతమైంది. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన టూ టౌన్ పోలీసులు బ్రాంచ్ మేనేజర్‌ను అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు సౌత్ జోన్ డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. రాజమండ్రి ఏఆర్ డిపార్ట్మెంట్లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న కోరుకొండ విజయ్‌కుమార్ మార్గదర్శిలో మోసంపై శనివారం టూటౌన్ సీఐ గణేష్‌కు ఫిర్యాదు చేశారు. విజయ్‌కుమార్ మార్గదర్శి చిట్స్‌లో 2019లో రూ.5 లక్షల చిట్ వేశారు. 50 నెలల కాల వ్యవధిలో నెలకు రూ.10 వేల చొప్పున చిట్కు నగదు చెల్లించాలి. తనకున్న ఆర్థిక అవసరాల రీత్యా ఆయన 2020 జూన్ 21వ తేదీన రూ.3 లక్షలకు చిట్ పాడారు. చిట్ డబ్బులు చెల్లించాల్సిన మార్గదర్శి మేనేజర్, బ్రాంచ్ అధికారులు ఆయనకు డబ్బులు ఇవ్వలేదు. అదేమని ప్రశ్నిస్తే ఇద్దరి ష్యూరిటీ కావాలన్నారు. వాళ్ల కోరిక మేరకే ఇద్దరి ష్యూరిటీ తీసుకువచ్చారు. ఇప్పుడైనా చీటీ డబ్బులు ఇవ్వాలని కోరగా.. మీరు ఇతరులకు ష్యూరిటీ పెట్టారు. అది క్లియర్ చేస్తే మీ చీటీ డబ్బులు ఇస్తామని మేనేజర్ సమాధానం చెప్పారు. ష్యూరిటీకి సంబంధించిన డబ్బులు హెడ్ కానిస్టేబుల్ స్నేహితుడు చెల్లించేశారు. అయినా.. ఇతనికి రావాల్సిన రూ.3 లక్షలు ఇవ్వకుండా మూడేళ్లుగా తిప్పుకుంటున్నారు. ఈ విషయమై హెడ్ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు డీఎస్పీ తెలిపారు. మార్గదర్శి రాజమండ్రి బ్రాంచ్ మేనేజర్ సత్తి రవిశంకర్‌ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు చెప్పారు. -
తల్లి కర్మకాండలకు వెళ్లొస్తూ..
చెన్నూరు: తల్లి కర్మకాండలకు వెళ్లి తిరిగి వస్తూ కొడుకు, అతని కుమారుడు, అత్త దుర్మరణం చెందగా, భార్య, కుమార్తె తీవ్ర గాయాలతో ఆస్పత్రిపాలైన ఘటన వైఎస్సార్ జిల్లా చెన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కడప–కర్నూలు జాతీయ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... తెలంగాణ రాష్ట్రం ఖైరతాబాద్ ప్రాంతంలో నివాసం ఉండే కొండేటి కృష్ణ(48) తన తల్లి కర్మకాండల నిమిత్తం భార్య విజయరాణి, కుమార్తె నిహారిక, కుమారుడు రిషి(15), అత్త అన్నే పద్మావతితో కలిసి తిరుపతి వెళ్లారు. కర్మకాండల కార్యక్రమం పూర్తి చేసుకుని తిరిగి తన కారులో హైదరాబాద్‌కు బయలుదేరారు. చెన్నూరు ఆంధ్ర స్పైస్ సమీపానికి రాగానే ఒక్కసారిగా కారు అదుపు తప్పి వేగంగా వెళ్లి ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కృష్ణ, పద్మావతి, రిషి అక్కడికక్కడే మృతి చెందగా, విజయరాణి, నిహారికలు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న చెన్నూరు ఎస్ఐ శ్రీనివాసులురెడ్డి వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేమికుల ఆత్మహత్య
వైఎస్సార్: వారంలో అమ్మాయికి వివాహం చేసేలా పెద్దలు నిశ్చయించారు. అంతలోపే అమ్మాయి ప్రేమికుడితో కలిసి వెళ్లిపోయి ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న కుటుంబీకులు బోరున విలపిస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి. అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం మానేవారిపల్లి పంచాయతీ చిట్టెంవారిపల్లికు చెందిన బొడె కళ్యాణి(17) తిరుపతి సమీపంలోని భాకరాపేట అడవిలో ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. రామసముద్రం మండలం మానేవారిపల్లి పంచాయతీ చిట్టెంవారిపల్లి గ్రామానికి చెందిన రమణ, రజినిల కుమార్తె బి.కల్యాణి(17) చిత్తూరు జిల్లా పుంగనూరులోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. అయితే అదే కళాశాలలోనే చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం లద్దిగం గ్రామానికి చెందిన యుగంధర్(17) కూడా చదువుతున్నాడు. వారిద్దరూ కలిసి ప్రేమలో పడ్డారు. ఈ నేపథ్యంలో అమ్మాయికి వివాహం చేయాలని కుటుంబీకులు నిశ్చితార్థం చేశారు. ఈ నెల 26న వివాహం జరగాల్సి ఉండగా కల్యాణి శుక్రవారం నుంచి కనిపించకుండా పోయింది. చుట్టు పక్కల, బంధువుల ఊర్లలో విచారణ చేసినా ఆచూకీ లభించలేదు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు శనివారం రామసముద్రం పోలీస్‌స్టేషన్‌లో అదృశ్యం అయినట్లు ఫిర్యాదు చేశారు. అయితే ఆదివారం తిరుపతి జిల్లాలోని భాకరాపేట ఘాట్ రోడ్డులోని ఫారెస్టు చెక్‌పోస్టు వద్ద అడవిలో యుగంధర్, కల్యాణిలు చెట్టుకు ఉరివేసుకొని వేలాడుతుండటం పశువుల కాపరుల కంట పడ్డారు. సమాచారం తెలుసుకున్న అక్కడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చంద్రగిరి సీఐ రాజశేఖర్, ఇన్చార్జి ఎస్ఐ వెంకటేశ్వర్లు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాగా కల్యాణికి ఇంక వారంలో వివాహం ఉండగా.. ఇలా ఆత్మహత్య చేసుకోవడంపై కుటుంబీకులు బోరున విలపిస్తున్నారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com