మానవత్వం చాటుకున్న మహిళా పోలీసు

భోపాల్‌: ఖాకీల కరుకు గుండెల్లో కూడా మానవత్వం ఉంటుందని నిరూపిస్తున్న సంఘటనల్ని ఈ మధ్య కాలంలో చాలానే చూశాం. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఓ మహిళా పోలీసు అనాథ అయిన ఓ వృద్ధురాలికి బట్టలు తొడుగుతున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. వివరాలు.. కుటుంబ సభ్యులు వదిలేయడంతో.. ఆ తల్లి అనాథలా మారింది. ఆకలితో అలమటించే పేగులకు ఇంత ముద్ద దొరికితే అదే భాగ్యం అనుకునే ఆ తల్లి బట్టల గురించి ఆలోచించడం అత్యాశే అనుకుంది. ఈ క్రమంలో ఒంటి మీద సరైన బట్టలు లేక అవస్థ పడుతున్న ఆ తల్లిని చూసి శ్వేతా శుక్లా అనే మహిళా పోలీసు అధికారి హృదయం ద్రవించింది. దాంతో కొత్త బట్టలు, చెప్పుల తెచ్చి మరో ఉద్యోగిని సాయంతో ఆ ముసలమ్మకు తొడిగించింది.

అధికారి ఆప్యాత చూసి ఆ ముసలి తల్లి కన్నీరు పెట్టుకుంది. ఎందుకు ఏడుస్తున్నావని ప్రశ్నించగా.. ‘నా కడుపున పుట్టిన వారికి నేను భారమయ్యాను. ఇలా ఒంటరిగా అనాథలా వదిలేశారు. ఏ తల్లి కన్న బిడ్డవో.. నా కోసం ఇంత ఆప్యాయంగా బట్టలు తెచ్చావు’ అంటూ శ్వేతను పట్టుకుని ఏడ్చింది ఆ వృద్ధురాలు. ఇందుకు సంబంధించిన వీడియోను మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌ తన ట్విటర్‌లో షేర్‌ చేశారు. ‘శ్రద్ధా శుక్లా లాంటి కుమార్తెలను చూసి మధ్యప్రదేశ్‌ గర్విస్తోంది. కుమార్తెలు ప్రతి ఒక్కరి బాధను అర్థం చేసుకుంటారు. ఇంటికి కొత్త కాంతిని తీసుకువస్తారు’ అంటూ ట్వీట్‌ చేసిన ఈ వీడియో నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది. ‘మిమ్మల్ని చూసి గర్విస్తున్నాం.. చాలా గొప్ప పని చేశారు’ అంటూ నెటిజన్లు శ్వేతపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top