రాష్ట్రంలోని వేర్వేరు ప్రమాదాల్లో పదిమంది దుర్మరణం
23 మందికి గాయాలు...
వారిలో పలువురి పరిస్థితి విషమం
కర్లపాలెం/యలమంచిలి రూరల్/నాదెండ్ల/నగరి/పెళ్లకూరు: రాష్ట్రంలో రహదారులు రక్తసిక్తమయ్యాయి. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో పదిమంది దుర్మరణం చెందారు. మరో 23మంది గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలంలోని సత్యవతిపేట వద్ద జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. బాపట్ల టీడీపీ ఎమ్మెల్యే నరేంద్రవర్మ కుమారుడి వివాహం సందర్భంగా పాండురంగాపురంలోని ఓ రిసార్ట్‌లో ఆదివారం రాత్రి సంగీత్ వేడుకలు ఏర్పాటు చేశారు.
కర్లపాలెం గ్రామానికి చెందిన బేతాళం బలరామరాజు తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ వేడుకలకు హాజరయ్యారు. వారందరూ ఆనందంగా గడిపి రాత్రి 12 గంటల సమయంలో తిరిగి కారులో కర్లపాలెం బయలుదేరారు. కర్లపాలెం పంచాయతీ సత్యవతిపేట వద్ద కారు, నరసాపురం నుంచి వస్తున్న కంటైనర్ లారీ ఎదురెదురుగా ఢీ కొన్నాయి. కారులో ఉన్న బేతాళం బలరామరాజు(65), ఆయన భార్య బేతాళం లక్ష్మి(60), వారి వియ్యపురాలు గాదిరాజు పుష్పావతి(60), కారు నడుపుతున్న బలరామరాజుకు బావమరిది వరసైన ముదునూరి శ్రీనివాసరాజుకు తీవ్ర గాయాలయ్యాయి.
స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కారులో చిక్కుకుపోయిన క్షతగాత్రులను బయటకు తీసి బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే నలుగురు మృతిచెందినట్లు తెలిపారు. అదే కారులో ఉన్న గాదిరాజు పుష్పావతి మనవరాలు గాదిరాజు వైష్ణవి, మనవడు జయంత్‌వర్మకు తీవ్ర గాయాలయ్యాయి. వైష్ణవిని చీరాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి, జయంత్‌వర్మను గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
ఆగి ఉన్న ఆటోను ఢీకొట్టిన వ్యాన్.. ఇద్దరి మృతి 
అనకాపల్లి జిల్లా యలమంచిలి మున్సిపాలిటీ పరిధిలోని కొక్కిరాపల్లి కూడలి ప్రేమ సమాజం వద్ద సోమవారం ప్రయాణికులు దిగడానికి రోడ్డు వెంబడి ఆగి ఉన్న ఆటోను వెనుక నుంచి మినీ వ్యాన్ ఢీకొట్టింది. ఆటోలో ఉన్న 10 మంది, మినీ వ్యాన్‌లో ప్రయాణిస్తున్న 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో నర్సీపట్నానికి చెందిన బాదంపూడి లక్ష్మి(65), కశింకోట మండలం తీడ గ్రామానికి చెందిన గొంది పెంటయ్య(56) మృతిచెందారు. మొత్తం 16 మంది గాయపడ్డారు. 
అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న వాహనం బోల్తా పడి..
అక్రమంగా సేకరించిన రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న వాహనం బోల్తాపడి ఒడిశాకు చెందిన ఓ కూలీ మృతిచెందాడు. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో రేషన్ మాఫియా అక్రమంగా కొనుగోలు చేసిన 35 బస్తాల బియ్యాన్ని ఆదివారం అర్ధరాత్రి మినీ వ్యాన్‌లో పల్నాడు జిల్లా నాదెండ్ల మీదుగా చిలకలూరిపేటకు తరలిస్తున్నారు. నాదెండ్ల–తిమ్మాపురం రోడ్డులో జాలాది సుబ్బయ్యకుంట వద్ద వాహనం వెనుక టైరు పంక్చర్ కావడంతో రోడ్డుపై బోల్తాపడింది. వ్యాన్‌లో బియ్యం బస్తాలపై కూర్చున్న ఒడిశాకు చెందిన బఫూన్‌మాలిక్ (25) అనే కూలీ అక్కడికక్కడే మృతిచెందాడు. వ్యాన్‌లో ఉన్న ప్రభాస్ మాలిక్, భీమాసేన్ దాస్, డైతిరిమాలిక్ తీవ్రంగా, సర్వేశ్వర్ మాలిక్, బాజ్‌పాయ్ మాలిక్ స్వల్పంగా గాయపడ్డారు.
ట్యాంకర్ ఢీకొని తండ్రీకొడుకుల కన్నుమూత 
తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం చెంబడిపాలెం వద్ద సోమవారం ట్యాంకర్ ఢీకొని బైక్‌పై వెళుతున్న తండ్రీకొడుకులు మరణించారు. శ్రీకాళహస్తి వీఎం పల్లికి చెందిన సుబ్రహ్మణ్యం(31) తన కుమారుడు రూపేష్(9)తో కలిసి బైక్‌పై నాయుడుపేట నుంచి శ్రీకాళహస్తికి రహదారిపై వ్యతిరేక మార్గంలో వెళుతున్నాడు. వారిని చెంబడిపాలెం వద్ద ఎదురుగా వస్తున్న ట్యాంకర్ లారీ ఢీకొంది. సుబ్రహ్మణ్యం అక్కడికక్కడే మృతిచెందగా, అపస్మారక స్థితిలో ఉన్న రూపేష్‌ను చికిత్స నిమిత్తం శ్రీకాళహస్తికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతిచెందాడు.
స్నేహితుడి పెళ్లికి వెళ్లి వస్తూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృత్యువాత 
చిత్తూరు జిల్లా నగరి మున్సిపాలిటీ పరిధిలోని నెత్తం కండ్రిగ వద్ద సోమవారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఖాజా మొహిద్దీన్ (26) అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతిచెందాడు. తిరుపతి బైరాగిపట్టెడకు చెందిన ఖాజా మొహిద్దీన్ బెంగుళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. అతను మిత్రులతో కలిసి బైక్‌పై ఆదివారం చెన్నైలో స్నేహితుడి వివాహ వేడుకలకు హాజరయ్యాడు. తిరిగి వస్తూ సోమవారం తెల్లవారుజామున నెత్తంకండ్రిగ వద్ద బైక్ అదుపు తప్పి బారికేడ్‌ను ఢీకొని కిందపడిపోయాడు. తీవ్రంగా గాయపడిన ఖాజా మొహిద్దీన్ను స్నేహితులు నగరి ఏరియా ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
