రెండు ప్రమాదాల్లో 8 మంది దుర్మరణం | 8 die in two separate road accidents in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

రెండు ప్రమాదాల్లో 8 మంది దుర్మరణం

Aug 27 2024 4:57 AM | Updated on Aug 27 2024 4:57 AM

8 die in two separate road accidents in Andhra Pradesh

గువ్వలచెరువు ఘాట్‌ రోడ్డులో కారు, కంటైనర్‌ ఢీకొని ఐదుగురు మృత్యువాత

పెద్దకర్మ తర్వాత బంధువుల ఇళ్లలో దీపం చూసేందుకు వెళ్తుండగా దుర్ఘటన 

దువ్వూరు మండలం చింతకుంట వద్ద కారు అదుపుతప్పి చిన్నారి సహా ముగ్గురు మృతి 

పుట్టు వెంట్రుకలు తీయించేందుకు వెళ్తుండగా ప్రమాదం

సాక్షి ప్రతినిధి, కడప/ప్రొద్దుటూరు క్రైం/దువ్వూరు:  వైఎస్సార్‌ జిల్లాలో రెండుచోట్ల జరిగిన ప్రమాదాల్లో 8 మంది దుర్మరణం పాలయ్యారు. గువ్వలచెరువు ఘాట్‌ రోడ్డులో కారు, కంటైనర్‌ ఢీకొని ఐదుగురు మృత్యువాత పడగా.. దువ్వూరు మండలం చింతకుంట వద్ద కారు అదుపుతప్పి చిన్నారి సహా ముగ్గురు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. చక్రాయపేట మండలం కె.వడ్డెపల్లెకు చెందిన సత్యనారాయణ ఇటీవల మృతి చెందారు.

స్వగ్రామంలో సోమవారం మధ్యాహ్నం పెద్దకర్మ నిర్వహించారు. అనంతరం సమీప బంధువుల ఇళ్లలో దీపం చూసేందుకు సతీమణి వల్లెపు చిన్న వెంకటమ్మ (50) అద్దె కారులో బయలుదేరారు. తోడుగా ఆమె తమ్ముడు గుజ్జుగారి నాగయ్య (46), కోడలు వల్లెపు నాగలక్ష్మీదేవి (35) వెళ్లారు. వారు ప్రయాణిస్తున్న కారు గువ్వలచెరువు ఘాట్‌ రోడ్డు మీదుగా వెళ్తుండగా.. రాయచోటి నుంచి కడప వైపు వస్తున్న అమరరాజా బ్యాటరీ లోడ్‌ కంటైనర్‌ కారును ఢీకొట్టింది.

ఘటనలో చిన్న వెంకటమ్మ, ఆమె తమ్ముడు నాగయ్య, కోడలు నాగలక్ష్మీదేవి, డ్రైవర్‌ షరీఫ్‌ అక్కడికక్కడే మృతి చెందారు. కంటైనర్‌ అదుపు తప్పి లోయలో పడిపోవడంతో దానిని నడుపుతున్న డ్రైవర్‌ కూడా మరణించాడు. క్లీనర్‌ ఉన్నాడా లేడా అన్న విషయం తేలాల్సి ఉంది. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కాగా.. మృతదేహాలు అందులో ఇరుక్కుపోయాయి. మృతదేహాలను క్రేన్‌ సాయంతో బయటకు తీశారు. ఎస్పీ హర్షవర్దన్‌రాజు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

మొక్కు తీరకుండానే..  
దువ్వూరు మండలం చింతకుంట వద్ద కారు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో కర్నూలుకు చెందిన కియన్‌సింగ్‌ (9 నెలలు), భగత్‌సింగ్‌ (34), నాగలక్ష్మి (70) దుర్మరణం చెందారు. కర్నూలులోని గణే‹Ùనగర్‌లో ఉన్న ఫోర్త్‌ క్లాస్‌ ఎంప్లాయీస్‌ కాలనీకి చెందిన భగత్‌సింగ్, కవితాబాయ్‌ దంపతులకు కియాన్‌సింగ్‌ అనే కుమార్తె ఉంది. అతను కర్నూలులో ఎస్‌ఆర్‌ ఫ్లెక్స్‌ ప్రింటింగ్‌ నిర్వహిస్తున్నాడు. వారి ఒక్కగానొక్క కుమార్తె కియన్‌సింగ్‌కు 9 నెలలో తిరుమలలో పుట్టు వెంట్రుకలు తీయించేందుకు కర్నూలు, మార్కాపురంలో ఉంటున్న ముఖ్య బంధువులు కలిసి మొత్తం 17 మంది సోమవారం బయలుదేరారు.

ఒక కారును భగత్‌సింగ్‌ నడుపుతుండగా.. దువ్వూరు సమీపంలో ఎదురుగా మరో వాహనం రావడంతో ఒక్కసారిగా వాహనాన్ని సైడ్‌ తీసుకునే ప్రయత్నంలో కారు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో గాయపడిన వారిని ప్రొద్దుటూరు, మైదుకూరు ప్రభుత్వాస్పత్రులకు తరలించారు. తీవ్ర గాయాలై చికిత్స పొందుతున్న చిన్నారి కియాన్‌సింగ్, తండ్రి భగత్‌సింగ్, అమ్మమ్మ నాగలక్ష్మి మృతి చెందారు. అదే కారులో ఉన్న చిన్నారి తల్లి కవితాబాయ్, బంధువులు యుగంధర్, ఉమామహేశ్వరి, సాయి, కల్యాణ్‌సింగ్‌ గాయపడ్డారు. వీరంతా ప్రొద్దుటూరు జిల్లా ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement