రాష్ర్ట విభజన అంశంపై తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రోజుకో మాట.. పూటకో పాట పాడుతున్నారని ఆ పార్టీలోనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ర్ట విభజనకు సంబంధించి తన వద్ద పూర్తి సమాచారం ఉన్నా ఏమీ తెలియనట్టు అస్సలు పెదవే విప్పని చంద్రబాబు.. తీరా సీమాంధ్ర ప్రాంతంలో ప్రజల నుంచి పెద్దఎత్తున నిరసనలు, ఆందోళనలు చెలరేగడంతో వెంటనే వైఖరి మార్చేశారు. ఈ రకంగా పూటకో వైఖరి మార్చడం వల్ల ప్రజల్లో తలెత్తుకుని తిరగలేకపోతున్నామని ఇరు ప్రాంతాల నేతలు అంతర్గత చర్చల్లో వాపోతున్నారు. జూలై 1న హైదరాబాద్‌కు వచ్చిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ర్ట వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్‌సింగ్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియకు చర్యలు తీసుకుంటున్నామని, పార్టీ సీనియర్ నేతలకు రోడ్ మ్యాప్ తయారు చేయాల్సిందిగా చెప్పారు. విభజన ప్రక్రియపై ఆ తర్వాత జూలై 12, 26 తేదీల్లో ఢిల్లీలో కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశమై తెలంగాణ అంశంపైనే చర్చించింది. రాష్ర్టంలోని కాంగ్రెస్ ముఖ్య నేతలందరూ ఢిల్లీలోనే మకాం వేశారు. ఎంతో హడావిడి నడిచింది. ఇదంతా జరుగుతున్న సమయంలో రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు ఏమాత్రం స్పందించలేదు. ఆ విషయాలేవీ తనకు పట్టనట్లు ఇంటికే పరిమితమయ్యారు. తొలి దశ పంచాయతీ ఎన్నికలు గతనెల 23న జరగ్గా ఆ ఎన్నికలకు ముందు విలేకరుల సమావేశంలో మాట్లాడినప్పుడు కాంగ్రెస్ వ్యవహారాలుగానీ, తెలంగాణపై ఢిల్లీలో జరుగుతున్న హడావుడిపైగానీ నోరు విప్పలేదు. పంచాయతీ ఎన్నికల గురించి మాత్రమే మాట్లాడారు. తమ హయాంలో పంచాయతీలను ఎలా అభివృద్ధి చేసింది, ఒకవేళ అధికారంలోకి వస్తే ఏమి చేసేది చెప్పారే తప్ప రాష్ట్ర విభజనపై మాట్లాడనన్నారు. తొలిదశ పంచాయతీ ఎన్నికల ఫలితాలు వచ్చిన త ర్వాత మరోసారి విలేకరులతో మాట్లాడారు. అప్పుడు తమ గెలుపు గురించి వివరించారు. ఇదే సమయంలో విలేకరులు తెలంగాణ అంశం గురించి ప్రస్తావిస్తే... తాను ఇప్పుడు ఆ అంశం గురించి మాట్లాడనని చెప్పారు. ఆ తరువాత కూడా పంచాయతీ ఎన్నికల ఫలితాలపైనే ప్రసంగించారు. తెలంగాణ గురించి ఎక్కడా మాట్లాడలేదు.
Aug 3 2013 9:18 AM | Updated on Mar 22 2024 10:39 AM
Advertisement
Advertisement
Advertisement
