పుల్వామా ఉగ్ర దాడి నేపథ్యంలో పాకిస్తాన్ చుట్టూ భారత్ ఉచ్చు బిగుస్తోంది. సింధూ నదీ జలాల ఒప్పందంలో భాగంగా పాక్‌కు వెళ్తున్న తన నీటి వాటాను నిలిపివేయాలని భారత్ నిర్ణయించింది. ఈ విషయాన్ని జల వనరుల మంత్రి నితిన్ గడ్కారీ గురువారం ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని అమలు చేయాలంటే 6 సంవత్సరాలు పట్టొచ్చని, నీటి ప్రవాహాన్ని అడ్డుకోవడానికి అప్పటిలోగా 100 మీటర్ల ఎత్తయిన డ్యామ్‌లను నిర్మిస్తామని అధికారులు తెలిపారు. తాజా నిర్ణయంతో 1960 నాటి ఒప్పందం ఉల్లంఘనకు గురవదని, మన దేశ ప్రజలకు దక్కాల్సిన న్యాయబద్ధ హక్కుల్ని కల్పించినట్లవుతుందని పేర్కొన్నారు. పాకిస్తాన్‌కు వెళ్తున్న మన నీటిని నిలిపివేసి కశ్మీర్, పంజాబ్ రాష్ట్రాలకు సరఫరా చేయాలని యోచిస్తున్నారు. పాకిస్తాన్‌కు భారత జలాలను నిలిపివేయాలని రెండు నెలల క్రితమే నిర్ణయించామని, గడ్కారీ అదే సంగతిని తాజాగా పునరుద్ఘాటించారని మరో సీనియర్ అధికారి తెలిపారు.