మహిళా కానిస్టేబుళ్లపై టీడీపీ నేతల ప్రతాపం | TDP Leader Misbehavior With Women constables: Andhra pradesh | Sakshi
Sakshi News home page

మహిళా కానిస్టేబుళ్లపై టీడీపీ నేతల ప్రతాపం

Aug 20 2024 5:34 AM | Updated on Aug 20 2024 5:34 AM

TDP Leader Misbehavior With Women constables: Andhra pradesh

ఇసుక లారీలకు స్లిప్పులు రాస్తుండగా వివాదం

కుర్చీలు కంపల్లోకి విసిరేసి ఉన్మాదం

స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయని వైనం

తాడికొండ: గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలంలో కొంతమంది టీడీపీ నేతలు అధికారులు, సామాన్యులనే కాకుండా ఇప్పుడు మహిళా పోలీసులను సైతం బెదిరింపులకు గురిచేసేందుకు వెనుకాడడం లేదు. తాజాగా ఆదివారం లింగాయపాలెం ఇసుక రీచ్‌కు వెళ్లే లారీలకు స్లిప్పులు రాస్తున్న మహిళా పోలీసులపై అదే గ్రామానికి చెందిన ఇద్దరు టీడీపీ నాయకులు గొడవ పెట్టుకుని.. మీరేమైనా ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులనుకుంటున్నారా కుర్చీలు వేసుకుని ఇక్కడ ఏంటీ అంటూ..  కుర్చీలను తీసుకుని కంపచెట్లలోకి విసిరేశారు. 

పక్కనే ఉన్న ఎస్‌ఈబీ కానిస్టేబుల్‌ వారించేందుకు యత్నించినప్పటికీ అతనిని కూడా ఇష్టారీతిగా మాట్లాడడంతో.. డ్యూటీ ముగిసిన అనంతరం పోలీస్‌స్టేషన్‌లో సదరు మహిళా కానిస్టేబుళ్లు ఫిర్యాదు చేశారు. అయితే టీడీపీ నాయకులకు వత్తాసుగా లింగాయపాలెం గ్రామానికి చెందిన ఓ టీడీపీ నాయకుడితో పాటు ఎమ్మెల్యే కార్యాలయం నుంచి కూడా చూసీ చూడనట్లు పొమ్మని ఫోన్లు రావడంతో.. కేసు కూడా నమోదు చేయలేదు. దీంతో మహిళా కానిస్టేబుళ్లు  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా పోలీసు శాఖ ఉన్నతాధికారులు స్పందించి సదరు టీడీపీ నేతల దురుసు ప్రవర్తనకు అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement