మహిళల అభ్యున్నతే ధ్యేయం

women's development is trs govt aim : jogu ramanna - Sakshi

అటవీశాఖ మంత్రి జోగు రామన్న

దళితబస్తీ పెట్టుబడి చెక్కుల పంపిణీ

జైనథ్‌(ఆదిలాబాద్‌): మహిళల అభ్యున్నతి, సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలోని ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. గురువారం మండల కేంద్రంలోని మార్కెట్‌యార్డులో ఆదిలాబాద్, జైనథ్, బేల మండలాల్లోని 260 మంది మహిళలకు దళితబస్తీ పెట్టుబడి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేద దళితులను రైతులుగా మార్చడమే లక్ష్యంగా దళితబస్తీ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. మొదటి సంవత్సరం పెట్టుబడి ఖర్చుతోపాటు భూమి అభివృద్ధి, సాగునీటి సౌకర్యాల కల్పనకు నిధులు అందిస్తున్నామని అన్నారు.

ఆదిలాబాద్‌ నియోజకవర్గంలో ఇప్పటివరకు 1500 ఎకరాలు అందించామని, త్వరలో మరో వెయ్యి ఎకరాల భూమిని లబ్ధిదారులకు అందిస్తామని తెలిపారు. వచ్చే ఖరీఫ్‌ కంటే ముందు మే 15 వరకు ఖరీఫ్‌ కోసం ఎకరానికి రూ.4వేలు రూపాయల పెట్టుబడి ఖర్చును ప్రభుత్వం చెక్కుల రూపంలో అందిస్తుందని తెలిపారు. రబీలో పంటలు వేసుకున్న రైతులకు సైతం ఎకరానికి రూ.4 వేల చొప్పున అందిస్తామని పేర్కొన్నారు. రైతులు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం కోసం ప్రతి 5 వేల ఎకరాలకు ఒక ఏఈవోను నియమించామని, గ్రామాల్లో క్లస్టర్‌ వారీగా మట్టి పరీక్షలు చేసే మినీ ల్యాబ్‌లను అందుబాటులోకి తెచ్చామని అన్నారు. త్వరలో క్లస్టర్‌కు ఒక రైతు భవనం నిర్మించి, రైతులకు సలహాలు, సూచనలు అందించేందుకు శాశ్వత వేదికలను గ్రామాల్లో ఏర్పాటు చేస్తామని అన్నారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరో ఇరవై ఏళ్లు కొనసాగుతారని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. అనంతరం దళితబస్తీ లబ్ధిదారులకు పెట్టుబడి ఖర్చు చెక్కులను మంత్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ కృష్ణారెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ రౌతు మనోహర్, బేల ఎంపీపీ రఘుకుల్‌రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్లు అడ్డి భోజారెడ్డి, తల్లెల చంద్రయ్య, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్‌ సర్సన్‌ లింగారెడ్డి, మార్కెట్‌కమిటీ వైస్‌ చైర్మన్‌ ఎల్టి భూమారెడ్డి, వైస్‌ ఎంపీపీ రోకండ్ల సురేశ్‌రావు, నాయకులు గంబీర్‌ ఠాక్రే, గడ్డ పోతరెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

ఎడ్లబండెక్కిన మంత్రి
మంత్రి జోగు రామన్న గురువారం ఎడ్లబండిపై మార్కుట్‌యార్డుకు చేరుకున్నారు. ఎప్పుడూ కారులో తిరిగే మంత్రి బండెక్కి నడపడంతో ప్రజలు ఆసక్తిగా తిలకించారు. తాను ఒకప్పుడు స్వయంగా తన భార్యతో కలిసి చేనులో పని చేసిన రైతు బిడ్డనని, చాలా రోజుల తర్వాత ఎడ్లబండి నడపడం సంతోషంగా ఉందని మంత్రి ఆనందం వ్యక్తం చేశారు.  

ఘనంగా సన్మానం  
మంత్రి రామన్నను ఆయా మండలాల్లోని దళితబస్తీ లబ్ధిదారులు, మహిళలు ఘనంగా సన్మానించారు. తమ భూముల్లో బోర్లు, బావులు వేసుకునేందుకు ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా నిధులు మంజూరు చేయాలని కోరారు. భూమి చదును చేసుకోవడానికి డబ్బులు ఇప్పించాలని వేడుకున్నారు.

Read latest Adilabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top