breaking news
-
రెండు ప్రమాదాల్లో 8 మంది దుర్మరణం
సాక్షి ప్రతినిధి, కడప/ప్రొద్దుటూరు క్రైం/దువ్వూరు: వైఎస్సార్ జిల్లాలో రెండుచోట్ల జరిగిన ప్రమాదాల్లో 8 మంది దుర్మరణం పాలయ్యారు. గువ్వలచెరువు ఘాట్ రోడ్డులో కారు, కంటైనర్ ఢీకొని ఐదుగురు మృత్యువాత పడగా.. దువ్వూరు మండలం చింతకుంట వద్ద కారు అదుపుతప్పి చిన్నారి సహా ముగ్గురు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. చక్రాయపేట మండలం కె.వడ్డెపల్లెకు చెందిన సత్యనారాయణ ఇటీవల మృతి చెందారు.స్వగ్రామంలో సోమవారం మధ్యాహ్నం పెద్దకర్మ నిర్వహించారు. అనంతరం సమీప బంధువుల ఇళ్లలో దీపం చూసేందుకు సతీమణి వల్లెపు చిన్న వెంకటమ్మ (50) అద్దె కారులో బయలుదేరారు. తోడుగా ఆమె తమ్ముడు గుజ్జుగారి నాగయ్య (46), కోడలు వల్లెపు నాగలక్ష్మీదేవి (35) వెళ్లారు. వారు ప్రయాణిస్తున్న కారు గువ్వలచెరువు ఘాట్ రోడ్డు మీదుగా వెళ్తుండగా.. రాయచోటి నుంచి కడప వైపు వస్తున్న అమరరాజా బ్యాటరీ లోడ్ కంటైనర్ కారును ఢీకొట్టింది.ఘటనలో చిన్న వెంకటమ్మ, ఆమె తమ్ముడు నాగయ్య, కోడలు నాగలక్ష్మీదేవి, డ్రైవర్ షరీఫ్ అక్కడికక్కడే మృతి చెందారు. కంటైనర్ అదుపు తప్పి లోయలో పడిపోవడంతో దానిని నడుపుతున్న డ్రైవర్ కూడా మరణించాడు. క్లీనర్ ఉన్నాడా లేడా అన్న విషయం తేలాల్సి ఉంది. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కాగా.. మృతదేహాలు అందులో ఇరుక్కుపోయాయి. మృతదేహాలను క్రేన్ సాయంతో బయటకు తీశారు. ఎస్పీ హర్షవర్దన్‌రాజు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.మొక్కు తీరకుండానే.. దువ్వూరు మండలం చింతకుంట వద్ద కారు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో కర్నూలుకు చెందిన కియన్సింగ్ (9 నెలలు), భగత్‌సింగ్ (34), నాగలక్ష్మి (70) దుర్మరణం చెందారు. కర్నూలులోని గణే‹Ùనగర్లో ఉన్న ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ కాలనీకి చెందిన భగత్‌సింగ్, కవితాబాయ్ దంపతులకు కియాన్‌సింగ్ అనే కుమార్తె ఉంది. అతను కర్నూలులో ఎస్ఆర్ ఫ్లెక్స్ ప్రింటింగ్ నిర్వహిస్తున్నాడు. వారి ఒక్కగానొక్క కుమార్తె కియన్సింగ్కు 9 నెలలో తిరుమలలో పుట్టు వెంట్రుకలు తీయించేందుకు కర్నూలు, మార్కాపురంలో ఉంటున్న ముఖ్య బంధువులు కలిసి మొత్తం 17 మంది సోమవారం బయలుదేరారు.ఒక కారును భగత్‌సింగ్ నడుపుతుండగా.. దువ్వూరు సమీపంలో ఎదురుగా మరో వాహనం రావడంతో ఒక్కసారిగా వాహనాన్ని సైడ్ తీసుకునే ప్రయత్నంలో కారు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో గాయపడిన వారిని ప్రొద్దుటూరు, మైదుకూరు ప్రభుత్వాస్పత్రులకు తరలించారు. తీవ్ర గాయాలై చికిత్స పొందుతున్న చిన్నారి కియాన్‌సింగ్, తండ్రి భగత్‌సింగ్, అమ్మమ్మ నాగలక్ష్మి మృతి చెందారు. అదే కారులో ఉన్న చిన్నారి తల్లి కవితాబాయ్, బంధువులు యుగంధర్, ఉమామహేశ్వరి, సాయి, కల్యాణ్‌సింగ్ గాయపడ్డారు. వీరంతా ప్రొద్దుటూరు జిల్లా ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. -
ఆ ఆత్రమే అగ్గిరాజేసింది
విశాఖ సిటీ: ఎసైన్షియా అడ్వాన్స్›డ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో జరిగిన ప్రమాదంపై ఉన్నత స్థాయి కమిటీ పరిశీలనలో అనేక విస్మయకర విషయాలు వెలుగుచూసినట్లు తెలిసింది. కొత్త డ్రగ్ ఉత్పత్తిని వేగంగా ప్రారంభించాలన్న ఆత్రంలో ట్రయల్ రన్ నిర్వహించకపోవడం, నిబంధనలు పాటించకపోవడం వంటివే ఈ భారీ ప్రమాదానికి కారణమన్న విషయాన్ని నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం.ప్రమాద కారణాలతో పాటు కంపెనీలో 6 లోటు పాట్లను హైలెవల్ కమిటీ గుర్తించినట్లు తెలిసింది. అత్యవసర ద్వారాలు, భవనానికి బాహ్య కారిడార్లు లేకపోవడం, ప్రీ స్టార్టప్ తనిఖీలు చేయకపోవడం, విద్యుత్ వైరింగ్ బహిరంగంగా ఉండడం, రసాయనం లీక్ అయిన వెంటనే దాన్ని నిలువరించకపోవడం వంటి కారణాలను నివేదికలో పొందుపరిచింది. ముందస్తు తనిఖీలు నిల్ ఎసైన్షియాలో కొత్త డ్రగ్ ఉతి్పత్తిని ఇటీవలే ప్రారంభించింది. వాస్తవానికి ఏ డ్రగ్ ఉత్పత్తి చేయాలన్నా ముందు తప్పనిసరిగా ట్రయల్ రన్ నిర్వహించాలి. ఈ ప్రక్రియలో అన్నీ సజావుగా ఉన్నట్లు నిర్థారించుకున్నాకే ఉత్పత్తిని ప్రారంభించాలి. సదరు కంపెనీ యాజమాన్యం మాత్రం ముందస్తు తనిఖీలు లేకుండానే, వేగంగా ఉత్పత్తి ప్రారంభించేందుకు ఉపక్రమించింది. ఫలితంగానే ఈ ప్రక్రియలో నెలకొన్న అనేక లోటుపాట్లను గుర్తించలేకపోయారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని ఉన్నత స్థాయి కమిటీ నివేదికలో పొందుపరిచినట్లు తెలిసింది. గతంలోనూ ఇదే వైఖరి ఈ కంపెనీ గతంలో కూడా ఇదే తరహాలో వ్యవహరించినట్లు కమిటీ పరిశీలనలో గుర్తించింది. ప్రీ స్టార్టప్ తనిఖీలు లేకుండానే భారీ స్థాయిలో డ్రగ్ ఉత్పత్తిని చేపడుతున్నట్లు వెల్లడైంది. అదృష్టవశాత్తూ ఇప్పటి వరకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో కంపెనీలో వరుసగా అదే తరహాలో ఔషధాల ఉత్పత్తి ప్రక్రియను నిర్వహిస్తోంది.తాజాగా అదే విధానాన్ని కొనసాగించగా.. మిౖథెల్ టెర్ట్ బ్యూటిల్ ఎథర్(ఎంటీబీఈ) రసాయనం లీకై గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఎంసీసీ ప్యానల్ మీద పడడంతో భారీ ప్రమాదం సంభవించింది. 17 మంది మృత్యువాత పడ్డారు. 36 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేపడుతున్న ఉన్నత స్థాయి కమిటీ ఇదే అంశాలపై నివేదిక తయారు చేసినట్లు సమాచారం. త్వరలోనే ఈ నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది. -
వైఎస్సార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. అయిదుగురి మృతి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్ జిల్లాలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చింతకొమ్మదిన్నె పరిధిలోని గువ్వలచెరువు ఘాట్ రోడ్లో కంటైనర్‌కు వెనకనుంచి ఓ కారు బలంగా ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురితోపాటు, కంటైనర్ డ్రైవర్ అక్కడిక్కడే మృతి చెందారు. కారులోని వారంతా బంధువుల అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారు నుజ్జు నుజ్జు అయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతులను చక్రాయపేట మండలం కొన్నేపల్లికి చెందిన వారిగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
యువతి ఫొటోలు మార్ఫింగ్!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు/తెనాలి రూరల్: ఒకవైపు కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం మీద దేశవ్యాప్తంగా దుమారం కొనసాగుతోంది. మరోవైపు మహిళలకు రక్షణ కల్పిస్తామని, వేధింపులను అరికడతామని సీఎం చంద్రబాబు, హోం మంత్రి అనిత రోజుకొక ప్రకటన చేస్తున్నారు. కానీ, వైద్య రంగంలోనే ఉన్న ఓ యువతి ఫొటోలను టీడీపీ నాయకుడి తమ్ముడు, మరో ఇద్దరు కలిసి మార్ఫింగ్ చేసి బెదిరించడం సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు... తెనాలికి చెందిన ఓ యువతి వైద్య రంగంలో స్పీచ్ అండ్ హియరింగ్ టెక్నీషియన్‌గా చేస్తున్నారు. ఆమె ఫొటోలను కొందరు మార్ఫింగ్ చేశారు. వాటిని కొరియర్ ద్వారా ఆమెకు పంపి బెదిరించారు. దీంతో బాధితురాలు రెండు వారాల కిందట తెనాలి టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు విచారణ చేపట్టిన పోలీసులు ప్రకాశం జిల్లా కంభం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడి సోదరుడు అబ్దుల్ సత్తార్, మార్కాపురానికి చెందిన కరుణాకర్, గుంటూరులోని గోరంట్లకు చెందిన భరత్‌ను ఐదు రోజులు కిందట అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. కానీ, హార్డ్‌వేర్ ఇంజినీర్ అయిన భరత్‌ను శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మిగిలిన ఇద్దరినీ గుట్టుగా తమ స్వస్థలాలకు పంపినట్టు సమాచారం. ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతానికి చెందిన ఓ ఎమ్మెల్యే ఒత్తిడి మేరకు ఇద్దరు నిందితులను వదిలేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో గుంటూరు జిల్లాలో పనిచేస్తున్న ప్రకాశం జిల్లాకు చెందిన ఓ పోలీసు అధికారి కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది.హైదరాబాద్ లింక్‌పై విచారణ ఏదీ? అబ్దుల్ సత్తార్, కరుణాకర్, భరత్ హైదరాబాద్ కేంద్రంగా కొన్నేళ్ల నుంచి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు సమాచారం. తెనాలి పోలీసుల విచారణలో వీరి వద్ద అనేకమంది యువతులు, మహిళల నగ్న చిత్రాలు లభించినట్లు తెలిసింది. హైదరాబాద్‌కు చెందిన ఒక మహిళ ఈ ముఠాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. నిందితుల్లో ఒకరు ఆమెతో సహజీవనం చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. టీడీపీ నాయకుల ప్రమేయంతోనే పూర్తి స్థాయిలో విచారణ చేయకుండానే నిందితులను వదిలిపెట్టినట్లు సామాజిక మధ్యమాల్లో ప్రచారం సాగుతోంది.కేసు దర్యాప్తు పూర్తి కాలేదు ఈ కేసు దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదు. కేసులో ఎవరినీ వదిలిపెట్టలేదు. ప్రధాన నిందితుడిని మాత్రమే అరెస్టు చేశాం. ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది. మరింతమంది నిందితులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ కేసులో సున్నితమైన అంశాలు ఉండడంతో పూర్తి వివరాలను అప్పుడే వెల్లడించే అవకాశం లేదు. – ఎ.సుధాకర్, తెనాలి టూ టౌన్ సీఐ -
5 సెకన్లలో 2 పేలుళ్లు
సాక్షి, విశాఖపట్నం : అనకాపల్లి జిల్లా అచ్చుతాపురం సెజ్‌లోని ఎసైన్షియా అడ్వాన్స్డ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫార్మా కంపెనీలో నిర్లక్ష్యం కారణంగానే పెను ప్రమాదం సంభవించిందని, ప్రాణ నష్టం ఎక్కువగా ఉందని ప్రభుత్వం నియమించిన ఉన్నతస్థాయి కమిటీ వెల్లడించింది. తొలి పేలుడు జరిగిన 5 సెకన్లలోనే మరో పేలుడు సంభవించిందని తెలిపింది. భారీ పేలుళ్ల ధాటికి పెద్ద ఎత్తున మంటలు చెలరేగడం, గ్రౌండ్ ఫ్లోర్ గోడలు, మొదటి అంతస్తు శ్లాబు కొంత భాగం కూలడం, ఈ సంస్థ భవనాలకు అత్యవసర మార్గాలు, అత్యవసర మెట్లు లేకపోవడంతో కార్మికులు తప్పించుకోలేక ప్రాణ నష్టం అధికంగా ఉందని వెల్లడించింది.ఎసైన్షియా ఫార్మా కంపెనీలో ఈ నెల 21న జరిగిన ఘోర ప్రమాదంలో 17 మంది మృత్యువాత పడగా 39 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దారుణంపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల శాఖ, బాయిలింగ్, ఫైర్ సేఫ్టీ, ఏపీపీసీబీ అధికారులు, నిపుణులతో ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. ఈ కమిటీ ఇంత ఘోర ప్రమాదం జరగడానికి ముందు ఏం జరిగింది, కారణాలేమిటో క్షుణ్ణంగా విచారణ జరిపి ప్రాథమిక నివేదిక రూపొందించింది. వారం రోజుల్లో మరో నివేదిక ఇవ్వనున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి.నివేదికలోని ప్రధానాంశాలు..⇒ కొత్త డ్రగ్స్ తయారీకి ప్రయోగాలు ఇక్కడే జరుగుతుంటాయి. బ్యాచ్‌ల వారీగా పరిశోధనలు చేస్తుంటారు. మూడు నెలల విరామం తర్వాత ఫస్ట్ బ్యాచ్ పరిశోధన ప్రారంభించింది. ⇒ఆ రోజు రియాక్టర్లో 500 లీటర్ల మిౖథెల్ టెర్ట్ బ్యూటైల్ ఈథర్ (ఎంటీబీఈ) ద్రావకం తయారీకి వ్యాక్యూమ్ డిస్టిలేషన్ ప్రారంభించారు. ⇒ ఇక్కడ తయారయ్యే వ్యాక్యూమ్ డిస్టిలేషన్ని నైట్రోజన్ ప్రెజర్ ద్వారా రెండో ఫ్లోర్లో ఉన్న 5 వేల లీటర్ల స్టోరేజ్ ట్యాంక్‌కు పంపింగ్ చేస్తున్నారు. ⇒మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో రెండో అంతస్తులో ఎంటీబీఈ లీకై ఘాటైన వాసన వస్తుండటాన్ని ప్రొడక్షన్ టీమ్ గుర్తించింది. ఇది క్రమంగా మొదటి అంతస్తుకూ వ్యాపించింది. ⇒ మొదటి అంతస్తులోని కార్మికులు ఆ వాసనను గుర్తించారు. వెంటనే అప్రమత్తమై అక్కడి నుంచి రెండో అంతస్తుకు వెళ్తున్న ఎంటీబీఈ పైప్‌లైన్‌ను పరిశీలించారు. ట్రాన్స్ఫర్ లైన్లో ఎంటీబీఈ వ్యాక్యూమ్ లీకవుతున్నట్లు గుర్తించారు. ⇒ఈ కెమికల్ పైపుల నుంచి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న విద్యుత్ కేబుల్స్ వెళ్తున్న కటౌట్స్ పైన పడి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న మైక్రో క్రిస్టలైన్ సెల్యులోజ్ (ఎంసీసీ) ప్యానెల్‌పై పడుతున్నట్లు గుర్తించారు. ⇒ వెంటనే ఇంజినీరింగ్ అండ్ ప్రొడక్షన్ సిబ్బందికి కార్మికులు సమాచారమిచ్చారు. లంచ్ టైమ్ కావడంతో ఆ సమయంలో ఆ సిబ్బంది అందరూ భోజనం చేస్తున్నారు. దీంతో లీకేజీని అరికట్టేందుకు ఎవ్వరూ రాలేదు. ⇒ బిల్డింగ్‌లో ప్రతి ఫ్లోర్‌ను అనుసంధానం చేసేలా ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్స్ (ఏహెచ్‌యూ) ఉన్నాయి. ఏహెచ్‌యూ ప్రధాన యూనిట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది. ఏవైనా వాయువులు లీకైతే ఏహెచ్‌యూ ద్వారా బయటకు వెళ్లిపోతుంటాయి. కానీ.. ఆ రోజు లీకైన ఎంటీబీఈ రసాయనం ఆవిరి ఏహెచ్‌యూ ద్వారా ప్రాసెస్ డెవలప్మెంట్ (పీడీ) ల్యాబ్, కార్యాలయం గదులు, క్వాలిటీ కంట్రోల్, క్వాలిటీ ఎస్యూరెన్స్ గదులు, యుటిలిటీ అండ్ మెటీరియల్ నిల్వ ప్రాంతాలకు వ్యాపించింది.⇒ మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో భోజనం అనంతరం వచి్చన బృందాలు లీకేజీని అరికట్టే ప్రక్రియ ప్రారంభించాయి. ⇒ కానీ.. అప్పటికే ఏహెచ్యూల ద్వారా కమ్ముకున్న ఆవిరి లోవర్ ఎక్స్‌ప్లోజివ్ లిమిట్ (ఎల్‌ఈఎల్) స్థాయికి చేరుకుంది. దీంతో హఠాత్తుగా గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఎంసీసీ ప్యానెల్లో భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి గ్రౌండ్ ఫ్లోర్ ప్లెయిన్ సిమెంట్, కాంక్రీట్ (పీసీసీ) గోడలు కూలిపోయాయి. మొదటి అంతస్తు శ్లాబులో కొంత భాగం కుప్పకూలింది. ⇒ వెంటనే కార్మికులు, సిబ్బంది బయటకు వెళ్లిపోయేందుకు ప్రయతి్నంచారు. ⇒ 5 సెకెన్లలోనే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఏహెచ్‌యూ మెయిన్ ప్యానల్లో రెండో పేలుడు సంభవించింది. దీంతో.. ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్స్ ఉన్న మొదటి, రెండో అంతస్తుల్లోని అన్ని రూములూ తీవ్ర ప్రభావానికి గురయ్యాయి. ⇒ ఈ పేలుడు తీవ్రత పీడీ ల్యాబ్, యుటిలిటీ, ప్రొడక్షన్ ఏరియాలోనూ తీవ్ర ప్రభావం చూపింది. ⇒ వెంటవెంటనే పేలుళ్లు సంభవించడంతో అత్యవసర మార్గాలు లేక కార్మికులు తప్పించుకోవడానికి అవకాశం లేకుండాపోయింది. ⇒ ఎంటీబీఈ 28 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద లోవర్ ఎక్స్‌ప్లోజివ్ లిమిట్ (ఎల్‌ఈఎల్) 1.6 శాతం, అప్పర్ ఎక్స్‌ప్లోజివ్ లిమిట్ (యూఈఎల్) 15.1 శాతం ఉంది. ఈ ఎంటీబీఈ ఆవిరి అన్ని ప్రాంతాలకూ తీవ్రస్థాయిలో విస్తరించడమే ప్రమాదానికి ప్రధాన కారణం.⇒ దాదాపు బిల్డింగ్‌లోని అన్ని ప్రాసెసింగ్ ప్రాంతాలకూ ఏహెచ్యూల ద్వారా ఎంటీబీటీఈ వ్యాక్యూమ్ చేరుకుంది. దీనివల్ల పేలుడు తీవ్రత ఎక్కువైంది. ⇒ బిల్డింగ్ నిర్మాణంలో లోపాలు కూడా ప్రమాద తీవ్రతకు ప్రధాన కారణం. పీడీ ల్యాబ్, ఆఫీస్ బిల్డింగ్, మ్యాన్యుఫాక్చరింగ్ యూనిట్ పక్కపక్కనే ఉండకూడదు. కానీ.. అన్నీ ఒకేచోట ఏర్పాటు చేశారు. ⇒ అంతేకాకుండా ఈ భవనాలన్నింటినీ ఏహెచ్యూతో అనుసంధానం చేశారు. ప్రాసెసింగ్ ప్రక్రియ చేయని రూమ్లకూ వీటిని అనుసంధానం చేయడం కూడా ప్రధాన లోపమే. ⇒ ముఖ్యంగా.. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్, సెకండ్ ఫ్లోర్లకు ఒక్కటే మెట్ల మార్గం ఉంది. ఎలాంటి అత్యవసర మార్గాలు, అత్యవసర మెట్లు లేవు. ఉన్న ఒక్క మార్గం మొదటి పేలుడు ధాటికే కూలిపోయింది. ⇒ భవనం చుట్టూ ఎక్స్టర్నల్ కారిడార్లు లేవు. అనుసంధానించే మెట్లు కూడా లేవు. దీనివల్ల కొందరు దూకేందుకు ప్రయతి్నంచినా.. భవన శిథిలాల కింద పడి నలిగిపోయారు. ⇒ ప్రతి ఫార్మా కంపెనీలోనూ ఉత్పత్తి ప్రారంభించే ముందు ప్రతి విభాగాన్ని క్షణ్ణంగా పరిశీలిస్తారు. దీన్నే ప్రీ స్టార్టప్ చెక్స్ (పీఎస్ఎస్ఆర్) అంటారు. ఈ పరిశ్రమలో అది కూడా చెయ్యడం లేదు. ⇒ రసాయన మిశ్రమాలు, రసాయనిక ఆవిరి వెళ్లే లైన్లు సరిగ్గా విద్యుత్ కేబుల్స్ పైనే వేశారు. దీనివల్ల ఏ చిన్న సాల్వెంట్ లీకేజీ జరిగినా నేరుగా విద్యుత్ కేబుల్ కటౌట్స్పై పడటంతో పాటు ఎంసీసీ ప్యానెల్స్ దెబ్బతినేలా వ్యవస్థ ఉంది. ⇒ ఎంటీబీఈ లీకేజీని గమనించిన తర్వాత తక్షణమే స్పందించేందుకు ఎవ్వరూ లేకపోవడం వల్ల.. ఈ సాల్వెంట్ ఆవిరి వాసన పీల్చి ఉద్యోగులు, కార్మికులు ఇబ్బంది పడ్డారు. అయినా.. ఈ ప్రమాదం జరుగుతుందని ఎవ్వరూ ఊహించకపోవడంతో బయటకు వెళ్లకుండా పనిలోనే నిమగ్నమయ్యారు. ఫలితంగా ప్రాణనష్టం ఎక్కువగా సంభవించిందని ఉన్నతస్థాయి విచారణ కమిటీ నివేదికలో స్పష్టం చేసింది. -
రోడ్డు ప్రమాదంలో టీచర్ మృతి
కొవ్వూరు: దేచెర్ల గ్రామ సమీపంలోని చెరువు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో దేవరపల్లి మండలం గౌరీపట్నం జెడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు బడుగు రాజారత్న (47) మృతి చెందారు. ఏడాదిన్నర కుమార్తెకు అనారోగ్యంగా ఉండడంతో సెలవులో ఉన్న ఆమె శనివారమే విధులకు హాజరయ్యారు. అయితే కుమార్తె ఏడుస్తోందని సమాచారం రావడంతో స్వస్థలమైన రాజమహేంద్రవరం బయలుదేరారు. గౌరీపట్నంలో ఎక్స్‌ప్రెస్‌లు ఆపకపోడంతో ఐ.పంగిడి వెళ్లి రాజమహేంద్రవరానికి బస్సు ఎక్కాలని భావించారు. అదే పాఠశాలలో ఉపాధ్యాయుడు కేదాటి ఫణిశేఖర్‌ను సాయం కోరడంతో ఆయన రాజారత్నను తీసుకుని మోటారుసైకిల్‌పై ఐ.పంగిడి బయలుదేరారు. దేచెర్ల చెరువు సమీపంలో బురద మట్టి కారణంగా వాహనం అదుపు తప్పింది. దీంతో ఇద్దరూ కిందపడిపోయారు. ఆ సమయంలో వెనుక వస్తున్న లారీ.. రాజారత్న తలపై నుంచి వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. రాజారత్న భర్త రాజేంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై కర్రి శ్రీహరిరావు తెలిపారు. -
అర్ధరాత్రి పచ్చ మూక అరాచకం.. వైఎస్సార్సీపీ కార్యకర్త మృతి
సాక్షి, శ్రీకాకుళం: ఏపీలో టీడీపీ మూకలు రెచ్చిపోతున్నాయి. పచ్చ బ్యాచ్ దాడుల్లో మరో వైఎస్సార్సీపీ కార్యకర్త మృతిచెందాడు. పది మంది టీడీపీ కార్యకర్తలు కర్రలతో విచక్షణారహితంగా కొట్టడంతో ప్రసాద్ తీవ్ర గాయాల కారణంగా చికిత్స పొందుతూ మృతిచెందాడు.కాగా, పచ్చటి పల్లెలో రాజకీయ చిచ్చు రేగుతోంది. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి ఎక్కడో ఒక చోట వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై పచ్చ మూకల దాడులు జరుగుతూనే ఉన్నాయి. గత ఆదివారం ఎచ్చెర్ల మండలం ఫరీదుపేట గ్రామంలో రాత్రి 11.15 గంటల సమయంలో వైఎస్సార్సీపీ కార్యకర్త కూన ప్రసాద్‌పై టీడీపీ మూకలు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో ప్రసాద్‌కు తీవ్ర గాయాలు కావడంతో జీజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం పరిస్థితి విషమించడంతో వైద్యుల సలహా మేరకు కేజీహెచ్‌కు తీసుకువెళ్లారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ ప్రసాద్ ఈరోజు తెల్లవారుజామున మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. మరోవైపు.. ప్రసాద్ మరణ వార్త విని మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.అర్దరాత్రి అరాచకం.. టీడీపీ వర్గానికి చెందిన కొందరు ఆదివారం రాత్రి జాతీయ రహదారి పక్కనే ఉన్న దాబా హోటల్లో బర్త్‌డే పార్టీ చేసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి బైక్‌లపై గ్రామానికి బయల్దేరారు. అదే సమయంలో కూన ప్రసాద్ తన బండిపై రామ చెరువు వైపు వెళ్తూ.. వారికి ఎదురుపడడంతో వారంతా ఒక్కసారిగా బైక్ ఆపి తాళం తీసుకుని మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. పది మంది కర్రలతో విచక్షణారహితంగా కొట్టడంతో ప్రసాద్ భయంతో పరుగులు తీశాడు. అయినా వదలకుండా వెంటాడి మరీ కొట్టారు. చివరకు బీసీ కాలనీలోని సూర కృష్ణమూర్తి అనే వ్యక్తి ఇంటి టెర్రస్‌పైకి ఎక్కితే.. అక్కడకూ వచ్చి దాడి చేశారు. దాడిలో దెబ్బలకు తాళలేక అపస్మారక స్థితికి చేరటంతో విడిచి పెట్టి వెళ్లిపోయారు.అనంతరం గ్రామంలో పికెట్ నిర్వహిస్తున్న పోలీసులకు విషయం తెలియడంతో వారు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వగా ఎస్ఐ ఆధ్వర్యంలోని సిబ్బంది అక్కడకు వచ్చారు. అనంతరం 108 వాహనంలో క్షతగాత్రుని ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనతో గ్రామంలో పోలీస్ పికెట్ బందోబస్తు సిబ్బంది సంఖ్య పెంచారు. -
తరగతి గదిలో బాలికపై లైంగిక దాడి!
తిరుపతి క్రైమ్: సభ్యసమాజం తలదించుకునేలా.. తరగతి గదిలోనే ఓ బాలికపై లైంగిక దాడి జరిగిన దారుణ ఘటన తిరుపతిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్ సీఐ రామకృష్ణ తెలిపిన వివరాల మేరకు.. తిరుపతిలోని ప్రభుత్వ బాలికల వసతి గృహంలో ఉంటూ నెహ్రూ మున్సిపల్ హైస్కూల్లో 14 సంవత్సరాల విద్యార్థిని తొమ్మిదో తరగతి చదువుతున్నది. ఈ నెల 21వ తేదీన క్లాసులు జరిగిన అనంతరం పీటీ పీరియడ్‌లో విద్యార్థులంతా ఆటలాడుకోడానికి గ్రౌండ్‌కు వెళ్లారు. ఈ సమయంలో సత్యవేడుకు చెందిన.. ఓ ప్రైవేటు కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తున్న రిషి అనే యువకుడు స్కూలుకు వచ్చాడు. బాలికకు మాయమాటలు చెప్పి క్లాస్ రూమ్‌లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. టీచర్ ఆరా తీయడంతో బయటపడ్డ వైనం బాలిక ప్రవర్తన వింతగా ఉండడంతో క్లాస్ టీచర్‌కు శుక్రవారం అనుమానం వచ్చింది. ఎందుకలా ప్రవర్తిస్తున్నావు.. ఆరోగ్యం సరిగా లేదా? అంటూ ప్రశి్నంచింది. బాలిక ఏం లేదంటూనే ఏడవడంతో టీచర్‌కు అనుమానం వచ్చి గట్టిగా నిలదీశారు.దీంతో జరిగిన విషయాన్ని పూర్తిగా తెలిపింది. వెంటనే టీచర్ ప్రభుత్వ బాలికల హాస్టల్ సూపరింటెండెంట్‌కు సమాచారం అందించారు. సూపరింటెండెంట్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రిషిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలికను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
మరో ఫార్మా కంపెనీలో ప్రమాదం
సాక్షి, అనకాపల్లి/పరవాడ: ‘అచ్యుతాపురం–పరవాడ’ సెజ్‌లో వరుస ప్రమాదాలు కార్మికులు, వారి కుటుంబాలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. రెండు నెలల వ్యవధిలో జరిగిన ఏడు ప్రమాదాల్లో 22 మంది మృతిచెందారు. రెండు రోజుల కిందట అచ్యుతాపురం సెజ్‌లోని ఎసైన్షియా ఫార్మా కంపెనీలో 17 మంది మరణించిన దుర్ఘటన మరువక ముందే... పరవాడ సెజ్‌లో మరో ప్రమాదం చోటుచేసుకుంది. పరవాడ సమీపంలోని జేఎన్ ఫార్మాసిటీలో సినర్జిన్ యాక్టివ్ ఇన్‌గ్రేడియంట్స్–3 యూనిట్లో గురువారం అర్ధరాత్రి రియాక్టరు నుంచి రసాయనాలు వెలువడి పొగతో కూడిన మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో జార్ఖండ్‌కు చెందిన ముగ్గురు, విజయనగరం జిల్లాకు చెందిన ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం హుటాహుటిన విశాఖపట్నంలోని ఇండస్ ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రమాదం జరిగింది ఇలా... సినర్జిన్ యాక్టివ్ ఇన్‌గ్రేడియంట్స్–3 యూనిట్లో గురువారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన కాంట్రాక్టు కార్మికులు రొయా ఆర్జీ, లాల్‌సింగ్, ఆయూ ఖాన్, విజయనగరానికి చెందిన కెమిస్ట్ సూర్యనారాయణ కలిసి 6 కేఎల్ సామర్థ్యం ఉన్న రియాక్టర్‌ను చార్జ్ చేస్తున్నారు. రసాయనాలు కలిపేటప్పుడు రియాక్షన్ ఏర్పడి పొగతోపాటు మంటలు వ్యాప్తిచెందాయి. కొద్ది క్షణాల్లోనే మ్యాన్‌హోల్ నుంచి కూడా రసాయనాల రియాక్షన్ సంభవించి మంటలు మరింత వ్యాపించాయి. దీంతో అక్కడే ఉన్న జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన హెల్పర్లు ఓఏ కోరా(24), లాల్‌సింగ్ పుర్తీ(22), రోయాన్ అంజీరియా(22), విజయనగరం జిల్లాకు చెందిన సీనియర్ కెమిస్ట్ సూర్యనారాయణ(34)కు తీవ్ర గాయాలయ్యాయి. ఫార్మా కంపెనీ యాజమాన్యం వెంటనే ప్రొడక్షన్ నిలిపివేసింది. తక్షణమే క్షతగాత్రులను ఇండస్ ఆస్పత్రికి ఎయిర్ బస్సులో తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓఏ కోరాకు 75 శాతం, లాల్‌సింగ్ పుర్తీ, రోయాన్ అంజీరియా(22)లకు 60 శాతానికి పైగా శరీరాలు కాలిపోవడంతో వారి పరిస్థితి విషమంగా ఉంది. సూర్యనారాయణ(34)కు కాలిన గాయాలు తక్కువగా ఉన్నప్పటికీ రసాయనాలు పీల్చడంతో పొట్ట ఉబ్బిపోయింది. ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉంది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన కూటమి నేతలు, అధికారులు సినర్జిన్ యాక్టివ్ ఇన్‌గ్రేడియంట్స్–3 యూనిట్లో ప్రమాదం గురించి తెలుసుకున్న కూటమి నేతలు శుక్రవారం ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఎంపీ సీఎం రమే‹Ù, స్థానిక ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు, కలెక్టర్ విజయ కృష్ణన్, ఎస్పీ దీపిక పాటిల్, ఆర్డీవో మురళీకృష్ణ ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితులను సమీక్షించారు. ఇండస్ ఆస్పత్రిలో క్షతగాత్రులను హోంమంత్రి అనిత పరామర్శించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించడానికి చర్యలు చేపట్టాలని పరిశ్రమ యాజమాన్యాన్ని ఆదేశించారు. రెండు ఘటనలపై కేసులు నమోదు అచ్యుతాపురం సెజ్‌లోని ఎసైన్షియా ఫార్మాలో ప్రమాదానికి కంపెనీ నిర్లక్ష్యమే కారణమని పోలీసులు కేసు నమోదు చేశారు. ఎసైన్షియా ఫార్మా కంపెనీలో ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా సినర్జిన్ ఫార్మాలో ప్రమాదానికి కూడా కంపెనీ నిర్లక్ష్యమే కారణమని సెక్షన్ 125, 289 బీఎన్ఎస్ కింద పరవాడ సీఐ ఎస్.బాలసూర్యరావు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
Atchutapuram: ఒక్కరోజు ఆగినా బతికేది!
సాక్షి, కాకినాడ: సోదరుడికి రాఖీ కట్టి కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపిన హారిక మరొక రోజు కాకినాడలోనే ఉండి ఉంటే మృత్యువు ఒడికి ఆమె చేరి ఉండేది కాదు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలోని ఫార్మా కంపెనీ రియాక్టర్ పేలిన ఘటనలో మృతి చెందిన చర్లపల్లి హారిక (22) కథ ఎవరికైనా గుండెలు పిండేసే విధంగా ఉంటుంది.కడు పేదరికంలో పుట్టి చదువుల తల్లిగా ఎదిగి ఇడుపులపాయ త్రిబుల్ ఐటీలో కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి 8 నెలల క్రితం కెమికల్ ఇంజనీర్ గా ఫార్మా కంపెనీలో ఉద్యోగం పొందిన హారిక కు చిన్నప్పుడే తండ్రి చనిపోయారు. సోదరుడు కూడా చిన్నప్పుడే ఇల్లు వదిలి వెళ్ళిపోవడంతో తల్లి అన్నపూర్ణ, నానమ్మ సంరక్షణలో పెరిగింది.చక్కటి విద్యాభ్యాసంతో మెరిట్ విద్యార్థినిగా పేరు గడించింది. రాఖీ సందర్భంగా పెదనాన్న కుమారుడికి రాఖీ కట్టి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపింది , మరొక రోజు తమతో ఉండాలని వారు కోరినప్పటికీ సెలవు లేదని ఆమె విధులకు అదే రోజు చేరింది. కంపెనీ ల్యాబ్ కు చేరిన కొద్ది గంటల్లోనే రియాక్టర్ పేలిన ఘటనలో హారిక మృత్యువు ఒడికి చేరింది. భవన శిధిలాలలో చిక్కుకొని ఆమె మృతి చెందినట్లుగా తెలుస్తుంది. కుటుంబ సభ్యుల రోదన అందర్నీ కలిసి వేస్తుంది. -
అమెరికాలో వ్యభిచారం.. ఏడుగురు భారతీయుల అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: అమెరికాలో వ్యభిచారం చేస్తూ ఏడుగురు భారతీయులు పట్టుబడ్డారు. వీరిలో ఐదుగురు తెలుగు యువకులు ఉన్నట్టుగా స్థానిక అధికారులు వెల్లడించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. డెంటన్ కౌంటీ షెరీఫ్ అధికారులు వ్యభిచారాన్ని అరికట్టడానికి హాయ్‌ల్యాండ్ విలేజ్ పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతో మంగళవారం టెక్సాస్‌లోని డెంట¯న్లో స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారు. ఇందులో మొత్తం 18 మంది నిందితులు పట్టుబడ్డారు. వీరిలో ఏడుగురు భారతీయులు ఉండగా.. అందులో ఐదుగురు తెలుగువారని అధికారులు వెల్లడించారు. స్థానిక పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో నిఖిల్ బండి, మోనిష్ గల్లా, నిఖిల్ కుమ్మరి, జైకిరణ్ మేకల, కార్తీక్ రాయపాటి ఉన్నారు. వీరిలో పోలీసుల అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించిన ఆరోపణలపై బండి నిఖిల్, కుమ్మరి నిఖిల్‌ను అరెస్ట్ చేశామని, వ్యభిచారం చేయాలని కోరిన ఆరోపణలపై గల్లా మోనిష్, అమిత్‌కుమార్, పోలీసుల అరెస్టు నుంచి తప్పించుకోవడంతోపాటు 18 ఏళ్లలోపు మైనర్‌ను వ్యభిచారం చేయాలని కోరిన ఆరోపణలపై మేకల జైకిరణ్ రెడ్డిని, వ్యభిచారం చేయాలని అభ్యర్థించిన ఆరోపణలపై రాయపాటి కార్తీక్, నబిన్ శ్రేష్ఠలను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. పట్టుబడిన మొత్తం 18 మందిలో ఇద్దరి వద్ద అక్రమ ఆయుధాలు సైతం ఉన్నట్టు గుర్తించామని వెల్లడించారు. ఈ వ్యభిచార ముఠాతో సంబంధాలున్న ఇతర వ్యక్తుల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్టు పేర్కొన్నారు. కాగా, పట్టుబడిన తెలుగు యువకులు రాయపాటి కార్తీక్ చౌదరి, గల్లా మోనిష్చౌదరి టెక్సాస్ ఎన్ఆర్ఐ టీడీపీ వింగ్ కో–ఆర్డినేటర్లు అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. -
పుట్టపర్తిలో భారీ చోరీ
పుట్టపర్తి అర్బన్: పుట్టపర్తి సమీపంలోని కర్ణాటక నాగేపల్లి వద్ద ఉన్న సాయి సందీప్ విల్లాస్–2లో భారీ చోరీ జరిగింది. పుట్టపర్తి రూరల్ సీఐ సురేష్, ఎస్ఐ కృష్ణమూర్తి తెలిపిన వివరాల మేరకు... సాయి సందీప్ విల్లాస్–2లోని 40 నంబర్ ఇంట్లో పుట్టపర్తి వ్యవసాయాధికారి వెంకట బ్రహ్మం, కొత్తచెరువు అగ్రి ల్యాబ్ ఏవో శ్రీవాణి దంపతులు నివాసం ఉంటున్నారు. వారు బుధవారం రాత్రి తమ ఇంట్లోని పై అంతస్తు గదిలో నిద్రించారు. అర్ధరాత్రి వేళ కింద హాలులో చప్పుడు రావడంతో వెంకట బ్రహ్మం కిందకు వచ్చి చూడగా, ఇంటి తలుపు తెరిచి ఉంది. బెడ్ రూంలోకి వెళ్లి చూడగా బీరువా పగులగొట్టి ఉంది. అందులో ఉన్న బంగారు ఆభరణాలు, నగదు కనిపించలేదు. ఆయన వెంటనే అదే అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న పుట్టపర్తి ‘దిశ’ డీఎస్పీ శ్రీనివాసరావుకు సమాచారం ఇచ్చారు. శ్రీనివాసరావు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వగా ఎస్ఐ కృష్ణమూర్తి వచ్చి దొంగల కోసం చుట్టపక్కల వెదికినా కనిపించలేదు. గురువారం ఉదయం రూరల్ సీఐ సురేష్ ఘటనాస్థలానికి వచ్చి ఆధారాలు సేకరించారు. ఏడో తరగతి చదువుతున్న తమ కూతురుకు ప్రతి జన్మదినం రోజున బహుమతిగా ఒక బంగారు నగ చేయిస్తామని, ఆ విధంగా చేయించిన లాంగ్ చైను, పూసల దండ, డాలర్లు, కమ్మలు, చైన్లు కలిపి మొత్తం 37 తులాల బంగారు ఆభరణాలు, రూ.50వేలు నగదును దొంగలు అపహరించారని వెంకట బ్రహ్మం, శ్రీవాణి దంపతులు తెలిపారు. దొంగలు పక్కాగా రెక్కీ నిర్వహించి చోరీకి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. విల్లాస్‌లో ప్రవేశించిన దొంగలు తొలుత ఓ ఇంటి తాళాలు పగులగొట్టి లోపలికి వెళ్లారని, ఆ ఇంట్లో ఏమీ లభించకపోవడంతో పక్కనే ఉన్న వెంకట బ్రహ్మం ఇంట్లో చోరీ చేశారని గుర్తించారు. కాగా, దొంగలు విల్లాస్‌లోకి ప్రవేశించే సమయంలో అదే కాలనీలో ఉన్న ఒకతను గుర్తించి సెక్యూరిటీని అప్రమత్తం చేశారని, అయినా ఉపయోగం లేకపోయిందని స్థానికులు చెబుతున్నారు. -
బంగారం వ్యాపారులపై తుపాకీతో కాల్పులు
చీపురుపల్లిరూరల్(గరివిడి): బంగారు వ్యాపారులపై గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్పులు జరిపిన ఘటన విజయనగరం జిల్లా గరివిడి మండలం అప్పన్నవలస కూడలి వద్ద బుధవారం రాత్రి జరిగింది. గరివిడి ఎస్ఐ ఎల్.దామోదరరావు కథనం ప్రకారం... రాజాం పట్టణంలో నివసిస్తున్న ఇద్దరు బంగారు వర్తకులు రాత్రి 11 గంటల సమయంలో విజయనగరం నుంచి రాజాం వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. చీపురుపల్లి–రాజాం ప్రధాన రహదారిలో గరివిడి మండలం అప్పన్నవలస కూడలి వద్దకు వచ్చేసరికి గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు వాహనాన్ని అడ్డగించి దాడి చేశారు. తుపాకీ తీసి కాల్పులు జరిపారు. ఈ క్రమంలో వర్తకులు తమ వద్ద ఉన్న బంగారాన్ని సమీపంలో ఉన్న తుప్పల్లోకి విసిరేశారు. వారి నుంచి ఏమీ దొరక్కపోవడంతో సెల్ఫోన్లను లాక్కున్నారు. దుండగలు జరిపిన కాల్పుల్లో ఒక వర్తకుడికి బుల్లెట్ తగిలి ఎడమ చేతికి గాయమైంది. ఆయన రాజాం కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనా స్థలాన్ని క్లూస్ టీం బృందం, డాగ్‌స్క్వాడ్ పరిశీలించాయి. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ నెల 7న ఇదే రోడ్డులో గరివిడి మండలం కాపుశంబం కూడలి వద్ద కూడా రాత్రి 12 గంటల సమయంలో చీపురుపల్లి వైపు వెళ్తున్న ఆటోను కొంతమంది వ్యక్తులు ఆపి దాడి చేయడమే కాకుండా వెంటాడి భయాందోళనకు గురిచేశారు. -
ఫ్యూచర్ థ్రెట్.. సైబర్ టెర్రరిజం
సైబర్ నేరగాళ్లు.. లక్షలు, కోట్లలో డబ్బులు వ్యక్తిగత ఖాతాల్లోంచి కొల్లగొట్టడమే కాదు.. సైబర్ టెర్రరిజానికి తెరతీస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న ఉగ్రవాద ముప్పు క్రమంగా కొత్త రూపు సంతరించుకుంటోంది.. ఇది భవిష్యత్తులో జడలువిప్పుకుని సైబర్ టెర్రరిజంగా మారి మానవాళికి ఫ్యూచర్ థ్రెట్‌గా మారబోతోందని సైబర్ భద్రత నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు సైబర్ టెర్రరిజం అంటే ఏంటి? దీంతో ప్రపంచ దేశాలకు వచ్చే ముప్పు ఏంటి? దీన్ని ఎలా ఎదుర్కోవాలి? అన్న విషయాలపై ‘సాక్షి ’ప్రత్యేక కథనం. రోజువారీ జీవితంలో సాంకేతికతపై ఆధారపడటం విపరీతంగా పెరిగిపోయింది. అదే సమయంలో సాంకేతికంగా అభివృద్ధి చెందిన తీవ్రవాదులు వారి ప్రయోజనాల కోసం ఇందులో ఉన్న లొసుగులను ఉపయోగించుకొనే అవకాశం కూడా పెరుగుతోంది. జనజీవనాన్ని స్తంభింపజేసి, వ్యవస్థలను గందరగోళపర్చి తమ గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు డిజిటల్ సాధనాలు, సాంకేతికతను ఉపయోగించడాన్ని సైబర్ టెర్రరిజంగా చెబుతున్నారు సైబర్ భద్రత నిపుణులు. తరచుగా హింసపై ఆధారపడే సంప్రదాయక ఉగ్రవాద రూపాల్లా కాకుండా సైబర్ ఉగ్రవాదులు తమ లక్ష్యాలను సాధించడానికి ఇంటర్నెట్ను ఉపయోగించుకుని వర్చువల్‌గా పనిచేస్తారు. సైబర్ దాడులతో ప్రభుత్వ, ప్రైవేట్ వ్యవస్థలను హ్యాక్ చేయడం, కీలకమైన మౌలిక సదుపాయాలకు తీవ్ర అంతరాయాన్ని కలిగించడం, సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేయడం, ప్రజల్లో విస్తృతమైన భయాందోళనలు సృష్టించడం సైబర్ ఉగ్రవాదుల ప్రధాన లక్ష్యాలు. – సాక్షి, హైదరాబాద్సైబర్ టెర్రరిజానికి గురవుతున్న ప్రధాన రంగాలు సైబర్ ఉగ్రవాదులు ప్రభుత్వరంగ సంస్థలు, పవర్ గ్రిడ్లు, రవాణా నెట్‌వర్క్‌లు, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలు వంటి కీలకమైన మౌలిక సదుపాయాకు అంతరాయం సృష్టించి ప్రజా భద్రత, సంక్షేమానికి ఆటంకాలు కలిగిస్తారు. ప్రతికూల పరిస్థితులను సృష్టించి సామాజిక జీవనాన్ని బలహీనపర్చడం వీరి లక్ష్యం. సోషల్ మీడియా, ఆన్లైన్ ఫోరమ్‌ల ద్వారా తీవ్రవాద భావజాల వ్యాప్తికి, హింసను ప్రేరేపించేందుకు సైబర్ టెర్రరిజాన్ని వాడుతున్నారు. సైబర్ టెర్రరిజాన్ని ఇలా ఎదుర్కోవచ్చు» సైబర్ సెక్యూరిటీ చర్యలు: సైబర్ టెర్రరిస్ట్‌ల నుంచి డిజిటల్ మౌలిక సదుపాయాలను కాపాడుకునేందుకు సైబర్ సెక్యూరిటీ సాంకేతికతను, సైబర్ దాడులను అడ్డుకోవడానికి బలమైన ఫైర్‌వాల్స్‌ను ఏర్పాటుచేసుకోవాలి. చొరబాట్లను గుర్తించే వ్యవస్థలు, ఎన్క్రిప్షన్ మెకానిజమ్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి. వీటి కోసం ప్రభుత్వం అదనంగా పెట్టుబడి పెట్టాలి. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు పరస్పర సహకారంతో సైబర్ సెక్యూరిటీని బలోపేతం చేసేలా ఉమ్మడి ప్రణాళికలు అమలు చేయాలి. » అంతర్జాతీయ సహకారం: సైబర్ ఉగ్రవాదం ముప్పును సమర్థవంతంగా ఎదుర్కోవడానికి, సైబర్నేరగాళ్లను పట్టుకోవడానికి ఆయా దేశాలు ద్వైపాక్షిక, బహుపాక్షిక ఒప్పందాలు చేసుకోవాలి. » ప్రజల్లో అవగాహన పెంచాలి: ఫిషింగ్ స్కామ్‌లు, మాల్వేర్ బెదిరింపులు ఇతర సైబర్ ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. విద్యాసంస్థలు, సైబర్ సెక్యూరిటీ సంస్థలు శిక్షణ, వర్క్‌షాప్‌లు, అవగాహన కార్యక్రమాలను విరివిగా నిర్వహించాలి. 4 రకాలుగా హాని » సైద్ధాంతిక ఉగ్రవాదం: సైబర్ ఉగ్రవాదులు తమ ఎజెండాను ముందుకు తీసుకెళ్లడానికి, అనుచరులను నియమించుకోవడానికి, ప్రత్యర్థులపై హింసను ప్రేరేపించడానికి సైబర్‌స్పేస్‌ను ఒక సాధనంగా ఉపయోగించుకుంటున్నారు. » భౌగోళిక, రాజకీయ లక్ష్యాలు: ప్రత్యర్థి ప్రభుత్వాలను అణగదొక్కడం, రహస్యమైన సమాచారాన్ని దొంగిలించడం, శత్రు భూభాగంలో కీలకమైన అవసరాలకు అంతరాయం కలిగించడం లాంటివి చేస్తారు. » ఆర్థిక లాభం: సైబర్ టెర్రరిజం లక్ష్యం సైతం ఆర్థిక వ్యవస్థల్ని దోచుకోవడమే. ఉగ్ర సంస్థలు లేదా హ్యాకర్లు ర్యాన్సమ్వేర్ దాడులు, ఆర్థిక మోసాలతో డబ్బులు కొల్లగొడుతారు. అవసరమైన డేటాను ఎన్‌క్రిప్‌్ట, డిక్రీప్ట్ చేయడానికి భారీగా డబ్బును డిమాండ్ చేస్తారు. » సైకలాజికల్ వార్ఫేర్: భయం, అనిశి్చతి, అపనమ్మకాన్ని వ్యాప్తి చేసే లక్ష్యంతో ప్రజల మానసిక స్థితిపై ప్రభావం చూపేలా ప్రభుత్వరంగ సంస్థలను హ్యాక్ చేస్తుంటారు. ఎలా చేస్తారు? మాల్వేర్: వైరస్లు, ట్రోజన్లు, ర్యాన్సమ్వేర్ వంటి హానికర సాఫ్ట్వేర్లను సైబర్ ఉగ్రవాదులు ఎక్కువగా వాడుతున్నారు. ఫిషింగ్: వీటిని సోషల్ ఇంజనీరింగ్ ఎటాక్‌గా చెప్పొచ్చు. లక్ష్యంగా ఎంచుకున్న సంస్థల నెట్‌వర్క్‌లు, సంస్థలు, వ్యక్తులకు మోసపూరిత ఈ– మెయిల్లు, ఎస్ఎంఎస్లలో లింకులు పెట్టి పంపుతారు. దీని ద్వారా హాక్ చేస్తే కలిగే నష్టం ఊహించడానికి కూడా భయంకరంగా ఉంటుంది. డిస్ట్రిబ్యూటెడ్ డినైయల్ ఆఫ్ సర్విస్: వీటినే డీడీఓఎస్ దాడులు అంటారు. టార్గెట్ చేసిన నెట్‌వర్క్‌కు విపరీతమైన ట్రాఫిక్ ఉండేలా చేసి వాటిని వినియోగదారులకు అందుబాటులో లేకుండా చేస్తారు. కీలకమైన మౌలిక సదుపాయాలు, ఆర్థిక లేదా ప్రభుత్వ సంస్థల కార్యకలాపాలకు అంతరాయం కలిగించేందుకు ఉపయోగిస్తారు. ఆరి్థక, ఆరోగ్య రంగాల్లో గందరగోళం సృష్టించడం ఈ దాడి లక్ష్యం. సాఫ్ట్వేర్ వల్నరబిలిటీ ఎటాక్: సాఫ్ట్వేర్ అప్లికేషన్లు, ఆపరేటింగ్ సిస్టమ్, నెట్వర్క్ ప్రోటోకాల్‌లోని చిన్నపాటి లోపాలను ఆసరాగా తీసుకుని దాడులు చేస్తారు. సప్లై చైన్ అటాక్స్: కస్టమర్లు లేదా క్లయింట్ల నెట్‌వర్క్‌లలోకి చొరబడేందుకు థర్డ్ పార్టీ విక్రేతలుగా చేరి నెట్‌వర్క్‌కు హాని కల్గిస్తారు. మచ్చుకు కొన్ని ఘటనలను చూస్తే.. సైబర్ టెర్రరిజం వేళ్లూనుకుంటుందనడానికి ఇటీవలి కొన్ని పరిణామాలు ఉదాహరణగా నిలుస్తున్నాయి. హ్యాకర్లు సోనీ అంతర్జాతీయ సంస్థపై సైబర్ దాడి చేసి గోప్యమైన సమాచారాన్ని హ్యాక్ చేసి సంస్థ కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలిగించారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రి డేటాపై రామ్సన్వేర్ ఎటాక్ జరగడం, హైదరాబాద్‌లో ఏపీ మహేశ్ కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు హ్యాకింగ్ ఘటన, తెలంగాణ పోలీస్ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేయడం కూడా ఇలాంటి కోవలోనివే. గుర్తించకపోతే అనర్థాలు సాంకేతికత వినియోగం పెరిగేకొద్దీ సైబర్ టెర్రరిజం ముప్పు కూడా పెరుగుతోంది. ఇది అనేక రంగాలకు విస్తరించే ప్రమాదం ఉంది. అందుకు తగ్గట్టుగా ప్రభుత్వాలు అన్ని స్థాయిల్లో కీలక నిర్ణయాలు తీసుకోవడంతోపాటు చర్యలు ప్రారంభించాలి. భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చే సైబర్ టెర్రరిజం ముప్పును గుర్తించకపోతే అనర్థాలు తప్పవు. – అద్వైత్ కంభం, సైబర్ సెరిటీ ట్రైనర్ -
నూజివీడు ట్రిపుల్ ఐటీలో చోరీ
నూజివీడు: నూజివీడు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లోని స్టాఫ్ క్వార్టర్స్‌లో మంగళవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. క్యాంపస్‌లో ఉన్న ఓ1 బ్లాక్‌లోని 401 ఫ్లాట్‌లో దొంగలు పడి బంగారు ఆభరణాలను, వెండి వస్తువులు, నగదు దోచుకెళ్లారు. గడులను తొలగించి లోనికి ప్రవేశించిన దొంగలు ప్లాట్లోని బీరువాలు, కప్‌బోర్డులు తెరిచి వాటిల్లోని వస్తువులను చిందరవందరగా పడేశారు. ఈ క్వార్టర్లో సీఎస్ఈ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న బి.పద్మ కుటుంబం నివాసముంటోంది.ఆమెకు వారం రోజులుగా డెంగీ జ్వరం కావడంతో నూజివీడులోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. భర్త ఆమెకు తోడుగా ఆస్పత్రిలోనే ఉంటున్నారు. ఈ ఘటనలో రూ.1.95 లక్షల నగదు, రెండు కాసుల బంగారం వస్తువులు, 750 గ్రాముల వెండి వస్తువులను చోరీ అయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే ఫ్లాట్ నం.203లో కూడా చోరీ జరిగింది. అయితే ఆ కుటుంబం ఊరినుంచి వస్తే గానీ ఏమేమి చోరీకి గురయ్యాయో తెలియదు. ట్రిపుల్ఐటీ ఏర్పాటు చేసిన 16 ఏళ్లల్లో తొలిసారిగా జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. దీంతో బ్లాక్‌లో ఉన్న మిగిలిన ఫ్లాట్ల వారు ఆందోళన చెందుతున్నారు. ఏలూరు నుంచి క్లూస్‌టీం వచ్చి ఆధారాలను సేకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. క్యాంపస్‌లో 8వేల మంది విద్యార్థులు, వెయ్యిమంది ట్రిపుల్ ఐటీ సిబ్బంది ఉంటున్నారు.ప్రతి షిప్టులో 56 మంది సెక్యూరిటీ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నా చోరీ జరగడం విస్మయాన్ని కలిగిస్తోంది. కాగా, సెక్యూరిటీ పాయింట్లు ట్రిపుల్ ఐటీ క్యాంపస్ సరిహద్దుల వద్ద కాకుండా ఎక్కడో ఏర్పాటు చేయడం గమనార్హం. -
కడపలో విషాదం.. స్కూలు పిల్లలకు కరెంట్ షాక్
సాక్షి,కడపజిల్లా: కడప నగరంలో బుధవారం(ఆగస్టు21) మధ్యాహ్నం విషాదం చోటు చేసుకుంది. తెగిపడి రోడ్డుపై పడ్డ కరెంటు తీగలు తగిలి ఒక విద్యార్థి మృతి చెందగా మరో విద్యార్థికి గాయాలయ్యాయి.తన్వీర్(11), ఆదాం(10)లు సైకిల్‌పై స్కూల్‌కు వెళ్తుండగా నగరంలోని అగాడీ వీధిలో ఈ ఘోరం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి చిన్నారులిద్దరినీ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి విద్యుత్‌శాఖ అధికారుల నిర్లకక్ష్యమే కారణమని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. -
అనంతలో ఘోర రోడ్డు ప్రమాదం
అనంతపురం: అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ, కారు ఢీ కొట్టిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. బుధవారం ఉదయం తాడిపత్రి సమీపంలో వంగనూరు వద్ద లారీ, కారు ఢీ కొట్టాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. తాడిపత్రికి చెందిన దంపతులు ప్రతాప్ రెడ్డి (25), ప్రమీల(22), మరో మహిళ వెంకటలక్ష్మి (45) మృతి చెందినట్లు పోలీసులు ప్రకటించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. -
ప్రేమ పేరుతో వంచన
హిందూపురం అర్బన్: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం గోళ్లాపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు ఓ బాలిక (16)ను ప్రేమ పేరుతో లొంగదీసుకుని గర్భవతిని చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గోళ్లాపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు రాజేష్ ఇటీవల జరిగిన అదే గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త సతీష్ హత్య కేసులో ప్రధాన నిందితుడు. అతను ఈ కేసులో ప్రస్తుతం జైల్లో రిమాండ్‌లో ఉన్నాడు. రాజేష్ రిమాండ్‌కు వెళ్లకముందు గ్రామానికి చెందిన ఓ బాలికను ప్రేమ పేరుతో నమ్మించాడు. శారీరకంగా లొంగదీసుకొని గర్భవతిని చేశాడు.రెండు రోజుల క్రితం బాలిక కడుపునొప్పిగా ఉందని తల్లిదండ్రులకు చెప్పడంతో కర్ణాటక రాష్ట్రం గౌరీబిదనూరు ఆస్పత్రికి తీసుకెళ్లి చూపించారు. వైద్యులు పరీక్షించి ఆమె గర్భవతి అని తేలి్చ.. అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు బాలికను అక్కడి ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. చిక్‌బళ్లాపుర ఎస్పీ కార్యాలయం నుంచి కేసును సోమవారం హిందూపురం అప్‌గ్రేడ్ పోలీస్‌స్టేషన్‌కు బదలాయించారు. దీంతో అప్‌గ్రేడ్ సీఐ ఆంజనేయులు బాధిత బాలికను గౌరీబిదనూరు నుంచి హిందూపురం తీసుకువచ్చి స్థానిక ప్రభుత్వాస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. ఆమె గర్భిణి అని నిర్ధారణ కావడంతో రాజే‹Ùపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. -
మహిళా కానిస్టేబుళ్లపై టీడీపీ నేతల ప్రతాపం
తాడికొండ: గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలంలో కొంతమంది టీడీపీ నేతలు అధికారులు, సామాన్యులనే కాకుండా ఇప్పుడు మహిళా పోలీసులను సైతం బెదిరింపులకు గురిచేసేందుకు వెనుకాడడం లేదు. తాజాగా ఆదివారం లింగాయపాలెం ఇసుక రీచ్‌కు వెళ్లే లారీలకు స్లిప్పులు రాస్తున్న మహిళా పోలీసులపై అదే గ్రామానికి చెందిన ఇద్దరు టీడీపీ నాయకులు గొడవ పెట్టుకుని.. మీరేమైనా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులనుకుంటున్నారా కుర్చీలు వేసుకుని ఇక్కడ ఏంటీ అంటూ.. కుర్చీలను తీసుకుని కంపచెట్లలోకి విసిరేశారు. పక్కనే ఉన్న ఎస్ఈబీ కానిస్టేబుల్ వారించేందుకు యత్నించినప్పటికీ అతనిని కూడా ఇష్టారీతిగా మాట్లాడడంతో.. డ్యూటీ ముగిసిన అనంతరం పోలీస్‌స్టేషన్‌లో సదరు మహిళా కానిస్టేబుళ్లు ఫిర్యాదు చేశారు. అయితే టీడీపీ నాయకులకు వత్తాసుగా లింగాయపాలెం గ్రామానికి చెందిన ఓ టీడీపీ నాయకుడితో పాటు ఎమ్మెల్యే కార్యాలయం నుంచి కూడా చూసీ చూడనట్లు పొమ్మని ఫోన్లు రావడంతో.. కేసు కూడా నమోదు చేయలేదు. దీంతో మహిళా కానిస్టేబుళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా పోలీసు శాఖ ఉన్నతాధికారులు స్పందించి సదరు టీడీపీ నేతల దురుసు ప్రవర్తనకు అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు. -
విషాహారానికి ముగ్గురు విద్యార్థులు బలి.. .. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, అనకాపల్లి: ఫుడ్ పాయిజన్‌తో ముగ్గురు విద్యార్థులు మృతి చెందగా, మరో 35 మంది అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న విషాద ఘటన అనకాపల్లి జిల్లాలో జరిగింది. కోటవురట్ల మండలం కైలాసపట్నం శివారు రాజగోపాలపురంలో పరిశుద్ధాత్మ అగ్ని స్తుతి ఆరాధన (పాసా) ట్రస్ట్ నిర్వహిస్తున్న ఆశ్రమంలో శనివారం రాత్రి మిగిలిపోయిన బిర్యానీని తినడం వల్ల విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ట్రస్ట్ నిర్వాహకుడు, పాస్టర్ ఎం.కిరణ్‌కుమార్ ఈ నెల 17న పందూరులో మధ్యాహ్నం జరిగిన ఓ ప్రైవేట్ ఫంక్షన్‌కు వెళ్లాడు. అక్కడ మిగిలిపోయిన బిర్యానీని ఆశ్రమానికి తెచ్చి రాత్రి విద్యార్థులకు పెట్టారు. దాన్ని తిన్న విద్యార్థుల్లో ఐదుగురు అదేరోజు అర్ధరాత్రి అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు చేసుకున్నారు.వారిని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లలేదు. తెల్లవారుజామున మరో 15 మంది అస్వస్థతకు గురవ్వడంతో విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ చేసి రప్పించారు. తల్లిదండ్రులతో విద్యార్థులను ఇళ్లకు పంపించేశారు. తీవ్ర అస్వస్థతతో ఇంటి దగ్గరే మరుసటి రోజు ముగ్గురు విద్యార్థులు మృత్యువాత పడ్డారు. మరో 35 మందిని తల్లిదండ్రులు సమీపంలోని నర్సీపట్నం, పాడేరు ఏరియా ఆస్పత్రులకు, డౌనూరు, చింతపల్లి ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. నర్సీపట్నంలో చికిత్స పొందుతున్న 16 మందిలో 14 మంది ఆరోగ్యం విషమించడంతో విశాఖలోని కేజీహెచ్‌కు తరలించారు.ప్రస్తుతం నర్సీపట్నం, పాడేరు, డౌనూరు, చింతపల్లి ఆస్పత్రుల్లో 21 మంది చికిత్స పొందుతున్నారు. ఫుడ్ పాయిజన్ జరిగిన రోజు అర్ధరాత్రి అస్వస్థతకు గురైన ఐదుగురిలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. వారిలో కొయ్యూరు మండలం డౌనూరు పంచాయతీ రెల్లలపాలేనికి గెమ్మెలి నిత్య(భవాని)(8), చింతపల్లి మండలం తిరుమల పంచాయతీ నిమ్మలపాలేనికి చెందిన తంబెలి జాషువా(7), చింతపల్లి మండలం బలభద్రకు చెందిన కొర్రా శ్రద్ధ(7) ఆదివారం రాత్రి ఇంటి వద్దే మృతి చెందారు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న జెస్సికాకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. 13 ఏళ్లుగా అనధికారికంగానే..పాస్టర్ కిరణ్‌కుమార్ 13 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన పాసా ట్రస్టుకు ఎలాంటి అనుమతుల్లేవు. తొలుత అతను కోటవురట్ల మండలం హనుకు గిరిజన గ్రామంలో చర్చి ఏర్పాటు చేశాడు. ఆ సమయంలో ఓ అమ్మాయి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడన్న ఆరోపణలతో గ్రామస్తులు పంపించేశారు. ఆ తర్వాత ఇక్కడ ట్రస్ట్ ఏర్పాటు చేశాడు. ఇక్కడున్న 86 మందిలో 80 మంది అల్లూరి జిల్లాకు చెందిన గిరిజన విద్యార్థులే.సంఘటన స్థలాన్ని సందర్శించి, నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. ఘటనపై విద్యాశాఖ అధికారులు, పోలీసులతో విచారణకు ఆదేశించారు. పాసా ట్రస్ట్ నిర్వాహకుడు కిరణ్‌కుమార్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని జిల్లా ఎస్పీ దీపికా పాటిల్ సోమవారం రాత్రి మీడియాకు తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించి, ఉన్నతస్థాయి కమిటీ విచారణకు సీఎం ఆదేశించినట్లు అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్‌కుమార్ వెల్లడించారు.విద్యా సంస్థల తనిఖీలకు సీఎం ఆదేశంసాక్షి, అమరావతి: రెండు రోజుల క్రితం అనకాపల్లి జిల్లా కోటవురట్లలోని హాస్టల్లో కలుషిత ఆహారం తిని ముగ్గురు విద్యార్థులు మరణించిన నేపథ్యంలో ఇతర విద్యా సంస్థల్లో పరిస్థితులను తనిఖీ చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు వారి పరిధిలోని ప్రయివేటు, చైల్డ్ కేర్ సెంటర్లను తనిఖీ చేయాలని సోమవారం ‘ఎక్స్’లో పేర్కొన్నారు.విద్యార్థుల మృతి ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి సాక్షి, అమరావతి: అనకాపల్లి జిల్లా, కోటవురట్ల మండలం, కైలాసపట్నంలో కలుషితాహారం తినడం వల్ల విద్యార్థులు మరణించిన ఘటనపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ఘటనలో ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. సరైన పర్యవేక్షణ కొరవడిందనడానికి ఈ ఘటన ఉదాహరణగా నిలుస్తుందని తెలిపారు. చికిత్స పొందుతున్న ఇతర విద్యార్థులకు మంచి వైద్య సదుపాయాలను అందించాలని, మరణించిన విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. తప్పుడు ప్రచారాలు ఇకనైనా మాని వ్యవస్థలపై దృష్టి పెట్టాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి హితవు పలికారు. -
రూ.300 ఎస్ఈడీ నకిలీ టికెట్లతో మోసం
తిరుమల: ఏపీ టూరిజం రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం నకిలీ టికెట్లతో మోసగిస్తున్న దళారుల ముఠాకు చెందిన ముగ్గురిని సోమవారం రాత్రి టీటీడీ విజిలెన్స్ అధికారులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తిరుమల టూటౌన్ సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాల మేరకు.. పాత నేరసుడు ∙అమృత యాదవ్, తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ రూ.300 ఎస్ఈడీ టికెట్ స్కానింగ్ కౌంటర్లో పనిచేసే రుద్రసాగర్, అదే విభాగంలో గతంలో పనిచేసిన నవీన్ తేజ, నారాయణ అనే వారితో కలిసి ఓ ముఠాగా ఏర్పడ్డారు. చెన్నైకి చెందిన మోహన్ రాజ్ అనే భక్తుడు సోమవారం దళారి అమృత యాదవ్‌ను టికెట్ల కోసం సంప్రదించారు. అతను 4 పాత∙టికెట్లు కలర్ జిరాక్స్ తీసి సీరియల్ నంబరు మార్చి రూ.11వేలకు విక్రయించాడు. క్యూ కాంప్లెక్స్‌లో తనిఖీల్లో ఆ టికెట్లు నకిలీవని తేలింది. స్కానింగ్ కేంద్రంలో పనిచేసే రుద్రసాగర్ నకిలీ ఎస్ఈడీ రూ.300 టికెట్లను స్కానింగ్ చేసినట్లు నటిస్తూ మోసగిస్తున్నట్లు గుర్తించారు. నిందితులు రుద్రసాగర్, నవీన్ తేజ, ట్రావెల్ డ్రైవర్ పెరియస్వామిని అదుపులోకి తీసుకున్నారు. -
ఆనందం.. అంతలోనే విషాదం
కొత్తపల్లి: రాఖీ కట్టడానికి వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక బాలిక మృతి చెందిన సంఘటన కొత్తపల్లి మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. పొన్నాడ శివారు కోనపాపపేటకు చెందిన ఉప్పరపల్లి బలరామ్ కుమార్తె ఉప్పరపల్లి దేవి (11) అక్కడి జిల్లా పరిషత్ పాఠశాలలో 6వ తరగతి చదువుతుంది. రాఖీ పౌర్ణమి కావడంతో దేవితో పాటు తన స్నేహితులు తిత్తి కస్తూరి, నాగవల్లి, దుర్గ, లక్ష్మిలు ఉప్పాడలో ఉన్న తమ బంధువులు ఇంటికి రాఖీ కట్టేందుకు వెళ్లారు. దేవి సోదరుడైన సంతోష్‌కు ఉప్పాడలో రాఖీలు కొనుగోలు చేసి తిరిగి ఆటోలో ఇంటికి బయలు దేరారు. ఉప్పాడ– కోనపాపపేట రోడ్డులో కొత్తమూలపేట సమీపంలోని రొయ్యల శుద్ధి పరిశ్రమ దగ్గరలోకి రాగానే ఎదురుగా వచ్చిన లోడు ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో దేవి సంఘటనా స్థలంలోనే దుర్మరణం పాలైంది. ఆటోలో ప్రయాణిస్తున్న కస్తూరి, నాగవల్లి, దుర్గ, లక్ష్మికి గాయాలు కాగా చికిత్స నిమిత్తం పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కస్తూరికి తీవ్ర గాయాలు కాగా మెరుగైన చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. దేవి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై ఎస్సై వెంకటేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లోడు ఆటో కోనపాపపేట నుంచి అతివేగంగా వచ్చి ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. మరికొద్ది నిమిషాల్లోనే తన సోదరి వచ్చి రాఖీ కడుతుందనుకుంటున్న సోదరుడు సంతోష్‌కు విషయం తెలియగానే తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు. దేవీ మృతితో కోనపాపపేటలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆమె మృతదేహం వద్ద కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. వారి రోదనలు ప్రతి ఒక్కరినీ కంటితడి పెట్టించాయి. -
అనకాపల్లి: అనాథాశ్రమంలో ఫుడ్ పాయిజన్.. నలుగురు పిల్లలు మృతి
అనకాపల్లి, సాక్షి: వసతి గృహంలో ఫుడ్‌పాయిజన్.. నలుగురు చిన్నారుల్ని బలిగొంది. మరో 27 మంది విద్యార్థులు ఆస్పత్రి పాలు కాగా.. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కోటవురట్ల మండలం కైలాసపట్నంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కైలాసపట్నంలోని ఓ ఆశ్రమంలో 60 మంది విద్యార్థులు.. ఓ ఆర్గనైజేషన్ ద్వారా ఉచిత వసతితో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. ఎం. కిరణ్ కుమార్ అనే వ్యక్తి దీనిని నిర్వహిస్తున్నారు. అయితే.. ఆదివారం మధ్యాహ్నాం వసతి గృహంలో పిల్లలు సమోసా తిన్నారు. వాటితో ఫుడ్ పాయిజన్ కావడంతో పిల్లలు వాంతులు చేసుకున్నారు. దీంతో ఆందోళన చెందిన నిర్వాహకులు.. పిల్లలను వారి వారి స్వస్థలాలకు పంపించి వేశారు. వీళ్లలో చింతపల్లి మండలానికి చెందిన ఇద్దరు పిల్లలు.. వాళ్ల ఇళ్ల వద్ద మృతి చెందారు. నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో మరో ఏడుగురు చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై డిప్యూటీ డిఈఓ పెన్నాడ అప్పారావు, ఎంఈఓ పి రామారావు, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
పత్తికొండ హత్య కేసులో టీడీపీ నేతే హంతకుడు
సాక్షి ప్రతినిధి కర్నూలు: పత్తికొండ నియోజకవర్గం హోసూర్‌లో ఇటీవల హత్యకు గురైన టీడీపీ నేత వాకిటి శ్రీనివాసులు కేసును పోలీసులు ఛేదించారు. శ్రీనివాసులును అదే గ్రామానికి చెందిన మరో టీడీపీ నేత గుడిసె నరసింహులు హత్య చేయించాడని తేల్చారు. పత్తికొండ టీడీపీలో ఆధిపత్య పోరులో భాగంగానే టీడీపీ నేతను, అదే పార్టీకి చెందిన మరో నేత హత్య చేయించినట్లు తేలింది. ఈ హత్య జరిగిన రోజు వాస్తవాలు తెలుసుకోకుండా వైఎస్సార్సీపీ హత్య చేయించిందనేలా పార్టీపె, మాజీ సీఎం వైఎస్ జగన్‌పైనా మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. ఇప్పుడు వాస్తవాలు బట్టబయలు కావడంతో లోకేశ్ నవ్వులు పాలుకావడంతో పాటు వైఎస్సార్సీపీపై ఆయన పచ్చి అబద్ధాలు మాట్లాడతారని.. వైఎస్సార్సీపీ, జగన్‌పై అదేపనిగా బురదజల్లుతున్నారని స్పష్టమైంది. అడ్డు తొలగించుకునేందుకే స్కెచ్.. హోసూర్‌లో వాకిటి శ్రీనివాసులు టీడీపీ నేత. గుడిసె నరసింహులు సీఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్‌గా రిటైరైన తర్వాత టీడీపీలో చేరి నాయకునిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నారు. శ్రీనివాసులును పత్తికొండ సహకార సంఘం అధ్యక్షుడిగా ఎంపిక చేసేందుకు ఎమ్మెల్యే శ్యాంబాబు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో రాజకీయంగా తన భవిష్యత్తు ఏంటో చెప్పాలని శ్యాంబాబును నరసింహులు అడిగినట్లు తెలుస్తోంది. హోసూర్‌లోనే ఇద్దరూ ఉంటే భవిష్యత్‌లో గొడవలు ఉంటాయని, పత్తికొండలో కాపురం పెడితే అక్కడ ఓ వార్డు బాధ్యతలు అప్పగిస్తానని నరసింహులుకు శ్యాంబాబు చెప్పినట్లు తెలిసింది. దీంతో.. రాజకీయంగా శ్రీనివాసులు ఎదగడంతో పాటు తాను ఊరు వదిలే పరిస్థితి తలెత్తే ప్రమాదం ఉందని గ్రహించిన నరసింహులు.. ఈనెల 14న శ్రీనివాసులును హత్య చేయించారు. ఇక శ్రీనివాసులును వడ్డే కాశీనాథ్, ఎరుకల వంశీ అనే ఇద్దరు బాలనేరస్తులు హత్యచేసినట్లు పత్తికొండ డీఎస్పీ శ్రీనివాసాచారి వెల్లడించారు. వీరితో పాటు రామాంజనేయులు, హరికృష్ణ, వడ్డే నరసింహులును కూడా కేసులో చేర్చారు. ఇప్పుడేమంటావ్ లోకేశ్? హత్య జరిగిన ఉదయం ‘పచ్చ’ ఛానెళ్లు వైఎస్సార్సీపీ నేతలే టీడీపీ నేతను హత్యచేశారని ఊదరగొట్టాయి. వైఎస్సార్సీపీపై కావాలనే లోకేశ్ దుష్ప్రచారంతో ట్వీట్ కూడా చేసేశారు. ‘ఈ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నా! ఎన్నికల్లో టీడీపీ తరఫున కీలకంగా పనిచేశాడనే కక్షతో కిరాతకంగా హతమార్చారు. ప్రజాక్షేత్రంలో తిరస్కారానికి గురైనప్పటికీ జగన్ అండ్ కో తమ పాత పంథా మార్చుకోకుండా దురాగతాలకు పాల్పడుతున్నారు’ అని పేర్కొన్నారు. ఈ ట్వీట్ చూసి హోంమంత్రి అనిత, మరో మంత్రి బీసీ జనార్థన్‌రెడ్డి కూడా వైఎస్సార్సీపీపై విమర్శలు చేశారు. ఈ హత్యకు రాజకీయరంగు పులిమి వైఎస్సార్సీపీపై మోపే ప్రయత్నం చేశారు. కానీ, పోలీసు విచారణలో వాస్తవాలు బయటపడడంతో ఈ హత్య విషయంలో వైఎస్సార్సీపీ, జగన్మోహన్రెడ్డిపై చేసిన ఆరోపణలకు మంత్రి లోకేశ్ ఇప్పుడు ఏం సమాధానం చెబుతారో!? -
అమెరికాలో ప్రకాశం జిల్లా సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి
ముండ్లమూరు: అమెరికాలోని కాలిఫోర్నియాలో ప్రకాశం జిల్లా ముండ్లమూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ దొద్దాల బుచ్చిబాబు (40) సముద్రంలో మునిగి మృతి చెందాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ముండ్లమూరుకు చెందిన దొద్దాల కోటేశ్వరరావు, కోటేశ్వరమ్మలకు కుమారుడు బుచ్చిబాబు, ఒక కుమార్తె ఉన్నారు. తల్లిదండ్రులు వ్యవసాయ పనులు చేసుకుంటూ ఇద్దరినీ చదివించారు. కుమారుడు బుచ్చిబాబు ఎనిమిదేళ్లు హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశాడు.కంపెనీ ఆదేశాల మేరకు 18 నెలల కిందట భార్య కిరణ్మయితో కలిసి కాలిఫోర్నియా వెళ్లి అక్కడే నివాసం ఉంటూ ఉద్యోగం చేస్తున్నాడు. వీకెండ్ సెలవులు కావడంతో ఆదివారం కుటుంబ సభ్యులతో సరదాగా సముద్ర స్నానానికి వెళ్లారు. అక్కడ ఈత కొడుతుండగా ప్రమాదవశాత్తు కొట్టుకుపోవడంతో ఊపిరాడక మృతి చెందాడు. కుమారుడి మరణవార్త విని తల్లి కోటేశ్వరమ్మ సొమ్మసిల్లి పడిపోయింది. మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వగ్రామానికి చేర్చేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని వేడుకొంటున్నారు.