మంత్రి లోకేశ్‌కు స్వాగతం పలికేందుకు 11 మంది మహిళలు ఒకే ఆటోలో తరలింపు
తిరిగి వస్తుండగా కారు ఢీకొని రోడ్డు ప్రమాదం
డ్రైవర్‌తోపాటు 11 మంది మహిళలకు గాయాలు
ఉలవపాడు: మంత్రి నారా లోకేశ్‌కు స్వాగతం పలికేందుకు వెళితే కూలి డబ్బులు ఇస్తారనే ఆశతో వెళ్లిన 11 మంది పేద మహిళలు... టీడీపీ నేతల కక్కుర్తి కారణంగా రోడ్డు ప్రమాదానికి గురై గాయపడ్డారు. లోకేశ్ గురువారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పర్యటనకు వస్తున్నారని, స్వాగతం పలకడానికి గుడ్లూరు మండలం మోచెర్ల వస్తే ఒక్కొక్కరికి రూ.300 కూలి ఇస్తామని ఉలవపాడు మండలంలోని కరేడు పంచాయతీ టీడీపీ నాయకులు అలగాయపాలెం ఎస్సీ కాలనీ మహిళలకు చెప్పారు.
కానీ, సరిపడా ఆటోలు ఏర్పాటు చేయకపోవడంతో అదే కాలనీకి చెందిన చెరుకూరి హరి ఆటోలో 11 మంది మహిళలు ఇరుక్కుని మోచెర్ల వద్దకు వెళ్లారు. తిరిగి అలగాయపాలెం ఎస్సీ కాలనీకి వస్తూ ఉలవపాడు సమీపంలోని దక్షిణ బైపాస్ వద్ద ఉన్న పెట్రోల్ బంకులో ఆటోకు డీజిల్ కొట్టించుకుని హైవే ఎక్కే సమయంలో నెల్లూరు వైపు నుంచి ఒంగోలు వైపు వెళ్తున్న కారు ఢీకొట్టింది.
ఈ ఘటనలో ఆటో డ్రైవర్‌తోపాటు దానిలో ఉన్న మహిళలు అందరూ గాయపడ్డారు. రావినూతల యలమందమ్మ, రావినూతల ప్రభావతి, రావినూతల లక్షి్మ, చెరుకూరి మరియమ్మ, చెరుకూరి లక్ష్మి, చెరుకూరి సునంద, చెరుకూరి అనూష, శిరీషతోపాటు డ్రైవర్ హరిని హైవే అంబులెన్స్‌లో ఉలవపాడు సీహెచ్‌సీకి తరలించారు. రావినూతల నాగమ్మ, రావినూతల ప్రసన్నబేబీ, రావినూతల మరియమ్మకు తీవ్ర గాయా లు కావడంతో ఒంగోలు జీజీహెచ్‌కి తీసుకెళ్లారు.


