ఉక్రెయిన్ వార్ వేళ బిగ్ ట్విస్ట్.. ట్రంప్ లక్ష కోట్ల మాస్టర్ ప్లాన్! | Behind the Scenes of Ukraine War Talks: The Massive US-Russia Oil Deal | Sakshi
Sakshi News home page

ఉక్రెయిన్ వార్ వేళ బిగ్ ట్విస్ట్.. ట్రంప్ లక్ష కోట్ల మాస్టర్ ప్లాన్!

Oct 4 2026 9:17 AM | Updated on Oct 4 2026 1:45 PM

Behind the Scenes of Ukraine War Talks: The Massive US-Russia Oil Deal

వాషింగ్టన్: ఉక్రెయిన్‌‌పై రష్యా దాదాపు మూడేళ్లుగా సాగిస్తున్న భీకర యుద్ధాన్ని ముగించే దిశగా జరుగుతున్న దౌత్య ప్రయత్నాలలో  అనూహ్యమైన మలుపు చోటు చేసుకుంది. రష్యాతో యుద్ధాన్ని ముగించేందుకు అమెరికాలోని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం జరుపుతున్న రహస్య చర్చలు.. కేవలం రాజకీయ ఒప్పందాలకే పరిమితం కాకుండా, బిలియన్ డాలర్ల (దాదాపు లక్ష కోట్ల రూపాయల) భారీ చమురు ఒప్పందం వైపు అడుగులు వేస్తున్నట్లు న్యూయార్క్ టైమ్స్ సంచలన కథనాన్ని వెలువరించింది.

ఈ ఒప్పందం ద్వారా అమెరికా తరఫున దౌత్య మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్‌లతో సన్నిహిత సంబంధాలున్న పశ్చిమాసియా వ్యాపారవేత్తలకు అత్యధిక లబ్ధి చేకూరే అవకాశం ఉందని ఆ నివేదిక పేర్కొంది.

లూకోయిల్ ఆస్తులే లక్ష్యంగా..
అమెరికా ప్రభుత్వం, రష్యా  సంయుక్త ఆమోదంపై పూర్తిగా ఆధారపడి ఉన్న ఈ ఒప్పందంలో.. రష్యాకు చెందిన ప్రముఖ ప్రైవేట్ ఇంధన దిగ్గజం 'లూకోయిల్'  సంస్థకు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి ఉన్న చమురు క్షేత్రాలు, అధునాతన రిఫైనరీలు, భారీ గ్యాస్ స్టేషన్ల నెట్‌వర్క్ ప్రధాన భాగంగా ఉన్నాయి. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యాపై విధించిన కఠినమైన ఆంక్షల వల్ల నిలిచిపోయిన ఈ అంతర్జాతీయ ఆస్తులకు మళ్లీ జీవం పోయడమే ఈ డీల్ ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది.

తెరవెనుక చక్రం తిప్పుతున్న దిగ్గజాలు
ఈ భారీ చమురు ఒప్పందాన్ని కుదిర్చేందుకు తెరవెనుక తీవ్రంగా ప్రయత్నిస్తున్న బృందంలో ప్రముఖ అమెరికన్ బిలియనీర్, పెట్టుబడిదారుడు టాడ్ బోహ్లీతో పాటు.. ట్రంప్ బంధువైన కుష్నర్ లేదా విట్కాఫ్ కుటుంబాలతో వాణిజ్య సంబంధాలున్న రెండు శక్తివంతమైన పశ్చిమాసియా సంస్థలు, అలాగే అమెరికా ప్రభుత్వానికి చెందిన ఒక కీలక విభాగం క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం.

పుతిన్ ప్రత్యేక వ్యూహం
గత సెప్టెంబర్ 5న క్రెమ్లిన్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో అమెరికా సంధానకర్తలు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్‌లు భేటీ అయ్యారు. ఈ సమావేశంలోనే పుతిన్ స్వయంగా ఈ భారీ చమురు ఒప్పంద ప్రతిపాదనను తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది.

ఈ రహస్య సమావేశం గురించి పూర్తి అవగాహన ఉన్న విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ 'న్యూయార్క్ టైమ్స్' ఈ వివరాలను ప్రచురించింది. అమెరికాతో తాము కేవలం శత్రువులమే కాదని, భవిష్యత్తులోనూ విజయవంతంగా వాణిజ్య, వ్యాపార సంబంధాలు కొనసాగించగలమని రష్యన్ ప్రజలకు, ప్రపంచ దేశాలకు నిరూపించేందుకు ఈ ఒప్పందం ఒక బలమైన వేదిక అవుతుందని పుతిన్ అభిప్రాయపడ్డారు. అందుకే ఈ డీల్‌ను వీలైనంత త్వరగా తుదిరూపునకు తీసుకురావాలని ఆయన ప్రతి పాదించినట్లు ఆ వర్గాలు వెల్లడించాయి.

మొత్తానికి, ఉక్రెయిన్ సంక్షోభాన్ని ముగించే ముసుగులో జరుగుతున్న ఈ భారీ ఆర్థిక లావాదేవీలు ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

ఇదీ చదవండి : అమెరికా ఘోర తప్పిదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement