బుందేల్‌ఖండ్‌లో బందిపోటు రాజకీయాలు! | Sakshi
Sakshi News home page

Bundelkhand: బుందేల్‌ఖండ్‌లో బందిపోటు రాజకీయాలు!

Published Wed, Apr 3 2024 10:17 AM

Dacoits Continued for Decades in the Politics of Bundelkhand

ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌లో ఒకప్పుడు బందిపోటు దొంగల కనుసన్నల్లోనే రాజకీయాలన్నీ నడిచేవి. దశాబ్దాల తరబడి రాజకీయాలపై వారి ఆధిపత్యం కొనసాగింది. ఈ బందిపోటు దొంగలు  ఎవరికి మద్దతిస్తే వారే ఎన్నికల్లో గెలిచేవారు. ఓట్ల కోసం ఆ బందిపోటు దొంగలు ఓటర్లను బెదిరించేవారు. ఎన్నికల రాజకీయాలను వారు తమ గుప్పిట్లో పెట్టుకునేవారు. 

80వ దశకంలో యూపీలో భాగమైన బుందేల్‌ఖండ్‌లోని ఏడు జిల్లాలలోని ఆరింటిలో బందిపోట్లు తమ ఆధిపత్యం చెలాయించారు. ఝాన్సీ, జలౌన్, బందా, మహోబా, హమీర్‌పూర్, చిత్రకూట్‌లో వారి ఆటలు సాగేవి. దాదువా, నిర్భయ్ సింగ్ గుర్జార్, థోకియా తదిర బందిపోట్లు  తాము ఈ ప్రాంతానికి రాజులుగా ప్రకటించుకున్నారు. తరువాతి కాలంలో వీరు రాజకీయ నేతలుగా, రాజకీయాలను శాసించేవారుగా మారారు. 

నేతలుగా మారిన దోపిడీ దొంగల జాబితాలో ముందుగా  దాదువా పేరు వినిపిస్తుంది. దాదువా తన కుమారుడు వీర్ సింగ్‌ను జిల్లా పంచాయతీ అధ్యక్షునిగా చేయడంలో విజయం సాధించాడు. దాదువా 2007లో ఎన్‌కౌంటర్‌లో మృతిచెందాడు. అయితే అ‍ప్పటికే అతని కుటుంబ సభ్యులు రాజకీయ సామ్రాజ్యాన్ని స్థాపించారు. వీర్ సింగ్ చిత్రకూట్ నుంచి ఎస్పీ టికెట్ పై ఎమ్మెల్యేగా, అతని సోదరుడు బాల్ కుమార్ పటేల్ మీర్జాపూర్ నుంచి ఎంపీగా గెలుపొందారు. మేనల్లుడు రామ్ సింగ్ కూడా ఎస్పీ టిక్కెట్‌పై ప్రతాప్‌గఢ్‌లోని పట్టి అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికల్లో గెలుపొందాడు.

దాదువా మాదిరిగానే అంబికా పటేల్ అలియాస్ థోకియా కుటుంబ సభ్యులు కూడా రాజకీయాల్లో తమ హవా చాటుకున్నారు. 2005లో థోకియా అత్త సరిత బందాలోని కార్వీ బ్లాక్‌కు అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరో అత్త సవిత జిల్లా పంచాయతీ సభ్యురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2007లో తల్లి పిపారియా దేవి రాష్ట్రీయ లోక్‌దళ్ టిక్కెట్‌పై బందాలోని నారైని అసెంబ్లీ నుండి ఎన్నికలలో పోటీ చేశారు. ఆమె థోకియా పేరుతో 27 వేల ఓట్లను పొందగలిగారు. నిర్భయ్ సింగ్ గుర్జార్ కూడా ఎన్నికల్లో కాలు మోపారు. ఝాన్సీలోని గరౌత, జలౌన్, భోగానిపూర్‌లలోని రాజకీయాలన్నీ అతని  కనుసన్నల్లో నడిచాయి. నిర్భయ్ సింగ్ గుర్జార్ అండతో నేతలు ఎన్నికల రేసులో దూసుకెళ్లేవారు. ఫూలన్ దేవి ఝాన్సీ డివిజన్‌లోని జలౌన్ జిల్లాలోని గోర్హా అనే చిన్న గ్రామానికి చెందిన బందిపోటు రాణిగా పేరొందింది. 1981 ఫిబ్రవరి 14న బెహ్మాయి ఊచకోత ఘటనతో ఫూలన్ దేవి దేశవ్యాప్తంగా వెలుగులోకి వచ్చింది. జైలు నుంచి విడుదలైన రెండేళ్ల తర్వాత 1996లో సమాజ్‌వాదీ పార్టీ ఆమెకు లోక్‌సభ టిక్కెట్‌ ఇచ్చింది. ఫూలన్ తన తొలి ఎన్నికల్లోనే మీర్జాపూర్ ఎంపీగా విజయం సాధించింది. అయితే ఆ తర్వాత ఆమె హత్యకు గురయ్యింది.